SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
చిన్న పిల్లలకు కృత్తిమ తీపి పదార్థాలు ఉన్న ఎలాంటి పానీయాలు ఇవ్వకూడదని బ్రిటన్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్పర్టమ్, స్టీవియా, సేకరిన్, సుక్రలోజ్ వంటి పదార్థాలు ఉండే షుగర్ ఫ్రీ ‘టూత్ కైండ్’ స్క్వాష్ వంటి పానీయాలకు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ (ఎస్‌ఏసీఎన్) సిఫార్సులు వర్తిస్తాయి.
చిన్న పిల్లలకు ఇలాంటి తీపి పానీయాలకు బదులుగా నీటిని తాగించడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.
కాస్త పెద్ద పిల్లలకు చక్కెర మోతాదును తగ్గించడంలో స్పీటెనర్లు సహాయపడొచ్చు.

కృత్తిమ తీపి పదార్థాలు అంటే ఏంటి?
చక్కెర ఎక్కువగా తినడం వల్ల దంతక్షయం వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే టైప్-2 డయాబెటిస్, ఒబెసిటీ, హృదయసంబంధ వ్యాధులకు దారితీయొచ్చు.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా కృత్తిమ తీపి పదార్థాలను (ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు) అభివృద్ధి చేశారు. ఇవి తక్కువ కేలరీలు లేదా అసలు కేలరీలు లేకుండా తీపి రుచిని అందిస్తాయి.
ఆమోదించిన స్వీటెనర్లనే యూకేలో వాడుతున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాకే వాడకానికి ఆమోద ముద్ర వేశారు.
కానీ, ఈ స్వీటెనర్లు పిల్లల్లో తీపి తినాలనే అభిరుచిని పెంచుతాయని, దాన్నుంచి బయటపడటం కష్టమని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, PA Media
అందుబాటులో ఉన్న ఆధారాలను సమీక్షించిన తర్వాత, స్వీటెనర్లతో దంతక్షయం తగ్గుతుందని చెప్పలేమని ఎస్‌ఏసీఎన్ పేర్కొంది.
ఫ్రీ షుగర్లను తగ్గించుకోవడంతో పాటు డైట్‌లో ఇతర సానుకూల మార్పులను చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించింది.
అయితే బరువు తగ్గడంలో కాస్త ఇవి ఉపయోగకరంగా ఉంటాయని, కానీ, బరువు తగ్గడానికి ఇదొక్కటే మార్గం కాదని చెప్పింది.
ముఖ్యంగా పిల్లల విషయంలో వీటిపట్ల జాగ్రత్తగా ఉండటం అవసరమని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో సైకోబయాలజీ చైర్, ప్రొఫెసర్ గ్రాహమ్ ఫిన్లాయ్‌సన్ అన్నారు. అయితే, చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు నాన్ షుగర్ స్వీటెనర్లు ఒక సాధనంగా చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
”ఒబెసిటీ, డయాబెటిస్ కేసులు పెరుగుతున్నందున, అనూహ్య విధాన మార్పులు మంచి కంటే హాని కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)