SOURCE :- BBC NEWS

చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, UGC

  • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 1 ఏప్రిల్ 2025

    అప్‌డేట్ అయ్యింది 4 ఏప్రిల్ 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్న కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

చెట్ల సంరక్షణ మినహా మరే ఇతర కార్యకలాపాలు చేపట్టరాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏప్రిల్ 3న ఆదేశాలు జారీ చేసింది.

కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికవేత విషయంపై పత్రికల్లో వస్తున్న కథనాలపై అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గవాయి.. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఏప్రిల్ 3న హైకోర్టు రిజిస్ట్రార్.. కంచె గచ్చిబౌలిలోని భూములను పరిశీలించి నివేదిక అందించారు.

నివేదిక పరిశీలించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లను నరికివేయడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చెట్లను నరికివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు తెలంగాణ హైకోర్టులోనూ వట ఫౌండేషన్, విద్యార్థులు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ పెండింగులో ఉంది.

కాగా చెట్లను నరికివేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించడంపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

”సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే నేపథ్యంలో మా ఆందోళనలు తాత్కాలికంగా నిలిపివేశాం” అని హెచ్ సీయూ స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ త్రివేణి బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
HCU

మంత్రుల కమిటీ ఏర్పాటు

తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు, పౌర సమాజం ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో మంత్రుల కమిటీ చర్చిస్తుందని చెప్పారు.

మంత్రుల కమిటీలో సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై మంత్రుల కమిటీ చర్చిస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 400 ఎకరాలను భూమిని ఎకో పార్కుగా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు.

”మరో మూడేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 400 ఎకరాల్లో భూములు ఎవరూ కొనొద్దు. అక్కడ అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం.” అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

హెచ్‌సీయూ భూముల వివాదం

ఫొటో సోర్స్, UGC

అసలేం జరిగింది?

విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కంచె గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండటంతో అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళనలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం..

HCU

హెచ్‌సీయూకు ఎన్ని భూములున్నాయి?

దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

మొదట్లో, అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు.

ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పట్నుంచి అక్కడే కొనసాగుతోంది. అయితే, ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందట మొదలైంది.

2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది.

అప్పట్లో సదరు కంపెనీకి ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయించగా, అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం.

2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూముల బదలాయింపు జరిగింది.

హెచ్‌సీయూ భూముల వివాదం

ఫొటో సోర్స్, UGC

2006లో భూముల కేటాయింపు రద్దు

ఐఎంజీ అకాడ‌మీ నిర్దేశిత సమయంలో ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006, న‌వంబ‌రు 21న అప్పటి రాష్ట్ర ప్ర‌భుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది.

దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది.

ఆ తర్వాత, ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ నిరుడు మే నెలలో పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది.

ఐటీ, ఇత‌ర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎక‌రాలు కేటాయించాల‌ని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) గతేడాది జూన్ 19న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించింది.

”టీజీఐఐసీ చేసిన విజ్జప్తి మేరకు ఆ 400 ఎక‌రాల భూమి హ‌క్కుల‌ను టీజీఐఐసీకి బ‌ద‌లాయిస్తూ 2024 జూన్ 24న ఉత్త‌ర్వులు చేశాం” అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

”యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిజిస్ట్రార్ స‌మ్మ‌తితోనే 2024 జులై 19న యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్‌, యూనివ‌ర్సిటీ ఇంజినీర్‌, యూనివ‌ర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌, మండ‌ల స‌ర్వేయ‌ర్ స‌మ‌క్షంలో స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్ధరించారు” అని ప్రభుత్వం చెబుతోంది.

హెచ్‌సీయూ భూముల వివాదంపై ఏబీవీపీ నిరసన

ఫొటో సోర్స్, X/ABVPTelangana

అయితే, భూములకు హద్దులు నిర్ణయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసీ చెప్పిన విషయంలో వాస్తవం లేదని యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

”ఇప్పటివరకు భూములకు హద్దులు నిర్ధరించలేదు. ఆ విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేయలేదు. ప్రభుత్వానికి విజ్జప్తి చేసిన విధంగా పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలి.” అని యూనివర్సిటీ మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో కోరింది.

ఈ మొత్తం వ్యవహారంపై యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ బీబీసీతో మాట్లాడారు.

”2003లో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని, గోపన్‌పల్లి వైపు 397 ఎకరాలు స్వాధీనపరిచింది. అలా ఇచ్చిన భూమిలో కూడా కొంతమేర తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలకు కేటాయించింది” అని అన్నారు.

అలాగే, అప్పట్లో ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి వర్సిటీ ఆధీనంలోకే భూములు వస్తాయని ఆయన వివరించారు.

”2006లో రాష్ట్ర ప్రభుత్వంపై ఐఎంజీ అకాడమీ హైకోర్టు వెళ్లింది. ఆ సమయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు. దానివల్ల ఆ భూములు ప్రభుత్వానివేనని, ప్రభుత్వమే పోరాడుతోందన్నట్లుగా మారిపోయింది” అని ఆ సీనియర్ ప్రొఫెసర్ బీబీసీతో అన్నారు.

హెచ్‌సీయూ భూముల వివాదం

ఫొటో సోర్స్, X/sravandasoju

ప్రస్తుతం ఏం పనులు జరుగుతున్నాయంటే..

వివాదాస్పద భూముల ప్రాంతాన్ని బీబీసీ మార్చి 31వ తేదీన సందర్శించింది.

హెలీప్యాడ్స్ ప్రాంతం వద్ద పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లే దారిలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్స్ వద్ద పోలీసు పికెట్ కనిపించింది. ఇప్పటికే జేసీబీలు పెద్దసంఖ్యలో అక్కడ పనులు చేస్తున్నాయి.

బీబీసీ వెళ్లినప్పుడు, అప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లు, పొదలను తొలగించి చదును చేసే పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాత్రిళ్లు కూడా పనులు కొనసాగుతున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు.

”ఇప్పటికే సగం అడవిని చదును చేసేశారు. రాత్రిళ్లు కూడా పనులు చేస్తుండటంతో నెమళ్లు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. మా విద్యార్థులందరికీ చాలా బాధగా అనిపిస్తోంది.” అని అంబేడ్కర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెన్నెల బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం వివాదం నడుస్తున్న ప్రాంతానికి సంబంధించి స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేశారు. అందులో పెద్దసంఖ్యలో పొక్లెయిన్లు పనులు చేస్తున్నట్లుగా ఉంది.

అందులో ఒక చెరువు కూడా కనిపిస్తోంది.

”చదును చేస్తున్న ప్రాంతంలోనే పీకాక్ లేక్ ఉంది. మష్రూం రాక్ పాయింట్ ఉంది. జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. జింకలు, నెమళ్లు పెద్దసంఖ్యలో తమ నివాసం కోల్పోతున్నాయి.” అని బీబీసీతో హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ త్రివేణి చెప్పారు.

”మేం పోరాడేది మా కోసం, మా భవిష్యత్తు తరాల కోసం. ఇప్పుడు 400 ఎకరాలు అంటారు.. తర్వాత 200, 300 ఎకరాలు.. ఇలా మొత్తం యూనివర్సిటీనే లేకుండా చేస్తారనే భయం ఉంది.” అని త్రివేణి అన్నారు.

ఈ విషయంపై రాహుల్ గాంధీ స్పందించాలని, యూనివర్సిటీ భూములు కాపాడాలని ఆమె కోరారు.

హెచ్‌సీయూ భూములు

ఫొటో సోర్స్, X/sravandasoju

మష్రూం రాక్స్, చెరువుల పరిస్థితి ఏంటి..?

తాము పనులు చేస్తున్న 400 ఎక‌రాల్లో బ‌ఫెల్లో లేక్‌, పీకాక్ లేక్ లేవని చెబుతోంది టీజీఐఐసీ.

”అయితే, మ‌ష్రూం రాక్స్‌తో పాటు ఇత‌ర రాళ్ల అమ‌రిక (రాక్ ఫార్మేష‌న్‌) ఈ భూముల్లోనే ఉన్నట్లుగా గుర్తించాం. వాటిని హ‌రిత స్థ‌లాలుగా (గ్రీన్ స్పేస్‌) పరిరక్షిస్తాం.” అని టీజీఐఐసీ చెబుతోంది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ భూములు ఆక్ర‌మించ‌లేదని, ఇప్పుడు ఉన్న జ‌లవ‌న‌రులు (లేక్స్‌), రాళ్ల అమ‌రిక (రాక్ ఫార్మేష‌న్‌)ను దెబ్బ‌తీయ‌డం లేద‌ని ఒక ప్రకటనలో పేర్కొంది.

”మేం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా ముట్టుకోలేదు. నేను అదే యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అక్కడే చదువుకున్నారు. యూనివర్సిటీ భూములను రక్షించే బాధ్యత మాపై ఉంది.” అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు.

ఈ విషయంపై అసెంబ్లీలో మార్చి 25వ తేదీన రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆ భూమి లేదు. డెవలప్‌మెంట్ కోసం భూమిని టీజీఐఐసీకి కేటాయించి ఐటీ కంపెనీలు రావాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రూపొందించాం.” అని చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా టీజీఐఐసీ ద్వారా బహిరంగ వేలం వేసి భూములు విక్రయిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

”పారదర్శకంగా భూముల విక్రయాలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఆ భూముల్లో జింకలు, పులులు, సింహాలు ఉన్నట్లుగా చెబుతున్నారని, అక్కడ గుంట నక్కలు చేరి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

హెచ్‌సీయూ భూములు

ఫొటో సోర్స్, UGC

‘యూనివర్సిటీనే మా భూములు కాదని చెప్పింది’

యూనివర్సిటీ అధికారులే ఆ 400 ఎకరాలు తమ భూములు కావని చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు మార్చి 25న అసెంబ్లీలో ప్రకటన చేశారు.

”యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ మమ్మల్ని సంప్రదించారు. ఆ భూములతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు” అని అన్నారు.

ఈ విషయంపై మాట్లాడేందుకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు, రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించింది బీబీసీ. కానీ, వారు స్పందించలేదు.

”యూనివర్సిటీకి చెందిన భూముల బదలాయింపు ఏదైనా సరే రాష్ట్రపతి నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారానే జరుగుతుంది.” అని మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీ చెప్పింది.

మరోవైపు, 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీకి 1626 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది.

ఆ భూములను యూనివర్సిటీ పేరుతో మ్యుటేషన్(బదలాయింపు) చేయాలని వర్సిటీ అధికారులు కోరుతూ వస్తున్నారు.

అయితే, ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు.

”యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లోనే గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్ఐటీ సహా వేర్వేరు సంస్థలకు స్థలాలు కేటాయించారు.

ఆ మిగిలిన భూములను ఇప్పటికైనా యూనివర్సిటీ పేరుతో బదలాయించాలి” అని యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఒకరు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS