SOURCE :- BBC NEWS

బ్లాక్ మాంబా

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, జేమ్స్ గాలిగర్
  • హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాండెంట్
  • 3 మే 2025

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఉద్దేశపూర్వంగా రెండు దశాబ్దాలపాటు పాము విషాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం, సాటిలేని యాంటీవీనమ్ కనుగొనడానికి దారితీసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.

టిమ్ ఫ్రైడ్ రక్తంలో కనుగొన్న యాంటీబాడీలను జంతువులపై ప్రయోగించడం ద్వారా అవి వివిధ రకాల ప్రాణాంతక విషాల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుసుకున్నారు.

ప్రస్తుతం పాముకాటుకు చికిత్స, ఆ పాము జాతి ఆధారంగాఅందిస్తున్నారు. అయితే, ఫ్రైడ్ 18 ఏళ్లుగా చేస్తున్నఈ పనివల్ల అన్నిరకాల పాము కాటుల నుంచి రక్షించేలా యూనివర్సల్ యాంటివీనమ్‌ను రూపొందించేందుకు దోహదపడింది.

పాము కాటుల వల్ల ఏటా వేలాది మంది చనిపోతున్నారు. చాలామంది శాశ్వతంగా అంగ వైకల్యం పొందుతున్నారు.

పాము కాటుకు విరుగుడు కనిపెట్టాలనే తన మిషన్‌లో భాగంగా ఫ్రైడ్ 200కి పైగా పాము కాట్లు వేయించుకున్నారు. అలాగే, ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాముల నుంచి తయారు చేసిన విషాన్ని 700 సార్లకు పైగా ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకున్నారు.

ఈ ప్రాణాంతక పాముల్లో కోబ్రాలు, తైపాన్లు, నాగుపాములు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కోబ్రా కాటుకు రెండుసార్లు కోమాలోకి వెళ్లినప్పుడు తాను చాలా కుంగిపోయినట్లు మాజీ ట్రక్ మెకానిక్ అయిన ఫ్రైడ్ చెప్పారు.

” నేను చనిపోవాలనుకోలేదు. ఒక్క వేలిని కూడా పోగొట్టుకోవాలనుకోలేదు. అలాగని నా పనిని వదులుకోవాలనుకోలేదు.” అని ఫ్రైడ్ చెప్పారు.

ఫ్రైడ్ చర్యలు మిగిలిన ప్రపంచానికి మెరుగైన చికిత్సను అందించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ‘‘ఇది నాకో జీవన శైలిగా మారింది. పాము కాటు కారణంగా చనిపోయే ప్రజలను రక్షించడానికి నేనెంత చేయగలనో అంతా చేశాను’’. అంటారు ఫ్రైడ్

ప్రస్తుతం పాముల నుంచి తీసిన విషాన్ని గుర్రాలు వంటి జంతువుల్లోకి చిన్న మోతాదుల్లో ఎక్కించడం ద్వారా యాంటివీనమ్‌ను తయారు చేస్తున్నారు. ఈ జంతువుల రోగనిరోధక వ్యవస్థలు పాము విషంతో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటినే చికిత్సలాగా వాడుతున్నారు.

వీనమ్, యాంటివీనమ్ రెండింటికీ దగ్గర సంబంధంఉండాలి. ఎందుకంటే, ప్రాణాంతక కాటుకు చెందిన విషపూరిత పదార్థాలు ఒక జాతి నుంచి మరో జాతి మధ్య భిన్నంగా ఉంటాయి.

ఒకే రకమైన జాతుల్లో కూడా విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది. భారత్‌లో పాముల నుంచి తయారు చేసిన యాంటివీనమ్ శ్రీలంకలోని అదే రకమైన జాతులకు తక్కువగా పనిచేస్తుంది.

న్యూట్రలైజింగ్ యాంటీబాడీలుగా (తటస్థీకరణ ప్రతిరోధకాలుగా) పిలిచే ఒకే రకమైన రోగనిరోధక వ్యవస్థ కోసం పరిశోధకుల బృందం అన్వేషించడం ప్రారంభించింది.

విషాల్లో కేవలం ఒక్క భాగాన్నే కాకుండా, మొత్తం విషపదార్థాలకు చెందిన సాధారణ భాగాలను లక్ష్యంగా చేసుకునేలా ఆ రోగనిరోధక వ్యవస్థ ఉండాలని పరిశోధకుల బృందం భావించింది.

అప్పుడే బయోటెక్ కంపెనీ సెంటివ్యాక్స్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాకోబ్ గ్లాన్విల్లేకు టిమ్ ఫ్రైడ్ గురించి తెలిసింది.

” ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి విస్తృతమైన తటస్థీకరణ ప్రతినిరోధకాలను (న్యూట్రలైజింగ్ యాంటిబాడీలను) అభివృద్ధి చేసిన వారు ఉన్నారా? అంటే ఆయనే అని నాకనిపించింది..” అని జాకోబ్ తెలిపారు.

వెంటనే జాకోబ్ ఫ్రైడ్‌కు ఫోన్ చేశారు. మొదటిసారి ఫోన్ చేసినప్పుడే తమ పరిశోధనలకు ఫ్రైడ్ రక్తం కావాలని అడగడం కొంత ఇబ్బందిగా అనిపించిందని జాకోబ్ చెప్పారు.

టిమ్ ఫ్రైడ్

ఫొటో సోర్స్, Jacob Glanville

జాకోబ్ విన్నపాన్నిఫ్రైడ్ అంగీకరించారు.వారు చేసే పనికి నైతిక ఆమోదం లభించింది. ఎందుకంటే ఈ అధ్యయనంలో ఆయనకు మరింత విషం ఇవ్వకుండా కేవలం ఆయన రక్తాన్ని మాత్రమే తీసుకుంటున్నారు.

ఎలపిడ్స్‌పై ఈ పరిశోధన సాగింది. ఎలపిడ్స్ అనేవి కోబ్రాలు, తైపాన్లు, క్రైట్స్, మాంబాలు వంటి విషపూరితమైన పాములకు చెందిన రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందినవి.

ఎలపిడ్స్ విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. అవి కాటేయడం వల్ల బాధితులకు పక్షవాతం వస్తుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమయ్యే కండరాల వ్యాకోచం నిలిచిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది.

భూమిపై అత్యంత ప్రమాదకరమైన పాములుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 19 రకాల ఎలపిడ్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు.

రెండు రకాలైన న్యూరోటాక్సిన్‌లను లక్ష్యంగా చేసుకునే రెండు విస్తృతమైన తటస్థీకరణ ప్రతినిరోధకాలను (న్యూట్రలైజింగ్ యాంటిబాడీలను) గుర్తించినట్టు ‘సెల్’ మేగజైన్‌లో వివరించారు. వాటికో ఔషధాన్ని కలిపి యాంటివీనమ్ కాక్‌టైల్ తయారు చేసేందుకు ఉపయోగించారు.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో, 19 రకాల విషపూరితమైన పాములలో 13జాతులకు చెందిన ప్రాణాంతక విషాల నుంచి జంతువులను ఆ కాక్‌టైల్ కాపాడింది.

ఇది తిరుగులేని రక్షణ అని డాక్టర్ గ్లాన్విల్లే అన్నారు. ప్రస్తుతం ఎలాంటి యాంటీవినమ్ లేని ఎలపిడ్స్‌ బారి నుంచి ఇది రక్షిస్తుందన్నారు.

యాంటిబాడీలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనా బృందం పనిచేస్తోంది. నాలుగవ కాంపోనెంట్‌ను కలిపితే, అన్ని ప్రాణాంతక పాము విషాల నుంచి రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

యూనివర్సల్ యాంటివీనమ్

ఫొటో సోర్స్, Jacob Glanville

రక్త పింజర లాంటి పాములు, నాడీ వ్యవస్థను కాకుండా మనిషి రక్తాన్ని విషపూరితం చేస్తాయి. పాము విషాలలో విస్తృతమైన విభజన ఉంది. వీటిల్లో కణాలను నిర్వీర్యం చేసే కైటో‌టాక్సిన్లు కూడా ఉన్నాయి.

రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో విషపూరితమైన ప్రతి పాము నుంచి సమర్థవంతంగా బయటపడేలా ఉంటామని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ పీటర్ వాంగ్ అన్నారు.

ఫ్రైడ్ రక్త నమూనాలతో తమ పరిశోధన కొనసాగిస్తామని తెలిపారు.

”టిమ్ ఫ్రైడ్ యాంటిబాడీలు నిజంగా చాలా అసాధారణమైనవి. తన రోగనిరోధక వ్యవస్థకు విస్తృతమైన గుర్తింపును ఆయన నేర్పించారు.” అని ప్రొఫెసర్ వాంగ్ అన్నారు.

ఎలపిడ్స్‌కు, రక్త పింజర్లకు ఒకే రకమైన ఇంజెక్షన్ పనిచేసేలా ఒకే యాంటివీనమ్‌ను రూపొందించడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS