SOURCE :- BBC NEWS

వేసవికాలం

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా శీతాకాలం ముందుగానే ముగియడం వల్ల పొలాలు, కర్మాగారాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇది పంటల విధానాలను, వ్యాపార ప్రణాళికలను దెబ్బతీస్తోంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో వారంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది.

మార్చి, మే మధ్య కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చని, వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి కాలం ప్రారంభమవడం నితిన్ గోయల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఆయన కుటుంబం 50 సంవత్సరాలుగా లూథియానాలో దుస్తుల వ్యాపారం చేస్తోంది. జాకెట్లు, స్వెటర్లు వంటి శీతాకాలపు దుస్తులను తయారుచేస్తుంది.

కానీ, ఈ సంవత్సరం వేసవి ముందుగానే వచ్చింది. దీని కారణంగా ఆయన కంపెనీ నష్టాలు చవిచూస్తోంది.

ఇప్పుడు వారు తమ వ్యాపార వ్యూహాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తోంది.

వాతావరణం కారణంగా తలెత్తే సవాళ్ల గురించి నితిన్ గోయల్ బీబీసీతో మాట్లాడారు.

“ప్రతి సంవత్సరం శీతాకాలపు వ్యవధి తగ్గుతోంది. మేం స్వెటర్లకు బదులుగా టీ-షర్టులను తయారు చేయాల్సి వచ్చింది. గత ఐదు సంవత్సరాలలో మా అమ్మకాలు సగానికి తగ్గాయి. ఈ సీజన్‌లో అది మరో పది శాతం తగ్గింది” అని ఆయన అన్నారు.

నితిన్ గోయల్ వంటి వారికి, ఈ అనిశ్చిత వాతావరణం కేవలం ఉత్పత్తుల అమ్మకాలపైనే కాదు , అంతకంటే ఎక్కువే ప్రభావం చూపుతోంది.

వాతావరణం

ఫొటో సోర్స్, NITIN GOYAL

ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనకు దాదాపు దశాబ్ద కాలం పట్టింది. కానీ, వాతావరణం అనకూలించకపోవడం వల్ల, తమ వ్యాపార ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది.

గోయల్ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్‌లకు దుస్తులను సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఈ అవుట్‌లెట్‌లు డెలివరీకి డబ్బు చెల్లించడం లేదని ఆయన అన్నారు.

ఇప్పుడు ‘అమ్మకం జరిగితే సరే లేదా తిరిగి ఇచ్చేసే పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే, అమ్ముడవని వస్తువులను కంపెనీకి తిరిగి ఇచ్చేస్తారు. దాంతో తయారీదారుడు నష్టపోవాల్సి వస్తోంది.

అందుకే ఈ సంవత్సరం వారు తమ కస్టమర్లకు భారీ తగ్గింపులు, లేదంటే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి వచ్చింది.

“ఆర్డర్లు ఇచ్చిన తర్వాత కూడా పెద్ద రిటైలర్లు వస్తువులను తీసుకోలేదు” అని గోయల్ అన్నారు.

ఫలితంగా లూథియానాలోని కొంతమంది చిన్న వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.

అల్ఫోన్సో,  మామిడి

ఫొటో సోర్స్, Getty Images

అల్ఫోన్సో మామిడికీ సెగ..

భారతదేశ పశ్చిమ తీరంలోని దేవ్‌గఢ్ పట్టణంలో, దేశంలో అత్యంత ఇష్టంగా తినే అల్ఫోన్సో మామిడి తోటలను హీట్‌వేవ్ నాశనం చేసింది.

రైతు విద్యాధర్ జోషికి 1,500 చెట్లు ఉన్నాయి.

“ఈ సంవత్సరం ఉత్పత్తి సాధారణ దిగుబడిలో 30 శాతం మాత్రమే ఉంటుంది” అని ఆయన అన్నారు.

ఈ ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే అల్ఫోన్సో మామిడి తియ్యటి పండు మాత్రమే కాదు సుగంధభరితమైనది కూడా. ఈ రకం మామిడిని ప్రధానంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాల్లో పండిస్తారు.

కానీ, ఈసారి దాని ఉత్పత్తి తగ్గింది.

“ఈ సంవత్సరం పంటను కాపాడటానికి నీరు, ఎరువుల కోసం సాధారణం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినందున మాకు నష్టాలు తప్పవు” అని జోషి అన్నారు.

ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు నేపాల్ నుంచి మామిడి తోటలలో పని చేయడానికి వచ్చిన కార్మికులను వెనక్కి పంపుతున్నారని, ఎందుకంటే వారికి పెద్దగా పని లేదని ఆయన అన్నారు.

పెరుగుతున్న వేడి కారణంగా, గోధుమ, పప్పు ధాన్యాల పంటలు కూడా ప్రమాదంలో పడ్డాయి.

అయితే, దిగుబడి తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదని, ఈసారి భారతదేశంలో గోధుమ పంట బాగా పండుతుందని వ్యవసాయ మంత్రి చెప్పారు.

కానీ, నిపుణుల అంచనా వేరేలా ఉంది.

“2022 సంవత్సరంలో, వేడిగాలుల కారణంగా, ఉత్పత్తిలో 15-25 శాతం తగ్గుదల కనిపించింది. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండొచ్చు” అని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ థింక్ ట్యాంక్‌కు చెందిన అభిషేక్ జైన్ అన్నారు.

శీతాకాలం

ఫొటో సోర్స్, Getty Images

నీటి లభ్యతపై ఆందోళన

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వ్యవసాయానికి నీటి లభ్యత గురించి ఆర్థికవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.

సీఈఈడబ్ల్యూ ప్రకారం, ఉత్తర భారతదేశంలోని రిజర్వాయర్ల స్థాయిలు వాటి సామర్థ్యంలో 28 శాతానికి పడిపోయాయి.

గత సంవత్సరం ఇది 37 శాతంగా ఉంది.

ఇది పండ్లు, కూరగాయలు, పాల రంగాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల ఉత్పత్తిలో 15 శాతం క్షీణతను గుర్తించారు.

“ఈ విషయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. ఆర్‌బీఐ చెప్పిన 4 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోవచ్చు” అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు.

భారతదేశంలో చాలా నెలలుగా గరిష్ట స్థాయిలో ఉన్న ఆహార ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీని ఫలితంగా చాలా కాలం తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి.

వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలపై వెంటనే చర్చించాలని సీఈఈడబ్ల్యూ వంటి మేథోసంస్థలు చెబుతున్నాయి.

ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో, భారతదేశంపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయి.

దేశంలోని ప్రతి నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాలు వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పును చూస్తాయని సీఈఈడబ్ల్యూ అంచనా వేసింది.

వీటిలో, 40 శాతం ప్రాంతాలు వాతావరణ మార్పు కనిపించే విధంగా ఉన్నాయి. అంటే, సాధారణంగా వరదలు సంభవించేచోట, కరవు ఏర్పడవచ్చు.

ఒక అంచనా ప్రకారం, 2030 నాటికి దేశంలో వేడి కారణంగా రోజువారీ పని గంటల్లో దాదాపు 5.8 శాతం కోల్పోతారు.

భారతదేశంలోని ఈ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో వేడిగాలులతో ప్రాణాలకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగే ప్రమాదం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS