SOURCE :- BBC NEWS

డమాస్కస్‌లో గత వారం షారాతో ఫోటో దిగిన లీ ఖైరల్లా

ఫొటో సోర్స్, X

ఆన్‌లైన్‌లో తన వీడియోపై వస్తున్న ఆరోపణలను సిరియా తిరుగుబాటు నాయకుడు అహ్మద్ అల్-షారా తోసిపుచ్చారు. గత వారం ఓ మహిళతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చేముందు….తలను కప్పుకోవాల్సిందిగా ఆమెకు షారా సైగ చేస్తున్న వీడియోలపై వివాదం చెలరేగింది.

సిరియాలో రెబల్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భవిష్యత్ ఎలా ఉంటుందనేదానిపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో షారా వీడియోపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఉదారవాదులతో పాటు, సంప్రదాయవాదులు కూడా షారాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సున్నీ ఇస్లామిక్ సంస్థ హయత్ తహ్రీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్)అధినేత అయిన షారా…ఓ మహిళను తల మీద వస్త్రం కప్పుకోవాలని సూచించడాన్ని ఉదారవాదులు తప్పు పడుతున్నారు.

బషర్ అల్-అసద్‌ను తొలగించిన తర్వాత సిరియాలో ఇస్లామిక్ వ్యవస్థ అమలుచేయాలన్న షారా ఆలోచనకు ఇది సంకేతమని వారంటున్నారు. ఇటు సంప్రదాయవాదులేమో ఓ మహిళతో ఫోటో దిగినందుకు షారాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహించిన షారా

ఫొటో సోర్స్, AFP

షారా ఏమంటున్నారు?

”నేను ఆమెను ఒత్తిడి చేయలేదు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛ. నాకు నచ్చినట్లు నేను ఫోటోలు దిగాలనుకుంటాను” అని బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెర్మీ బోవెన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో షారా అన్నారు.

తల మీద వస్త్రం కప్పుకోవాలన్న షారా సూచనతో తనకెలాంటి ఇబ్బందీ కలగలేదని ఫోటోలోని మహిళ లియా ఖైరల్లా కూడా అన్నారు.

ఆయన చాలా మర్యాదగా, తండ్రి తరహాలో సూచించారు. ”తాను సౌకర్యవంతంగా కనిపించాలని భావించే హక్కు నాయకునికి ఉంది” అని ఆమె అన్నారు.

మతపరంగా భిన్నత్వం ఉండే దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో సిరియా భవిష్యత్తు నాయకులకు ఎదురయ్యే కొన్ని సవాళ్లను ఈ ఘటన కళ్లకు కట్టింది.

సిరియా జనాభాలో ఎక్కువమంది సున్నీ ముస్లింలు. మిగిలినవారిలో క్రిస్టియన్లు, ఇతర మతాల వాళ్లు ఉన్నారు.

షారాను విమర్శిస్తున్న ఉదార, సంప్రదాయవాదులు

ఫొటో సోర్స్, Hayat Tahrir al-Sham

సిరియా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అసద్‌ను వ్యతిరేకించిన రాజకీయ, సాయుధ గ్రూపుల నాయకుల్లో కూడా దేశంలో ఎలాంటి పాలన ఉండాలన్నదానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కొందరు లౌకిక ప్రజాస్వామ్యం కోరుకుంటుంటే…మరికొందరు ఇస్లామిక్ చట్టం ప్రకారం పాలన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

అల్ ఖైదా మాజీ అనుబంధ సంస్థ అయిన హెచ్‌టీఎస్‌కు కఠిన ప్రవర్తనా నియమావళిని అమలుచేసిన చరిత్ర ఉంది. 2017లో రెబల్స్‌కు గట్టి పట్టున్న ఇడ్‌లిబ్ ప్రావిన్స్‌పై నియంత్రణ సాధించిన తర్వాత తొలినాళ్లలో డ్రెస్‌కోడ్, ఇస్లామిక్ నియామవళిని అమలుచేసింది ఈ సంస్థ. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఇటీవలి సంవత్సరాల్లో ఆ నియమాలను వెనక్కి తీసుకుంది.

ముస్లిం మహిళలు, పురుషులు నిరాడంబర దుస్తులు ధరించాలని ఇస్లాం మత గ్రంథం ఖురాన్ సూచిస్తుంది.

పురుషులు నాభి నుంచి మోకాళ్ల వరకు కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. భర్త, లేదా ఇతర కుటుంబ సభ్యులు తప్ప, పరాయి మగవారి ముందు మహిళలు ముఖం, చేతులు, అరికాళ్లు తప్ప మిగిలిన శరీరమంతా కప్పిఉండే దుస్తులు వేసుకోవాలి.

డమాస్కస్‌లోని మెజ్జె ప్రాంతంలో షారా ఈ నెల 10న పర్యటిస్తున్న సమయంలో ఆయతో ఓ ఫోటో దిగాలని లీ ఖైరల్లా భావించారు.

ఫోటో దిగడానికి అంగీకరించేముందు…తల మీద వస్త్రం కప్పుకోవాలని ఖైరల్లాకు సైగ ద్వారా సూచించారు షారా. ఆ వెంటనే ఖైరల్లా తలను కప్పుకుని షారా పక్కన ఫోటో కోసం నిలబడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. సోషల్ మీడియా యూజర్లు, మీడియా కామెంటేటర్లకు ఈ ఘటన తీవ్ర ఆగ్రహం కలిగించింది.

ఉదారవాదులు, సంప్రదాయవాదుల ఆలోచనలను వ్యతిరేకించే వాళ్లు, హెచ్‌టీఎస్ నాయకత్వంలో సిరియా సమీప భవిష్యత్తు ఎంత ఇబ్బందికరంగా ఉండబోతోందనేదానికి సంకేతంగా ఈ ఘటనను చూస్తున్నారు. మహిళలందరూ హిజాబ్ ధరించడం లేదా తలను కప్పుకోవడం వంటి సంప్రదాయ విధానాలు పెరుగుతాయన్న భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

‘సిరియా ఇస్లామిక్ పాలన వైపు వెళ్తోందా’ అన్న హెడ్‌లైన్ పెట్టి ఫ్రాన్స్ 24 అరబిక్ చానల్ ఈ ఘటనపై చర్చించింది.

మరికొందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ”ఒక నియంత స్థానంలో మరొక నియంతను తెచ్చుకున్నాం” అని సిరియా జర్నలిస్ట్ ఒకరు విమర్శించారు.

‘అతి-తీవ్రవాదులు’ అధికారంలోకి వస్తారని సోషల్ మీడియాలో కొందరు కామెంటేటర్లు హెచ్చరించారు. సంప్రదాయ తరహాలో కనిపించాల్సిందిగా స్వేచ్ఛగా ఉన్న ఓ మహిళను ఒత్తిడి చేశారని మరికొందరు ఆరోపించారు.

అహ్మద్ అల్ షారా

ఫొటో సోర్స్, Getty Images

సంప్రదాయవాదుల ఆగ్రహం

ఓ యువతితో కలిసి షారా ఫోటో దిగడంపై ఇస్లామిక్ సంప్రదాయవాదులు టెలిగ్రామ్‌లో విమర్శలు గుప్పించారు.

ఇంకొందరు ఖైరల్లాను ‘ముటాబారిజా’ అని తిట్టారు. మహిళల వస్త్రధారణ సంప్రదాయబద్ధంగా లేకపోయినా, మేకప్ వేసుకున్నా ఈ పదంతో విమర్శిస్తారు.

ఎలాంటి సంబంధంలేని ఒక మహిళ, పురుషుడు పక్కపక్కనే ఉండటానికి మతం అనుమతించదని సంప్రదాయవాదులు అంటున్నారు. షారా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, మతబోధనలకు వ్యతిరేకంగా ఉండే అలవాట్లపట్ల ఆసక్తి చూపిస్తున్నారని వారు ఆరోపించారు.

”ఇడ్‌లిబ్‌లోని జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్లను పరిష్కరించడం కోసం అమ్మాయిలతో సెల్ఫీలు తీసుకుంటూ హెచ్‌టీఎస్ లీడర్ చాలా బిజీగా ఉన్నారు” అని ఒక టెలిగ్రామ్ చానల్‌లో చేసిన ఓ పోస్టులో ఉంది.

షారా ఫోటోపోజులను విమర్శిస్తూ మాట్లాడిన సంప్రదాయవాదుల్లో ఎక్కువమంది గతంలో రాజకీయ, మతపరమైన కోణంలో షారాను విమర్శించినవారే. హెచ్‌టీఎస్‌‌ను వీడిపోయిన మత పెద్దలు కూడా ఆయన్ను విమర్శిస్తున్న వారిలో ఉన్నారు.

మతపెద్దల నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్లైన కామెంటేటర్ల దాకా అనేకమంది సంప్రదాయవాదులు ఈ వ్యవహారంపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. వారి అభిప్రాయాలను సిరియాలోని సంప్రదాయ కమ్యూనిటీలు ఆన్‌లైన్‌లో చదువుతుంటాయి. ఈ అభిప్రాయాలు హెచ్‌టీఎస్ మద్దతుదారులకు, బహుశా అధికారుల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)