SOURCE :- BBC NEWS

హెచ్‌ఎంపీవీ

ఫొటో సోర్స్, Getty Images

8 జనవరి 2025, 10:08 IST

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న హెచ్‌ఎంపీ వైరస్‌కు సంబంధించిన కొంత ముఖ్య సమాచారం గురించి తెలుసుకుందాం.

1. హెచ్‌ఎంపీవీ పూర్తి పేరేంటి?

హెచ్ఎంపీవీ అంటే హ్యుమన్ మెటాన్యూమో వైరస్. రెస్పిరేటరీ సెన్సిషల్ వైరస్ (ఆర్ఎస్‌వీ)తో పాటు న్యూమోవిరిడే కుటుంబానికి చెందినదే ఈ వైరస్ అని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

200 నుంచి 400 ఏళ్ల కిందట పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని సైన్స్ డైరెక్ట్‌ పేర్కొంది. కానీ, అప్పటి నుంచి ఈ వైరస్ పదేపదే పరిణామం చెందుతూ వచ్చింది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

2. హెచ్ఎంపీవీ అంటే ఏంటి?

హ్యుమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ)ను తొలుత 2001లో నెదర్లాండ్స్‌లో గుర్తించారు. దీనివల్ల, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇన్‌ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు, బ్రాంకైటిస్ లేదా న్యుమోనియాకు కూడా కారణం కావొచ్చు. చిన్న పిల్లలు, పెద్దవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనికి ఎక్కువగా ప్రభావితం కావొచ్చు.

3. భారత్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయి?

భారత్‌లో ఇప్పటి వరకు మూడు హ్యుమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు వెలుగులోకి వచ్చాయి.

వాటిలో రెండు కేసులు బెంగళూరులో సాధారణ పరీక్షల సమయంలో ఐసీఎంఆర్ గుర్తించిందని ఎక్స్ వేదికగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గుజరాత్‌లో రెండు నెలల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు.

హెచ్‌ఎంపీవీ

ఫొటో సోర్స్, Getty Images

4. చైనాలో ఎన్ని కేసులు బయటపడ్డాయి?

చైనాలో హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఆ దేశంలో ఎన్నికేసులు నమోదయ్యాయో అధికారిక గణాంకాలు లేవు.

చైనా ప్రభుత్వ వార్తా వెబ్‌సైట్ గ్లోబల్ టైమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఉత్తర చైనాతో పాటు బీజింగ్‌, నైరుతి నగరం చాంగ్‌కింగ్, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ నగరంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది.

చైనాలో డిసెంబర్ మూడో వారంలో, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసిందని రాయిటర్స్ కథనం ఒకటి పేర్కొంది.

నమోదవుతున్న కేసుల్లో రైనో వైరస్, హ్యుమన్ మోటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు రాయిటర్స్ తన రిపోర్టులో పేర్కొంది.

ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లలో నమోదవుతున్నాయి. 14 ఏళ్ల లోపున్న చిన్నారులు ఎక్కువగా దీనికి ప్రభావితులు అవుతున్నారు.

హ్యుమన్ మెటాన్యూమో వైరస్ మూలం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని ఈ రిపోర్టు పేర్కొంది.

హెచ్‌ఎంపీ వైరస్

ఫొటో సోర్స్, Getty Images

5. హెచ్‌ఎంపీ వైరస్ లక్షణాలు ఏంటి?

  • జ్వరం
  • దగ్గడం, ముక్కు దిబ్బడ
  • గొంతు నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • వైరస్ తీవ్రమైతే బ్రాంకైటిస్ లేదా న్యుమోనియా వచ్చే ప్రమాదం

ఇతర వైరస్‌లకు మాదిరిగానే ఇది కూడా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది.

6. హెచ్‌ఎంపీ వైరస్ కొత్తదా?

హెచ్‌ఎంపీ వైరస్ కొత్తది కాదని దిల్లీలోని శ్రీ గంగారామ్ హాస్పిటల్‌ పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ సురేశ్ గుప్తా పీటీఐ వార్తా సంస్థకి చెప్పారు.

గత 20 ఏళ్లుగా ప్రజలకు ఈ వైరస్ తెలుసని, శీతాకాలంలో, ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతుంటాయని, ఇది ఫ్లూ వైరస్ లాంటిదని తెలిపారు.

హెచ్‌ఎంపీవీ వైరస్‌

ఫొటో సోర్స్, Gettyimages/Kateryna/science

7. హెచ్‌ఎంపీ వైరస్‌ను ఎప్పుడు గుర్తించారు?

2001లో ఈ వైరస్‌ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికాకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

8. హెచ్‌ఎంపీ వైరస్, కరోనాలాంటిదేనా?

హెచ్‌ఎంపీ వైరస్, కోవిడ్-19 రెండూ భిన్నమైనవని కేరళ వన్ హెల్త్ సెంటర్ ఫర్ నిపా రీసెర్చ్ అండ్ రెజీలియెన్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ టీఎస్ అనీశ్ చెప్పారు.

”కోవిడ్-19 అప్పటికి కొత్త వైరస్. ఈ కారణంతో, ఇతర వైరస్‌ల మాదిరి దీన్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఏ వ్యక్తిలోనూ అప్పటికి లేదు.” అని తెలిపారు.

చైనాలో హెచ్ఎంపీవీ అవుట్‌బ్రేక్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నట్లు సీబీఎస్‌ న్యూస్‌ పేర్కొంది. కరోనాలాగా ఇది కొత్తది కాదని, అంతుబట్టని అనారోగ్యమేమీ కాదని తెలిపింది.

అయితే, హ్యుమన్ మెటాన్యూమో వైరస్, కోవిడ్-19 రెండూ కూడా అంటువ్యాధులే, శ్వాసకోశాన్ని దెబ్బతీస్తాయి. ఈ రెండింటి లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు వైరస్‌లు ఒకే విధంగా వ్యాపిస్తాయి. కోవిడ్-19 లాగా కాకుండా హెచ్ఎంపీవీ చికిత్సకు యాంటీవైరల్ థెరపీ లేదా వ్యాక్సీన్ లేదు.

హెచ్ఎంపీవీ అనేది సీజన్‌లలో వస్తుంటుంది. కోవిడ్-19 మాదిరిగా కాకుండా శీతాకాలం, వసంతకాలాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి.

కోవిడ్-19 తర్వాత కొన్ని దేశాలలో హెచ్‌ఎంపీవీ కేసులు మూడు రెట్లు పెరిగాయని అధ్యయనాలు చెప్పాయి. కోవిడ్-19 నివారణ చర్యలు అమల్లో ఉన్నప్పుడు ప్రజలు శ్వాసకోశానికి సంబంధించిన అన్ని రకాల జబ్బుల బారిన పడలేదు. కానీ, ఈ చర్యలు సడలించిన తర్వాత, హెచ్ఎంపీవీ వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం మొదలైంది.

పిల్లలకి ఐదేళ్లు, ఆపైన వయసు వచ్చిన తర్వాత ఈ వైరస్‌ను ఎదుర్కొనే పూర్తి రోగనిరోధక శక్తిని పొందుతారని డాక్టర్ అనీశ్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ చెప్పారు.

హెచ్‌ఎంపీవీ వైరస్

ఫొటో సోర్స్, Getty Images

9. హెచ్‌ఎంపీ వైరస్ ప్రమాదకరమైనదా/ప్రాణాంతకమైనదా?

”ఈ వైరస్‌పై పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరుగుతోంది. 15 నుంచి 16 ఏళ్ల కిందటే దీన్ని గుర్తించారు. ఇది సీజనల్ ఇన్‌ఫెక్షన్” అని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వి.రవి చెప్పారు.

”ఇన్‌ఫ్లుయెంజా కేసులతో పాటు ఇది కూడా వస్తుంటుంది. పిల్లలు ఎక్కువగా దీని ప్రభావాన పడతారు.” అని అన్నారు.

” భారత్‌లో నమోదవుతున్న హెచ్‌ఎంపీవీ అనేది జలుబు, ఫ్లూ వంటి లక్షణాలకు కారణమయ్యే సాధారణ వైరస్. భయపడాల్సిన పని లేదు. ఇది శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే మామూలు వైరస్. తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలోని ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి” అని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ అన్నారు.

10. హెచ్‌ఎంపీవీ ఎలా వ్యాపిస్తుంది?

హెచ్‌ఎంపీవీ ఒక అంటువ్యాధి. దగ్గడం, తుమ్మడం వల్ల నోటిలో నుంచి వచ్చే ఉమ్మి వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

కరచాలనం, కౌగిలించుకోవడం లేదా ఒకరినొకరు తాకడం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.

దగ్గు లేదా ముక్కు కారడం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజలం పడినప్పుడు, వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను, నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది.

11. హెచ్‌ఎంపీవీ‌తో మరణాల రేటు ఎలా ఉంటుంది?

అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి అదనంగా హెచ్‌ఎంపీవీ సోకినట్లయితే మరణానికి దారి తీయవచ్చని సీడీసీ పేర్కొంది.

లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ 2021లో ప్రచురించిన ఒక కథనంలోని డేటా ప్రకారం, అయిదేళ్లలోపు చిన్నారుల్లో అక్యూట్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో సంభవించే మరణాల్లో ఒక శాతం మరణాలకు హెచ్‌ఎంపీవీ కారణం.

హెచ్‌ఎంపీ వైరస్

ఫొటో సోర్స్, ANI

12. హెచ్‌ఎంపీవీ సోకకుండా నిరోధక శక్తిని పొందడం ఎలా?

హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని దశాబ్దాలుగా ఇది ఉనికిలో ఉందని సింగపూర్‌లోని ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ ఫిజీషియన్ సు లి యాంగ్ చెప్పారు.

గతంలో తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ వైరస్‌ను తట్టుకునేలా ఒకస్థాయి ఇమ్యూనిటీతో ఉన్నారని వెల్లడించారు.

అయితే, ఫ్లూ, కోవిడ్, ఆర్‌ఎస్‌వీల మీద పని చేసేలా ప్రత్యేక వ్యాక్సీన్ ఉన్నట్లుగా హెచ్‌ఎంపీవీకి లేకపోవడం వల్ల టీకా ద్వారా రోగనిరోధక శక్తిని పొందే అవకాశం లేదని వైద్యనిపుణులు అంటున్నారు.

13. హెచ్‌ఎంపీ వైరస్ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి?

ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది. అనారోగ్యం స్వల్ప కాలం ఉండొచ్చు, దీర్ఘకాలం కూడా ఉండొచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటుంది.

14. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?

  • బహిరంగ ప్రదేశాల్లో, రద్దీగా ఉండే చోట మాస్క్‌లు ధరించాలి.
  • ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి త్వరగా అనారోగ్యానికి గురయ్యేవారు బయట ఎక్కువగా తిరగకపోవడం మంచిది
  • ఫ్లూ వ్యాక్సీన్ తీసుకోవడం

15. కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?

వైరస్ లక్షణాలు తీవ్రంగా లేకపోతే సాధారణంగా రెండు నుంచి వారం రోజుల్లో హెచ్‌ఎంపీవీ నుంచి కోలుకోవచ్చు. దగ్గు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS