SOURCE :- BBC NEWS
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
31 అక్టోబర్ 2024
అప్‌డేట్ అయ్యింది 6 జనవరి 2025
హైదరాబాద్ నగరానికి తూర్పున చర్లపల్లి కొత్త రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్) స్టేషన్లు వందేళ్ల క్రితం నిర్మించినవి. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇన్నేళ్లకు అంతపెద్ద స్థాయిలో ఒక టెర్మినల్ అందుబాటులోకి రావడం చర్లపల్లిలోనే అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ వ్యయం సుమారు రూ.430 కోట్లకు చేరుకుంది.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది
సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను పునర్‌నిర్మించారు. సికింద్రాబాద్‌లో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 236 రైళ్లు వచ్చిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే 12 రైళ్లకు చర్లపల్లిలో హాల్టు కల్పిస్తున్నారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం 13 రైళ్లకు హాల్టు సౌకర్యం ఉంది. కొత్త ట్రాకులు, ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తే అదనంగా 15 రైళ్లు నిలిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్‌ను లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్లుగా తీర్చిదిద్దారు.
చర్లపల్లిలో గతంలో తొమ్మిది ట్రాకులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను రైల్వేశాఖ 19కి పెంచింది. అలాగే ఐదు ప్లాట్‌ఫాంలను తొమ్మిదికి పెంచారు. స్టేషన్ అవరణలో దాదాపు 5500 మొక్కలు పెంచుతున్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను విమానాశ్రయం తరహాలో నిర్మించారు. విశాలమైన పార్కింగ్, రహదారులు, సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, దివ్యాంగులకు ర్యాంపులు, బుకింగ్ కౌంటర్, ఆటోలు, ట్యాక్సీలు, బస్సులకు ప్రత్యేక బే (మార్గం), డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు.
హెల్ప్ డెస్క్, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులకు స్థలం కేటాయించారు.
ఇకపై కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచే ప్రారంభించి, అక్కడే ఆపడానికి వీలుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. రైళ్ల నిర్వహణకు నాలుగు పిట్ లైన్లు నిర్మించారు. ఇక్కడ వాషింగ్, సేఫ్టీ చెక్ చేస్తారు. ఇంటర్మీడియటరీ ఓవర్ హాలింగ్ షెడ్ (ఐఓఎస్) నిర్మించారు. ఇక్కడ రైల్వే కోచ్‌లకు అవసరమైన మరమ్మతులు చేస్తారు.
చర్లపల్లిలో తొమ్మిది ప్లాట్‌ఫాంలను కలుపుతూ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుంది. ప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పికప్ అండ్ గో ప్రాంతం నుంచి మొదలయ్యే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆరు మీటర్ల వెడల్పుతో ఉంటుంది.
అయితే ఈ స్టేషన్‌కు చేరుకునేందుకు రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మహాలక్ష్మి నగర్, భరత్ నగర్ వైపు ఉన్న రోడ్లను 80-100 అడుగులకు విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు ప్రజారవాణా సదుపాయాలు తగినన్ని అందుబాటులో లేవని ప్రయాణికులు చెబుతున్నారు. ఆటో, ట్యాక్సీల్లోలాంటి ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి వస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించాల్సి ఉంది.
ఎంఎంటీఎస్ రెండో దశ కింద ఇక్కడికి రైళ్ల సంఖ్య మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS