SOURCE :- BBC NEWS

శ్రీకాళహస్తి మహిళ లక్ష్మి

“నా పేరు లక్ష్మి. నాకు సాయం చేయండి. కువైట్‌లో ఇరుక్కుపోయాను. రెండున్నర లక్షలు కడితే గానీ నన్ను పంపమంటున్నారు. గదిలో బంధించి హింసిస్తున్నారు” అంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన లక్ష్మి ఈ ఏడాది డిసెంబర్ 17న కువైట్ నుంచి తన బంధువులకు ఒక సెల్ఫీ వీడియో పంపారు. ఈ వీడియోలో తన కష్టాలు చెప్పుకున్నారు.

అయితే, బంధువులు వెంటనే స్పందించడం, స్థానిక నేతలు, అధికార యంత్రాంగం చొరవతో ఆమె డిసెంబర్ 27న స్వస్థలం చేరుకుంటున్నారని పోలీసులు చెప్పారు.

పది రోజుల్లోనే బాధితురాలు తిరిగి స్వస్థలానికి ఎలా చేరుకుంటున్నారు? అసలేం జరిగింది? ఎవరెవరు సాయం చేశారు? అనే వివరాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగిందంటే.. ?

యల్లంపల్లి లక్ష్మి స్వస్థలం తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికతో శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్ నగర్‌లో అద్దె ఇంట్లో ఆమె కుటుంబం నివసిస్తోంది. 2024 నవంబర్ 5న లక్ష్మి కువైట్ వెళ్లారు. అక్కడ నెలకు పైగా పనిచేసిన తర్వాత డిసెంబర్ 15న మోహన్ అనే తమ బంధువుకు ఆమె కాల్ చేసి తన కష్టాలు చెప్పారు.

తర్వాత డిసెంబర్ 17న ఆయనకే తన బాధలు చెబుతూ 4 నిమిషాల సెల్పీ వీడియో పంపారు.

ఆ వీడియోలో లక్ష్మి ఏం చెప్పారంటే..

“నన్ను మొదట పెట్టిన ఇంట్లో ఘోరంగా కొట్టేవారు. ఒక పిల్లవాడికి మతిస్థిమితం లేదు. పిల్లాడి వెంటే తిరుగుతూ ఉండాలి. నాకు కాళ్లు నొప్పులు వచ్చాయి. సమయానికి తిండి లేదు, నిద్ర లేదు. ఆరోగ్యం పాడైంది. ఏజెంట్లకు కాల్ చేసి ఆరోగ్యం సరిగా లేదు ఆస్పత్రికి తీసుకెళ్లండని అడిగితే నాటకాలు ఆడుతున్నావని బెదిరించారు.’’

‘‘మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం పెడుతున్నారు. ముందు రోజు వండిన అన్నం ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి పెడుతున్నారు. 13 రోజులు ఓపిక పట్టాను. అయినా నావల్ల కావడం లేదు. ఇంటికి ఫోన్ కూడా చేసుకోనివ్వడం లేదు. నన్ను ఆఫీసు వాళ్లకు అప్పగించండని అంటే నిన్ను వేరే ఇంటికి పంపిస్తాg అంటున్నారు. ఇంటికి పంపమని అడిగితే తీవ్రంగా కొట్టారు” అని అందులో చెప్పారు.

సుచిత్ర

‘అమ్మ లేకపోతే మేమూ ఉండలేం’

లక్ష్మికి భర్త లేరు. ఇద్దరు కుమార్తెలు. మెదటి అమ్మాయికి పెళ్లి చేశారు. నెల్లూరులో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఆమె చదువు బాధ్యతలు తల్లి లక్ష్మినే చూసుకుంటున్నారు. రెండో కుమార్తె సుచిత్రను తిరుపతిలోని పద్మావతీ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదివిస్తున్నారు.

“మాకు నాన్న లేరు. ఏమి కావాలన్నా అమ్మ కష్టపడితేనే మాకు వస్తుంది. అక్కడ వాళ్ళు టార్చర్ చేస్తున్నారని వచ్చేస్తాను అంటోంది. అమ్మకు అన్నం కూడా పెట్టడం లేదంట. గదిలో పెట్టి కొడుతున్నారంట. అమ్మకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అన్నీ తెలిసి వాళ్ళు ఒక్క పూటే అన్నం, కొన్ని నీళ్లే ఇస్తున్నారట. వాష్ రూమ్ వెళ్లడానికి కూడా టైం ఇవ్వడం లేదంట. వాళ్లు పెట్టే టార్చర్‌కి అమ్మకి జ్వరం వచ్చి పడుకున్నా టాబ్లెట్స్ ఇవ్వలేదంట.” అని చిన్న కూతురు సుచిత్ర చెప్పారు.

బయటకు వెళుతున్న సమయంలో లక్ష్మిని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్తున్నారని, చిన్న విషయాలకు కూడా వేధిస్తున్నారని, ఒకవేళ తాను తిరిగి రాలేకపోతే జాగ్రత్తగా ఉండాలని అమ్మ చెప్పారని సుచిత్ర తెలిపారు.

తండ్రి చిన్నతనంలోనే చనిపోయారని, తను భరించిన కష్టాలను తాము పడకుండా ఉండేందుకు, కష్టపడి చదివించడానికి తల్లి కువైట్ వెళ్లారని, అక్కడ వేధింపులు భరించలేక ఫోన్ చేశారని సుచిత్ర చెప్పారు.

‘‘అమ్మ మా కోసం, మేం మా అమ్మ కోసమే ఉన్నాం. అమ్మ లేకపోతే ఇక మేము కూడా ఉండాలనుకోం. అమ్మ కష్టపడి మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చింది. అమ్మ ఎలాగైనా తిరిగి ఇల్లు చేరితే చాలు” అని కోరుకున్నారు సుచిత్ర.

లక్ష్మి ఇల్లు

తల్లి రెండో పెళ్లి చేసుకున్నా..

తండ్రి లేకపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకున్నారని, తమ దగ్గర డబ్బు లేకపోవడంతో ఆయన కూడా వెళ్లిపోయారని సుచిత్ర చెప్పారు.

పదో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి కువైట్ వెళ్లిన తల్లి, ఇప్పుడు మూడోసారి వెళ్లారని తెలిపారు.

“రెండోసారి మా అమ్మ పెళ్లి చేసుకున్నారు. మా స్కాలర్‌షిప్ డబ్బులు పడడానికి తండ్రిగా ఆయన వివరాలు ఇచ్చారు. ఆ డబ్బులు పడుతున్నా, పడలేదని చెప్పి మొత్తం ఆయనే వాడుకున్నారు. ఫీజు కడితేనే లోపలికి రా అని మా అక్కని కాలేజీ వాళ్ళు బయటకు పంపించేశారు. మా ఫీజుల కోసం వేరే ఎవరినీ అడగలేక అమ్మ కువైట్ వెళ్లారు.” అని సుచిత్ర చెప్పారు.

శ్రీకాళహస్తి మహిళ లక్ష్మి

ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి…

లక్ష్మి వీడియో తర్వాత ఆమె చిన్న కూతురు సుచిత్ర కూడా అమ్మను కాపాడండి అంటూ ఈ నెల 17న ఒక సెల్ఫీ వీడియో పెట్టారు.

తిరుపతిలోని శ్రీనివాసులు అనే ఏజెంట్ ద్వారా లక్ష్మి కువైట్ వెళ్లారని, మొదట్లో వారు స్పష్టమైన సమాచారం ఇచ్చేవారని ప్రస్తుతం ఫోన్‌లో మాట్లాడటం కూడా కుదరడం లేదని లక్ష్మి అల్లుడు తులసీరాం బీబీసీతో చెప్పారు.

”స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాం. ఏజెంట్లు స్పందించారు. విమానం టికెట్ బుక్ చేసి తిరిగి పంపిస్తామని చెబుతున్నారు. మొదట్లో మాకు సమాచారమంతా క్లారిటీగా చెప్పేవాళ్లు. ఇప్పుడు ఏ సమాచారం ఇవ్వడం లేదు. ఫోన్ మాట్లాడడానికి కూడా లేదు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడాలంటే వాళ్లే చూపించి మాట్లాడిస్తున్నారు.” అని చెప్పారు.

లక్ష్మి, సుచిత్ర వీడియోలు వైరల్ అవడంతో పాటూ.. తర్వాత రోజే స్థానికుల సాయంతో లక్ష్మి కూతురు సుచిత్ర, మోహన్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిశారు.

ఎమ్మెల్యే ఈ విషయం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన లోకేష్, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

ఆ తర్వాత లక్ష్మి కుటుంబ సభ్యులకు తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. డిసెంబర్ 23 సోమవారంనాడు వారు తిరుపతి ఎస్పీని కలిసిన తర్వాత, ఆమెను కువైట్ పంపించిన స్థానిక ఏజెంట్ శ్రీనివాసులుతో పోలీసులు మాట్లాడారు. లక్ష్మిని తిరిగి తీసుకువచ్చేలా చూడాలని ఆదేశించారు.

ఆయన కువైట్‌‌లోని ఏజెంట్‌తో మాట్లాడి ఆమెకు విమాన ప్రయాణ టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు తీసుకొస్తున్నారు.

తిరుపతిలోని ఏజెంట్ శ్రీనివాసులతో కూడా బీబీసీ డిసెంబర్ 25న మాట్లాడింది. లక్ష్మిని కువైట్‌లో వేధించడం అబద్ధం అని ఆయన చెబుతున్నారు.

”ఆమెను భారత్‌కు తీసుకొస్తున్నాం. అక్కడ టార్చర్ పెట్టారు అనేది అవాస్తవం. ఆమె అక్కడ ఉండలేక ఇక్కడకు రావడానికి అలా సెల్పీ వీడియో పెట్టారు. పోలీసులు నన్ను పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఏజెంట్ ఇంట్లో ఉన్నారు. తిరిగి రావడానికి సిద్దంగా ఉన్నారు. విమాన టికెట్లు బుక్ చేశాం. ఆమె భారత్‌కు వస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు” అని అన్నారు.

లక్ష్మి తిరిగి వస్తున్న విషయాన్ని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కూడా చెప్పారు.‘‘లక్ష్మిని తిరిగి భారత్‌కు రప్పిస్తున్నాం. ప్లైట్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి’’ అని బీబీసీకి చెప్పారు.

లక్ష్మి బంధువు మెహన్‌కు కూడా ఫోన్ చేసిన పోలీసులు, డిసెంబర్ 27న ఉదయం లక్ష్మి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS