SOURCE :- BBC NEWS

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

1 ఏప్రిల్ 2025

అంతరిక్షం నుంచి మార్చి 19న భూమికి తిరిగొచ్చిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్, తన తండ్రి పుట్టిన భారత దేశాన్ని కచ్చితంగా సందర్శిస్తానని చెప్పారు.

అంతరిక్షం నుంచి చూసినప్పుడు హిమాలయ పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయని ఆమె అన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలకుపైగా గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఇద్దరూ హూస్టన్‌లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో విలేఖరులతో మాట్లాడారు.

భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఇదే వారు పాల్గొన్న తొలి విలేఖరుల సమావేశం. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో గడపడానికి సంబంధించిన అనేక అంశాలను వారు విలేఖరులతో పంచుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుంది?

అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సునీత బదులిస్తూ, భారత్ అద్భుతంగా ఉంటుందని అన్నారు.

”మేం హిమాలయాలపై నుంచి వెళ్లిన ప్రతిసారి నా సహచరుడు బుచ్ ఆ అద్భుతమైన హిమాలయాల ఫోటోలు తీసేవారు. ఆ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు, టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన తరంగాల లాంటివి అక్కడ కనిపిస్తాయి. అవి ఎన్నో రంగుల్లో ఉంటాయి.

తూర్పు నుంచి గుజరాత్, ముంబయి లాంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ తీరంలో మత్స్యకారుల పడవలు మనం ఇక్కడికి వచ్చామని తెలిసేలా ఒక సంకేతం ఇస్తున్నట్లు ఉంటాయి.

భారత్‌లోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల మధ్య లైట్స్ నెట్‌వర్క్ రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది. హిమాలయాలు పగటి పూట కూడా అందంగా కనిపిస్తాయి” అని సునీతా విలియమ్స్ వివరించారు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్

ఫొటో సోర్స్, Getty Images

‘భారత వ్యోమగాములకు సహకరిస్తా’

భారత్‌ను సందర్శించడం, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో తన నైపుణ్యాలను పంచుకోవడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పారు.

”భారత్‌కు కచ్చితంగా వెళ్లాలని అనుకుంటున్నా. అక్కడ మా నాన్న వాళ్ల ఇల్లు ఉంది. అక్కడి ప్రజలను కలిసి నా అనుభవాలను పంచుకుంటా. యాక్సియమ్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లబోయే భారతీయ వ్యోమగాములను కలవడం, వారితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనుభవాలను పంచుకోవడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. భారత్ గొప్ప దేశం. అంతరిక్షంలో తనదైన ముద్ర వేయాలని భారత్ అనుకుంటోంది. అందులో భాగం కావడానికి, వారికి సాయం చేయడానికి నేను ఇష్టపడతా” అని సునీతా విలియమ్స్ అన్నారు.

అప్పుడు బుచ్ విల్‌మోర్ స్పందిస్తూ ‘మీరు మీతో పాటు మీ బృందాన్ని కూడా భారత్‌కు తీసుకెళ్తారా?’ అని సునీతా విలియమ్స్‌తో సరదాగా అన్నారు.

”నేను కచ్చితంగా నా వెంట మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు కూడా నాతో రావొచ్చు. మీకు కారంగా ఉండే ఆహారాన్ని తినిపిస్తాను” అని సునీతా బదులిచ్చారు.

సునీతా పూర్వీకులు గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి 40 కి.మీ దూరంలో ఉండే ఝులాసన్ గ్రామానికి చెందినవారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా ఈ గ్రామంలోనే జన్మించారు. 1957లో వైద్యశాస్త్రం చదవడానికి ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన ఉర్స్‌లీన్ బోనీ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరికి 1965లో సునీత జన్మించారు.

ఈ గ్రామ జనాభా దాదాపు 7 వేలు. సునీతా రెండుసార్లు ఈ గ్రామానికి వచ్చారు. 2007, 2013లలో అంతరిక్ష యాత్రలను పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ గ్రామాన్ని సందర్శించారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

సెలవుల్లో సునీతా విలియమ్స్ ఎక్కడికి వెళ్తున్నారు?

భూమికి తిరిగి రాగానే ఏం చేయాలని అనుకున్నారని సునీతను విలేఖరులు ప్రశ్నించగా, వెంటనే తన భర్తను, పెంపుడు కుక్కలను హత్తుకోవాలని కోరుకున్నట్లు ఆమె చెప్పారు.

”మనం ఇంట్లో ఉన్న భావన కలిగించే మరో విషయం ఆహారం. మా నాన్న పూర్తి శాఖాహారి. నేను ఇంటికి తిరిగి వెళ్లగానే మా నాన్న నాకు చీజ్ శాండ్‌విచ్ చేసి ఇచ్చారు.

న్యూ ఇంగ్లండ్‌లో మాకో ఇల్లు ఉంది. వేసవి సెలవులకు అక్కడికి వెళ్తున్నాం. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఇంట్లో ఖాళీగా ఉండటం చాలా కష్టం. అంతరిక్షం నుంచి మేం భూమిపై ఉండే చాలా అందమైన ప్రాంతాలను చూశాం” అని సునీత అన్నారు.

అంతరిక్షం, సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, NASA

వేగంగా కోలుకున్న సునీత

గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఆరోగ్యం భూమి మీదకు తిరిగొచ్చాక ఎలా ఉంది? వారు సాధారణ స్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందంటూ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

దీని గురించి మాట్లాడుతూ, తన సహచరుడు బుచ్ విల్‌మోర్ తరహాలోనే తాను కూడా ఇప్పుడు పరిగెత్తగలనని అన్నారు.

”శరీరం మార్పులకు అలవాటు పడటం చాలా అద్భుత విషయం. భూమ్మీదకు రాగానే మేమంతా కాస్త ప్రశాంతంగా ఉన్నాం. 24 గంటల్లోగా మా నాడీ వ్యవస్థ మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది. మా చుట్టూ ఏం జరుగుతుందో మెదడు అర్థం చేసుకుంది. వారంలోనే మేం బరువులు ఎత్తగలిగాం, పరిగెత్తగలిగాం” అని సునీతా వివరించారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

”పిల్లలూ.. ఎల్లప్పుడూ మీ లక్ష్యాల వైపు సాగాలి”

విద్యార్థులకు ఏమి చెప్పాలనుకుంటున్నారని సునీతను అడిగినప్పుడు, లక్ష్యం వైపు చేసే ప్రయాణంలో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకే సాగాలని ఆమె విద్యార్థులకు సూచించారు.

”ఇప్పుడు మేం భూమ్మీదకు తిరిగొచ్చాం. మేం తిరిగి రావాలనేదే మా ప్రణాళిక. ఇది అందరూ తెలుసుకోవాలి. కాకపోతే మధ్యలో చాలా మార్పులు జరిగాయి. వాటి నుంచి మేం చాలా నేర్చుకున్నాం.

ముఖ్యంగా మీరు వేసుకున్న ప్రణాళికలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు, దాన్నుంచి మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందాలి. ప్రణాళిక ప్రకారం వెళ్లాలని అనుకుంటాం. కానీ, కొన్నిసార్లు మీరు ఎడమ లేదా కుడి వైపుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కూడా మీరు ఎల్లప్పుడూ మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి. మీ కోసం చాలా తలుపులు తెరుచుకుంటాయి” అని ఆమె విద్యార్థులకు సూచించారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, AP

”మేం అన్నింటికీ సిద్ధమయ్యాం”

వివిధ రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము సిద్ధమయ్యామని బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్ చెప్పారు. వ్యోమగాములుగా ఇలాంటి పరిస్థితులకు తగినట్లుగా శిక్షణ తీసుకున్నామని అన్నారు.

”మేం అన్నింటికీ సన్నద్ధమయ్యం. మమ్మల్ని భూమ్మీదకు తీసుకురావడానికి ఇక్కడ ఒక పెద్ద బృందం పనిచేస్తుందనే సంగతి మాకు తెలుసు. సరైన సమయం ఎప్పుడో వారికి తెలుసు. వారు ఆ నిర్ణయం తీసుకునే వరకు మేం వేచి ఉండటానికి సిద్ధపడ్డాం” అని వారు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS