SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, BBC/Jamie Niblock
బ్రిటన్‌లోని సఫోల్క్ మ్యూజియంలోని ఒక పుస్తకం కవర్ పేజీని దాదాపు 200 సంవత్సరాల కిందట ఉరితీసిన కరుడుగట్టిన హంతకుడి చర్మంతో తయారు చేశారని ఇటీవల కనుగొన్నారు.
ఒక మహిళను హత్యచేసినందుకు 1827లో విలియం కార్డర్ దోషిగా తేలారు. ఈ కేసు బ్రిటిషు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రెడ్ బార్న్ మర్డర్‌గా ఈ కేసు ప్రసిద్ధి పొందింది.
బరీ సెయింట్ ఎడ్మండ్స్ పట్టణంలోని మోయిసిస్ హాల్ మ్యూజియం క్యూరేటర్లు ఈ పుస్తకాన్ని ఒక షెల్ఫ్‌లో కనుగొన్నారు. చాలా ఏళ్ళుగా ఎవరూ గుర్తించని ఈ పుస్తకాన్ని ఇప్పుడు ప్రదర్శనకు పెట్టారు.
విలియంను ఉరితీసిన తరువాత ఆయన మృతదేహంపై శాస్త్రీయ ప్రయోజనాల కోసం పరీక్షలు జరిపిన వైద్యుడితో దగ్గరి సంబంధాలు ఉన్న ఓ కుటుంబం చాలా ఏళ్ల కిందట ఈ పుస్తకాన్ని మ్యూజియానికి ఇచ్చింది.
అసలు ఇంతకీ ఈ విలియం కార్డర్ ఎవరు, ఆయన ఎందుకు హత్య చేశారు, ఈ హత్యపై ఇప్పటికీ ప్రజలలో ఎందుకంత ఆసక్తి?


ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ విలియం?
19వ శతాబ్ధం ప్రారంభంలో పోల్‌స్టెడ్ అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కౌలు రైతుల కుటుంబంలో జన్మించారు విలియం కార్డర్. ఈ గ్రామం ఇప్స్‌విచ్, సడ్‌బరీ నగరాల మధ్య ఉంటుంది.
22 ఏళ్లున్న విలియమ్, 24 ఏళ్లున్న మరియా మార్టెన్ ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కార్డర్ కుటుంబానికి విలియమే పెద్ద దిక్కు. ‘లేడీస్ మ్యాన్’ గా ఆయనకు పేరుంది.
మరోపక్క మరియా పొలాల్లో ఎలుకలను పట్టే వృత్తిలో ఉన్నతండ్రి, సవతి తల్లి, సోదరి, చిన్నకొడుకుతో కలిసి నివసించేవారు .
అయితే ఈ బంధాలనుంచి తప్పించుకుని కొత్తజీవితాన్ని ప్రారంభించడానికి విలియం ఆమెకు ఓ మార్గంగా కనిపించి ఉండొచ్చు.
ఈ నేపథ్యంలో మరియాతో పారిపోవడానికి విలియం 1827లో ఓ ప్లాన్ వేశారు. ఈమేరకు తన పొలంలోని ధాన్యం కొట్టం (రెడ్‌బార్న్)లో కలవమని, అక్కడి నుంచి ఇప్స్ విచ్ పట్టణానికి పారిపోయి పెళ్లి చేసుకుందామని మరియాకు చెప్పారు విలియం.
ఆ తరువాత విలియం అదృశ్యం అయిపోయారు. మరియా మళ్లీ కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత ఏం జరిగింది?
ఇంగ్లండ్‌లోని సఫోల్క్ ప్రాంతం నుంచి బయటపడిన తర్వాత మరియా కుటుంబానికి ఒక లేఖ పంపారు విలియం.
మరియాతో కలిసి వైట్‌ఐల్‌కు వెళ్లిపోయినట్లు ఆ లేఖలో తెలిపారు. నిజానికి ఆయన లండన్ శివార్లలో తలదాచుకున్నారు. ఎందుకంటే మరియా మెడపై ఆయన తుపాకీతో కాల్చి చంపారు. తరువాత ఆమెను తాము ఎక్కడైతే కలవాలనుకున్నారో అక్కడే పాతిపెట్టారు.
దాదాపు సంవత్సరం గడిచాక, మరియా చనిపోయినట్లు, రెడ్‌బార్న్ వద్ద పాతిపెట్టినట్లు ఆమె సవతి తల్లి ఆన్ మార్టెన్ కల కన్నారు. దీంతో మరియా తండ్రి ఆ ప్రదేశంలో తవ్వారు, అక్కడ మరియా మృతదేహం దొరికింది.
అనంతరం, విలియం కోసం గాలింపు ప్రారంభమైంది. ఒక వార్తాపత్రిక ఎడిటర్ తనకు విలియం కార్డర్ గురించి తెలుసని చెప్పారు.
”విలియం పరారీలో ఉండటమే కాదు, ఒంటరిగా ఉన్నారు. కాబట్టి కొత్త భార్య కోసం ఒక వార్తాపత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు” అని మోయిసిస్ హాల్ మ్యూజియంలోని హెరిటేజ్ ఆఫీసర్ డాన్ క్లార్క్ చెప్పారు. రెడ్‌బార్న్ హత్యకు సంబంధించి అనే కళాఖండాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. వాటిల్లో కార్డర్ చర్మంతో కవర్‌పేజీలు చేసిన రెండు పుస్తకాలు కూడా ఉన్నాయి.
పోలీసులు విలియంను పట్టుకున్నారు. ఆయన మొదట మరియా గురించి తెలియదని చెప్పారు. కానీ, ఆమె మృతదేహం దొరికిందని పోల్‌స్టెడ్ నుంచి వచ్చిన ఒక లేఖ విలియం వద్ద లభ్యమైంది.

ఫొటో సోర్స్, Getty Images
విచారణ, బహిరంగ ఉరి
విలియంను బరీ సెయింట్ ఎడ్మండ్స్‌కు తీసుకెళ్లారు. మరియా హత్య నేరానికి సంబంధించి పది రకాల అభియోగాలు మోపారు. ఇవ్వన్నీ కూడా ఆయనకు శిక్షపడేలా పకడ్బందీగా ఉన్న అభియోగాలే.
అయితే, మరియా ఆత్మహత్య చేసుకుందని చెప్పడం ద్వారా ఈకేసులోంచి తప్పించుకోవడానికి విలియం ప్రయత్నించారు. కానీ రెండు రోజుల విచారణ తర్వాత దోషిగా తేలారు. ఇరువురి మధ్య వాదన జరిగిందని, ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మరియాను కాల్చి చంపినట్లు విలియం చివరకు అంగీకరించారు.
1828 ఆగస్టు 11న మధ్యాహ్నం జైలు వెలుపల విలియంను ఉరితీయడాన్ని చూడటానికి దాదాపు 7,000 నుంచి 10,000 మంది జనం వచ్చారు. ఆ తర్వాత, పట్టణంలోని షైర్ హాల్ వద్ద అతని మృతదేహాన్ని చూడటానికి ప్రజలు బారులు తీరారు.
”అక్కడ చాలామంది ఉన్నారు. దీంతో విలియం మృతదేహాన్ని జైలు ప్రధాన ద్వారం నుంచి తీసుకురాలేకపోయారు. దీంతో అధికారులు జైలు భవనం గోడకు ఒక రంధ్రం చేసి విలియం శవాన్ని బయటకు తీసుకురావాల్సి వచ్చింది” అని క్లార్క్ చెప్పారు.
హత్య తర్వాత, పోల్‌స్టెడ్ పర్యటక ప్రాంతంగా మారింది. స్మారక చిహ్నాలుగా భావించి కొందరు రెడ్‌బార్న్‌లోని కొన్ని వస్తువులను తీసుకెళ్లడంతో రెడ్‌బార్న్, మరియా సమాధి దెబ్బతిన్నాయి.

విలియం శరీరాన్ని ఏం చేశారు?
రెడ్‌బార్న్ మర్డర్ అంశంపై ప్రజలు చాలా ఆసక్తి కనబరిచారు. ఇది పుస్తకాలు, నాటకాలు, పాటలకు దారితీసింది. నేటికీ నిజమైన నేర కథలలో దాని గురించి మాట్లాడుతుంటారు.
మోయ్స్ హాల్, నార్విచ్ కోటలో ఇప్పటికీ విలియం డెత్ మాస్క్(చనిపోయిన తర్వాత తయారు చేసిన ముసుగు)ను కనిపిస్తుంది. అది విలియం మూసిన కళ్లు, పగిలిన నాసికా రంధ్రాలను చూపిస్తుంది.
వెస్ట్ సఫోల్క్ హాస్పిటల్‌లోని వైద్య విద్యార్థులకు బోధించడానికి విలియం అస్థిపంజరాన్ని ఉపయోగించారు.
విలియం చర్మంతో రెండు పుస్తకాలకు కవర్ పేజీలు తయారు చేశారు. అతని తలలోని ఒక భాగం, చెవిని జ్ఞాపకంగా దాచారు. ఇవన్నీ మోయిసిస్ హాల్‌లో భద్రపరిచారు.
మరియాను అమాయకమైన యువతిగా తప్పుగా చిత్రీకరించడంతో పాటు విలియంను అవమానించారని ‘హారిబుల్ హిస్టరీస్’ సిరీస్ రచయిత టెర్రీ డియరీ నమ్ముతున్నారు.
విలియం గురించి కాకుండా మరియాతో సహా సఫోల్క్‌లో మహిళా బాధితులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మోయిసిస్ హాల్ కొత్త ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తోంది.
రెడ్‌బార్న్ మర్డర్ గురించి తెలుసుకోవడానికి 80 శాతం మంది సందర్శకులు చాలా ఆసక్తిగా ఉన్నారని హెరిటేజ్ అసిస్టెంట్ అబ్బీ స్మిత్ అన్నారు.
“ఇదొక పెద్ద, షాకింగ్ ఘటన. అయినా జనం దానిపై మక్కువ చూపిస్తున్నారు, ఇది ఆందోళనకరం” అని స్మిత్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, BBC/Jamie Niblock
ఆ పుస్తకాలలో ఏం రాశారు?
మొదటి పుస్తకం విలియం కార్డర్ విచారణను వివరిస్తుంది. దీనిని జే కర్టిస్ అనే జర్నలిస్ట్ రాశారు. పుస్తకం పేరు “ట్రయల్ ఆఫ్ డబ్ల్యు కార్డర్”.
కార్డర్ శరీరాన్ని కోసి పరిశీలించిన ‘సర్జన్ జార్జ్ క్రీడ్’ చెప్పిన విషయం ఒకటి పుస్తకం లోపల పొందుపరిచారు. 1838లో సర్జన్ స్వయంగా చర్మాన్ని తోలుగా మార్చి పుస్తకం కవర్ పేజీ చేయడానికి ఉపయోగించినట్లు అందులో తెలిపారు.
రెండవ పుస్తకం కూడా అదే ఎడిషన్‌ది అయి ఉండొచ్చని అనుకుంటున్నారు కానీ, దాని టైటిల్ “పోల్‌స్టెడ్ – విలియం కార్డర్” అని ఉంది.
జార్జ్ క్రీడ్‌తో దగ్గరి సంబంధాలున్న ఒక కుటుంబం ఈ పుస్తకాన్ని మ్యూజియానికి ఇచ్చింది. క్రీడ్ తన దగ్గరున్న చాలా వస్తువులను ఈ కుటుంబానికే ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)