SOURCE :- BBC NEWS
1915లో 29 ఏళ్ల భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త జమన్‌దాస్ వటుముల్ తన వ్యాపార భాగస్వామి ధరమ్‌దాస్‌తో కలిసి హవాయిలోని హోనలులులో తన ఇంపోర్ట్ బిజినెస్‌కు సంబంధించిన ఒక రిటైల్ షాపు పెట్టేందుకు వచ్చారు.
హోనలులులోని హోటల్ వీధిలో వటుముల్ అండ్ ధరమ్‌దాస్ పేరుతో వారు తమ వ్యాపారాన్ని రిజిస్టర్ చేయించారు. అక్కడ సిల్క్, చేతితో తయారు చేసిన కళాఖండాలు, వెండివస్తువులు, తూర్పు దేశాల నుంచి తీసుకొచ్చిన ఆసక్తికరమైన వస్తువులను విక్రయించడం ప్రారంభించారు.
1916లో ధరమ్‌దాస్ కలరాతో చనిపోయారు. దీంతో అప్పటికే మనీలాలో తన వ్యాపారం చూసుకుంటున్న జమన్‌దాస్ వటుముల్ తన సోదరుడు గోవిందరామ్‌ను హొనలులులో వ్యాపారం చూసుకునేందుకు పంపించారు.
తర్వాత కొన్నేళ్ల వరకు ఈ సోదరులిద్దరు తమ వ్యాపారాలను చూసుకుంటూ భారత్ హవాయి మధ్య ప్రయాణిస్తుండేవారు.
ప్రస్తుతం హవాయి దీవుల్లో వటుముల్ పేరు అన్ని రంగాల్లో విస్తరించింది. దుస్తుల తయారీ నుంచి రియల్ ఎస్టేట్, విద్య, కళలు, దాతృత్వం.. ఇలా ఏ రంగమైనా ఈ కుటుంబం చరిత్ర హవాయితో విడదీయరాని రీతిలో పెనవేసుకుపోయింది.
భారత దేశం నుంచి హవాయి దీవులకు వలస వచ్చిన తొలి భారతీయ కుటుంబం ఇది. ప్రస్తుతం హవాయిలోని సంపన్న కుటుంబాల్లో ఒకటిగా మారింది.
జమన్‌దాస్ 1973లో ఒక స్థానిక పత్రికతో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ.. ‘చిన్నచిన్నగా ఇదంతా సాధ్యమైంది’ అని చెప్పారు.
స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలో పుట్టిన జమన్‌దాస్ తండ్రి ఇటుకల కాంట్రాక్టర్. వారి కుటుంబం సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో( ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) ఉండేది.
కుటుంబ సభ్యులంతా విద్యావంతులు, అయితే సంపన్నులు కాదు. జమన్‌దాస్ తండ్రికి ఓ ప్రమాదం తరువాత పక్షవాతం రావడంతో తల్లి జమన్‌దాస్‌ను టెక్స్‌టైల్ మిల్లులో పని చేసేందుకు ఫిలిప్పీన్స్ పంపించారు.
1909లో ఆయన తన భాగస్వామి ధరమ్‌దాస్‌తో కలిసి మనీలాలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు.
అమెరికా ఫిలిప్పీన్స్‌ను ఆక్రమించుకున్న తర్వాత మనీలాలో విదేశీయుల వ్యాపారాలను మూసియించడంతో జమన్‌దాస్, ధరమ్‌దాస్ మనీలా నుంచి హవాయి వెళ్లినట్లు జమన్‌దాస్ మనవడు జేడీ వటుముల్ చెప్పారు.
హవాయిలో వ్యాపారాల నిర్వహణ జమన్‌దాస్ సోదరుడు గోవిందరామ్ చేతికి వచ్చిన తర్వాత ఈ వ్యాపారాలకు ఈస్టిండియా స్టోర్ అని పేరు మార్చారు.
అనంతర కాలంలో ఈ సంస్థ డిపార్ట్‌మెంటల్ స్టోర్ వ్యాపారంలోకి విస్తరించింది.
హవాయితో పాటు ఆసియాలోని అనేక ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేసినట్లు సౌత్ ఏషియన్ అమెరికన్ హిస్టరీ అనే డిజిటల్ ఆర్కైవ్ చెబుతోంది.
1937లో హోనలులులోని వైకికి సమీపంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు గోవిందరామ్ వటుముల్ భవనాన్ని నిర్మించారు.
ఆ తర్వాత ఆయన కోట్ల రూపాయల వ్యాపారం 1957 నాటికి10 స్టోర్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలకు విస్తరించిందని సౌత్ ఏషియన్ అమెరికన్ హిస్టరీ డిజిటల్ ఆర్కైవ్ చెబుతోంది.
ఈ స్టోర్లలో దుస్తులు, లో దుస్తులు.. వెండి, టేకు చక్కతో చేసిన అరుదైన, విలువైన వస్తువులను విక్రయించేవారని.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని స్టార్ బులెటిన్ వార్తా పత్రిక వివరించింది.
అలోహ షర్టులు
1930లో సంపన్నులైన పర్యటకులకు హవాయి గమ్యస్థానంగా ఉండేది. ముదురు రంగులో ఒకేలాంటి డిజైన్‌తో ఉండే ఇక్కడి చొక్కాలకు మంచి డిమాండ్ ఉండేది. వీటిని అలోహ షర్ట్స్ అనేవారు.
హవాయి నమూనాలతో డిజైన్లను తీసుకొచ్చిన తొలి స్టోర్‌గా వటుముల్‌కు చెందిన ఈస్టిండియా స్టోర్ గుర్తింపు పొందిందని హవాయి టెక్స్‌టైల్ అండ్ ప్యాటర్న్స్ నిపుణుడు డేల్ హోప్ చెప్పారు.
ఈ డిజైన్లనను 1936లో గోవిందరామ్ తన కోడలు ఎల్సీ జెన్సెన్‌తో కలిసి రూపొందించారు.
“మౌంట్ ఫ్యుజీకి బదులుగా డైమండ్ హెడ్.. కోయి అని పిలిచే రంగు రంగుల చేపకు బదులుగా ఇతర ముదురు చేపల బొమ్మల్ని.. చెర్రీ పువ్వులకు బదులు మందారం, తెల్లటి పూలను చొక్కాలపై ముద్రించారు. అవి ఇక్కడ ఉన్న వారందరికీ సుపరిచితమైనవి” అని హోప్ చెప్పారు.
ఈ డిజైన్లను జపాన్ పంపించేవారు. అక్కడ వాటిని ముడి సిల్క్ మీద చెక్క ముక్కలతో ముద్రించేవారని హవాయి చొక్కాల డిజైన్ల గురించి నాన్సీ షిఫర్ రాసిన పుస్తకంలో వివరించారు.
“చిన్న చిన్న పూల నమూనాలు, ఆధునికంగా కనిపించే కాన్సెప్ట్‌లు, హవాయిలో కమర్షియల్‌గా తయారైన మొదటి డిజైన్లు” అని ఫిషెర్ తెలిపారు
“వాటిని పడవల్లో నింపి అమ్మారు. అంతే కాదు ఆ దుస్తుల్ని లండన్‌లోనూ ప్రదర్శించారు” అని ప్యారడైజ్ ఆఫ్ పసిఫిక్ అనే పుస్తకంలో విలియం డెవెన్‌పోర్ట్ చెప్పారు.
వటుముల్‌కు చెందిన వైకీకి స్టోర్‌లో అమెరికన్ సినీ నటులు లొరెట్టా యంగ్,
జాక్ బెన్నీ, లానా టర్నర్, ఎడ్డీ “రోచెస్టర్” ఆండర్సన్ ఈ షర్టులను కొనుగోలు చేసేందుకు వచ్చేవారని గోవిందరామ్ కుమార్తె లీల డేల్ హోప్‌తో చెప్పారు.
“హవాయి ఫ్యాషన్‌కు వటుముల్ పర్యాయపదంగా మారిందని చెప్పేందుకు మేం అనేక కొత్త విషయాలు గుర్తించాం” అని గులాబ్ వటుముల్ 1966లో హొనలులు స్టార్-బులెటిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
వటుముల్ ఫ్యామిలీ కొంత కాలం తర్వాత రాయల్ హవాయి మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని కొనుగోలు చేసింది. ఇక్కడే తొలిసారి అలోహ దుస్తుల్ని తయారు చేశారు.
పౌరసత్వం కోసం..
హవాయిలో విజయం సాధించినప్పటికీ వటుముల్ సోదరులు జమన్‌దాస్, గోవిందరామ్‌లకు అమెరికన్ పౌరసత్వం రావడానికి చాలాకాలం పట్టింది. తొలినాళ్లలో వారు హవాయి వెళ్లినప్పుడు వివక్, క్లిష్టమైన వలస చట్టాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని హవాయి బిజినెస్ మ్యాగజైన్ రాసింది.
1922లో గోవిందరామ్ అమెరికన్ పౌరురాలైన ఎల్లెన్ జెన్సన్‌ను పెళ్లి చేసుకున్నారు. అమెరికన్ పౌరసత్వానికి అర్హత లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కేబుల్ చట్టం ప్రకారం ఆమె పౌరసత్వాన్ని రద్దు చేశారు. కేబుల్ చట్టానికి వ్యతిరేకంగా లీగ్ ఆఫ్ విమెన్ ఓటర్స్‌తో కలిసి పోరాడిన జెన్సన్ ఈ చట్టంలో సంస్కరణలు తేవడంతో 1931లో తిరిగి తన పౌరసత్వాన్ని పొందారు.
1946లో సహజంగా భారతీయులకు ఇచ్చే పౌరసత్వం ద్వారా గోవిందరామ్ భారత పౌరసత్వాన్ని పొందారు.
ఆయన సోదరుడు జమన్‌దాస్ ఎక్కువ సమయం భారత్, హవాయి మధ్య తిరుగుతూ ఉండేవారు.
1947లో భారతదేశ విభజన సమయంలో వటుముల్ కుటుంబం సింధ్ నుంచి బొంబాయికి తరలి వచ్చింది. వారి ఆస్తుల్లో ఎక్కువ భాగాన్ని సింధ్‌లోని హైదరాబాద్‌లో వదిలేశారని సౌత్ ఏషియన్ అమెరికన్ హిస్టరీ తెలిపింది.
జమన్‌దాస్ కుమారుడు గులాబ్ హవాయి చేరుకుని అక్కడ కుటుంబ వ్యాపారానికి అధిపతి అయ్యారు.
1955లో జమన్‌దాస్, గులాబ్ వ్యాపారాన్ని పంచుకున్నారు. జమన్‌దాస్ రిటైల్ వ్యాపారాన్ని తీసుకోగా, గోవిందరామ్ కుటుంబం రియల్ ఎస్టేట్ విభాగాన్ని సొంతం చేసుకుంది.
భార్య, కుమారుల్లో ఒకరు చనిపోయిన కొన్నేళ్ల తర్వాత1956లో జమన్‌దాస్ శాశ్వతంగా హవాయికి మారిపోయారు. 1961లో ఆయన అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారు.
భారత్‌తో సంబంధం
వటుముల్ కుటుంబం తరువాత భారత్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. భారతదేశ స్వతంత్ర పోరాటంలోనూ ఆయన పనిచేశారని.. దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం తరచుగా వాషింగ్టన్ ప్రయాణించేవారని ‘మేకింగ్ ఇట్ ఇన్ అమెరికా’ అనే పుస్తకంలో ఇలియట్ రాబర్ట్ బార్కాన్ రాశారు.
లాస్ఏంజిల్స్‌లోని గోవిందరామ్ ఇల్లు స్వాతంత్ర్య పోరాటం చేసేవాళ్లకు అడ్డాగా ఉండేదని ఇండియా ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనే పుస్తకంలో సచ్చీంద్ర నాధ్ ప్రధాన్ ప్రస్తావించారు.
భారత రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1946లో అమెరికన్ యూనివర్సిటల్లో ఇచ్చిన వరుస లెక్చర్లను వటుముల్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసింది.
1959లో ఇంటర్నేషనల్ పార్టనర్‌హుడ్ కాన్ఫరెన్స్‌ను దిల్లీకి తీసుకురావడంలో గోవిందరామ్ భార్య ఎల్లెన్ కీలక పాత్ర పోషించారు. ఇది దేశంలో తొలి జనాభా నియంత్రణ క్లినిక్‌ల స్థాపనకు దారి తీసింది.
వటుముల్ కుటుంబం హవాయి, భారత్‌లో అనేక విద్యా సంస్థలకు నిధులు అందిస్తోంది.
వటుముల్ సోదరుల మనవళ్లు ప్రస్తుతం హవాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఈ కుటుంబంఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగం మీద దృష్టి పెట్టింది. 2020లో వటుముల్ చివరి రిటైల్ స్టోర్‌ను మూసివేశారు.
గతేడాది హవాయిలో వటుముల్ ప్రాపర్టీస్ 19,045 చదరపు మైళ్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. “ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లోనూ మా కుటుంబం హవాయి దీవులపై దృష్టి పెడుతుంది” అని సంస్థ అధ్యక్షుడు జేడీ వటుముల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS