SOURCE :- BBC NEWS
- రచయిత, దేవీనా గుప్తా
- హోదా, దిల్లీ
-
7 జనవరి 2025
వణికించే డిసెంబరు మాసపు చలిలో ఓ రోజు ఉదయం దిల్లీ పొరుగున్న రద్దీగా ఉండే ప్రాంతంలో మూడంతస్తుల భవనం ముందు రంగురంగుల చీరలు, వెచ్చని శాలువాలు, ఉన్ని టోపీలు ధరించిన మహిళలు గుమికూడి కనిపిస్తున్నారు. ఆ భవనంలో భారతదేశంలో మహిళలు నిర్వహిస్తున్న పురాతన సహకార సంస్థకు చెందిన యూనిట్ ఒకటి పనిచేస్తోంది.
ది కో-ఆపరేటివ్, ఇప్పుడు దీన్ని శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ అని పిలుస్తున్నారు. దీనిని 1959లో ముంబయి (అప్పటి బొంబాయి)లో ఏడుగురు గృహిణులు భారతీయ భోజనంతోపాటు తీసుకునే పాపడ్ (అప్పడాల) తయారీ సంస్థగా ప్రారంభించారు.
అరవై ఐదు సంవత్సరాల తరువాత. ముంబాయిలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 45,000 కంటే ఎక్కువ మంది మహిళా సభ్యులతో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ 1600 కోట్ల రూపాయలు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందీ సంస్థ.
ఈ సంస్థలోని మహిళలు ఎక్కువమంది ఇంటి నుంచే పనిచేస్తుంటారు. వీరు డిటర్జెంట్లు, మసాలాలు, చపాతీలాంటివి తయారుచేస్తున్నప్పటికీ వీరందరికీ ప్రియమైన ఉత్పత్తి మాత్రంఅప్పడాలకు ప్రసిద్ధిగాంచిన లిజ్జత్ బ్రాండే.
“లిజ్జత్ మాకు ఒక గుడిలాంటిది. ఇది మాకు డబ్బు సంపాదనకు, మా కుటుంబాలను పోషించడానికి సాయపడుతోంది’’ అని దిల్లీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న70 ఏళ్ల లక్ష్మి చెప్పారు.
లక్ష్మి తన భర్త చనిపోవడంతో నాలుగు దశాబ్దాల క్రితం ఈ సహకార సంఘంలో చేరారు.
“నేను పెద్దగా చదువుకోలేదు. ఏం చేయాలో నాకు తెలియదు. అప్పుడు మా పొరుగింటివారు లిజ్జత్ గురించి నాకు చెప్పారు,” ఆమె చెప్పారు.
మహిళా సహకార సంఘంలో చేరాలనే నిర్ణయం తన జీవితాన్ని మార్చేసిందని ఆమె అన్నారు. ఆమె ఇప్పుడు ఆ కేంద్రంలో పనిచేసే 150 మంది మహిళలను పర్యవేక్షిస్తుంటారు.
లక్ష్మి వంటి మహిళలకు, ఇంట్లో పని చేసుకుంటూనే..మంచి ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందిస్తోందీ సహకార సంస్థ.
ప్రతిరోజూ ఉదయం, మహిళా సభ్యులు సహకార సంస్థ అద్దెకు తీసుకున్న బస్సులో సమీపంలోని లిజ్జత్ కేంద్రానికి వెళతారు. అక్కడ, పప్పులు, మసాలా దినుసులతో కలిపిన పిండిని తీసుకుని, ఇంటివద్ద అప్పడాలు చేయడానికి తీసుకెళతారు.
“నేను ఈ పిండి ఇంటికి తీసుకెళతాను. ఇంటిపనులు, పిల్లలు పనులన్నీ అయ్యాక మధ్యాహ్నంనుంచి అప్పడాల కర్ర, పీట తీసుకుని అప్పడాలు చేయడానికి కూర్చుంటాను’’ ” అని లక్ష్మి చెప్పారు. .
మొదట్లో, ఒక కిలో అప్పడాలు తయారు చేయడానికి నాలుగు-ఐదు గంటలు పట్టిందని, అయితే ఇప్పుడు కేవలం అరగంటలోనే చేస్తున్నానని ఆమె చెప్పారు.
ముంబైలోని ప్రధాన కార్యాలయం పప్పులు, మసాలాలు, నూనె వంటి ముడి పదార్థాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి, పిండిని కలిపి దేశవ్యాప్తంగా ఉన్న లిజ్జత్ కార్యాలయాలకు పంపుతుంది.
మహిళలు ఇంట్లోనే అప్పడాలు తయారుచేసి, ఆరబెట్టిన తర్వాత, ప్యాకింగ్ కోసం వాటిని తిరిగి కేంద్రానికి అందజేస్తారు. లిజ్జత్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఈ ఉత్పత్తులను రిటైల్ షాపులకు చేరవేస్తుంది.
ఈ సంస్థ స్థాపించనప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా అభివృద్ధి చెందింది.
స్వతంత్ర భారతదేశం 1950వ దశకంలో దేశ పునర్నిర్మాణంపై దృష్టిసారించింది. చిన్న స్థాయి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధితోపాటు నగరాలలోని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను ప్రోత్సహించే విషయంలో సమతుల్యత సాధించడానికి ప్రయత్నించింది.
అది దేశంలోని చాలా కర్మాగారాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న కాలం కూడా. అప్పటి సాంప్రదాయిక, పితృస్వామ్య సమాజంలో స్త్రీలు చదువుకోవడం, పని చేయడం పెద్ద సవాల్‌గా ఉండేది.
లిజ్జత్‌ను స్థాపించిన మహిళల బృందం – జస్వంతిబెన్ జమ్నాదాస్ పొప్పట్, పార్వతీబెన్ రాందాస్ తోడాని, ఉజంబెన్ నారందాస్ కుండలియా, బానుబెన్ ఎన్ తన్నా, లగుబెన్ అమృత్లాల్ గోకాని, జయబెన్ వి విఠలానీ, దివాలీబెన్ లుక్కా … వీరంతా 20, 30 ఏళ్ల వయసు మధ్యన ఉండేవారు, కిక్కిరిసిపోయిన నివాసాలతో ఉండే ముంబాయిలో తమ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గాలను అన్వేషించేవారు.
వీరిది చాలా సాదాసీదా ఆలోచనే. తరతరాల నుంచి మహిళలు అందిపుచ్చుకుంటున్న వంటనైపుణ్యం ద్వారా ఇంటి నుంచే డబ్బు సంపాదించాలన్నదే ఆ ఆలోచన.
ఆలోచనైతే వచ్చిందికానీ, అందుకు కావలసిన వస్తువులు కొనడానికి వారి వద్ద డబ్బు లేదు. అందుకే సామాజిక కార్యకర్త ఛగన్‌లాల్ కర్మాషీ పరేఖ్ నుంచి ఆర్థిక సహాయం కోరారు.
ఆయన వారికి 80 రూపాయల రుణం ఇచ్చారు. ఆ కాలంలో వ్యాపారం ప్రారంభించడానికి ఈ డబ్బు సరిపోయేది.
అయితే తాము తయారు చేసిన అప్పడాలను కొనేవారు ఎవరూ లేరని వారికి తొందరగానే అర్థమయింది. దీంతో వారు మళ్లీ తాము బప్పా (నాన్నా అని అర్ధం) అని పిలిచే పరేఖ్ సాయం కోరాల్సివచ్చిందని సహకార సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు స్వాతి పరాద్కర్ చెప్పారు. అయితే ఆయన ఈసారి 200 రూపాయలు తిరిగి ఇవ్వాలనే షరతుపై మరో 80 రూపాయలు అప్పుగా ఇచ్చారని తెలిపారు.
దీంతోపాటు వీరు తయారుచేసిన అప్పడాలను స్థానిక దుకాణాదారుల వద్దకు తీసుకువెళ్లే బాధ్యతను ఇతర సామాజిక కార్యకర్తులు తీసుకున్నారు. అయితే అప్పడాలను అమ్మిన తరువాతే డబ్బు చెల్లించే ప్రాతిపదికన వాటిని తమ దుకాణాలలో పెట్టడానికి విక్రేతలు అంగీకరించారు.
ఒక్క దుకాణదారుడు మాత్రమే మహిళలకు వెంటనే డబ్బు చెల్లించేందుకు అంగీకరించారు. “ఆయన రోజూ నాలుగు నుండి ఆరు ప్యాకెట్లను కొనుగోలు చేసేవారు. క్రమంగా ఈ అప్పడాలు బాగా ప్రాచుర్యం పొందాయి” అని పరాద్కర్ చెప్పారు.
వ్యాపారం పెరిగేకొద్దీ, ఎక్కువ మంది మహిళలు సహకార సంఘంలో చేరారు. ఉద్యోగులుగా మాత్రమే కాదు, నిర్ణయాలు తీసుకోవడంలో సహ-యజమానులుగానూ ఉన్నారు. ఈ మహిళలు గుజరాతీలో ఒకరినొకరు బెన్ అని పిలుచుకుంటారు.
“మేం కంపెనీలా కాదు, సహకార సంఘంలా ఉన్నాం. నేను అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ యజమానిని కాదు. మేమందరం సహ యజమానులం. సమాన హక్కులు కలిగి ఉన్నాం. లాభనష్టాలను కూడా పంచుకుంటాం. అదే మా విజయ రహస్యం అని అనుకుంటున్నాను.”అని పరాద్కర్ చెప్పుకొచ్చారు.
దశాబ్దాలుగా, ఈ సహకార సంస్థ లిజ్జత్ బ్రాండ్ పేరు లేకుండానే అప్పడాలను ఉత్పత్తి చేసింది.
1966లో, చిన్న గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సంస్థ అయిన ఖాదీ డెవలప్మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైనా బ్రాండ్ నేమ్‌తో రావాలని వీరికి సూచించింది.
అప్పుడు సరైన పేరు సూచించాల్సిందిగా ఈ సహకార సంఘం వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చింది.
“మాకు చాలా పేర్లను పంపించారు., కానీ మా సొంత సోదరిలలో ఒకరు లజ్జత్ పేరును సూచించారు. మేం దానిని లిజ్జత్గా మార్చాం, లిజ్జత్ అంటే అంటే గుజరాతీలో రుచి” అని అర్థమని పరాద్కర్ చెప్పారు.
దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కో-ఆపరేటివ్ సంస్థ తరతరాలుగా మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం పొందేందుకు తోడ్పడింది.
“నేను నా పిల్లలని చదివించి, ఇల్లు కట్టి, వారి పెళ్లి చేశాను” అని లక్ష్మి చెప్పారు.
“ఇక్కడ పని చేయడం వల్ల నాకు ఆదాయం మాత్రమే కాదు, గౌరవం ఉంది.” అని ఆమె తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS