SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, EPA
ఎల్ ఫాషర్ సిటీకి సమీపంలోని క్యాంపు మీద దాడి జరిగిన తర్వాత, అక్కడి నుంచి పారిపోయిన సూడానీలు కొందరు బొగ్గు, ఆకులు తిని బతుకుతున్నారని వీరికి సాయంగా నిలుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ బీబీసీతో చెప్పింది.
‘‘ఒక్కో కథ వింటుంటే చాలా దారుణం అనిపిస్తోంది’’ అని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ ఆపరేషన్స్ హెడ్ నోవా టేలర్ బీబీసీ న్యూస్‌డే కార్యక్రమంలో చెప్పారు.
తవిలా పట్టణానికి వెళ్లేందుకు ఈ జనం ఎల్ ఫాషర్ సిటీకి వస్తున్నారనీ, కానీ దారిలోనే చనిపోతున్నారని టేలర్ చెప్పారు.
వారిలో కొందరు జమ్‌జమ్ అనే క్యాంప్ నుంచి, మండుతున్న ఎండలో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయత్నం చేశారనీ, తాగేందుకు నీళ్లు కూడా దొరక్క దాహంతో చనిపోతున్నారని ఆయన చెప్పారు.
‘‘ఎల్ ఫాషర్, తవిలా మధ్య రోడ్డు మీద మృతదేహాలు పడి ఉన్నాయన్న వార్తలను మేం విన్నాం. ఒక కుటుంబంతో మాట్లాడినప్పుడు ఎల్ ఫాషర్ నుంచి ఒంటరిగా నడిచి వస్తున్న ఒక అమ్మాయి మీద దారి పొడవునా పదే పదే అత్యాచారం జరిగిందని, ఆమె తవిలాకు వచ్చే సరికి గాయాల కారణంగా మరణించిందనీ ఆ కుటుంబం చెప్పింది” అని టేలర్ ఆ కార్యక్రమంలో చెప్పారు.


ఫొటో సోర్స్, Reuters
సూడాన్ పశ్చిమ ప్రాంతమైన డార్ఫర్‌లోని చివరి నగరం ఎల్ ఫాషర్. ఇప్పుడది సైన్యం, దాని మిత్రపక్షాల స్వాధీనంలో ఉంది. ఏప్రిల్ తొలి నాళ్లలో పారా మిలటరీకి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, జమ్‌జమ్ అనే క్యాంపు మీద దాడి చేశాయి. దీంతో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇళ్లను వదిలేసి వేలమంది పారిపోవాల్సి వచ్చింది.
డార్ఫర్‌లో ఇంతకు ముందు జరిగిన ఘర్షణల నుంచి తప్పించుకున్న జమ్‌జమ్ వాసులు అనేకమంది రెండు దశాబ్ధాలుగా అక్కడే ఉంటున్నారు.
ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ రెండేళ్లుగా సూడాన్ సైన్యంతో పోరాడుతోంది. ఈ యుద్ధంలో లక్షన్నర మంది చనిపోయారు. కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభమని సహాయ సంస్థలు చెబుతున్నాయి.
నిధుల కొరత కారణంగా కరవు పీడిత సూడాన్‌కు అందిస్తున్న ఆహార సాయాన్ని తగ్గిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
యుద్ధ సమయంలో డార్ఫర్‌లోని అరబ్బేతరులను ఆర్ఎస్ఎఫ్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో “సామూహిక జాతి హననానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిని మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలుగా భావించవచ్చు” అని బ్రిటన్ విదేశాంగమంత్రి డేవిడ్ లామీ అన్నారు.
“సహాయాన్ని త్వరగా అందించేందుకు మానవతా సాయం చేసే సంస్థలకు భద్రతాపరమైన హామీలు ఇవ్వాలి’’ అని ఆయన ఇరుపక్షాలను కోరారు.

ఏప్రిల్ 10 నుంచి ఎల్ ఫాషర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 481 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని కూడా వెల్లడించింది.
సూడాన్‌లో పరిస్థితులపై ఐరాస మానవహక్కుల అధిపతి వోకర్ తుర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
“పలు ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించే వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్య సిబ్బంది ప్రమాదంలో ఉన్నారు. నీటి వనరులపైనా విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.
లైంగిక హింసకు సంబంధించి వస్తున్న కథనాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్‌జమ్ క్యాంపును బూడిదగా మార్చారని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన హ్యుమానిటేరియన్ రీసర్చ్ ల్యాబ్ అధిపతి నెతానియల్ రేమండ్ చెప్పారు.
“ఇళ్లను, సహాయ కేంద్రాలను తగలబెట్టడం ద్వారా ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం జరుగుతోంది” అని రేమండ్ అన్నారు. జమ్‌జమ్ క్యాంపు నుంచి తప్పించుకున్న ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఆయన అన్నారు.
తమ ఇళ్లను వదిలి పారిపోయి వస్తున్న వారికి ఆశ్రయం కల్పించలేక తవిలా సిటీ ఇబ్బంది పడుతోందని టేలర్ హెచ్చరించారు.
“అక్కడ ఆహారం, నీరు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ చిన్న పట్టణం ఇప్పుడు లక్ష 50వేల మందికి ఆశ్రయం ఇస్తోంది” అని ఆయన చెప్పారు.
తమ ఇళ్లను తగలబెట్టి, తమపై కాల్పులు జరిపారని జమ్‌జమ్ నుంచి పారిపోతున్న కొంతమంది బీబీసీతో చెప్పారు. క్యాంపు మీద దాడి చేసిన మాట నిజమేనని అంగీకరించిన ఆర్ఎస్ఎఫ్, తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని చెబుతోంది.
సూడాన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ యుద్ధం కొనసాగుతోంది.
వెస్ట్ కోర్డోఫాన్‌లోని అల్ జాఆఫా గ్రామంపై ఆర్ఎస్ఎఫ్ దాడి చేసినప్పుడు 74 మంది చనిపోయారని సూడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)