SOURCE :- BBC NEWS

విశాఖ, పహల్గాం, కశ్మీర్

‘‘నుదుటన బొట్టు ఉంటే మమ్మల్ని చంపేస్తారని అక్కడ కొలనులో మా ముఖాలు కడిగేసుకున్నాం. తుపాకీ కాల్పులకు గుండె అదిరి.. విపరీతంగా భయం కలిగినా కూడా దైవ నామస్మరణ చేయలేదు. ఎందుకంటే ఆ శబ్ధం విన్నా చంపేస్తారేమో” అని పహల్గాం దాడిలో ప్రాణాలతో బయటపడిన విశాఖకు చెందిన సుచిత్ర బీబీసీతో చెప్పారు.

ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్లలో భయం, శరీరంలో వణుకు స్పష్టంగా కనిపించాయి.

చంద్రమౌళి, శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కశ్మీర్ విహారయాత్రకు బయలుదేరి వెళ్లాయి. వారంతా కుటుంబ స్నేహితులు. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్ వెళ్దామని రెండేళ్లుగా అనుకుంటున్నామని, ఇప్పటికి అన్నీ కుదిరి బయలుదేరితే ఆ పర్యటన తమ మిత్రుడిని దూరం చేసిందని శశిధర్ దంపతులు బీబీసీతో చెప్పారు.

విశాఖ చేరుకున్న శశిధర్, సుచిత్రలు అక్కడి భయానక అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
విశాఖ, పహల్గాం, కశ్మీర్

ఆ రోజు ఏం జరిగిందంటే…

”మా షెడ్యూల్‌లో భాగంగా ఏఫ్రిల్ 22న పహల్గాం వెళ్లాలి. మేం శ్రీనగర్‌లో ఉంటూ రోజుకో ప్రాంతానికి వెళ్లి, వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం.

మా టూర్‌లో నాలుగో రోజు పహల్గాం ప్రోగ్రాం ఉంది. శ్రీనగర్ నుంచి అక్కడికి చేరుకున్న తర్వాత ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి కొండ ఎక్కాలి. పహల్గాం కొండ మీదకు వెళ్లలేక వెనక్కి వెళ్లిపోదామని మాలో కొందరన్నారు. కానీ చంద్రమౌళీ.. ‘ఇంత దూరం వచ్చాం కదా కాస్త దూరం ఎక్కితే వెళ్లిపోవచ్చు’ అని అందరిని ప్రోత్సహించి కొండ ఎక్కించారు.

కొండపైకి వెళ్లగానే క్యాంటీన్ ఉంది. ఏదైనా తిందామని అనుకున్నాం. ముందుగా టాయిలెట్‌కు వెళ్లి ఆ తర్వాత తిందామని అనుకున్నాం. వాష్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చేసరికి మాకు మూడు, నాలుగు సార్లు ఏవో శబ్దాలు వినిపించాయి. అవేంటని అనుకునేలోగా ఆడవాళ్ల ఏడుపులు వినిపించాయి. అప్పుడు చూసేసరికి అక్కడొక మనిషి తుపాకీతో కాల్చడం కనిపించింది. మేం భయంతో వెంటనే టాయిలెట్స్ వెనక్కి వచ్చేసి దాక్కుని చూస్తున్నాం. అప్పుడు ఒక మిలిటెంట్ మా వైపు రావడం కనిపించింది” అని శశిధర్ చెప్పారు.

విశాఖ, పహల్గాం, కశ్మీర్

ఫొటో సోర్స్, sasidhar

‘బొట్టు తీసేయమని చెప్పాను’

“టాయిలెట్స్ వెనక ఒక ఫెన్సింగ్ కనిపించింది. ఆ ఫెన్సింగ్ కింద నుంచి దూరి, అక్కడున్న వాగు దాటుకుని కొండపైకి వెళ్తే అక్కడ చెట్లు ఉన్నాయి. వాటి వెనక దాక్కోవచ్చని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాం. నా భార్య సుచిత్ర ఆఖరున ఉండిపోయి ఫెన్సింగ్ దాటలేకపోతే చంద్రమౌళినే చేయి అందించి జాగ్రత్తగా దాటించారు. ఆ తర్వాత అందరం చెట్లు వెనక్కి వచ్చేస్తుండగా చంద్రమౌళి కనిపించలేదు.

గన్ పట్టుకున్న వ్యక్తి ఆడవాళ్ల వైపు రెండడుగులు వేసి చూసి మళ్లీ వెనక్కు వెళ్లిపోయారు.

ఆడవాళ్లు భయంతో హరేరామ, హరేకృష్ణా అనడం మొదలుపెట్టారు. అలా అనొద్దని, నుదుటున ఉన్న బొట్టు కూడా తీసేయండని నేను చెప్పాను. కొందరు స్థానికులు మేం నడవలేకపోతే, చేతులందించి ముందుకు తీసుకెళ్లారు. నా భార్య నడవలేకపోతే వేరే ఆయన వచ్చి తన భుజాలపై ఎక్కించుకుని…కొంత దూరం తర్వాత వదిలిపెట్టారు. అక్కడున్న వారు చాలా సాయం చేశారు” అని శశిధర్ తెలిపారు.

”గన్లు పట్టుకున్నవారు మనిషికి ఎదురుగా తుపాకి పెట్టడం…మూడు, నాలుగు సార్లు బులెట్లు పేల్చడం చేశారు. కళ్ల ముందే వాళ్లు ఒరిగిపోయేవారు’’ అని శశిధర్ చెప్పారు.

‘‘చంద్రమౌళి కూడా కింద పడి ఉంటే కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ఆయన నేలపై పడుకున్నారని అనుకున్నాం. తర్వాత మృతదేహాలను గుర్తించాలని పిల్చినప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న మనిషి అక్కడ ఉండకూడదని కోరుకున్నాం. కానీ అక్కడ రెడ్ జాకెట్ ఉన్న చంద్రమౌళి మృతదేహం కనిపించింది” అని శశిధర్ ఆవేదన చెందారు.

విశాఖ, పహల్గాం, కశ్మీర్

ఫొటో సోర్స్, sasidhar

చెట్టు బెరడు మా వైపు దూసుకొచ్చింది..

శశిధర్ భార్య సుచిత్ర తన బీబీసీతో మాట్లాడుతూ.. “కాల్పులకి భయపడి బాత్రూం వెనుక దాక్కున్నాం. బాత్రూం మెయింటనెన్స్ చేసే వ్యక్తి అక్కడున్న ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోవడం చూశాం. దాంతో అదే సురక్షితం అనుకుని అలాగే వెళ్లేందుకు ప్రయత్నించాం. అ ఫెన్సింగ్ కింద నుంచి నేను వెళ్లలేకపోతే చంద్రమౌళి నాకు సహాయం చేశారు. ఆ తర్వాత ఆయనొక వైపు, మేం మరో వైపు వెళ్లాం.

కాల్పులు జరుగుతున్నప్పుడు నేను సమీపంలోనే ఉన్నాను. కానీ తలతిప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే వారు ఎవర్ని కాల్చుతున్నారో, ఎందుకు కాల్చుతున్నారో తెలియలేదు. అప్పుడే చంద్రమౌళిని కూడా కాల్చేసినట్లున్నారు. పడుకుండిపోయినట్లు ఉన్న ఆయన్ని చూసి…దాడులకు భయపడి ఆయన అలా ఉన్నారేమో అనుకున్నాను.

కానీ తుపాకీ కాల్చినప్పుడు ఒక చెట్టు బెరడు మా వైపు దూసుకొచ్చింది. “మౌళి ఉండిపోయారని” చంద్రమౌళి భార్య అంటూంటే… ఆయన ఎలాగోలా వచ్చేస్తారని చెప్పి ఆవిడను తీసుకుని వచ్చేశాం.

అలా వచ్చేటప్పుడు హిందువుల్లా కనపడకుండా ఉండేందుకు అక్కడ ప్రవహిస్తున్న వాగులోని నీళ్లతో బొట్టు కడుక్కున్నాను” అని సుచిత్ర తెలిపారు.

”ఏటా ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్తాం. పెద్దవాళ్లమైతున్నాం…కశ్మీర్ వంటి ప్రదేశాలకు ఇకపై వెళ్లడం కష్టమవుతుందని…ఈ ఏడాది తులిప్ తోటలు చూసేందుకు కశ్మీర్ బయలుదేరాం.

ఈ టూర్ ప్లాన్ చేసింది చంద్రమౌళినే.కశ్మీర్‌కు వెళ్లిన ఆరుగురిలో ఒకరి ప్రాణాలను అక్కడే వదిలేసి వచ్చేశాం. ఇది జీర్ణించుకోలేక పోతున్నాం” అని సుచిత్ర ఆవేదన చెందారు.

విశాఖ, పహల్గాం, కశ్మీర్

ఫొటో సోర్స్, sasidhar

అమెరికా నుంచి చేరుకున్న కుమార్తెలు

చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకుంది.

ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి చేరుకున్నారు.

చంద్రమౌళి మృతదేహాన్ని ప్రస్తుతం విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచారు.

ఆయన కుమార్తెలు రావడంతో శుక్రవారం(ఏప్రిల్ 25) ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని చంద్రమౌళి తోడల్లుడు కుమార్ రాజా బీబీసీతో చెప్పారు.

విశాఖ, పహల్గాం, కశ్మీర్

ఫొటో సోర్స్, DPRO VIZAG

చంద్రమౌళి కుటుంబానికి రూ.10లక్ష ల ఎక్స్‌గ్రేషియా

బుధవారం (ఏప్రిల్ 23) రాత్రి చంద్రమౌళి మృత దేహానికి విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గురువారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చంద్రమౌళి ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి చంద్రమౌళి భార్యను పరామర్శించారు.

చంద్రమౌళి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేసింది.

విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)