SOURCE :- BBC NEWS

సౌర జ్వాలలు, సూర్యుడు, నాసా, విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఫొటో సోర్స్, NASA/SDO

ఒక గంట క్రితం

సూర్యుడి ఉపరితలం మీద సంభవించే పరిణామాల వేగం పెరిగింది.

దీని ఫలితంగా ఈ ఏడాదిలోనే అతి పెద్ద సౌర జ్వాల ఏర్పడింది.

దీన్ని నాసాకు చెందిన ‘సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ’ ఫొటో తీసింది.

సూర్యుడిపై ‘హై యాక్టివిటీ’ ఉన్న కాలంలో ‘సౌర గాలి’గా పిలిచే అక్కడి విద్యుదావేశిత రేణువులు నిరంతరం భూమిని తాకుతుంటాయి.

ఈ పరిణామాన్ని అంతరిక్ష వాతావరణం లేదా సౌర తుపాన్లుగా పిలుస్తారు.

ఈ సౌర తుపాన్ల వల్ల భూమి మీద సాంకేతిక సమస్యలు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వంటివి కలగడంతో పాటు అంతరిక్షంలో వ్యోమగాములపైనా ప్రభావం పడొచ్చు.

అయితే భూమి మీద ఉండే మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సౌర జ్వాలలు, సూర్యుడు, నాసా, విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఫొటో సోర్స్, Getty Images

సౌర జ్వాల అంటే ఏమిటి?

సౌర తుపానులు అనేవి సూర్యుడి సౌర చక్రంలో సాధారణం.

సూర్యుడి నుంచి సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజక్షన్స్(సీఎంఈ) రూపంలో పెద్దమొత్తంలో ఉద్గారాలు వచ్చినప్పుడు ఈ సౌర తుపానులు ఏర్పడతాయి.

సౌర పదార్థం, శక్తి, కాంతి పెద్ద మొత్తంలో అంతరిక్షంలోకి విడుదల కావడాన్ని కరోనల్ మాస్ ఎజక్షన్ అంటారు.

సౌర జ్వాలల విద్యుదయస్కాంత రేడియేషన్ సూర్యుడి నుంచి కాంతి వేగంతో ప్రయాణించి భూమిని 8 నిమిషాల్లోనే చేరుతుంది.

సాధారణంగా సౌరజ్వాలలు కరోనల్ మాస్ ఎజక్షన్స్‌తో కలిసి ఏర్పడతాయి.

సౌర తుపానులు ఒక్కోటి ఒక్కో స్థాయి శక్తితో భూమిని తాకుతాయి.

సూర్యుడి నుంచి వెలువడే శక్తి ఆకాశంలో అరోరా అని పిలిచే ప్రకాశవంతమైన వెలుగును సృష్టిస్తుంది. వీటిని ఉత్తర కాంతులు లేదా దక్షిణ కాంతులని పిలుస్తారు.

సౌర జ్వాలలు, సూర్యుడు, నాసా, విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఫొటో సోర్స్, Getty Images

సౌర తుపాను భూమి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సౌర జ్వాలలు, సూర్యుడి మీద విస్పోటాల వల్ల రేడియో కమ్యూనికేషన్లు, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్లు, నావిగేషన్ సిగ్నల్‌ ప్రభావితం అవుతాయని నాసా చెబుతోంది.

2017లో సూర్యుడి ఉపరితలం నుంచి వెలువడిన రెండు భారీ సౌర జ్వాలలు జీపీఎస్ వంటి నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించాయి.

2011 ఫిబ్రవరిలో శక్తిమంతమైన సౌర జ్వాల ఒకటి చైనా అంతటా రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించింది.

1989లో సౌర జ్వాల ఒకటి కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో తొమ్మిది గంటల పాటు లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేసింది.

1859లో భారీ సౌర విస్పోటం వల్ల భూఅయస్కాంత తుపాను(జియో మాగ్నటిక్ స్టార్మ్) సంభవించింది.

దీని వల్ల విక్టోరియన్ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ లైన్స్‌కు అంతరాయం ఏర్పడింది.

సౌర జ్వాలలు, సూర్యుడు, నాసా, విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఫొటో సోర్స్, Getty Images

సౌర తుపానులు ఎంత తరచుగాా వస్తాయి?

శక్తివంతమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిచే విద్యుదావేశిత వేడి వాయువులతో సూర్యుడు ఏర్పడ్డాడు.

ఈ విద్యుదయస్కాంత క్షేత్రం సౌర చక్రం(సోలార్ సైకిల్‌)లోంచి సాగుతుంది.

సూర్యుడి విద్యుదయస్కాంత క్షేత్రం ఒక భ్రమణం పూర్తి చేయడాన్ని సౌర చక్రం అంటారు.

ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సౌర చక్రం పూర్తయి సూర్యుడి అయస్కాంత క్షేత్ర ఉత్తర, దక్షిణ ధ్రువాల స్థానాలు మారుతాయి. ఒకదాని స్థానంలోకి మరొకటి వస్తుంది.

సూర్యుడి మీద ప్రస్తుతం నడుస్తున్న చక్రాన్ని సోలార్ సైకిల్ 25గా గుర్తిస్తున్నారని, ఇది 2019 డిసెంబర్‌లో మొదలైందని నాసా, యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం తెలిపింది.

సూర్యుడి మీద కార్యకలాపాలు తక్కువగా ఉన్నప్పుడు సోలార్ సైకిల్ ప్రారంభం అవుతుంది. ఇది కొన్నేళ్ల పాటు ఉంటుంది. ఈ దశలో సూర్యుడి మీద ఉండే నల్లటి మచ్చలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సూర్యుడి గురించి అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు తేలికవుతుంది.

సూర్యుడి మీద కార్యకలాపాలు పెరిగే కొద్దీ, మచ్చల సంఖ్య కూడా పెరుగుతుంది.

సోలార్ సైకిల్ మధ్య దశను సోలార్ మ్యాక్సిమమ్ అంటారు. ఈ సమయంలో సూర్యుడి మీద మచ్చలు పెరుగుతాయి. అలాగే అక్కడి అయస్కాంత ధ్రువాల స్థానాలు మారుతాయి.

గత ఏడాది సూర్యుడి ప్రస్తుత సైకిల్‌ మ్యాక్సిమమ్ పీరియడ్‌కు చేరుకున్నట్లు నాసా, యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపాయి.

11 ఏళ్ల సౌర చక్రంలో ‘సోలార్ మాక్సిమమ్’ కాలంలో సౌర తుపానులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)