SOURCE :- BBC NEWS

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Bastar Junction

ముకేశ్‌ చంద్రాకర్ బస్తర్‌కు చెందిన ఒక జర్నలిస్ట్. కొత్త సంవత్సరం రోజున ముకేశ్‌ కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని ఒక సెప్టిక్ ట్యాంక్ లో పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్‌ చంద్రాకర్‌ను సిట్ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. సురేశ్, ముకేశ్ బంధువులు.

బీబీసీ వాట్సాప్ చానల్

హత్యకు కారణాలేంటి?

ముకేశ్ చంద్రాకర్ ఎన్డీటీవీలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేసేవారు. తరువాత బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి సొంతంగా బస్తర్ నుంచి రిపోర్టింగ్ చేసేవారు.

అయితే గత ఏడాది డిసెంబర్‌లో బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో రోడ్డు నిర్మాణాలలో అవినీతి జరుగుతోందంటూ ముకేశ్ రిపోర్ట్ చేశారు.

ఈ అవినీతి వార్త బయటకు రాగానే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టుపై ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

సురేశ్ చంద్రాకర్ ఈ ప్రాజెక్ట్‌కు కాంట్రాక్టర్.

‘‘కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్ నిర్మించిన రహదారి నిర్మాణంలో అవినీతి వార్త ఎన్డీటీవీలో ప్రసారమైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నా సోదరుడు అదృశ్యమైన తర్వాత, మేము అతని మొబైల్, ల్యాప్‌టాప్ ఆధారంగా చివరి లొకేషన్‌ కోసం చెక్ చేశాం. అది కాంట్రాక్టర్ దినేశ్ చంద్రాకర్, సురేశ్ చంద్రాకర్, రితేశ్ చంద్రాకర్‌లు తమ పనివాళ్ల కోసం నిర్మించిన భవనం దగ్గర చూపించింది. దీంతో మాకు అనుమానం వచ్చింది.’’ అని ముకేశ్ అన్న, సీనియర్ జర్నలిస్ట్ ఉకేశ్ చంద్రాకర్ బీబీసీ‌తో చెప్పారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కాంట్రాక్టర్లు దినేశ్ చంద్రాకర్, సురేశ్ చంద్రాకర్, రితేశ్ చంద్రాకర్‌ల నుంచి వల్ల ముకేశ్‌కు హాని ఉండొచ్చని పేర్కొన్నారు ఉకేశ్.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Alok Putul/BBC

శరీరం మీద తీవ్రమైన గాయాలు

‘‘ముకేశ్ జనవరి 1 నుంచి కనిపించకుండా పోయారు. ఏదైనా వార్త గురించి బయటకి వెళ్లి ఉంటారని అనుకున్నాం. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి అనుమానం వచ్చింది.’’ అని ఉకేశ్ చంద్రాకర్ బీబీసీ‌తో చెప్పారు.

జనవరి 1న సురేశ్‌, ముకేశ్‌లు కలుసుకున్నారని ఉకేశ్ చెప్తున్నారు. ఆ తర్వాత సురేశ్ గతంలో నిర్మించిన ఒక కాంప్లెక్స్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లోనే ముకేశ్ మృతదేహం లభించింది.

ఘటనా స్థలాన్ని మొదట జనవరి 2న పరిశీలించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

జనవరి 3న లోతుగా దర్యాప్తు చేసినప్పుడు ఒక సెప్టిక్ ట్యాంక్‌లో ముకేశ్ మృతదేహం కనిపించిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

శరీరం మీద తీవ్రమైన గాయాలున్నాయని పోలీసులు చెప్పారు.

ముకేశ్ మరణంపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది.

ముకేశ్ హత్యపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్‌ను సిట్ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

సురేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్ చరిత్ర ఏంటి?

పోలీసులు అరెస్టు చేసిన కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్ బస్తర్‌లో ప్రభుత్వ నిర్మాణ పనులు, మైనింగ్‌ వ్యవహారాలలో పనిచేసే పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు.

ఆయన ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్డ్ కులాల సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను నవాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ పరిశీలకుడిగా పార్టీ నియమించింది.

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసు ఆధ్వర్యంలో మొదలైన ‘సల్వా జుడుం’ క్యాంపెయిన్‌లో సురేశ్ చంద్రాకర్ పాల్గొన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన, ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకొని బస్తర్‌లోని అగ్ర కాంట్రాక్టర్లలో ఒకరుగా ఎదిగారు. ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ పనులు నిర్వహిస్తుంటారు.

2021లో జరిగిన ఆయన వివాహం మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. బీజాపూర్‌లో అట్టహాసంగా రాజరికపు పద్ధతిలో జరిగిన వివాహ వేడుకలో ఆయన తన అత్తగారింటికి వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్‌ను ఉపయోగించారు.

బీజాపూర్‌లాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాటలు పాడటానికి, డాన్సులకు రష్యన్ డాన్సర్‌లను రప్పించడం చర్చనీయాంశమైంది.

పెళ్లి తరువాత బీజాపూర్‌ స్టేడియంలో ఆయన భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థాయి పెళ్లి వేడుక బీజాపూర్ ప్రాంతంలో జరగలేదని అప్పట్లో చెప్పుకున్నారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS