SOURCE :- BBC NEWS

అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/allu arjun/revanthreddy

43 నిమిషాలు క్రితం

పుష్ప 2 సినిమా విడుదలకు ముందు రోజున సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు చెప్పినా ఆయన వినలేదని అన్నారు. అంతకుముందు కొన్ని రోజుల కిందట రేవంత్ ఓ జాతీయ మీడియా చానల్‌తో మాట్లాడినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు అల్లు అర్జున్‌పై, సినీ రంగానికి కొందరి వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేశారు.

అనంతరం కొద్ది గంటల్లోనే అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయన వ్యాఖ్యలకు సమాధానాలు ఇచ్చారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన దగ్గరకు పోలీసులు ఎవరూ రాలేదని అల్లు అర్జున్ అన్నారు.

రేవంత్, అల్లు అర్జున్‌లు ఎవరేం అన్నారంటే..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, TelanganaAssembly

రేవంత్ రెడ్డి ఏమన్నారు?

సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవచ్చని, కానీ ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నటుడు అల్లు అర్జున్‌ అరెస్టుపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని సీఎం అన్నారు.

సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ..

‘సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్‌కు వెళ్లారు.

అతను కేవలం థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ, థియేటర్‌కు వెళ్లేటపుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా జనం సంధ్య థియేటర్ వైపు రావడంతో తోపులాట జరిగింది.

ఈ ఘటనలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది’ అన్నారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA CMO

హీరోను హెచ్చరించాం

‘హీరో థియేటర్‌లో ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా ఆయన వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి.. అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హీరోను హెచ్చరించి, కారు ఎక్కించారు. అయినా వెళ్లేటపుడు కూడా కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు.

ఈ నేపథ్యంలో హీరోపై, యాజమాన్యంపై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యతరహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి.

తన కొడుకు ఆ హీరో అభిమాని అని ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్‌లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు.

సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది.

జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిశారా? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చెలగాటమాడితే ఒప్పుకోం. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది.

allu arjun

ఫొటో సోర్స్, allu arjun team

అల్లు అర్జున్ ఏమన్నారంటే..

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లుఅర్జున్ స్పందించారు. తన మీద చేస్తున్న వ్యాఖ్యలు తన క్యారెక్టర్ నాశనం చేసేలా ఉన్నాయని అల్లుఅర్జున్ అన్నారు.

”థియేటర్ అంటే నాకు గుడి లాంటిది. అక్కడ ఏమైనా జరిగితే నాకు బాధగా ఉండదా? అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాలనేది తప్పు సమాచారం” అని అన్నారు.

”నేను కష్ట పడిందే తెలుగువాళ్ల పేరు నిలబెట్టడానికి.. అలాంటిది ఒక నేషనల్ మీడియా ముందు నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది” అని ఆయన అన్నారు.

థియేటర్‌కు ర్యాలీగా వెళ్లలేదని, ఫ్యాన్స్‌ను పక్కకు తప్పుకోండని, ముందుకెళ్లమని చెబుతూ వెళ్లానని చెప్పారు. థియేటర్‌లో ఉండగా పోలీసులు వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పారని, వెంటనే వెళ్లిపోయానని అల్లు అర్జున్ అన్నారు.

తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని మరుసటి రోజున తెలిసిందని ఆయన అన్నారు. అప్పటికప్పుడు బన్నీవాసును పిలిచి ఆసుపత్రికి వెళ్లి, గాయపడిన శ్రీతేజను కలవాలని చెప్పానని అన్నారు.

”ఆసుపత్రికి వెళ్లి బాలుడిని కలుద్దామనుకున్నాను. కేసు రిజిస్టర్ అయిందని, కలవడం న్యాయపరంగా సరైంది కాదని లీగల్ టీం చెప్పింది. శ్రీతేజ్ గురించి ప్రతి గంటకు అప్డేట్ తెలుసుకుంటున్నా.. అబ్బాయి ప్రస్తుతం బాగున్నాడు” అని అల్లు అర్జున్ అన్నారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, Harish Rao Thanneeru/facebook

అల్లు అర్జున్ విషయంలో మాట్లాడుతామంటే మాకెందుకు మైక్ ఇవ్వలేదు: హరీశ్ రావు

అల్లు అర్జున్ అరెస్టుపై ప్రతిపక్షాలు స్పందించిన తీరుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు.

సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాట్లాడుదామని మైక్ అడిగితే ఇవ్వలేదని, ఎందుకు అంత భయమని ప్రశ్నించారు హరీశ్.

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనను సమర్థించడం లేదని, అక్కడ ఒక మహిళ చనిపోవడాన్ని బీఆర్ఎస్‌ ఖండిస్తుందని పేర్కొన్నారు.

సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన మీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. చట్టం నీ కుటుంబానికి చుట్టం అయిందా? అని అడిగారు.

(అల్లు అర్జున్ స్పందన రాగానే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)