SOURCE :- BBC NEWS
దేవుడి హుండీలో పొరపాటున జారిపడ్డ తన ఐఫోన్‌ను తిరిగి పొందేందుకు చెన్నైకి చెందిన దినేశ్ అనే వ్యక్తి నానా ఇబ్బందులు పడుతున్నారు.
దినేశ్ ఐఫోన్, చెన్నైలోని తిరుప్పోరూర్ మురుగన్ దేవాలయంలోని హుండీలో పడిపోయింది.
అయితే, హుండీలో పడిన ఐఫోన్ దేవుడికే చెందుతుందంటూ దినేశ్‌కు తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ ఎండోమెంట్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
సెల్‌ఫోన్‌లోని డేటా తీసుకొని ఫోన్ ఇచ్చేయాలని అధికారులు తనను అడిగారని దినేశ్ వెల్లడించారు.
ఐఫోన్ ఎవరికి చెందుతుందో వారికే ఇచ్చేందుకు గల అంశాలను పరిశీలిస్తున్నట్లు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తెలిపారు.
ఏం జరిగింది?
చెన్నైలోని అంబత్తూర్ వినాయకపురంలో దినేశ్ నివసిస్తుంటారు. చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ)లో ఆయన పనిచేస్తారు.
తిరుప్పోరూర్ కందసామి దేవాలయ హుండీలో తన ఫోన్ పడిపోయిందని చెబుతూ, దాన్ని తిరిగి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
‘‘నేను మురుగన్ దేవాలయానికి వెళ్లినప్పుడు 13 ప్రో మ్యాక్స్ మోడల్ ఐఫోన్ హుండీలో జారిపడింది. ఈ విషయమై దేవాలయ కార్యనిర్వాహణ అధికారికి లేఖ రాశాను. హుండీని తెరిచినప్పుడు నాకు సమాచారమిస్తానని అధికారులు చెప్పారు. డిసెంబర్ 19న హుండీ తెరిచినప్పుడు నా ఐఫోన్ వారికి దొరికింది. కానీ, నాకు ఇవ్వలేదు. పైగా నిబంధనల ప్రకారం, హుండీలో ఏది పడినా అది దేవుడికే చెందుతుందని చెబుతున్నారు” అని దినేశ్ బీబీసీకి వివరించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏమన్నారు?
”ఆరోజు మధ్యాహ్నం నేను కందసామి గుడికి వెళ్లాను. అప్పుడు అనుకోకుండా నా ఫోన్ హుండీలో జారిపడింది” అని దినేశ్ చెప్పారు.
”ఈ ఘటన తర్వాత నేను ఇంటికి వెళ్లాను. దీని గురించి చర్చించిన అధికారులు నన్ను పిలిపించి ఫోన్‌లోని డేటా తీసుకెళ్లాలని చెప్పారు. మళ్లీ గుడికి వెళ్లలేకపోయినందున నేను డేటా తీసుకోలేదు” అని దినేశ్ చెప్పారు.
”గుడిలోని రాజగోపురం దగ్గర ఆరు అడుగుల ఎత్తుండే హుండీ ఉంది. ఐఫోన్ అందులో జారిపడే అవకాశమే లేదు” అని కందసామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి కుమారవేల్ అన్నారు.
”దినేశ్ ఆగస్టులో గుడికి వచ్చారు. దేవుడికి పూజలు చేశారు. తన ఐఫోన్ కనిపించడం లేదంటూ సెప్టెంబర్‌లో ఆయన ఆలయ పాలనాధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు” అని బీబీసీతో దినేశ్ అన్నారు.
తమకు సమర్పించిన పత్రంలో తన ఫోన్ బహుశా హుండీలో పడిపోయి ఉంటుందని దినేశ్ పేర్కొన్నట్లు కుమారవేల్ చెప్పారు.
”నా ఫోన్ హుండీలో పడిపోయి ఉంటుంది. హుండీని తెరిచినప్పుడు నాకు సమాచారం ఇవ్వండి” అని దినేశ్ కోరినట్లు ఆయన తెలిపారు.
హుండీని తెరిచినప్పుడు సాధారణంగానే ఆ విషయాన్ని తాము ప్రజలకు తెలియజేస్తామని, అదే విధంగా దినేశ్‌కు కూడా సమాచారమిచ్చినట్లు కుమారవేల్ అన్నారు.
”హుండీలో ఫోన్ దొరికింది, కానీ”
హిందూ రిలీజియస్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ జాయింట్ కమిషనర్ రాజలక్ష్మీ, దేవాలయ కార్యనిర్వహణ అధికారి కుమారవేల్ సమక్షంలో దేవాలయ హుండీని డిసెంబర్ 19న తెరిచారు.
హుండీలో 53 లక్షల రూపాయలు, 289 గ్రాముల బంగారం, 6,920 గ్రాముల వెండి, ఒక ఐఫోన్ లభించినట్లు అధికారులు వెల్లడించారు.
”దినేశ్ తనతో పాటు గుడికి ఒక ఫోటోగ్రఫర్, వీడియోగ్రఫర్‌తో వచ్చారు. రాజగోపురం దగ్గరున్న హుండీలో ఒక ఐఫోన్ దొరికింది. ఆ ఫోన్ తనదేనంటూ తనకివ్వాలని దినేశ్ కోరారు. అడిగిన వెంటనే ఫోన్‌ను ఇవ్వలేమని ఆయనకు చెప్పాం. మీ ఫోన్ వివరాలను తగు సాక్ష్యాధారాలతో లిఖితపూర్వకంగా ఇవ్వండని ఆయనకు చెప్పాం. దీని గురించి పై అధికారులతో చర్చించి చెబుతామని ఆయనకు తెలిపాం” అని కుమారవేల్ వివరించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
”తమిళనాడు దేవాదాయ ధర్మదాయ శాఖ నిబంధనల ప్రకారం, దానం చేసిన వస్తువులన్నీ దేవస్థానం ఆధీనంలో ఉంటాయి. హుండీలో ఎవరైనా ఏమైనా వేయొచ్చు. అందులో పడిన వస్తువులన్నీ దేవస్థానం ప్రాపర్టీగా పరిగణిస్తారు. హుండీలో లభించిన వస్తువులన్నింటినీ తప్పనిసరిగా రికార్డు చేస్తారు. ఐఫోన్ తనదేనని నిరూపించే సాక్ష్యాలను రాతపూర్వకంగా ఇవ్వాల్సిందిగా కోరాం” అని కుమారవేల్ తెలిపారు.
”ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరుగలేదు. ప్రత్యేక మినహాయింపు ఇచ్చి ఎలక్ట్రానిక్ వస్తువులను వాటి నిజమైన యజమానులకు అప్పగించాలా? వద్దా? అనే విషయాన్ని పై అధికారులే నిర్ణయిస్తారు” అని కుమారవేల్ చెప్పారు.
ఆరు అడుగుల ఎత్తున్న హుండీలో ఫోన్ పడే అవకాశమే లేదన్న కార్యనిర్వహణ అధికారి వ్యాఖ్యలపై స్పందిస్తూ ”పొరపాటున ఫోన్ పడిపోయింది” అని దినేశ్ అన్నారు. తర్వాతి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు.
తమిళనాడు దేవాదాయ శాఖ ఏమంటోంది?
తిరువళ్లూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఐఫోన్ సమస్యపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు స్పందించారు.
”క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఈ వ్యవహారంపై ఓ నిర్ధరణకు వస్తాం. హుండీలో వేసింది ఏదైనా దేవుడి ఖాతాలో వేయడం ఆనవాయితీ. న్యాయపరంగా ఏం చేయవచ్చో పరిశీలిస్తాం” అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)