SOURCE :- BBC NEWS

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
-
16 మే 2025, 20:31 IST
అప్డేట్ అయ్యింది ఒక గంట క్రితం
2002లో విశాఖలో ఇది ఏర్పాటైంది. 1969లో భారత నౌకదళంలో ప్రవేశించిన ‘కుర్సురా’ 31 ఏళ్లు దేశ రక్షణలో సేవలందించి, 2001లో రిటైర్ అయింది.
1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర కుర్సురా సబ్‌మెరైన్‌కు ఉంది. ఈ యుద్ధంలో ‘కుర్సురా’ ఎలాంటి పాత్ర పోషించింది?. అరేబియా సముద్రంలో గస్తీ విధులు నిర్వహించిన కుర్సురా, విశాఖ తీరంలో సబ్‌మెరైన్ మ్యూజియంగా ఎలా మారింది?


కుర్సురా విశేషాలు..
ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌మెరైన్‌కు ప్రస్తుతం ఎంవీఆర్ మూర్తి అసిస్టెంట్ క్యూరేటర్‌గా వ్యవహారిస్తున్నారు. ఇదే సబ్‌మెరైన్‌లో విధులు నిర్వహించారు మూర్తి. కుర్సురా సబ్‌మెరైన్ విశేషాలతో పాటు అది మ్యూజియంగా ఎలా మారిందో కూడా ఆయన బీబీసీకి వివరించారు.
“ఈ సబ్‌మెరైన్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇండియా. 22 టార్పెడోలను తీసుకెళ్లే సామర్థ్యమున్న ఈ సబ్‌మెరైన్ 1969 డిసెంబర్ 18న భారత నౌకదళంలోకి ప్రవేశించింది. 2001 ఫిబ్రవరి 27న సేవల నుంచి విరమణ పొందింది. కుర్సురా సబ్‌మెరైన్ గురించి ఎంవీఆర్ మూర్తి బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం..
- పొడవు 91.3 మీటర్లు, ఎత్తు 11.92 మీటర్లు.
- సముద్ర ఉపరితలంపై వేగం 15.5 నాట్స్, నీటిలో 9 నాట్స్
- సముద్ర ఉపరితలంపై బరువు 1,945 టన్నులు, నీటిలో 2,469 టన్నులు
- ఈ సబ్‌మెరైన్‌లో ఏడు కంపార్టుమెంట్లు ఉంటాయి.
- ఒకటో కంపార్ట్మెంట్లో టార్పెడోలు ఉంటాయి. మొత్తం 22 టార్పెడోలు ఉంటాయి.
- రెండో కంపార్ట్మెంట్లో ఆరు క్యాబీన్లు, డైనింగ్ హాల్ ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ డైనింగ్ హాలే ఆపరేషన్ థియేటర్‌గా మారిపోతుంది.

- మూడో కంపార్ట్మెంట్ సబ్‌మెరైన్‌కి ప్రాణం. సబ్‌మెరైన్‌లో ప్రతి చిన్న కదలిక ఇక్కడ రికార్డ్ అవుతుంది.
- నాలుగో కంపార్ట్మెంట్లో పెరిస్కోప్తో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది.
- ఐదో కంపార్ట్మెంట్లో సబ్‌మెరైన్‌లోని ఏ ఇంజిన్‌ను అయినా ఆపరేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.
- ఆరో కంపార్ట్మెంట్లో సబ్‌మెరైన్ స్పీడ్, డైరెక్షన్‌ని నియంత్రించే సిస్టం ఉంటుంది.
- ఏడో కంపార్ట్మెంట్లో 25 మంది పడుకునే సౌకర్యంతో పాటు టార్పెడోలను ఉపయోగించే వీలుంటుంది.

‘1971 పాకిస్తాన్ యుద్ధంలో కుర్సురా’
1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ‘కుర్సురా’ కీలక పాత్ర పోషించింది. ఆ యుద్ధంలో గస్తీ విధుల్లో పాల్గొంది.
సబ్‌మెరైన్ ప్రధాన లక్ష్యం శత్రు నౌకల కదలికలను గమనించడం, భారత జలాల్లోకి పాకిస్తాన్ నౌకదళం ప్రవేశించకుండా అడ్డుకోవడం. భారత నౌకదళం ఆపరేషన్లకు అవసరమైన సహాయం కూడా ‘కుర్సురా’ చేసింది.
ఐఎన్ఎస్ కుర్సురా డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ కావడంతో నీటి అడుగున ఎవరూ గుర్తించకుండా శత్రు జలాల్లోకి నిశ్శబ్ధంగా చొచ్చుకుపోయి, ఎక్కువ సమయం పనిచేయగలదు.
యుద్ధ సమయంలో పాకిస్తాన్ నౌకలపై నిఘా, వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది.

సబ్‌మెరైన్ నేరుగా దాడులు చేసినా, లేదంటే శత్రు నౌకలతో తలపడినా అవన్నీ రహస్యంగానే ఉంచుతారని మూర్తి చెప్పారు.
“మనకి మూడు వైపుల సముద్రం ఉండటంతో 365 రోజులు సబ్‌మెరైన్స్ విధులు నిర్వహిస్తూనే ఉంటాయి. అరేబియా సముద్రంలో కుర్సురా ఎక్కువగా నిఘా విధులు నిర్వహించేది.
అయితే అది ఎప్పుడు వెళ్లేది, ఎప్పుడూ వచ్చేది ఎవరికీ తెలియదు. రెండు నెలలకు సరిపడే 440 టన్నులు డీజీల్, ఇతర ఆహారం, నీరు అందులో ఉంటుంది” అని మూర్తి వివరించారు.

మ్యూజియంగా ఎలా మారింది?
2001 ఫిబ్రవరిలో విధుల నుంచి ‘ఐఎన్ఎస్ కుర్సురా’ రిటైర్ అయిన తర్వాత, దాన్ని మ్యూజియంగా మార్చాలనుకున్నారని మూర్తి చెప్పారు.
ఐఎన్ఎస్ కుర్సురా వంటి ఫాక్స్ ట్రాట్ సిరీస్ సబ్మెరైన్లు డీజిల్‌తో నడిచేవి. కుర్సురా రిటైరయ్యే సమయానికి రక్షణ రంగం ‘న్యూక్లియర్ సబ్‌మెరైన్స్’ వైపు దృష్టి సారించింది.

సబ్‌మెరైన్ దగ్గరికి వెళ్లడానికి సిబ్బందికి తప్ప బయటివారికి అనుమతి ఉండదు. ఎందుకంటే రేడియేషన్ ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ కుర్సురాను మ్యూజియంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పటి తూర్పు నావికా దళ చీఫ్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచా ప్రయత్నించారు.
ఇలా చేస్తే యువత దేశ రక్షణ రంగం వైపు ఆకర్షితులయ్యే అవకాశంతో పాటు, భారత నౌకదళం పనితీరు, గొప్పతనం కూడా వారికి తెలుస్తుందని భావించారు.

ఆరు కోట్లు ఖర్చు పెట్టి..
”రిటైర్ అయిన తర్వాత కుర్సురా సబ్‌మెరైన్‌ను విశాఖ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, అంత సులభంగా సాధ్యం కాలేదు. దానికి 18 నెలల సమయం పట్టింది. ఆ రోజుల్లోనే రూ. 6 కోట్లు ఖర్చు అయింది” అని అసిస్టెంట్ క్యూరేటర్ మూర్తి చెప్పారు.
సబ్‌మెరైన్‌ను సముద్రం నుంచి తీరానికి తీసుకొచ్చేందుకు ఏం చేశారంటే…
- ఇనుప తాళ్ల సహాయంతో సబ్‌మెరైన్‌ను తీరం వైపు లాగేందుకు ఐరన్ బాల్స్‌ను వెల్డింగ్ చేశారు.
- సబ్‌మెరైన్ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒరిగిపోకుండా బలమైన లోహపు దిమ్మెలతో వెల్డింగ్ చేశారు.
- సబ్‌మెరైన్ ఉంచడానికి 90 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతుతో ఫౌండేషన్ సిద్ధం చేశారు.
- టగ్స్ సహాయంతో తీరంలో ఇసుక తగిలే వరకు సబ్‌మెరైన్‌ను తీసుకువచ్చారు.
- ఈ తర్వాత ఇసుకలో ఉన్న సబ్‌మెరైన్‌ను అప్పటికే నిర్మించిన ఫౌండేషన్ పైకి తీసుకురావాలి. దీని కోసం హైడ్రాలిక్ వించ్‌ను ఏర్పాటు చేసి, బలమైన ఇనుప తీగలను దానికి కట్టి, సబ్‌మెరైన్‌ను తీరం వైపు లాగడం ప్రారంభించారు.
- కానీ, సబ్‌మెరైన్ ముందు భాగం ఇసుకలో కురుకుపోయింది. దీంతో సపోర్టర్స్ ఏర్పాటు చేసి సబ్‌మెరైన్‌ను కాస్త పైకి లేపి, ముందుకు లాగడం చేశారు.
- ఆ సమయంలో, మళ్లీ ఇసుక సబ్‌మెరైన్‌కు రెండు వైపులా చేరింది. ఎర్త్ మూవర్స్ ఉపయోగించి ఆ సమస్యను అధిగమించారు.
- ఆ తర్వాత అతి కష్టంపై హైడ్రాలిక్ వించ్, ఐరన్ వైర్స్ సహాయంతో ఫౌండేషన్ సమీపంలోకి సబ్‌మెరైన్‌ను తీసుకుని రాగలిగారు.

- హైడ్రాలిక్ జాక్స్ సహాయంతో సబ్‌మెరైన్‌ను ఫౌండేషన్‌పై ఉంచగలిగారు.
- సునామీలు, భూకంపాలు వస్తే సబ్‌మెరైన్ కదలకుండా ఉండాలని భారీ ఇనుప పట్టీలను (స్ట్రోమ్ సపోర్టర్ పేరుతో) వెల్డింగ్ చేశారు.
- అయితే, ఈ పనులు జరిగిన క్రమంలో సబ్‌మెరైన్‌లోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. అనంతరం, వాటిని బాగు చేశారు.
- తీరంలో ఉండటంతో తుప్పు పట్టకుండా యాంటీ రస్ట్ పెయింట్స్‌ను మూడుసార్లు వేశారు. అలా కుర్సురా సబ్‌మెరైన్‌ను 2002 ఆగస్ట్ 9 నాటికి మ్యూజియంగా మార్చారు.

సముద్రంలో సబ్‌మెరైన్, నేలపై మ్యూజియం
2002 ఆగస్టు 24 నుంచి ‘సబ్‌మెరైన్ మ్యూజియం’ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యూజియంలో రాడార్ రూమ్, సోనార్ రూమ్, కంట్రోల్ రూమ్, టార్పెడోలు, ఇతర ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి.
“ఈ మ్యూజియం చూసిన తర్వాత నెలల తరబడి ఇరుకైన ప్రదేశాల్లో తింటూ, పడుకుంటూ దేశం కోసం విధులు నిర్వహించిన రక్షణ సిబ్బంది గొప్పతనం తెలిసింది” అని ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన నిష్టా సాహు బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)