SOURCE :- BBC NEWS

మహారాష్ట్ర పూనే తిరిగొచ్చిన వ్యక్తి శివం

ఫొటో సోర్స్, Rohini Bhosale

కొన్నేళ్ల కిందటే మరణించాడనుకున్న తమ కుటుంబ సభ్యుడిని మళ్ళీ చూస్తామనుకోలేదు శివం(అసలు పేరు కాదు) కుటుంబం.

ఉత్తరాఖండ్‌కు చెందిన శివం, ఎప్పుడో 12 ఏళ్ల కింద చనిపోయాడనుకుంటే, పుణెకు చెందిన ఓ ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు సమన్వయంతో కృషి చేసి, ఆయన కుటుంబంతో కలిపారు.

శివంను 2013 నాటి కేదార్‌నాథ్ వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తిగా అప్పట్లో ధ్రువీకరించారు.

కానీ, ఆయన మహారాష్ట్రలో ఉంటున్నట్లు ఇటీవలే గుర్తించారు.

ఆయన తిరిగి దొరకడంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
శివం ఏళ్ల తరబడి కనిపించకుండా పోయాడు. వరదలకు ముందే ఇంటి నుంచి తప్పిపోయినట్లు రోహిణీ చెప్పారు.

2021లో ఛత్రపతి శంభాజీ‌నగర్ జిల్లాలోని వైజాపూర్ తాలూకాలో ఒక దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఆలయంలో ఉంటున్న మధ్య వయస్కుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టు విచారణలో తేలింది. అంతేకాక ఆయన పోలియో బాధితుడనీ, కాళ్లు బలహీనంగా ఉండటం వల్ల నడవలేరనీ కోర్టు విచారణ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

ఆయన్ను ఏ ప్రశ్న అడిగినా “ఓం నమః శివాయ” అని మాత్రమే జవాబివ్వడం గమనించిన కోర్టు, చికిత్స కోసం ఆయన్ను పుణె యరవాడా జైలులోని మానసిక ఆరోగ్య విభాగానికి పంపాలని ఆదేశించింది.

అక్కడి సిబ్బంది ఆయనకు ‘శివం’ అనే పేరును పెట్టారు. ఆసుపత్రి సామాజిక సేవల విభాగం సూపరింటెండెంట్ రోహిణీ భోసలే చెప్పిన వివరాల ప్రకారం శివం ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. ఇక్కడ సిబ్బంది చెప్పింది వింటారు, చేయమన్న పని చేస్తారు.

2023లో ఆ యూనిట్‌కి రోహిణి సామాజిక సేవల పర్యవేక్షకురాలిగా చేరిన తర్వాత, శివం ఫైల్ చూసి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించారు.

ఆయనకు మరాఠీ రాక, హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించిన రోహిణి, తాను కూడా హిందీలో మాట్లాడడం మొదలుపెట్టారు.

ఆయన తన కుటుంబ వివరాలు చెప్పలేకపోయారు. అయితే, స్కూలు గురించి అడిగినప్పుడు కొన్ని వివరాలు చెప్పగలిగారు. తాను రూర్కీలోని ఓ స్కూల్లో చదివినట్లు శివం గుర్తు చేసుకున్నారు.

ఆ ఊరి పేరు, స్కూలు పేరును గూగుల్‌లో రోహిణి వెతకగా, హరిద్వార్ పరిసరాల్లో ఆ పేరున్న స్కూలు ఒకటి కనిపించింది. స్కూల్ ఫోటో చూడగానే శివం వెంటనే గుర్తుపట్టారు.

‘‘ఆ ఫోటో చూడగానే ఆయన కళ్లల్లో వెలుగు కనిపించింది’’ అని అన్నారు రోహిణి

2025 సెప్టెంబర్‌లో కోర్టు శివంను నిర్దోషిగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, BBC HINDI

రూర్కి, హరిద్వార్ పోలీసులను రోహిణి సంప్రదించగా, ఆ వ్యక్తిని వెతకడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆమెకు తెలిసింది. కానీ రికార్డుల్లో మాత్రం ఆయన 2013 వరదల్లో కొట్టుకుపోయినట్లు నమోదుకావడంతో విచారణ ఆగిపోయింది.

కుటుంబంతో మాట్లాడిన పోలీసులతో ఆయన తమ సోదరుడని, వరదల్లో కొట్టుకుపోయి చనిపోయి ఉంటారని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోటో చూసి గుర్తు పట్టింది కుటుంబం.

శివం వరదలకు ముందే ఇంటి నుంచి తప్పిపోయినట్లు రోహిణి చెప్పారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆయన ఇంటికి దూరంగా, ఒంటరిగా జీవిస్తున్నారు. ఉత్తరాఖండ్ నుండి వైజాపూర్‌కు ఎలా వచ్చారో ఆయనకు గుర్తులేదు.

2015లో వైజాపూర్‌లోని ఒక దేవాలయంలో వాచ్‌మన్‌గా పని చేయడం ప్రారంభించారు. అక్కడే తిని, అక్కడే నిద్రిస్తూ, ఆలయ ప్రాంగణంలో చెట్లు మొక్కలు చూసుకునేవారు.

అధికారులు శివం కుటుంబానికి వీడియో కాల్ చేశారు. కాల్ కలవగానే శివం ఆయన సోదరుడిని గుర్తించారు. సోదరుడు కూడా శివంను గుర్తు పట్టారు.

‘‘ఎన్నాళ్లు దూరంగా ఉన్నా, కలహాలు ఉన్నా రక్తసంబంధం మాత్రం మరిచిపోయేది కాదు’’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గోలోట్ అన్నారు.

శివం కుటుంబం పుణె వచ్చి ఆయన్ను కలుసుకుంది. కానీ, దొంగతనం కేసు విచారణలో ఉండటంతో ఆయనను వెంటనే విడుదల చేయలేకపోయారు.

2025 సెప్టెంబర్‌లో కోర్టు శివంను నిర్దోషిగా ప్రకటించింది. నవంబరులో ఆ ఉత్తర్వు ఆసుపత్రికి చేరడంతో ఆయన్ను కుటుంబానికి అప్పగించారు.

‘‘శివం, ఆయన కుటుంబం కలుసుకున్న క్షణం మాకు మరపురాని అనుభవం’’ అని రోహిణి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS