SOURCE :- BBC NEWS
హైదరాబాద్ నార్సింగి సమీపంలోని పుప్పాలగూడ గుట్టల దగ్గర స్టోన్ క్రషర్ ఉంది. భోగి పండుగ నాడు ఉదయాన్నే ఆ గుట్టల వద్ద, క్రషర్‌ను అనుకుని గాలి పటాలు ఎగరేస్తున్నారు కొందరు యువకులు. గాలిపటాలతో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరుగుతున్న వారికి అకస్మాత్తుగా ఒక శవం కనిపించింది. వెంటనే చుట్టుపక్కలకు వ్యాపించిందా వార్త.
100 నంబరుకు ఫోన్ వచ్చింది. పోలీసులు వచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిసరాల గాలింపులో పడ్డాయి. చుట్టుపక్కల సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయోమోనని వెదుకుతున్న పోలీసులకు మరో శవం కనిపించింది. మొదటి శవానికి సుమారు 60 మీటర్ల దూరంలో ఈ శవం ఉంది. మొదటి మృతదేహం పురుషుడిది కాగా, రెండోది మహిళది.
”పురుషుడి శవంపై కత్తిపోట్లు ఉన్నాయి. బండరాయితో ముఖం పగులగొట్టి, పైన పెట్రోల్ పోసి తగలబెట్టారు. అక్కడకు 60 మీటర్ల దూరంలో మరో శవం కనిపించింది. ఆ శవం మహిళది. ఆ మృతదేహానికి కింద పైజమా లేదు.” అని ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాజేంద్ర నగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ మీడియాకు చెప్పారు.
సైబరాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మరణించిన మహిళ పేరు బిందు (25). ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఎల్బీ నగర్‌లో ఉన్నారు. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తరువాత ఆమెకు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తోన్న అంకిత్ సాకేత్ (25) అనే వ్యక్తితో పరిచయం అయింది.
”జనవరి 8వ తేదీన అంకిత్ ఆ మహిళను ఎల్బీ నగర్ నుంచి నానాక్ రాం గూడ తీసుకువచ్చి తన స్నేహితుల గదిలో ఉంచారు. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందన్నది మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం” అన్నారు పోలీసులు బీబీసీతో .
అసలేం జరిగింది?
”ఆ మహిళ తెలిసిన వ్యక్తుల దగ్గర ఉంటూ డబ్బు కోసం సెక్స్‌వర్కర్‌గా మారారు. ఆ క్రమంలోనే రాహుల్ కుమార్ సాకేత్ అనే వ్యక్తి ఆమెను రెండుసార్లు పిలిపించుకున్నారు. కానీ ఇటీవల ఆమెను పిలిపిచినప్పుడు వారిద్దరూ ఏకాంతంగా ఉన్నసమయంలో రాహుల్ వీడియో తీయడానికి ప్రయత్నించారు. దీనిని ఆ మహిళ వ్యతిరేకించడంతో గొడవ జరిగింది. తరువాత ఆమె అతన్ని బయటకు పంపేసింది. అంతేకాదు, తన దగ్గరకు రాహుల్‌ను తీసుకువచ్చిన అంకిత్‌కు వీడియో గురించి చెప్పింది. దీంతో వీడియో తీయడం సరికాదంటూ రాహుల్‌ని హెచ్చరించారు అంకిత్. ఆ గొడవ పెరిగి పెద్దదైంది” అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఈ గొడవ కారణంగానే బిందును, అంకిత్‌ను చంపేయాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. దీనికోసం రాజ్ కుమార్ సాకేత్, సుఖేంద్ర కుమార్ సాకేత్ అనే మరో ఇద్దరి సాయం తీసుకున్నాడని పోలీసుల అభియోగం.
ప్రధాన నిందితుడు 26 ఏళ్ల రాహుల్ కుమార్ సాకేత్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 22 ఏళ్ల రాజ్ కుమార్ సాకేత్ ఆఫీస్ బాయ్. 30 ఏళ్ల సుఖేంద్ర కుమార్ సాకేత్ హౌస్ కీపింగ్‌లో పనిచేస్తున్నాడు. వీరంతా మధ్య ప్రదేశ్‌లోని సిధి జిల్లాకు చెందిన వారు.
”బిందు, అంకిత్‌లను చంపడానికి వారు ఒక పథకం వేశారు. జనవరి 11వ తేదీన రాహుల్, అంకిత్‌కి కాల్ చేశాడు. బిందుతో గడపడానికి అంకిత్ ద్వారా 4 వేల రూపాయలకు మాట్లాడుకున్నారు. తరువాత బిందు, అంకిత్, రాహుల్ తనతో పాటూ ప్లాన్ చేసిన మరో ఇద్దరూ.. మొత్తం ఐదుగురూ కలసి ఆటోలో ఈ క్రషర్ వద్దకు చేరుకున్నారు.” అని సైబరాబాద్ పోలీసులు వివరించారు.
చంపే ఉద్దేశంతోనే..
గదిలో అయితే చంపడం సాధ్యపడదు కాబట్టి, క్రషర్ దగ్గరకు తీసుకువచ్చారనేది సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక అంచనా.
సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ముందుగా సుఖేంద్ర కుమార్ ఆ మహిళతో వెళ్లారు. ఆ సమయంలో రాహుల్ కుమార్, రాజ్ కుమార్ అంకిత్‌ను కొంచెం పక్కకు తీసుకువెళ్లి కత్తితో పొడిచారు. తరువాత తలపై బండరాయితో మోదారు. ఆ పెనుగులాటలో రాహుల్, రాజ్‌లకు కూడా గాయాలు అయ్యాయి.
అంకిత్‌ను చంపేసిన తరువాత ఆ ఇద్దరూ బిందు, సుఖేంద్ర కలిసి ఉన్న చోటుకు వచ్చారు. ఆమెను కూడా బండరాయితో మోది చంపేశారు. జనవరి 12వ తేదీ తెల్లవారుఝామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఆ ముగ్గురూ అక్కడి నుంచి బయలుదేరారు. నేరుగా మధ్యప్రదేశ్‌లోని తమ సొంతూరుకు వెళ్లిపోయారు.
కేసును విచారించిన పోలీసులు, మధ్య ప్రదేశ్‌కి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు.
”బిందు, అంకిత్ ఇద్దరూ చనిపోవడంతో వారి మధ్య ఏం సంబంధం ఉండేది అన్నది మనం నిర్ధరణగా చెప్పలేం. బహుశా రూములో చంపలేక వారిని క్రషర్ వద్దకు తీసుకువచ్చి ఉండొచ్చని భావిస్తున్నాం.” అని రాజేంద్ర నగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు .
నిందితులను ఎలా గుర్తించారని బీబీసీ ప్రశ్నించగా, ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్నామని’ పోలీసులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)