SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Unanimous Productions/X
నాని హీరోగా హిట్ -3 వచ్చింది. హిట్ సిరీస్‌లో ఇది మూడో సినిమా. విశ్వక్‌సేన్, అడవి శేష్ తర్వాత నాని హీరోగా థర్డ్ పార్ట్‌లో వచ్చాడు. ట్రైలర్‌తో బజ్ ఏర్పడిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని) అరెస్టుతో సినిమా మొదలవుతుంది. జైల్లో కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఎస్పీగా ఉన్న అర్జున్ వరుసగా ఇద్దరిని హత్య చేస్తాడు. తలకిందులుగా వేలాడదీసి మెడకోసి చంపుతాడు. దీనికో నేపథ్యం ఉంటుంది.
కశ్మీర్‌లో పని చేస్తున్నపుడు అదే రకమైన హత్యలు జరుగుతాయి. ఇలా వరుసగా ఒకే రకమైన హత్యలు దేశమంతటా 13 జరుగుతాయి.ఇదంతా ఒక నెట్‌వర్క్ ప్రకారం జరుగుతూ ఉందని హీరో అనుమానించి పరిశోధన ప్రారంభిస్తాడు.
ఆ నెట్‌వర్క్‌ను ఎలా కనుక్కున్నాడు? ఎలా ఫినిష్ చేశాడన్నది మిగతా కథ.

నిజానికి, కథ ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. హీరో వరుసగా ఫైటింగ్‌లు చేస్తూ నరుకుతూ ఉంటాడు. తెర మొత్తం రక్తమే. నాని మంచి నటుడు. ఆయన సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయి.
అయితే, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి యాక్షన్ హీరో కావాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఒక రకంగా దసరా, సరిపోదా శనివారం సినిమాలతో అది నెరవేరింది.
అయితే ఆ సినిమాల్లో బలమైన కథ , క్యారెక్టరైజేషన్ ఉంటుంది.
హిట్ -3 కొరియన్ డ్రామా. స్క్విడ్ గేమ్ తరహా.. సెకెండాఫ్ అంతా అదే.

ఫొటో సోర్స్, Unanimous Productions/X
హిట్ -1,2లో కథ స్థానికంగా ఉంటుంది. మనకి తెలిసిన ఊరిలో జరుగుతుంది. ఆ హత్యలను హీరో కండబలంతో కాకుండా బుద్ధి బలంతో శోధిస్తాడు. హిట్ 3 పరిధి చాలా ఎక్కువ. కశ్మీర్, బిహార్, జైపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో.. అంటే దేశమంతా జరుగుతుంది. హీరో ఆయా ఏరియాలకు వెళ్లి తలపడుతుంటాడు.
మొదటి రెండు సినిమాల్లో హత్యలకి ఒక లక్ష్యం ఉంటుంది.
మూడో పార్ట్‌లో ఒక ఉన్మాదం మాత్రమే కనిపిస్తుంది. పైగా విలన్‌గా నటించిన ప్రతీక్‌బబ్బర్ కొత్త నటుడు.
బలమైన విలన్ లేకపోవడం లోపం. ఆ క్యారెక్టర్ రిజిస్టర్ కాదు, అందుకే హీరో అంత రక్తపాతం చేస్తున్నా ప్రేక్షకుడికి ఎమోషన్ రాదు.

ఫొటో సోర్స్, Wall Poster Cinema/YT
హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి ప్రాధాన్యం లేదు. కాసేపు కనిపించి ఒక ట్విస్ట్ ఇస్తుంది. రావు రమేశ్, సముద్రఖని ఉన్నా ఒకటే. రెండు సన్నివేశాలకే పరిమితం. మొత్తం సినిమాని నాని భుజాన మోశాడు.
కొంచెం క్రాక్‌గా వ్యవహరించే స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటాడు. అభిమానులకి మరీ నచ్చుతాడు.
సినిమాల్లో హింస, బూతులు ఉండడం మోడరన్ ట్రెండ్ అని డైరెక్టర్ శైలేష్ కొలను నమ్మినట్టున్నాడు.
యానిమల్, మార్కోస్ జనాలకి నచ్చినపుడు హిట్ 3 కూడా యూత్‌ని ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెన్స్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
మరి ఆ నమ్మకం నిజమా, కాదా వేచిచూడాలి.

ఫొటో సోర్స్, Unanimous Productions/X
మొత్తం మీద ఇది రొటీన్ సినిమా కాదు. యాక్షన్ ప్యాక్డ్ వయలెన్స్. రెండు సీన్లలో తండ్రీకొడుకులు, తప్పదు కాబట్టి హీరోయిన్ లవ్ ట్రాక్ ఉన్నాయి. పాటలు కూడా ఉన్నాయి కానీ, అవి కథకి అడ్డం.
నిడివి ఇంకో 15 నిమిషాలు సులభంగా కత్తిరించే అవకాశం ఉంది. మిక్కీ జె మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పేరు పెట్టడానికి లేదు.
ఇలాంటి సినిమాలకి కెమెరా పనితనం అతిముఖ్యం. సానుజాన్ వర్గీస్ యాక్షన్ మూడ్ క్రియేట్ చేశాడు.
చిన్నపిల్లలు అసలు చూడకూడని సినిమా. తెరమీద దృశ్యాల కంటే రక్తమే ఎక్కువ ఉంటుంది.
చివర్లో అడవి శేష్, కార్తీ కామియోలుగా కనిపించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంటారు. హిట్ 2లో నాని చివర్లో కనిపించినట్టు 3లో కార్తీ కనిపిస్తాడు. అంటే పార్ట్ 4 కూడా ఉంది.
నిజంగా ప్రేక్షకులు ఇంత హింస కోరుకుంటున్నారా? అనేది అతిపెద్ద ప్రశ్న. ఫ్యామిలీ నానికి బదులు, హింసాత్మక నానిని చూడాలనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చుతుందేమో! రక్తాన్ని చూడలేని వాళ్లు వెళ్లకపోతేనే ఆరోగ్యం.

ఫొటో సోర్స్, Wall Poster Cinema/YT
ప్లస్ – మైనస్
ప్లస్ పాయింట్స్:
1. నాని స్టైలిష్ నటన
2. కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
1.బలమైన కథ లేకపోవడం
2.తెలుగు స్క్విడ్ గేమ్ చూస్తున్న ఫీలింగ్
3.విపరీతమైన హింస
4.బలమైన విలన్ లేకపోవడం
పాత రోజుల్లో సినిమాకి ఈస్ట్‌మన్ కలర్ అని వేసేవాళ్లు. ఈ సినిమాకి రెడ్ కలర్ అని వేయడం సబబు. హిట్ 3 ప్రత్యేకత ఏమంటే అనేక రకాల ఆయుధాలతో, మనిషిని అనేక రకాలుగా పొడవొచ్చు అని ప్రేక్షకులకి అర్థమయ్యేలా చేయడం.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)