SOURCE :- BBC NEWS
- రచయిత, త్రిభువన్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ
-
8 జనవరి 2025
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఒక సంఘటన కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ భాటీ సాగునీటి కోసం పొలంలో బోరుబావి తవ్విస్తున్నారు. 800 అడుగులవరకు తవ్వినా నీళ్లు పడకపోవడంతో, ఇంకా తవ్వాలని నిర్ణయించుకున్నారు.
అలా తవ్వుతుండగా, తెల్లవారుజాము సమయంలో భూమి లోపలి నుంచి ఒక్కసారిగా నీళ్లు ఉబికొచ్చాయి. భారీ జలధార పొంగిపొర్లడం మొదలైంది. మూడోరోజుల వరకూ ఆ నీటిధార అలాగే కొనసాగింది. మూడోరోజు ఆగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతం దాదాపు ఏడడుగుల మేర నీటితో నిండిపోయింది. సమీపంలోని జీలకర్ర పొలాలు నీటమునిగి పంట నాశనమైంది. ఈ ఘటన, సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలకు దారితీసింది.
ఈ విశాలమైన థార్ ఎడారిలో, భూగర్భం నుంచి నీరు ఇంతలా ఉబికి వస్తుందని ఎవరూ ఊహించరు.
”అలా తవ్వుతున్నప్పుడు, ఒక్కసారిగా నీరు ఎగసిపడడంతో 22 టన్నుల బోర్వెల్ మెషీన్ కూడా అందులో మునిగిపోయింది” అని విక్రమ్ సింగ్ భాటీ అన్నారు.
”దానితో పాటు లారీ కూడా అందులో పడిపోయింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది, భూమి పైపొర పదడగుల మేర కోతపడింది” అని ఆయన చెప్పారు.
భూగర్భం నుంచి అంత నీరు ఎలా వచ్చింది?
సీనియర్ గ్రౌండ్‌వాటర్ సైంటిస్ట్ (భూగర్భ జల శాస్త్రవేత్త), రాజస్థాన్ గ్రౌండ్‌వాటర్ బోర్డ్ ఇన్చార్జి డాక్టర్ నారాయణదాస్ ఇణఖియా నేతృత్వంలో నిపుణుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అక్కడి నమూనాలు సేకరించి మూడు రోజుల పాటు పరిశోధనలు జరిపింది.
సాధారణంగా ఇక్కడ 300 అడుగుల నుంచి 600 అడుగుల లోపు నీళ్లు పడతాయని స్థానికులు చెబుతున్నారు.
”850 అడుగుల వరకూ తవ్వడం వల్ల రాళ్లు పగిలిపోయి, ఒక్కసారిగా నీటిబుగ్గ పగిలి పోయింది. ఇవి క్లే రాక్స్(మట్టిరాళ్లు). ఈ క్లే రాక్స్ పొర చాలా బలంగా ఉంటుంది. అది పగిలిపోవడంతో నీరు ఒక్కఉదుటున పైకొచ్చింది” అని ఇణ్ఖియా వివరించారు.
ఇదే మొదటిసారా?
ఇణ్ఖియా మాట్లాడుతూ, ”భూగర్భంలో 850 అడుగుల లోపల బలమైన రాతిపొరలు ఉన్నాయి. ఈ పొరల మధ్య నీటినిల్వలు ఉన్నాయి. ఈ రాతిపొరలు పగిలినప్పుడు మాత్రమే, నీళ్లు అంత ఉధృతంగా బయటకు వస్తాయి” అని చెప్పారు.
”పదిహేనేళ్ల కిందట నాచ్నాలోని జాలువాలాలోనూ ఇలాగే నీళ్లొచ్చాయి” అన్నారు.
నాలుగు దశాబ్దాల కిందట ఒక అధ్యయనం కూడా జరిగింది. సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(CAZRI)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ వినోద్ శంకర్, డాక్టర్ సురేశ్ కుమార్ 1982లో రూపొందించిన ఒక పరిశోధనా పత్రంలో, మోహన్‌గఢ్ ప్రాంతంలో భూగర్భజలాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రిటైర్ అయిన డాక్టర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ, ”కేవలం 176 మిల్లీమీటర్ల నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో, కొన్నిచోట్ల ముళ్లపొదలు (హాలోక్సిలాన్ సేలికోర్నికమ్) పుష్కలంగా కనిపించాయి, కొన్నిచోట్ల అసలు లేవు”
”అది మమ్నల్ని ఆశ్యర్యానికి గురిచేసింది. నాలుగైదు మీటర్లు తవ్వి చూసినప్పుడు, ఆ పొదల వేర్లు ఇంకా లోతుగా ఉన్నట్లు అర్థమైంది. కానీ, వర్షపు నీరు నాలుగడుగులు మాత్రమే లోపలకు ఇంకుతుంది. భూగర్భంలో నీటి జాడ ఉందని, వాటి నుంచే ఈ పొదలకు నీరు అందుతున్నట్లు ఇది సూచించింది” అన్నారాయన.
నీటి జాడను ఆ మొక్కే చెబుతోందా?
థార్ ఎడారిలో పెరిగే సాధారణ మొక్క లానా లేదా లాణా. ఎడారి ప్రాంతాల్లో మేకలు, ఒంటెల ప్రాణాలు కాపాడే మొక్క ఇది. ఉష్ణమండల ప్రాంతాలు, బంజరు భూముల్లో ఈ పొదలు పెరుగుతాయి.
రాజస్థాన్, గుజరాత్, హరియాణాతో పాటు మధ్య ఆసియాలోని ఎడారి ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వీటి శాస్త్రీయ నామం హాలోక్సిలాన్ సేలికోర్నికమ్. ఇది అమరేంథేసీ జాతికి చెందిన మొక్క.
ఈ మొక్క నీటి లభ్యత అంతగా లేని, సరైన పోషకాలు అందని ఇసుక నేలలు, బంజరు భూముల్లో పెరుగుతుంది.
వీటి వేర్లు చాలా బలంగా దాదాపు 16 అడుగుల లోతు వరకూ ఉంటాయి. నీటిలభ్యత లేని ఎండిపోయిన భూముల్లో ఈ హాలోక్సిలాన్ సేలికోర్నికమ్ ప్రధానంగా కనిపిస్తుంది.
ఇక్కడ నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడడాన్ని, పురాణాల్లో ప్రస్తావించిన నదితో ముడిపెట్టారు డాక్టర్ సురేశ్ కుమార్.
”పురాణాలను అధ్యయనం చేయడంతో పాటు వాటిని రిమోట్ సెన్సింగ్ డేటాతో పోల్చి చూసినప్పుడు.. ఇది అంతరించిపోయిన సరస్వతి నదీ పరీవాహక ప్రాంతమని అర్థమైంది” అని ఆయన చెప్పారు.
”ఇక్కడ పూర్తిగా అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను రికార్డు చేశాం. చుట్టుపక్కల మొక్కలను పరిశీలించినప్పుడు, ఇతర ప్రాంతాల్లో ఈ హాలోక్సిలాన్ సేలికోర్నికమ్ పొదలు కనిపించలేదు. ఆ తర్వాత, సైన్యం ఈ ప్రాంతంలో లోతుగా తవ్వకాలు జరిపిన సమయంలో ఇక్కడ నీటిజాడ సంకేతాలు కనిపించాయి” అన్నారు సురేశ్ కుమార్.
నిజానికి, రుగ్వేదంలో నదీతమగా పేర్కొంటూ సరస్వతి నది గురించిన వర్ణన ఉంది. నదీతమ అంటే నదులకు తల్లి, లేదా పవిత్ర నది.
అంతేకాకుండా.. మహాభారతం, మత్స్య , విష్ణు తదితర పురాణాల్లోనూ, ఇంకా అనేక ఇంతర గ్రంథాల్లోనూ సరస్వతి నది ప్రస్తావన ఉంది.
పురావస్తు, భౌగోళిక అధ్యయనాల ప్రకారం, అంతరించిపోయిన సరస్వతి నది హరియాణా, రాజస్థాన్, గుజరాత్ల మీదుగా ప్రవహించేది.
ఆ నీటి ధార సరస్వతి నదిదేనా?
జోధ్‌పూర్ CAZRI సైంటిస్టులు, గ్రౌండ్‌వాటర్ సైంటిస్టుల ప్రకటనలను పరిశీలిస్తే, జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ వ్యవసాయ భూముల్లో ఎగసిపడిన జలధారను అంతరించిపోయిన సరస్వతి నదిగా చెప్పలేం.
అయితే, పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది జాడ కోసం చాలా ఏళ్ల కిందట ప్రారంభమైన అన్వేషణ ఇప్పుడు మళ్లీ ముమ్మరమయ్యే అవకాశం మాత్రం ఉంది.
గ్రౌండ్‌వాటర్ సైంటిస్ట్ నారాయణదాస్ ఇణ్ఖియా మాట్లాడుతూ, ”ఇప్పుడు బయటికి ఉబికొచ్చిన నీళ్లు దాదాపు 360 మీటర్ల కంటే దిగువ నుంచి వచ్చినవి. కానీ, సరస్వతి నదీ ప్రవాహం 60 మీటర్ల దిగువన మాత్రమే ఉన్నట్టుగా పరిగణిస్తున్నారు” అన్నారు.
అయితే, జైసల్మేర్ ఘటన గురించి సీనియర్ జియాలజిస్టులు(భూగర్భ శాస్త్రవేత్త), మైనింగ్ నిపుణులు, సరస్వతి నదిపై పనిచేస్తున్న వారిని అడిగినప్పుడు, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. ఏదో ఒకటి చెప్పడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు.
అక్కడి నీరు, మట్టి, వాస్తవాలను పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్దిష్ట వాదనలు చేసే అవకాశం ఉంటుంది.
కార్బన్ డేటింగ్ పరీక్షలతో మాత్రమే జైసల్మేర్‌లో ఉబికొచ్చిన నీళ్లు సరస్వతి నదీ ప్రవాహమా? కాదా? అనేది తేలుతుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త, సరస్వతి నది పరిశోధనలపై నివేదిక సమర్పించిన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ జేఆర్ శర్మ అన్నారు.
”ఈ పరీక్షలతో నీటి వయస్సు ఎంతో తెలుస్తుంది. అది సరస్వతి నదీ జలమే అయితే, దానికి మూడు వేల ఏళ్ల వయస్సు ఉండాలి” అన్నారాయన.
”లేదంటే, ఈ ఎడారి ఏర్పడక ముందు ఇక్కడ ఉన్న సముద్రపు నీరు కూడా కావొచ్చు” అని ఆయన అన్నారు.
”ముంబయిలోని బాబా రీసర్స్ ఇన్స్టిట్యూట్ లేదా అహ్మదాబాద్‌లోని ఇస్రో కేంద్రంలో ఉన్న ఫిజికల్ లేబొరేటరీలో ఈ కార్బన్ డేటింగ్ పరీక్ష చేయచ్చు” అని డాక్టర్ జేఆర్ శర్మ చెప్పారు.
సరస్వతి నదీ జాడ కోసం అధ్యయనం
2002, జూన్ 15 నాటి సంగతి ఇది. సరస్వతి నదీ ప్రవాహ మార్గాన్ని కనుగొనేందుకు తవ్వకాలు చేపట్టనున్నట్లు అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జగ్మోహన్ ప్రకటించారు.
అందుకోసం ఇస్రో అహ్మదాబాద్‌కి చెందిన బల్దేవ్ సహాయ్, పురావస్తు శాస్త్రవేత్త ఎస్.కల్యాణ్ రామన్, గ్లేసియాలజిస్ట్(హిమానీనద శాస్త్రవేత్త) వైకే పూరి, వాటర్ కన్సల్టెంట్ మాధవ్ చితాలెతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
మొదటి దశలో హరియాణాలోని ఆదిబద్రి నుంచి భగవాన్పురా వరకు తవ్వకాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత భగవాన్పురా నుంచి రాజస్థాన్‌లోని కాలిబంగా వరకూ రెండోదశలో తవ్వకాలు పూర్తి చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు.
ఈ బృందం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ పర్యటించి సమాచారాన్ని సేకరించింది. ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తల బృందం 2015 నవంబర్ 28న, సరస్వతి నదిపై ఒక నివేదికను విడుదల చేసింది.
సీనియర్ సైంటిస్టులు డాక్టర్ జేఆర్ శర్మ, డాక్టర్ బీసీ భద్ర, డాక్టర్ ఏకే గుప్తా, డాక్టర్ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘రివర్ సరస్వతి: యాన్ ఇంటిగ్రేటెడ్ స్టడీ బేస్డ్ ఆన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ టెక్నిక్స్ విత్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్’ పేరుతో ఆ నివేదిక రూపొందింది.
ఇస్రోకి చెందిన జోధ్‌పూర్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ నివేదికను రూపొందించింది. ఉపఖండం వాయువ్య ప్రాంతంలో గతంలో ఎన్నో పెద్ద నదులు ప్రవహించాయని ఆ నివేదిక పేర్కొంది.
సింధు నది తరహాలోనే, దాదాపు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాలకి పూర్వం.. అంటే సుమారు 8 వేల సంవత్సరాల కిందట సరస్వతి నది ప్రవహించినట్లు వేదాలు, పురాణాల్లో ఉంది.
సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గుజరాత్‌లోని కచ్ వద్ద సముద్రంలో కలిసేదని కూడా ఉంది. హిమాలయాల ప్రాంతంలో వాతావరణ మార్పులు, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పుల కారణంగా సరస్వతి నది క్రీస్తుపూర్వం మూడు వేల ఏళ్ల కిందట పూర్తిగా ఎండిపోయి, కనుమరుగైందని చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS