SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
షేక్ హసీనాను స్వదేశానికి తిరిగి పంపించాలంటూ భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లేఖ రాసింది.
బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు మొహమ్మద్ తౌహిద్ హుస్సేన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు, ఆ దేశ హోం శాఖ సలహాదారు మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి కూడా దీనిపై ప్రకటన చేశారు.
ఇరు దేశాల మధ్య ఉన్న ‘అప్పగింత ఒప్పందం’ ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి తీసుకురావొచ్చని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.
బంగ్లాదేశ్ ఏం చెప్పింది?
బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ “మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి పంపాలని దౌత్య ప్రక్రియ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం పంపాం. మేం ఆమెను ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నాం. ఆమె తిరిగి రావాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.
అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. షేక్ హసీనాను తిరిగి పంపాలని విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశామని చెప్పారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజేబీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు.
అక్టోబర్ 17న బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వును అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.
బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమంలో వందలాది మంది చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసన షేక్ హసీనా రాజీనామాకు దారితీసింది.
ఒప్పందం ఏంటి?
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. 2013 జనవరి 28న ఈ ఒప్పందం కుదిరింది.
అప్పటి భారత హోం మంత్రి సుశీల్ కుమార్ శిందే , బంగ్లాదేశ్ హోం మంత్రి మొహియుద్దీన్ ఖాన్ అలంగీర్ ఢాకాలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
అయితే, ఒప్పందంలోని ఆర్టికల్ 6లో ఒక వ్యక్తిని అప్పగించలేని పరిస్థితులను పేర్కొనే కొన్ని నిబంధనలు ఉన్నాయి.
రాజకీయపరమైన అభియోగాలు, నేరాలు ఎదుర్కొంటున్న వారికి ఈ ఒప్పందం వర్తించదని, హత్య, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు మాత్రమే దీని పరిధిలోకి వస్తారు అని స్పష్టంగా పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)