SOURCE :- BBC NEWS

అక్రమ రవాణాలో సిరియా గత ప్రభుత్వం ప్రమేయమున్నట్టు ఆరోపణలు

సిరియాను హస్తగతం చేసుకున్న తర్వాత తిరుగుబాటు దళ నాయకుడు అహ్మద్ అల్-షారా, డమాస్కస్‌లో విజయోత్సవ ప్రసంగం చేశారు. అయితే, ఆయన ప్రసంగంలో ఒక వ్యాఖ్యను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గత పదేళ్లుగా పశ్చిమాసియాను ముంచెత్తుతున్న అక్రమ మత్తుపదార్థాల గురించి షారా మాట్లాడారు.

‘‘ప్రపంచంలో కాప్టాగాన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం సిరియా. దేవుడి దయవల్ల సిరియా ఇప్పుడు స్వచ్ఛంగా మారబోతోంది.” అని వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియా వెలుపల కాప్టాగాన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇది మత్తు మాత్ర. దీన్ని పేదవాడి కొకైన్‌ అంటారు.

యుద్ధం, ఆర్థిక ఆంక్షలు, ప్రజలు భారీగా వలస వెళ్లడం వంటి పరిస్థితులతో సిరియా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో ఆ దేశంలో ఈ మాదకద్రవ్యం ఉత్పత్తి బాగా పెరిగింది. తమ సరిహద్దులగుండా పెద్దమొత్తంలో సాగుతున్న మాత్రల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు అనేక ఇబ్బందులు పడ్డారు.

కాప్టాగాన్ అక్రమ రవాణాకు సిరియా ప్రధాన కేంద్రమని అనడానికి అన్ని ఆధారాలూ ఉన్నాయి. ఏడాదికి రూ. 47వేలకోట్లకుపైగా విలువైన కాప్టాగాన్ అక్రమరవాణా జరుగుతోందని వరల్డ్ బ్యాంక్ లెక్కల్లో తేలింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సిరియాలో కాప్టాగాన్‌ అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్రమ రవాణా?

డ్రగ్ ఉత్పత్తి, రవాణా అయ్యే తీరు గమనిస్తే ఇది క్రిమినల్ గ్యాంగుల పని కాదని, ప్రభుత్వమే దీన్నొక పరిశ్రమలా నిర్వహిస్తోందని అనుమానాలు కలుగుతాయి.

షారా తన ప్రసంగంలో దీని గురించి మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత ఈ అనుమానాలు నిజమే అన్న అభిప్రాయం కలిగించే కొన్ని ఫోటోలు, వీడియోలు చిత్రాలు బయటకువచ్చాయి.

అసద్ బంధువులుగా భావించే కొందరు వ్యక్తుల ఆస్తులపై ప్రజలు దాడులు చేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. పారిశ్రామిక ఉత్పత్తుల పేరుతో ప్యాక్ చేసి ఉన్న మాత్రలు గదుల నిండా కనిపిస్తున్నాయి.

సిరియా మిలటరీ వైమానిక స్థావరంలో ఈ మాత్రల కుప్పలు, వాటిని రెబల్స్ తగలబెడుతున్న దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి.

బీబీసీ వరల్డ్ సర్వీస్ డాక్యుమెంటరీ కోసం నేను కాప్టాగాన్‌పై ఏడాది పాటు పరిశోధన చేశాను. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో ఈ డ్రగ్‌కు సంపన్న యువతలో, జోర్డాన్ లాంటి దేశాల్లో కార్మిక వర్గంలో ఎంత ఆదరణ ఉందో గమనించాను.

సిరియాను డ్రగ్స్ నుంచి కాపాడుతామన్న తిరుగుబాటు నేతలు

ఫొటో సోర్స్, Getty Images

కాప్టాగాన్ వాడకం, అక్రమ రవాణా ఎలా అరికడతారు?

‘‘నాకు 19 ఏళ్లప్పటినుంచి కాప్టాగాన్ తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచే నా జీవితం నాశనం కావడం మొదలైంది’’ అని జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఒక పునరావాస శిబిరంలో ఉన్న యువకుడు చెప్పారు. కాప్టాగాన్ తీసుకోవడం ఆయనకు వ్యసనంగా మారింది.

కాప్టాగాన్ తీసుకునేవాళ్లతో నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఇది తీసుకోవడం వల్ల ఆహారంతో అవసరం లేకుండా పనిచేయొచ్చు. ఆహారం లేకుండా జీవించొచ్చు. కానీ క్రమంగా శరీరం నాశనమవుతుందని వారు చెప్పారు.

సిరియాలోనూ, పశ్చిమాసియాలోనూ పెద్ద సంఖ్యలో ప్రజలకు కాప్టాగాన్‌ తీసుకుంటున్నారు. మరి అకస్మాత్తుగా వాటి సరఫరా నిలిచిపోతే ఎలాంటి పరిణామాలుంటాయి? ఆ డ్రగ్‌కు బానిసలైన వారితో అల్-షారా, ఆయన గ్రూప్ హయత్ తహరిర్ అల్ షహమ్(హెచ్‌టీఎస్) ఎలా వ్యవహరించనుంది?

న్యూ లైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సిరియా డ్రగ్ ట్రాఫికింగ్‌ వ్యవహారాల నిపుణుడు కరోలిన్ రోజ్ దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు.

”డిమాండ్ తగ్గించే ప్రయత్నాలు చేయకుండానే వాళ్లు హఠాత్తుగా సరఫరాను అరికడతారన్నది నా ఆందోళన.” అన్నారు కరోలిన్ రోజ్.

ఇక్కడ మరో పెద్ద సమస్య ఏంటంటే, అలాంటి లాభదాయక వ్యాపారం ఆగిపోవడం వల్ల సిరియా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టమెంత? దీని వెనక ఉన్నవాళ్లు పక్కకు తప్పుకుంటే, వారి స్థానాన్ని ఆక్రమించేందుకు వేచి చూస్తున్న ఇతర నేరస్థులను అల్ -షారా ఎలా అడ్డుకుంటారు?

సిరియా విడిచి వెళ్లిపోయిన అస్సద్

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమాసియాలో నార్కో యుద్ధం

కాప్టాగాన్ ఉత్పత్తి పెరగడం వల్ల పశ్చిమాసియా నార్కో యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది.

సిరియాతో ఉన్న సరిహద్దు దగ్గర జోర్డానియన్ ఆర్మీతో కలిసి ఈ కథనం కోసం చిత్రీకరణ జరుపుతున్నప్పుడు మేం కొన్ని విషయాలు గమనించాం.

సైనికులు వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలను, అక్రమ రవాణాదారులతో జరిగిన కాల్పుల్లో కొందరు సైనికులు మరణించిన విషయాలను తెలుసుకున్నాం.

అక్రమరవాణాదారులకు సరిహద్దుల్లోని సిరియా సైనికులు సహకరిస్తున్నారని జోర్డాన్ సైనికులు ఆరోపించారు.

ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా ఈ తరహా వాణిజ్యంతో ఇబ్బందిపడుతున్నాయి.

లెబనాన్ నుంచి కొంతకాలం పాటు పండ్లు, కూరగాయల దిగుమతులను సౌదీ అరేబియా నిలిపివేసింది. దానిమ్మ పండ్లు ఎగుమతి చేసే షిప్పింగ్ కంటెయినర్లలో కాప్టాగాన్ మాత్రలు ఉన్న బ్యాగులు నిండిపోయి ఉండేవి.

అసద్‌ పాలన, తిరుగుబాటుదారుల ఆధిపత్యం ఉన్న సిరియాతో పాటు మొత్తం ఐదు దేశాల్లో మేం చిత్రీకరణ జరిపాం. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం సేకరించాం. జర్మనీ, లెబనాన్‌లో కోర్టు కేసుల నుంచి నమ్మకమైన రికార్డులు పరిశీలించే అవకాశం పొందాం.

ఈ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు ప్రధాన శక్తులను గుర్తించగలిగాం. అసద్ కుటుంబానికి సంబంధించిన బంధువులతో పాటు సిరియా భద్రతాబలగాలకు ఇందులో పాత్ర ఉంది. ప్రత్యేకించీ సిరియా భద్రతాబలగాలకు చెందిన నాలుగో డివిజన్ ప్రమేయాన్ని గుర్తించాం. ఇది అసద్ సోదరుడు మహర్ నేతృత్వంలో సాగుతోంది.

కాప్టాగాన్ ఉత్పత్తి, అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Getty Images

అసద్ సోదరుడి పాత్ర ఏంటి?

అసద్ తర్వాత సిరియాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా భావించే ఆయన సోదరుడు మహర్ అల్- అసద్ చుట్టూ అనేక ఆరోపణలు ఉన్నాయి.

2011లో ప్రజాస్వామ్య తిరుగుబాటును రక్తపాత అంతర్యుద్ధంగా మారేలా రెచ్చగొట్టినట్టు, నిరసనకారులకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు చేపట్టినట్టు మహర్‌పై ప్రత్యర్ధులు విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి.

2013లో సిరియాలో జరిగిన రసాయన ఆయుధాల దాడికి బాధ్యులుగా పేర్కొంటూ మహర్, అసద్‌కు ఫ్రెంచ్ న్యాయవ్యవస్థ ఇంటర్నేషనల్ అరెస్టు వారెంట్ జారీచేసింది.

లెబనాన్ జైలులో ఉన్న కాప్టాగాన్ వ్యాపారితో వాట్సాప్ చాట్‌ల ద్వారా మాట్లాడగలిగాం. వారి నుంచి మహర్ అల్-అసద్‌కు చెందిన నాలుగో డివిజన్, ఆయన సెకండ్-ఇన్-కమాండ్‌గా ఉన్న జనరల్ ఘస్సాన్ బిలాల్‌కు సంబంధించిన ఆధారాలు పొందగలిగాం.

ఈ వ్యాపారంలో సిరియా భద్రతా బలగాలు, బషర్ అల్-అసద్ ఆంతరంగిక వర్గం ప్రమేయముందన్న విషయాన్ని ధ్రువీకరించడంలో ఇది కీలకమైన విషయం.

రెబల్స్ దేశంపై ఆధిపత్యం సాధించడంతో సిరియా ఆర్మీ చెల్లాచెదురై పారిపోవడాన్ని చూశాక, గత ఏడాది ఓ సైనికుడితో నేను చేసిన ఇంటర్వ్యూ గుర్తువచ్చింది.

ఆర్మీలో పనిచేసినందుకు తనకు నెలవారీగా వచ్చే ఆదాయం రూ. 2,548. ఇది తన కుటుంబం మూడు రోజుల ఆహారానికి మాత్రమే సరిపోతుందని, దీంతో తాము నేరపూరితమైన కార్యక్రమాల్లోనూ, కాప్టాగాన్‌ సంబంధిత వ్యవహారాల్లోనూ భాగస్వాములం కావాల్సివస్తోందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం చాలా వరకు డబ్బు దాని ద్వారానే వస్తోందని ఆయనన్నారు.

ప్రజాతిరుగుబాటును హింసాత్మకంగా అణిచివేసినందుకు సిరియాను బహిష్కరించిన 12 ఏళ్ల తర్వాత, తిరిగి ఆ దేశాన్ని చేర్చుకునేందుకు అరబ్ లీగ్ 2023 మేలో అంగీకరించింది. కాప్టాగాన్ వాణిజ్యాన్ని అరికట్టడం, బాధితులకు పునరావాసం కల్పించడం వంటి హామీల ద్వారా అసద్ దౌతవ్యపరంగా ఇది సాధించగలిగినట్టు భావించారు.

సిరియా తిరుగుబాటు నేత

ఫొటో సోర్స్, AFP

ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కిస్తారు?

సిరియాపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్న తిరుగుబాటు నేతలు కాప్టాగాన్ వాణిజ్యాన్ని అరికడతామంటూ పొరుగు దేశాలకు సానుకూల సంకేతాలు పంపుతున్నారు.

అయితే స్వయంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవస్థీకృత నేరం, లాభసాటి వ్యాపారంగా చాలా ఏళ్లపాటు సాగిన పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేయడం అంత తేలిక కాదు.

సిరియా ఆర్మీలో ఇస్సామ్ అల్ రెయిస్ కీలక ఇంజనీర్. అసద్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగేవరకు ఆయన ఆర్మీలో కీలకపాత్ర పోషించారు. కాప్టాగాన్ వాణిజ్యంపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ఈ వాణిజ్యాన్ని నిలిపివేయడానికి ప్రారంభంలో హెచ్‌టీఎస్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నది ఆయన అభిప్రాయం. ఈ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించిన వారంతా ఇప్పటికే దేశం నుంచి జారుకున్నారని, కాప్టాగాన్ ఎగుమతులు బాగా పడిపోయాయని, అయితే ఆ స్థానంలోకి వచ్చేందుకు కొత్త నేరస్థులు ఎదురుచూస్తున్నారని ఆయన హెచ్చరించారు.

డిమాండ్ వైపు నుంచి దీన్ని పరిష్కరించలేకపోతే ఇది సమస్యాత్మకంగా మారుతుందని రోజ్ కూడా అన్నారు. సిరియా గుండా జరిగే మరో మాదకద్రవ్యం అక్రమరవాణాలో ఇప్పటికే పెరుగుదల కనిపిస్తోందని కూడా ఆమె హెచ్చరించారు.చాలా మంది క్రిస్టల్ మెత్‌ను కాప్టాగాన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని ఆమె వెల్లడించారు.

ఇప్పటికే కాప్టాగాన్ ఎక్కువగా వినియోగించినవాళ్లు, మరింత ఎక్కువ మత్తు కోరుకుంటున్నారని రోజ్ చెబుతున్నారు.

సిరియా ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అతిపెద్ద సమస్యని రెయిస్ కూడా అన్నారు.

సిరియా ప్రజలు డ్రగ్స్ వ్యాపార ఉచ్చులో పడకుండా ఉండేందుకు, ఆంక్షలు ఎత్తివేయడం, మానవతాసాయం అందించడం ద్వారా అంతర్జాతీయ సమాజం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

అయితే సిరియా ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి, అందులో ప్రజలను భాగస్వాములను చేయడానికి కొత్త నాయకులు సరికొత్త ఆర్థిక మార్గాలను కనుగొనాల్సిన అవసరముందని రోజ్ అభిప్రాయపడ్డారు.

ప్రధాన సూత్రధారులు దేశం వదిలి పారిపోయినప్పటికీ, డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణాలో పాత్ర ఉన్న అనేకమంది ఇంకా దేశంలో ఉన్నారని ఆమె హెచ్చరించారు.

పాత అలవాట్లు వదిలించుకోవడం అంత తేలిక కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)