SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
‘‘తన చివరి శ్వాసవరకు బోల్షవిజానికి వ్యతిరేకంగా పోరాడుతూ మా నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ ఈ మధ్యాహ్నం జర్మనీ కోసం నేలకొరిగారు’’ అని మే1, 1945న హాంబర్గ్ రేడియో ప్రసారం చేసింది.
ఆ సమయంలో హాంబర్గ్ రేడియోలో ప్రసారమవుతున్న ఆంటోన్ బ్రూక్నర్ సెవెన్త్ సింఫనీని మధ్యలోనే నిలిపివేసి ఈ సమాచారాన్ని ప్రసారం చేసింది.
లండన్ వార్తాపత్రిక ది టైమ్స్ ‘‘ప్రపంచానికంతా దుష్టశక్తికి ప్రతిరూపంగా’’ కనిపించే ఓ వ్యక్తి మరణ వార్త జగమంతా శరవేగంతో వ్యాపించింది అని తెలిపింది.
“ఈ వార్తను ప్రసారం చేయడానికి మేం మా కార్యక్రమాన్ని నిలిపివేశాం: హిట్లర్ చనిపోయాడని జర్మన్ రేడియో ఇప్పుడే ప్రకటించింది” అని బీబీసీ కొన్ని నిమిషాల తరువాత ప్రకటించింది. ఐ రిపీట్ అంటూ ఇదే వాక్యాన్ని బీబీసీ మరోసారి చదివింది.
అయితే నాజీల వైపు నుంచి వచ్చిన ఈ వార్త అబద్ధమని, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ నిజానికి మే1న చనిపోలేదని అంతకు ముందురోజే చనిపోయాడని తరువాత తెలిసింది.
ఆయన యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందలేదని, భూగర్భంలోని బంకర్లో తనను తాను కాల్చుకుని చనిపోయినట్టు తరువాత వెల్లడైంది.
ఎనభై ఏళ్లు గడిచిపోయినా, 60 లక్షలమంది యూరోపియన్ యూదుల హత్యకు కారణమైన వ్యక్తి మరణం చుట్టూ అప్పట్లో నెలకొని ఉన్న పరిస్థితుల చిక్కుముడి ఇంకా రహస్యంగానే ఉండిపోయింది.
వెయ్యేళ్లపాటు నిలిచిపోయే సామ్రాజ్యాన్ని నిర్మించాలని కలలుగన్న నియంత చివరిరోజులు ఎలా గడిచాయనే విషయాన్ని చారిత్రక పత్రాలు, ముగ్గురు నిపుణుల సాయంతో బీబీసీ పున:సృష్టి చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
శాశ్వత తిరోగమనం
1944 నాటికి నాజీ జర్మనీ భవితవ్యం ఏమిటో ఖరారైపోయింది. నార్మండీపై మిత్రరాజ్యాల దండయాత్ర, పశ్చిమాన ఫ్రాన్స్, దక్షిణాన రోమ్ స్వాధీనం, తూర్పున ముందుకు చొచ్చుకొస్తున్న సోవియట్ దళాలు…జర్మనీ ఓడిపోవడానికి ఎంతో దూరంలో లేదని సూచించాయి. కానీ తాను లొంగిపోతున్నట్టు హిట్లర్ నుంచి ఎటువంటి సూచనలు కనిపించలేదు.
”నవంబరు 21, 1944న, హిట్లర్ వోల్ఫ్స్‌లైర్ (ప్రస్తుత పోలాండ్) నుంచి పశ్చిమాన ఉన్న తన ప్రధాన కార్యాలయానికి మారారు. (ఈ కార్యాలయం బెల్జియం, లక్సెంబర్గ్ సరిహద్దుకు సమీపంలో ఉంది.) అక్కడి నుంచి ఆర్డెన్స్ యుద్ధానికి నాయకత్వం వహించారు’ అని జర్మన్ చరిత్రకారుడు హరాల్డ్ శాండ్నర్ బీబీసీతో అన్నారు.
యుద్ధంలో ఓడిపోయాక హిట్లర్ 1945 జనవరి 16న బెర్లిన్‌కు తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని జర్మన్ నియంత జీవిత కాలక్రమాన్ని వివరించే ‘ది ఇటినరరీ’ పుస్తకంపై 20 ఏళ్లపాటు పరిశోధన చేసిన శాండ్నర్ ధ్రువీకరించారు.
”మార్చి 3న ఒక యుద్ధ బృందాన్నికలవడానికి మినహాయిస్తే హిట్లర్ తాను చనిపోయేవరకు తన రాజధానిని విడిచిపెట్టలేదు” అని ఆయన పేర్కొన్నారు.
కానీ మిత్రరాజ్యాలు బెర్లిన్‌పై బాంబుదాడులు పెంచినప్పుడు, హిట్లర్ తన చాన్సలర్ కార్యాలయం కింద ఉన్న బంకర్‌లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఈ బంకర్ పదేళ్ల కిందటే రాజధానిలోని భూగర్భంలో నిర్మించిన విశాల నిర్మాణం.

ఫొటో సోర్స్, Getty Images
”జనవరి 24 నుంచి హిట్లర్ బంకర్‌లోనే నిద్రపోవడం మొదలుపెట్టారు’ అని శాండ్నర్ వివరించారు.
ఏప్రిల్ మొదటివారంలో బెర్లిన్‌కు తూర్పున కొన్ని కిలోమీటర్ల సమీపంలో సోవియట్ దళాలు భీకర ఫిరంగి దాడికి దిగినప్పుడు కూడా హిట్లర్ బయటకు రాలేదని బ్రిటిషు చరిత్రకారుడు థామస్ వెబెర్ బీబీసీతో చెప్పారు.
”హిట్లర్ తన జీవితంలోని చివరి వారం మొత్తాన్ని ఆ బంకర్‌లోనే గడిపాడు. ఏప్రిల్ 20న హిట్లర్ తన పుట్టినరోజు సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన అతిథులను కలిసేందుకు చాన్సలర్ కార్యాలయానికి వచ్చాడు. ఆ తర్వాత 23వ తేదీ తోటలో కాసేపు నడిచాడు. అప్పుడే ఆయన చివరి ఫోటోలు తీశారు” అని వెబెర్ చెప్పారు.
హిట్లర్ సహా, ఆయన సన్నిహితులు అనేకమంది బంకర్‌లో ఉన్నారని అనేక దర్యాప్తులు, పత్రాలు ధ్రువీకరించాయి.
ఈ బృందంలో హిట్లర్ స్నేహితురాలు ఇవాబ్రాన్, పార్టీ కార్యదర్శి మార్టిన్ బోర్మన్, ప్రచారమంత్రి జోసెఫ్ గోబెల్స్ ఆయన కుటుంబం, హిట్లర్ కార్యదర్శులు, అంగరక్షకులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
30 గదుల బంకర్
ఫ్యూరర్ (నాయకుడు, మార్గదర్శి) బంకర్‌గా పిలిచే ఈ రహస్య భవనంలో 30 గదులు, హాళ్లు ఉన్నాయి. ఇది హిట్లర్ అధికారిక నివాసానికి కొన్ని మీటర్ల దిగువన ఉంది. పైన ఉన్న చాన్సలర్ కార్యాలయంలా కాకుండా, ఇది పెద్దగా అలంకరణలు, ఫర్నీచర్ లేకుండా ఉంది.
బంకర్‌కు ఉన్న నాలుగుమీటర్ల మందంగల గోడలు మిత్రరాజ్యాల బాంబుల నుంచి రక్షించాయి. అలాగే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే సౌకర్యం ఉండటం, కరెంట్ తదితర సౌకర్యాలు ఈ బంకర్‌ను మానవ నివాసానికి అనుకూలంగా మార్చాయి.
కానీ అది సౌకర్యంగా లేదు. “ఆ ప్రాంతం చీకటిగా, చప్పుళ్లతోపాటు కంపు కొడుతోందని, లైట్లు నిరంతరం వెలుగుతూ, గాలి వీస్తోందని కథనాలు చెబుతున్నాయి” అని బ్రిటిష్ చరిత్రకారిణి కరోలిన్ షార్ప్‌లెస్ బీబీసీ తో చెప్పారు.
”బంకర్ ఇరుకుగా ఉందని, ఎక్కడో చిక్కుకుపోయిన అనుభూతి కలుగుతోందని, లైట్లు నిరంతరం వెలుగుతూనే ఉండటం వల్ల రాత్రీపగలు తేడా తెలియలేదని స్థానికులు అభివర్ణించారు’’ అని బ్రిటన్‌లోని రోహాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు.
ఇన్ని ఇబ్బందుల నడుమ యుద్ధరంగం నుంచి వస్తున్న వార్తలు ప్రోత్సాహకరంగా లేవు. ”మేం యుద్ధంలో ఓడిపోతున్నామని అందరికీ తెలుసు కాబట్టి నిస్పృహ వాతావరణం అలుముకుంది” అని శాంట్నర్ చెప్పారు.
కానీ హిట్లర్ దైనందిన జీవితంలో ఎటువంటి మార్పూలేదు.
“మధ్యాహ్నానికి లేచేవాడు. ఆయన రోజుకు రెండుసార్లు తన సైన్యాధిపతులను కలుస్తాడు. ఆ తర్వాత టీ తాగి, తెల్లవారుజామునవరకు తన కార్యదర్శులతో మాట్లాడేవాడు” అని ది ఇటినరరీ రచయిత చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి దాడులు, కుట్రల మధ్యన..
హిట్లర్ ఏప్రిల్ 21న తన 56వ పుట్టినరోజునాడు జర్మనీ రాజధాని చుట్టూ ఉన్న సోవియట్ దళాలపై ఎదురుదాడి చేయాలని తన ముగ్గురు జనరల్స్‌ను ఆదేశించారు.
కానీ మ్యాప్‌లో హిట్లర్ చూసిన భాగం కేవలం తక్కువ సంఖ్యలో కనిపిస్తున్న మనుషులేనని, అవి ఫిరంగులు, భారీ సైనిక బలగాలు కావని చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు.
అయితే మరుసటి రోజు రెడ్ ఆర్మీ నగరంలోకి ప్రవేశించిందని, తాను ఆదేశించిన ఎదురుదాడి విఫలమైందని హిట్లర్ తెలుసుకున్నారు. ఆయన తన కమాండర్లపై అరిచారు. తరువాత తన జీవితంలో మొదటిసారి, యుద్ధంలో ఓడిపోయానని అంగీకరించారు.
”నేను కొనసాగలేను. నా వారసుడు పగ్గాలు చేపడతాడు’ అని పేర్కొన్నారు. ఈ క్షణాన్ని జర్మన్ చిత్రం డౌన్‌ఫాల్ (తరువాత లాటిన్ అమెరికా, స్పెయిన్‌లో అనువదించి విడుదల చేశారు)లో చాలా బాగా చిత్రీకరించారు” అని శాండ్నర్ చెప్పారు.
ఓటమిని అంగీకరించిన తరువాత, 23వ తేదీన ఆల్ఫ్స్ పర్వతాలపైకి పారిపోవాలంటూ తన ఆయుధ మంత్రి, అభిమాన వాస్తుశిల్పి ఆల్బర్ట్ స్పీర్ ఇచ్చిన సలహాను హిట్లర్ తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిట్లర్ ఓటమి వార్త ఫీల్డ్ మార్షల్, వైమానికదళాధిపతి హెర్మన్ గోరింగ్‌కు చేరింది. 1939,1941 లో జారీచేసిన రెండు ఉత్తర్వుల ద్వారా గోరింగ్‌ను హిట్లర్ తన వారసుడిగా నియమించారు.
కానీ బవేరియాలో ప్రవాసంలో ఉన్న గోరింగ్, హిట్లర్‌ను ఆఫీసు నుంచి వెళ్లిపోమని కోరుతూ టెలిగ్రామ్ పంపారు. హిట్లర్ దీనిని నమ్మకద్రోహంగా భావించారు.
”కోపోద్రిక్తుడైన హిట్లర్ గోరింగ్‌ను అన్ని పదవులకు రాజీనామా చేయమని, ఆస్తిని రాజ్యానికి తిరిగి ఇవ్వమని, లేకపోతే రాజద్రోహం కింద ఉరి తీయమని ఆదేశించాడు” అని షార్ప్‌లెస్ చెప్పారు.
అయితే ఇదొక్కటే ద్రోహం కాదు. 28వ తేదీన పారామిలటరీ ఎస్ఎస్ అధిపతి హెన్రిచ్ హిమ్లెర్, అమెరికన్లు, బ్రిటిషువారితో చర్చలు జరపాల్సిందిగా స్వీడిష్ రాయబారులను కోరినట్టు హిట్లర్‌కు సమాచారం అందింది.
”అందరూ నాకు అబద్ధాలు చెబుతారు, అందరూ నన్ను మోసం చేశారు, నాకు ఎవరూ నిజం చెప్పలేదు. సాయుధ దళాలు నాతో అబద్ధాలు చెప్పాయి, ఇప్పుడు ఎస్ఎస్ నన్ను విడిచిపెట్టింది” అని హిట్లర్ వాపోయినట్టు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్న గై లిడ్డెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చివరి అవకాశం
రష్యన్ దళాలు తమ ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడు, తాను ప్రాణాలైనా తీసుకుంటాను గానీ, నగరాన్నివీడిపోనని హిట్లర్ తన సన్నిహితులకు చెప్పారు.
నాజీ పైలట్ హన్నా రీష్ ఏప్రిల్ 26-27 మధ్య చాన్సలర్ కార్యాలయానికి అతి సమీపంలో విమానాన్ని ల్యాండ్ చేయడం ద్వారా అనూహ్యమైన పని చేశారు.
హిట్లర్ రీష్‌తో కలిసి ఆ విమానంలో ప్రయాణించి ఉండవచ్చు లేదా అంతకు ముందే తప్పించుకుని ఉండవచ్చు. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. ఎందుకంటే, దేశాధినేతగా రాజధానిలో వీలైనంత వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన భావించారు. తన ప్రాణాల గురించి ఆయనకు ఎలాంటి ఆందోళన లేదు’ అని శాండ్నర్ తెలిపాడు.
హిట్లర్ మిత్రుడు, ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలినీని, ఆయన ప్రియురాలు క్లారా పెటాచీలను ఇటాలియన్ తిరుగుబాటుదారులు చంపారని, వారి మృతదేహాలు మిలన్ లోని ఒక స్క్వేర్ లో తలకిందులుగా వేలాడదీశారని ఏప్రిల్ 28న వార్తలు వచ్చాయి. అప్పటికే శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్న హిట్లర్ సంకల్పాన్ని ఈ వార్త కుదేలయ్యేలా చేసింది.
”సైన్యంలో వాతావరణం బాగోలేదు. హిట్లర్ నిత్యం నిస్పృహలకు లోనయ్యేవాడు” అని నియంత అంగరక్షకుడు జోహాన్ రాటెన్‌హూబర్ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపుతూ షార్ప్‌లెస్ చెప్పారు.
యుద్ధభూమిలో పరాజయాలతోపాటు, పార్కిన్సన్ వ్యాధి ప్రభావాలను నివారించడానికి ఆయన ఏళ్ల తరబడి తీసుకున్న మందులు కూడా ఆయన శరీరాన్ని, మనసును బలహీన పరిచాయని మేం మాట్లాడిన నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హిట్లర్ అకస్మాత్తుగా 29న ఎవాబ్రాన్ ను వివాహం చేసుకున్నాడు. కానీ సంబరాలు చేసుకోవడానికి బదులు బంకర్ లో ఉన్న అందరికీ వీడ్కోలు పలికారు. తరువాత తన రాజకీయ చింతనను తన కార్యదర్శి గెర్‌ట్రూడ్ జంగ్ కు వివరించడం ప్రారంభించాడు.
”చివరికి యుద్ధంలో మనం ఓడిపోయామనే ఆలోచనకు, ఎక్కడో ఒక పరిష్కారం కనిపించవచ్చనే ఆలోచనకు మధ్య ఆయన ఊగిసలాడుతున్నారు” అని వెబెర్ చెప్పారు.
“అత్యంత మతోన్మాద నాజీ యోధులు అమెరికన్, బ్రిటిష్ దళాలయుద్ధానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకుంటే, వారు తట్టుకోలేరని ఆయన భావించారు” అని వెబెర్ పేర్కొన్నారు. కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు.
జర్మనీ ప్రజలు ధైర్యంగా పోరాడలేదు. అందువలన వారు నశించాలి. యుద్ధంలో ఓడిపోయింది నేను కాదు, జర్మన్ ప్రజలు” అని హిట్లర్ ప్రకటించినట్టు లిడ్డెల్ అధ్యయనం తెలుపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వదంతుల వ్యాప్తికి కారణమెవరు?
హిట్లర్ తన ప్రాణాలు తీసుకోవడంతోపాటు తన శరీరాన్ని ధ్వంసం చేయాలని కోరారు.
”అధికారం నుంచి దిగిపోవడమో, లేదా లొంగిపోవడం అనే అవమానాన్ని ఎదుర్కోవడం కంటే చనిపోవడం మంచిదని నేను, నా భార్య నిర్ణయించుకున్నాం. మేం చనిపోతే వెంటనే మా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించండి’ అని హిట్లర్ వీలునామాలో ఉంది.
ఏప్రిల్ 30న మధ్యాహ్నం 3.30 గంటలకు హిట్లర్, ఆయన భార్య ఓ గదిలోకి వెళ్లారు. ఇవా సైనైడ్ బాటిల్ మింగారు. హిట్లర్ తనను తాను తలపై కాల్చుకున్నారు.
కొద్ది నిమిషాల తర్వాత గార్డులు గదికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను వస్త్రంతో కప్పి మేడపై తోటలోకి తీసుకెళ్లారు. హిట్లర్ కోరికమేరకు అక్కడ అప్పటికే తవ్విన గుంతలో పెట్టి వాటిపై ఇంధనం పోసి దహనం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘రష్యన్లు తనను సజీవంగా కనుగొంటే, లేదా మృతదేహాన్ని కనుగొంటే ఏం జరుగుతుందోనని ఆయన చాలా ఆందోళన చెందారు. తన బాడీని మాస్కోలో ప్రదర్శనకు పెడతారేమోనని భయపడ్డారు” అని వెబెర్ చెప్పారు.
కానీ, హిట్లర్ నిర్ణయాల వెనుక ఇంకా ఇతర విషయాలు కూడా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు.
“1920ల ప్రారంభంలో ప్రజల మధ్య తనను తాను ఒక శక్తిమంతమైన దేవదూతగా హిట్లర్ సృష్టించుకున్నాడు” అని థామస్ వెబెర్ అన్నారు. తన ఇమేజ్ అలాగే ఉండాలని హిట్లర్ కోరుకున్నారు.
ఒకరకంగా హిట్లర్ ఈ లక్ష్యంలో కొంతవరకు విజయం సాధించాడనే చెప్పాలి. ఆయన మరణానికి పుష్కలమైన చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రాణాలతో దక్షిణ అమెరికాకు వెళ్ళాడనే పుకార్లు ఆయన మరణం తరువాత దశాబ్దాల పాటు ప్రచారంలో కొనసాగాయి.
సోవియట్లు ఈ ప్రచారాలను ప్రోత్సహించారు. “జోసెఫ్ స్టాలిన్, వారి పాశ్చాత్య మిత్రులతో పాటు, 1945 మే నుంచి హిట్లర్ మృతదేహం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ, ఆయన మరణంపై అపోహలు సృష్టించడానికి ప్రయత్నించారు ” అని శాండ్నర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అధికారం లేకుండా ఒక్కరోజు ఉన్నా..’
కానీ హిట్లర్ బంకర్ నుంచి తప్పించుకున్నాడనే సిద్ధాంతాలు నాజీ నాయకుడి అహంకార మనస్తత్వానికి అనుగుణంగా లేవు అని వెబెర్ చెప్పారు.
”అధికారం లేకుండా ఒక్కరోజు గడపడం కూడా నిరుపయోగమనేది హిట్లర్ దృక్పథం” అని వెబెర్ తెలిపారు.
”హిట్లర్ కు ప్రజల ప్రశంసలే కాదు, చుట్టుపక్కల వారి ప్రశంసలు కూడా ముఖ్యమన్నారు. సామాజిక సంబంధాలు, గుర్తింపు కోసం పరితపించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి అర్జెంటీనా గ్రామీణ ప్రాంతాల్లో అజ్ఞాతంలో బతకాలని అనుకోవడం ఊహకు కూడా అందని విషయం” అంటారు వెబెర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)