SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న అనుమతిని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్య ప్రభుత్వానికి, యూనివర్సిటీకి మధ్య ఉన్న ప్రతిష్ఠంభనను మరింత పెంచింది.
”చట్టానికి కట్టుబడి ఉండటంలో విఫలమవ్వడంతో హార్వర్డ్ ‘స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రొగ్రామ్ సర్టిఫికేషన్ (ఎస్‌ఈవీపీ)ను ప్రభుత్వం రద్దు చేసింది.” అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు.
”దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు, విద్యా సంస్థలకు ఇదొక హెచ్చరిక.” అని ఆమె గురువారం పోస్టు చేశారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టవిరుద్ధమైనదిగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
”140 దేశాలకు పైగా చెందిన విదేశీ విద్యార్థులకు, స్కాలర్లకు ఆతిథ్యమివ్వడానికి, ఈ దేశాన్ని, యూనివర్సిటీని సుసంపన్నం చేసేందుకు పూర్తిగా కట్టుబడిఉన్నాం.” అని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రతిస్పందించింది.
”మా కమ్యూనిటీ సభ్యులకు తక్షణమే అవసరమైన మార్గదర్శకత్వం, సాయం అందించేందుకు మేం కృషిచేస్తున్నాం. ఈ ప్రతీకార చర్య హార్వర్డ్ సమాజానికి, దేశానికి తీవ్ర హాని కలగజేస్తుంది. హార్వర్డ్ విద్యా, పరిశోధన లక్ష్యాన్ని ఇది బలహీనపరుస్తుంది.” అని పేర్కొంది.

వేలాదిమంది విద్యార్థులపై ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థులు ప్రభావితం కానున్నారు.
గత విద్యా సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయంలో 6,700 మందికి పైగా విదేశీ విద్యార్థులు చేరినట్లు యూనివర్సిటీ డేటా చెబుతోంది. యూనివర్సిటీ మొత్తం విద్యార్థుల్లో వీరు 27 శాతం మంది.
ఈ వార్త గురువారం క్యాంపస్‌లోని విదేశీ విద్యార్థుల మధ్య వ్యాపించగానే, వేలాది మంది విద్యార్థుల్లో భయం, ఆందోళన కలిగింది. వారి భవిష్యత్ అకస్మాత్తుగా అయోమయంలో పడింది.
”దీనిపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.” అని గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న ఆస్ట్రేలియా విద్యార్థి సారా డేవిస్ బీబీసీ న్యూస్‌అవర్‌తో అన్నారు.
”మేమందరం యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకోవడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ వార్త వచ్చింది. తర్వాత మేం అమెరికాలో ఉండగలమా? ఇక్కడ పని చేసుకోగలమా? అనే విషయాల్లో తీవ్ర అనిశ్చితిని లేవనెత్తింది.” అని డేవిస్ చెప్పారు.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కాకస్‌కు అధ్యక్షురాలిగా డేవిస్ ఉన్నారు.
”విశ్వవిద్యాలయం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దానిపై మాకు ఏదైనా సమాచారం వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాం.” అని తెలిపారు.
హార్వర్డ్ నుంచి అడ్మిషన్ లెటర్ పొందిన రోజును తన జీవితంలో అత్యంత అద్భుతమైన రోజుగా భావించినట్లు స్వీడన్‌కు చెందిన 22 ఏళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ లియో గెర్డెన్ గుర్తు చేసుకున్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తవడానికి వారం కంటే తక్కువ వ్యవధి ఉన్న సమయంలో, ప్రతిష్టాత్మక క్యాంపస్‌లో తన సమయం ఇలా ముగుస్తుందని ఆయన ఊహించలేదు.
”వైట్‌హౌస్‌కు, హార్వర్డ్‌కు మధ్య జరుగుతున్న పోరాటంలో విదేశీ విద్యార్థులను పందెంగా వాడుతున్నారు.” అని గెర్డెన్ బీబీసీతో అన్నారు. ‘‘ఇది అత్యంత అమానవీయం’’ అన్నారు.
డజన్ల సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తును చేపట్టింది.
కానీ ఏప్రిల్‌లో తమకు సుదీర్ఘ డిమాండ్ల జాబితాను పంపిన తరువాత ట్రంప్ పరిపాలనపై దావా వేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గిన అత్యంత ప్రముఖ సంస్థగా హార్వర్డ్ మారింది. అయితే తరువాత పొరపాటున ఈ జాబితాను పంపినట్లు వైట్ హౌస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
క్యాంపస్‌లో యాంటిసెమిటిజం (యూదు ప్రజల పట్ల శత్రుత్వం లేదా పక్షపాతం)పై పోరాడేందుకు తన నియామకాలు, అడ్మిషన్లు, బోధనా పద్ధతులను హార్వర్డ్ మార్చాలని వైట్‌హౌస్ కోరింది.
లేదంటే ప్రభుత్వ గ్రాంట్ల నుంచి యూనివర్సిటీకి వచ్చే బిలియన్ డాలర్ల మొత్తాన్ని నిలిపివేస్తామని, యూనివర్సిటీ పన్ను మినహాయింపు హోదాను రద్దు చేస్తామని హెచ్చరించింది.
యాంటిసెమిటిజాన్ని పరిష్కరించేందుకు తాము చాలా చర్యలు తీసుకున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో హార్వర్డ్ తెలిపింది.
ప్రభుత్వ డిమాండ్లు యూనివర్సిటీ మేథోపరమైన పరిస్థితులను నియంత్రించే చర్యలలో భాగంగా ఉన్నాయని పేర్కొంది.
కానీ, వైట్‌హౌస్‌కు, యూనివర్సిటీకి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది.
విదేశీ విద్యార్థులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం కోరిన రికార్డులను సమర్పించకపోతే విదేశీ విద్యార్థులకు ఆతిథ్యమిచ్చే హోదాను హార్వర్డ్ కోల్పోనుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అంతకుముందే హెచ్చరించింది.
గురువారం లేఖలో నోయెమ్ ఈ హెచ్చరికలను అమల్లోకి తెచ్చారు.
రానున్న 2025-26 విద్యా సంవత్సరంలో ఎఫ్ లేదా జే నాన్ ఇమ్మిగ్రెంట్ హోదాను కలిగిన విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేకుండా హార్వర్డ్‌కు ఎస్‌ఈవీపీ ప్రొగ్రామ్ యాక్సెస్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిలిపివేసిందని ఆమె ప్రకటించారు.
ఇప్పటికే ఈ వీసాలు ఉన్న వారు తమ చట్టపరమైన హోదా కొనసాగించడానికి ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ కావాలని ఆమె రాసిన లేఖలో చెప్పారు.
అయితే, ఈ విద్యార్థులను చేర్చుకునేలా తనకున్న హోదాను పునరుద్ధరించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 72 గంటల్లోగా తమ డిమాండ్ల జాబితాకు కట్టుబడి ఉండేందుకు అంగీకరించాలని తెలిపారు.
గత ఐదేళ్లుగా హార్వర్డ్‌లో చేరిన నాన్ ఇమిగ్రెంట్ (ఓ నిర్దిష్ట కారణంతో కొంతకాలం దేశంలో నివసించే వారు) విద్యార్థులకు చెందిన అన్ని క్రమశిక్షణా రికార్డులను ప్రభుత్వానికి అందించాలనే డిమాండ్ కూడా దీనిలో ఉంది.
క్యాంపస్‌లో నాన్‌ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన చట్టవ్యతిరేక లేదా ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు, వీడియోలు లేదా ఆడియోలను ప్రభుత్వానికి అప్పగించాలని హార్వర్డ్‌ను నోయెమ్ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల, విద్యా సంస్థలకు ఇదొక హెచ్చరిక అని నోయెమ్ తన పోస్టులో పేర్కొన్నారు.
విదేశీ విద్యార్థుల వ్యక్తిగత వీసాలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ ప్రయత్నించింది. దీనివల్ల అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై పలు దావాలు కూడా వేశారు.
రాజకీయ ఆందోళనల్లో పాల్గొన్న లేదా డ్రైవింగ్ ఉల్లంఘన లాంటి నేరారోపణలు ఎదుర్కొన్న విదేశీ విద్యార్థులను ఇది ప్రభావితం చేసినట్టు కనిపించింది.
అమెరికాలోని విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేయకుండా ట్రంప్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ జడ్జి గురువారం తీర్పు చెప్పారు.
” అమెరికా అంటే భావ ప్రకటన స్వేచ్చకు, విద్యా స్వతంత్రకు, చైతన్యవంతమైన మేథో సమాజానికి గుర్తింపు అని మేం ఇక్కడికి వచ్చాం.” అని తన విదేశీ సహ విద్యార్థులతో గెర్డెన్ అన్నారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ ఈ విలువలన్నింటికీ ముప్పు తెస్తున్నారన్నారు.
విదేశీ విద్యార్థులు లేకపోతే, హార్వర్డ్ ఇప్పుడు హార్వర్డ్ కాదు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)