SOURCE :- BBC NEWS

గేమ్ చేంజర్ సినిమా

ఫొటో సోర్స్, Ram Charan/Twitter

ఒకే న‌దిలో రెండుసార్లు నీళ్లు తాగ‌లేవు. కొత్త‌నీళ్లు వ‌చ్చి పాత‌ని తరిమేస్తూ వుంటాయి. సినిమా కూడా అంతే. అప్‌డేట్ కాక‌పోతే అవుట్‌డేట్ అయిపోతారు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప‌రిస్థితి ఇదే.

సామాజిక దృక్ప‌థం వుంటే చాల‌దు. స‌మాజంలో వ‌స్తున్న మార్పుల్ని గ‌మ‌నించాలి. ప్రేక్ష‌కులు కూడా సొసైటీలో భాగ‌మే. వాళ్లు వేగంగా మారుతున్నారు.

ఇది తెలియ‌కుండా పాత క‌థ‌ని పాత క‌థ‌నంతోనే తీస్తే అది గేమ్ చేంజ‌ర్ సినిమా. ఆట మారాలంటే స‌రిగా ఆడాలి. పాత క‌థ‌తో వ‌చ్చినా క‌నీసం క‌థ‌న‌మైనా కొత్త‌గా వుండాలి.

గేమ్ చేంజ‌ర్ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. భారతీయుడు-2 (ఇండియన్ -2) చూసిన త‌రువాత శంక‌ర్‌పై న‌మ్మ‌కం పోయింది.

అయితే, త‌న పాత్ర‌ని రాంచ‌ర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌ని దిల్‌రాజు న‌మ్మారు. నిజానికి అవి రెండూ బాగున్నాయి. అయితే, ఏం జ‌రిగింది?

సినిమాలో రాంచ‌ర‌ణ్‌కి అన్‌ప్రిడిక్ట‌బుల్ అనే డైలాగ్ వుంది. అయితే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ త‌ప్ప మిగ‌తా అంతా ప్రిడిక్ట‌బుల్‌. ట్రయిలర్ చూస్తే దాదాపు సినిమాని వూహించవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్

ఫొటో సోర్స్, Ram Charan/Twitter

కథ‌ ఏమంటే..?

రాంనందన్ (హీరో) నిజాయితీగల ఐఏఎస్ అధికారి. విశాఖ కలెక్టర్‌గా వచ్చిన వెంటనే బ్లాక్ మార్కెట్, అక్రమ కట్టడాలు, ఇసుక తవ్వకాలు…అన్ని అవినీతి పనుల మీద ఉక్కుపాదం మోపుతాడు.

ముఖ్యమంత్రి (శ్రీకాంత్) కుమారుడు మోపిదేవి (సూర్య) అవినీతి మంత్రి. రాంనందన్ పనులు అత‌నికి కోపం తెప్పిస్తాయి. ఇద్దరి మధ్య ఘర్షణ‌.

ఇంతలో హీరో లవ్ ఎపిసోడ్ ఫ్లాష్‌బ్యాక్‌. ఆ త‌ర్వాత హీరోయిన్ (కైరా అద్వానీ)ని వెతికి క‌లుసుకుంటాడు. ఆమె న‌డుపుతున్న శరణాలయంలో పార్వ‌తి (అంజ‌లి) అనే పెద్దావిడ వుంటారు.

ఆమె ముఖ్య‌మంత్రికి విన‌తిప‌త్రాలు రాస్తూ మ‌తిస్థిమితం లేకుండా వుంటుంది. పార్వ‌తి కోరిక మేర‌కు ముఖ్యమంత్రి సభకి హీరో తీసుకెళతాడు. ఆమెకి ముఖమంత్రికి వున్న సంబంధమేంటి? హీరో ఎవరు? ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఏంట‌నేది మిగతా కథ.

సెకెండాఫ్‌లో పార్వతి ఫ్లాష్ బ్యాక్, హీరో, విలన్ల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్, కథ‌ ఎలా ముగుస్తుందో ఎవరైనా సులభంగా అంచనా వేయొచ్చు.

శంకర్ ఒకప్పటి గొప్ప దర్శ‌కుడే. సందేహం లేదు. క్యారెక్టర్ రాసుకోవడం, కథ‌నాన్ని బిగువుగా నడపడంలో దిట్ట. పాటల్ని భారీగా పిక్చరైజ్ చేయడం ఆయన ప్రత్యేకత. వ్యవస్థలోని లొసుగుల్ని ఎత్తి చూపుతూ కమర్షియల్ ఫార్మాట్‌లోనే సందేశాన్ని ఇచ్చేవాడు.

అయితే ఒకే ఒక్కడు కాలానికి గేమ్ చేంజ‌ర్‌కి మధ్య 25 ఏళ్ళ తేడా వుంది.

హీరో ఫైట్, ఇంట్రో సాంగ్‌, హీరోయిన్ పరిచయం, లవ్ ట్రాక్, కామిడీ బిట్స్, విలన్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఘ‌ర్ష‌ణ‌, ఇంటర్వెల్ బ్యాంగ్‌, సెకండాఫ్ ఫ్లాష్‌ బ్యాక్, గొడ‌వ ముద‌ర‌డం, హీరోకి కొన్ని కష్టాలు, క్లైమాక్స్ ఫైట్, ఐదారు పాట‌లు… ఈ ఫార్మాట్ తుప్పు పట్టింది.

కత్తికి సానబెడితేనే పదును..క‌థైనా అంతే. రెండు నిమిషాల షార్ట్స్, రీల్స్ ల్యాగ్ అయితేనే భరించలేని కొత్త జనరేషన్. రెండు గంటల నలభై అయిదు నిమిషాలు థియేటర్లో కూర్చోపెట్టాలంటే ఎంత మ్యాట‌ర్ వుండాలి.

రామ్ చరణ్

ఫొటో సోర్స్, Ram Charan/Twitter

జెంటిల్‌మెన్‌లో విద్యా వ్యవస్థ, ఒకే ఒక్క‌డులో రాజ‌కీయ సిస్టం, భారతీయుడు, అపరిచితుడులో అవినీతిపైన అస్త్రాలు ఎక్కుపెట్టి శంకర్ విజయం సాధించాడు. ఆ సినిమాల్లో రైటింగ్ బలంగా వుంటుంది.

పాత్రచిత్రణ అద్భుత‌మైన ఎమోషన్స్‌తో మిక్స్ అయి వుంటుంది. కూతురికి కాగితం పడవ కోసం 500 నోటు ఇచ్చిన కమలహాసన్ (భారతీయుడు), అదే కూతురిని బ‌తికించుకోడానికి డాక్టర్‌కి పైసా లంచం ఇవ్వడు. అవినీతికి అలవాటైన సొంత కొడుకుని కూడా వదిలిపెట్టడు. క్యారెక్టర్ బలంగా వున్నపుడు నటులు కూడా రెచ్చిపోతారు.

గేమ్ చేంజర్‌లో సమస్య ఇదే. రైటింగ్ బలహీనంగా వుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్‌లు అక్కడక్కడ పేలినా, కథలో విషయం లేనపుడు, డైలాగులతో సినిమా గట్టెక్క‌దు.

రాంచరణ్, సూర్య అద్భుతమైన నటనని చూపినా, రొటీన్ కథ కావడంతో తేలిపోయింది. కైరా అద్వానీకి నటించే అవకాశం లేదు. వూరికే నిలబడి ఒకటో రెండో డైలాగులు చెప్పడమే.

అంజలి పరిస్థితి కూడా అంతే. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య ఎందరో వున్నా కామెడీ వ‌ర్కౌట్ కాలేదు.

సునీల్ ఒకవైపు చూస్తూ, ఇంకో వైపు నడిచే సైడ్ సత్యం కూడా నవ్వించలేదు. బ్రహ్మానందం కాసేపు క‌న‌బ‌డినా లాభంలేదు. వున్నంతలో జయరాం బెట‌ర్‌.

రామ్ చరణ్, కైరా అద్వానీ

ఫొటో సోర్స్, Ram Charan/Twitter

బ్యూరోక్ర‌సీ అనేక అంచెలుగా పనిచేస్తూ వుంటుంది. సినిమాల్లో మాత్రం హీరోకి అనుకూలంగా వుంటుంది. వాస్తవానికి మనల్ని ఎంగేజింగ్‌గా కూర్చోపెడితే లాజిక్‌లు అడగం.

శ్రీకాంత్ ఆస్ప‌త్రిలో వున్నపుడు, సూర్య అతనితో వ్యవహరించే సీన్ గ్లాడియేటర్ని గుర్తుకు తెస్తే అది మన తప్పుకాదు.

తమన్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ చాలాచోట్ల అద్భుతంగా వుంది. కొన్ని సీన్స్‌లో ఎనిమీ ఎట్ ది గేట్స్‌ (2001)లో విలన్ కనబడినపుడు వచ్చే మ్యూజిక్ గుర్తొస్తే అది మన తప్పు కాదు.

సెకండాఫ్‌లో అప్పన్నగా రాంచరణ్ చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. అయితే ఎక్కడో గిరిజన ప్రాంతంలో వున్న వ్యక్తి ఏకంగా పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పోటీ చేయ‌డం క‌న్విన్సింగ్‌గా లేదు.

పాటలు రిచ్‌గా వున్నాయి. వందల మంది డ్యాన్సర్లతో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్నా కథ‌కి అడ్డు పడినట్టు అనిపిస్తాయి.

హీరోకి, విలన్‌కి మధ్య ఘర్షణ కథ‌లోని ఏకసూత్రం అయినప్పుడు, రాజకీయ బ్యాక్ డ్రాప్‌తో ఆ పాయింట్ మీదే న‌డిస్తే బావుండేది. అనేక ఉపకథలు చొరబడి కథ‌ని పక్కకి లాగాయి.

హీరో యాంగ‌ర్ మేనేజ్‌మెంట్, ముఖ్యమంత్రి ఫ్లాష్‌ బ్యాక్‌, ఎన్నికల నిర్వ‌హణ, లవ్‌ట్రాక్‌ ఇవన్నీ పాయింట్ బ్లాంక్‌ని మిస్‌ చేశాయి.

రామ్ చరణ్, కైరా

ఫొటో సోర్స్, Ram Charan/Twitter

దాదాపు ఇలాంటి క‌థ‌తోనే మూడేళ్ళకిందట రిపబ్లిక్ అనే సినిమా వచ్చింది. ఆడలేదు. నాయకుల అవినీతి మీద జ‌నాల‌కి పెద్ద‌గా కంప్లయింట్‌ లేని కాలం.

సోషల్ మీడియా రాక‌తో ఇంట్లో విషయాల కంటే, రాజకీయాలే ఎక్కువ తెలుసుకుంటున్న కాలం. పాతకాలం బఫూన్ పాలిటిక్స్‌ని ఇప్పుడు ఎవ‌రూ చూడ‌రు. శంకర్ మారాలి, లేదా మానుకోవాలి.

సినిమాని రాంచరణ్ కోసం చూడొచ్చు..శంకర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని నమ్మే వాళ్లు చూడక్కరలేదు. హీరోలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఎక్కువ వుంటే అంతగా నచ్చేస్తున్నాయి. నీతినిజాయితీ అభ్యుద‌యం అని ఉప‌న్యాసాలు ఇస్తే బూతుల్లా వినిపిస్తాయి.

ఈ ప్రపంచాన్ని వేదాంతులు రకరకాలుగా నిర్వచించారు. కానీ, సమస్య ఏమంటే ఈ ప్రపంచాన్ని మార్చడం ఎలా? మార్క్స్ చెప్పిన మాట ఇది. స‌మాజాన్ని మార్చ‌డం మ‌హామ‌హుల వ‌ల్లే కాలేదు.

భారీ బడ్జెట్‌తో భారీ తారాగణంతో తెర మీద అవినీతి, అన్యాయాలపై కత్తి ఝుళిపించాలనే ఫార్ములాను శంకర్ వదిలించుకుంటే నిర్మాతలకు, ప్రేక్షకులకు మంచిది. ఎంత అవినీతి అక్రమాల మీద పోరాడినా, కొత్తదనం లేకపోతే, ఎంగేజ్ చేయలేకపోతే ప్రేక్షకులు చూడరని ఆయన గుర్తిస్తే మంచిది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)