SOURCE :- BBC NEWS

ఇబాద్ ఫాల్కే

ఫొటో సోర్స్, Eebad Phalke

హనీమూన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలనే అంశంపై మొదలైన వివాదంలో అల్లుడిపై మామ యాసిడ్ పోసిన ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో జరిగింది.

పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, హనీమూన్‌కు కశ్మీర్‌కు వెళ్లాలా? మక్కా వెళ్లాలా? అనే అంశంపై మామా అల్లుళ్లు గొడవ పడ్డారు. ఇది అల్లుడిపై మామ యాసిడ్‌తో దాడి చేసేదాకా వెళ్లింది.

ఈ దాడిలో గాయపడిన బాధితుడు ఇబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మామా, అల్లుళ్ల మధ్య ఇతర అంశాల్లోనూ మనస్పర్థలు ఉన్నాయని ఇబాద్ కుటుంబీకులు తెలిపారు.

నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇబాద్‌ను చంపేస్తానంటూ హెచ్చరించినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడి కొడుకు కూడా తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వివాహం

ఫొటో సోర్స్, Getty Images

హనీమూన్ వివాదం ఏంటి?

జులై 23న అయేషా, ఇబాద్ అతీక్ ఫాల్కేల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా అయేషా తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.

పెళ్లి తర్వాత దావత్-ఎ-వలీమా జరుగలేదు. ఈ కారణంగా అయేషాను అత్తింటివారు ఇంకా తమ ఇంటిని ఆహ్వానించలేదు.

అయేషా ఇంకా చదువుకుంటున్నందున రెండు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయని ఇబాద్ కుటుంబీకులు చెప్పారు. నవంబర్‌లో ఆమె పరీక్షలు జరిగాయి.

ఈ సమయంలో ఇబాద్, అయేషా కలుసుకున్నారు. ఆ తర్వాత వలీమా తేదీని నిర్ణయించారు. డిసెంబర్ 25న వలీమా జరగాల్సి ఉంది.

తన భార్యతో కలిసి కశ్మీర్ వెళ్లాలని కోరుకున్న ఇబాద్, ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు.

కానీ, అయేషా తండ్రి జకీ కోథల్‌ దీన్ని వ్యతిరేకించారు.

తన కూతురు, అల్లుడు ఇద్దరూ మక్కామదీనాకు వెళ్లి ఆశీర్వాదం పొందాలని ఆయన భావించారు. ఈ మేరకు అల్లుడిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

అయేషా, ఇబాద్‌లు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. దీంతో మామా అల్లుళ్ల మధ్య తరచుగా వాగ్వాదం జరిగేది. జకీ కోథల్ ఒక దశలో తన కూతురి పెళ్లిని రద్దు చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈ గొడవ అంతా డిసెంబర్ 18 నాటికి హింసాత్మకంగా మారింది.

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

ఇబాద్ కుటుంబం ఏమంటోంది?

అయేషా తండ్రి జకీ కోథల్, భర్త ఇబాద్‌ మధ్య గొడవ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇబాద్ బుధవారం రాత్రి 8 గంటలకు తన ఇంటికి వెళ్తుండగా దారిలో జకీ ఆయన్ను ఆపారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, చివరకు అల్లుడిపై జకీ యాసిడ్ పోశారు.

ఈ ఘటనలో ఇబాద్ ముఖం బాగా గాయపడింది. ఘటనాస్థలంలో ఉన్న కొందరు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇబాద్‌పై దాడి చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించాడని జకీ కోథల్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇబాద్ కుటుంబాన్ని కలిసిన బీబీసీ ప్రతినిధి, యాసిడ్ దాడి నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

”హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లాలనే దానిపై గొడవ మొదలైంది. జకీ కోథల్‌కు తన కూతురు అత్తింట్లో ఉండటం ఇష్టం లేదు. కుటుంబం నుంచి విడిపోయి, భార్యతో కలిసి ఉండాలంటూ ఇబాద్‌ను ఆయన ఒత్తిడి చేస్తున్నారు” అని కుటుంబీకులు చెప్పారు.

తల్లిదండ్రుల నుంచి విడిపోతానని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే అయేషాను పంపిస్తానని జకీ డిమాండ్ చేసేవారని వారు తెలిపారు. ఈ ప్రతిపాదనకు అయేషా, ఇబాద్ ఒప్పుకోలేదని చెప్పారు.

దీంతో కోపగించుకున్న జకీ కోథల్, పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించారని తెలిపారు.

అయేషా పెళ్లిని అబద్ధపు పెళ్లిగా చెప్పాలంటూ తన భార్యపై కూడా జకీ కోథల్ ఒత్తిడి తెచ్చారు. లేకపోతే విడాకులు ఇస్తానంటూ భార్యను బెదిరించారు.

ఈ నేపథ్యంలో అయేషా, ఆమె తల్లి అక్టోబర్‌లో జకీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో వారిద్దరినీ ఇంట్లో నుంచి బయటకు పంపారు జకీ. ఇలా చేయడం వల్ల క్రిస్మస్ రోజు జరగాల్సిన ఇబాద్, అయేషాల వలీమా రద్దు అవుతుందని జకీ భావించారు.

అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారమే కార్యక్రమం జరగాలని అయేషా, ఆమె తల్లి పనులు మొదలు పెట్టడంతో వారిద్దరిని జకీ మరోసారి బెదిరించారు. చివరకు ఈ గొడవంతా ఇబాద్‌పై యాసిడ్ దాడికి దారి తీసింది.

ఘటన తర్వాత పారిపోతూ ”ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా మిగిలే ఉంది” అంటూ ఇబాద్‌ను జకీ హెచ్చరించినట్లు కుటుంబీకులు తెలిపారు.

నిందితుడి కొడుకు మొహమ్మద్ జకీ కోథల్ కూడా తన తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముంబయి పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏం చెప్పారు?

యాసిడ్ దాడికి సంబంధించిన సమాచారం అందగానే బజార్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు బీబీసీకి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్ఆర్ గౌడ్ తెలిపారు.

”హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలన్న విషయంలో గొడవ జరిగింది. జకీ కోథల్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలిస్తున్నాం” అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)