SOURCE :- BBC NEWS

 ప్రపంచంలోనే అతిపెద్దదైన విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్

ఫొటో సోర్స్, US Navy/Reuters

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. డిసెంబర్ 10న, వెనెజ్వెలా తీరంలో ఒక భారీ చమురు ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ ట్యాంకర్‌లో నిషేధిత చమురు రవాణా చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

దక్షిణ అమెరికా దేశమైన వెనెజ్వెలాకు అత్యంత సమీపంలో అమెరికా యుద్ధనౌకలను మోహరించింది. అక్కడి పడవల్లో మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ అమెరికా దాడి చేసింది. ఈ దాడితో వాటిలో అనేకమంది చనిపోయారు. ఇదిలా ఉండగా, మదురోను అరెస్టు చేయడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చినవారికి ప్రకటించిన రివార్డును ట్రంపు ప్రభుత్వం రెట్టింపు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Reuters

ఎవరీ నికోలస్ మదురో

వామపక్ష అధ్యక్షుడు హ్యూగో చావెజ్, యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజ్వెలా హయాంలో నికోలస్ మదురో ఎదిగారు. గతంలో బస్సు డ్రైవర్‌గా, యూనియన్ నాయకుడిగా పనిచేసిన మదురో, చావెజ్ స్థానంలో 2013 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు.

చావెజ్, మదురో గత 26 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ అసెంబ్లీ, న్యాయవ్యవస్థలోని ప్రధాన భాగాలు, ఎన్నికల మండలి సహా అనేక కీలక సంస్థలపై నియంత్రణ సాధించింది.

2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురోను విజేతగా ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్ ఉర్రుతియా ఓట్ల లెక్కింపులో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకొచ్చాయి.

ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనాపై ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించడంతో ఆమె స్థానంలో గొంజాలెజ్ నియమితులయ్యారు.

నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి, న్యాయబద్ధమైన, శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటానికి గాను మచాదోకు 2025 అక్టోబర్‌లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న ఆమె ప్రయాణ ఆంక్షలను ధిక్కరిస్తూ, ఈ అవార్డును స్వీకరించడానికి ఓస్లోకు వెళ్లారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలాపై ట్రంప్ ఎందుకు దృష్టి పెట్టారు?

లక్షలాది మంది వెనెజ్వెలా వాసులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ట్రంప్ చెప్పారు. వెనెజ్వెలా నుంచి అక్రమ వలసదారులు రావడానికి మదురో కారణమని ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, అణచివేత కారణంగా 2013 నుంచి వెనెజ్వెలా నుంచి పారిపోయిన 80 లక్షల మంది ప్రజల్లో ఈ అక్రమ వలసదారులు కూడా ఉన్నారని చెబుతున్నారు.

ట్రంప్ ఎటువంటి ఆధారాలు చూపించనప్పటికీ, జైళ్లు, మానసిక ఆశ్రయాలను ఖాళీ చేయించి మదురో వారిని అమెరికాకు బలవంతంగా పంపుతున్నారని ఆరోపించారు.

అమెరికాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాను, ముఖ్యంగా ఫెంటానిల్, కొకైన్‌ను అరికట్టడంపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోలెస్‌ అనే రెండు వెనెజ్వెలా ముఠాలను ‘విదేశీ ఉగ్రవాద సంస్థల’ జాబితాలో చేర్చారు.

వీటిలో రెండవ గ్రూపునకు మదురో స్వయంగా నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ప్రకటనను మదురో తీవ్రంగా ఖండించారు.

తనను పదవి నుంచి తొలగించడానికి, వెనెజ్వెలాలోని విస్తారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ‘మాదకద్రవ్యాలపై యుద్ధాన్ని’ ఒక సాకుగా ఉపయోగిస్తోందని మదురో ఆరోపించారు.

కార్టెల్ డి లాస్ సోలెస్ అనేది ఒక నాయకుడో లేదా అతని కింద పనిచేసే వ్యక్తులో ఉన్న వ్యవస్థీకృత ముఠా కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది వెనెజ్వెలా ద్వారా కొకైన్‌ను అనుమతించే అవినీతి అధికారులను పేర్కొనడానికి ఉపయోగించే పదం.

అమెరికా ఎందుకు పంపింది?

కరీబియన్ ద్వీపంలో 15,000 మంది సైనికులను, అలాగే విమాన వాహక నౌకలు, గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌకలు యుద్ధనౌకలను కూడా అమెరికా మోహరించింది. 1989లో పనామాపై అమెరికా దాడి చేసిన తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో అతిపెద్ద సైనిక మోహరింపుకు చెబుతున్న కారణం, అమెరికాలోకి ఫెంటానిల్, కొకైన్ అక్రమ రవాణాను నిరోధించడమే.

అమెరికా మోహరించిన నౌకల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ కూడా ఉంది.

వెనెజ్వెలా తీరంలో సముద్రంలో చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకునే ముందు, అమెరికా హెలికాప్టర్లు ఇక్కడి నుంచే బయలుదేరాయని చెబుతున్నారు.

వెనెజ్వెలా, ఇరాన్ నుంచి నిషేధిత చమురును రవాణా చేయడానికి ఈ ట్యాంకర్‌ను ఉపయోగిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. అయితే, ఈ చర్యను “అంతర్జాతీయ పైరసీ” గా వెనెజ్వెలా అభివర్ణించింది.

గత కొన్ని నెలల్లో, అమెరికా భద్రతా దళాలు అంతర్జాతీయ జలాల్లో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నాయనే ఆరోపణలతో 20కి పైగా నౌకలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా మృతి చెందారు.

నౌకల్లోని వ్యక్తులను ‘మాదకద్రవ్యాల ఉగ్రవాదులు’ లేదా నార్కో-ఉగ్రవాదులు గా అమెరికా అభివర్ణించింది, అయితే ఈ దాడులు “చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలపై” జరిగినవి కావని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 2న ఒకటి కాదు రెండు దాడులు జరిగాయి. మొదటి దాడిలో ప్రాణాలతో బయటపడినవారు రెండవ దాడిలో మరణించారు కాబట్టి అది ప్రత్యేకంగా పరిశీలనలో ఉంది.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) మాజీ చీఫ్ ప్రాసిక్యూటర్ బీబీసీతో మాట్లాడుతూ, అమెరికా సైనిక చర్య శాంతి సమయంలో పౌరులపై ప్రణాళికాబద్ధమైన, క్రమబద్ధమైన దాడుల వర్గంలోకి వస్తుందని అన్నారు.

దీనికి ప్రతిస్పందనగా, “మా తీరాలకు విషాన్ని తీసుకురావడానికి, ప్రజల జీవితాలను నాశనం చేయడానికి” ప్రయత్నిస్తున్న “ముఠాల” నుంచి అమెరికాను రక్షించడానికి సాయుధ పోరాట చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ చెబుతోంది.

నికోలస్ మదురోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాను వెనెజ్వెలా మాదకద్రవ్యాలతో నింపుతోందా?

ప్రపంచ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో వెనెజ్వెలా సాపేక్షకంగా చిన్న పాత్ర పోషిస్తోందని, ఇతర దేశాలలో తయారైన మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా అయ్యే ‘ట్రాన్సిట్ కంట్రీ’గా వ్యవహరిస్తోందని మాదకద్రవ్యాల నిరోధక నిపుణులు చెబుతున్నారు.

దాని పొరుగు దేశమైన కొలంబియా ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ ఉత్పత్తిదారు. కానీ దానిలో ఎక్కువ భాగం వెనెజ్వెలా ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అమెరికాకు చేరుతోంది.

యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ 2020 నివేదిక ప్రకారం, అమెరికా చేరే కొకైన్‌లో దాదాపు మూడొంతుల భాగం పసిఫిక్ మహాసముద్రం ద్వారా అక్రమంగా రవాణా అవుతుందని అంచనా. అయితే కొద్ది భాగం మాత్రమే కరీబియన్‌ సముద్రంలో హై-స్పీడ్ బోట్ల ద్వారా వస్తుంది.

అయినా, అమెరికా పసిఫిక్‌లో చాలా తక్కువ దాడులను, కరీబియన్‌లో అధికంగా దాడులను నిర్వహించింది.

తాము సెప్టెంబరులో లక్ష్యంగా చేసుకున్న నౌకలు ‘ఫెంటానిల్, ఇతర మాదకద్రవ్యాలు ఉన్న తెల్లటి పొడితో నిండి ఉన్నాయి’ అని ట్రంప్ అమెరికా సైనిక అధికారులకు చెప్పారు.

ఫెంటానిల్ అనేది హెరాయిన్ కంటే 50 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన సింథటిక్ డ్రగ్. అమెరికాలో ఓపియాయిడ్ అధిక మోతాదు మరణాలకు ప్రధాన కారణంగా మారింది.

అయితే, ఫెంటానిల్ ఎక్కువగా మెక్సికోలో ఉత్పత్తి అవుతోంది. దాని దక్షిణ సరిహద్దు గుండా దాదాపు భూమార్గం ద్వారానే అమెరికాలోకి ప్రవేశిస్తుంది.

యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ 2025 నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదికలో ఫెంటానిల్‌కు మూల దేశంగా వెనెజ్వెలాను పేర్కొనలేదు.

వెనెజ్వెలా

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలా చమురు ఎగుమతి ఎంత?

వెనెజ్వెలాకు వస్తున్న విదేశీ ఆదాయానికి చమురు ప్రధాన వనరు. ఈ రంగం నుంచి వచ్చే లాభాలు ప్రభుత్వ బడ్జెట్‌లో సగానికి పైగా ఉన్నాయి.

ప్రస్తుతం అది రోజుకు దాదాపు 9,00,000 బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. చైనా దాని అతిపెద్ద కొనుగోలుదారు. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు వెనెజ్వెలాలో ఉన్నాయని అమెరికా అంచనాలు సూచిస్తున్నప్పటికీ, వెనెజ్వెలా వాటిలో చాలా తక్కువగా ఉపయోగిస్తోందని ఒక నివేదిక పేర్కొంది.

యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఈఐఏ) ప్రకారం, సాంకేతిక, బడ్జెట్ సవాళ్ల కారణంగా 2023లో వెనెజ్వెలా ప్రపంచ ముడి చమురులో 0.8% మాత్రమే ఉత్పత్తి చేసింది.

చమురు ట్యాంకరు స్వాధీనం తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “ఈ చమురును మన వద్దే ఉంటుందని అనుకుంటున్నాను” అని చెప్పారు.

తమ దేశంలో ఉపయోగంలో లేని చమురునిల్వలను స్వాధీనం చేసుకునేందుకే మదురో ప్రభుత్వంపై అమెరికా చర్యలు తీసుకుందన్న వెనెజ్వెలా ఆరోపణలను అమెరికా ఖండించింది.

2024 ఆగస్టులో ఫ్లోరిడాలో వెనెజ్వెలా ప్రతిపక్ష పార్టీ ర్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలాపై అమెరికా దాడి చేస్తుందా?

నవంబర్ 21న మదురోతో ఫోన్‌లో తాను మాట్లాడినట్లు ట్రంప్ ధ్రువీకరించారు. అయితే ఏమి మాట్లాడారో చెప్పలేదు.

కానీ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, మదురో తన సన్నిహిత కుటుంబంతో వెనెజ్వెలా విడిచి వెళ్లిపోవడానికి ట్రంప్ ఒక వారం గడువు విధించారు.

నివేదిక ప్రకారం, ఈ ప్రతిపాదనను మదురో అంగీకరించలేదు.

గడువు ముగిసిన ఒక రోజు తర్వాత, వెనెజ్వెలా చుట్టూ ఉన్న వైమానిక ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

వెనెజ్వెలా మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై “గ్రౌండ్ ఆపరేషన్” చేస్తామని ట్రంప్ ఇప్పటికే బెదిరించారు, కానీ అలాంటి ఆపరేషన్ ఎలా జరుగుతుందో వివరించలేదు.

వెనెజ్వెలాకు అమెరికా దళాలను పంపే అవకాశాన్ని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ తోసిపుచ్చలేదు, “అధ్యక్షుడి పరిశీలనలో అనేక ఆప్షన్లు ఉన్నాయి” అని రిపోర్టర్లతో అన్నారు.

చమురు ట్యాంకర్ స్వాధీనం చేసుకున్న తర్వాత, ట్రంప్ ప్రభుత్వం అటువంటి మరిన్ని చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తోందని సన్నిహిత వర్గమొకటి బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS