SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
హెర్మిట్ జాతి పీతలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను జపాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అనుమానితులను దక్షిణాన ఉన్న అమామి అనే ద్వీపంలో అదుపులోకి తీసుకున్నారని, వారంతా చైనాకు చెందిన వారని జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ ద్వీపంలో (స్పైరల్-షెల్డ్) శంకం వంటి శరీర ఆకారంగల పీతలు అరుదైనవి కావడంతో వీటిని సంరక్షణ జాబితాలో చేర్చారు.
సూట్ కేసుల నుంచి ఏదో శబ్దం వస్తోందని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని హోటల్ సిబ్బంది వారికి చెప్పారు. అప్పుడే వారు పీతలను అక్రమ రవాణా చేస్తున్నట్లు అర్ధమై సిబ్బంది అప్రమత్తమయ్యారని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు.
తరువాత అధికారులు దాదాపు 95 కిలోల బరువున్న కొన్ని వేల హెర్మిట్ జాతి పీతలు ఆ సూట్‌కేసులలో ఉన్నట్టు కనుగొన్నారు.
మూడో వ్యక్తి దగ్గరున్న మూడు సూట్‌కేసుల సెట్లో మరో 65 కిలోల పీతలు ఉన్నట్లు గుర్తించారు.


ఫొటో సోర్స్, Getty Images
వాటిని అమ్మడానికా, పెంపుడు జంతువులుగా మార్చుకోవడానికా లేక తినడానికి రవాణా చేస్తున్నారా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
‘మేం అన్నికోణాల్లో సమీక్షిస్తున్నాం’ అని బుధవారం నిందితుల అరెస్ట్ తర్వాత పోలీసు ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
అమామి ద్వీపంలోని వృక్ష, జంతు వైవిధ్యంలో భాగమైన హెర్మిట్ పీతలు “జాతీయ సంపద” అని పోలీసులు తెలిపారు.
ఈ పీతలు తమ మనుగడకోసం గవ్వలను వెతికి వాటిలో నివసిస్తాయి. అందుకే వాటికి హెర్మిట్ పీతలన్న పేరొచ్చింది.
ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యటక బీచ్‌లలో ఇవి కనిపిస్తాయి.
ఈ పీతల విలువ సుమారు 20 వేల యెన్( సుమారు రూ. 12 వేలు)లు ఉండొచ్చని జపాన్ టైమ్స్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)