SOURCE :- BBC NEWS

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Alok Putul

  • రచయిత, చెరిలాన్ మొల్లాన్, అలోక్ ప్రకాశ్ పుతుల్
  • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • 9 జనవరి 2025

పోలీసులు ఆయన్ను మావోయిస్టు అని ఆరోపించారు. మావోయిస్టులు ఆయన్ను ఇన్‌ఫార్మర్‌ అని అన్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలిన బస్తర్ జర్నలిస్టు ముకేశ్ చంద్రాకర్ అసలు ఎవరు? మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరాటానికి ప్రధాన కేంద్రంగా మారిన బస్తర్‌లో స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్న ముకేశ్ చంద్రాకర్ హత్యను భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జర్నలిస్టుల బతుకుచిత్రానికి ప్రతీకగా చూడాలా? జర్నలిస్టులు ఎంత ప్రమాదకర పరిస్థితుల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందో ముకేశ్ మరణం కళ్లకు కడుతోందా?

గ్రామీణ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు వారు జీవితాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. జర్నలిస్టు ముకేశ్ చంద్రాకర్ హత్య దీనికి తాజా నిదర్శనం.

33 ఏళ్ల ముకేశ్ దారుణ హత్య దేశంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో తెలియజేస్తోంది.

హత్య జరిగిన తర్వాత ఆరో రోజు ముకేశ్ చంద్రాకర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సురేశ్ చంద్రాకర్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో ఇద్దరు ముకేశ్‌కు తెలిసినవారే.

ముకేశ్ ఎవరి అవినీతి గురించి అయితే కథనం రాశారో ఆ వ్యక్తి ఇంటి ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది.

ముకేశ్ హత్య కేసులో దోషులను ఎవరినీ వదిలిపెట్టబోమని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Bastar Junction / YouTube

గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టర్లుగా ఉండడం సురక్షితమేనా?

ఖనిజాల నిలయమైన ఛత్తీస్‌గఢ్ కొన్ని దశాబ్దాలుగా సాయుధ పోరాటాలకు కేంద్రంగా మారింది. ముకేశ్ హత్యను భారత మీడియా ఖండించింది. ఆయన గురించి తెలిసినవారు ముకేశ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రజల సమస్యలపై ఆయన నిబద్ధతతో పనిచేసేవారని, ముఖ్యమైన విషయాల కోసం ఎంత దూరమైనా వెళ్లి రిపోర్ట్ చేసేవారని అనేకమంది చెప్పారు.

ఆయన హత్యతో స్వతంత్ర జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతోంది. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే, తిరుగుబాటుదారులు, శక్తిమంతమైన మైనింగ్ కార్పొరేట్లు, ప్రభుత్వానికి మధ్య అధిపత్యం కోసం పరోక్ష యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్న ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రంలో స్ట్రింగర్లుగా, ఫ్రీలాన్సర్లగా పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రతపై ఈ హత్య చర్చ లేవనెత్తింది.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Bastar Junction / YouTube

స్థానికులు సమస్యలను చెప్పుకునే వేదిక..

ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గ్రామం బసగూడలో ముకేశ్ పుట్టారు. జర్నలిస్టుగా మారడానికి ముందు ఆయన కూలీ పనులు చేసేవారు.

ఆయన బాల్యం కష్టాల మధ్య సాగింది. ఆయన చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. పూట గడవడానికి కష్టమైన పరిస్థితుల మధ్య తల్లి కొడుకును పెంచిపెద్దచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో హింస సర్వసాధారణం. ఆ ప్రభావమూ ఆయన జీవితంపై ఉంది.

కుటుంబానికి ఆసరాగా మారేందుకు మొదట ఆయన ఇప్ప పూలు సేకరించేవారు. ఆదివాసీల్లో బాగా ప్రాచుర్యం పొందిన లిక్కర్ తయారీలో ఈ పూలు ఉపయోగిస్తారు. తర్వాత గ్యారేజీలో పనిచేశారు.

స్నేహితుల ద్వారా ముకేశ్‌కు జర్నలిజం గురించి తెలిసిందని, 2013లో ఆయన ఈ వృత్తిలో ప్రవేశించారని, ఆయన స్నేహితుడు గణేశ్ మిశ్రా బీబీసీతో చెప్పారు. తోటివారి నుంచి వృత్తిలో మెలకువలు నేర్చుకున్న ముకేశ్‌కు తర్వాత కాలంలో రిపోర్టింగ్‌పై మక్కువ పెరిగింది.

సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టేముందు ప్రధాన మీడియా కంపెనీల్లో రిపోర్టర్‌గా పనిచేశారు. మరణించే సమయానికి ఆయన చానల్‌కు 1,65,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

దట్టమైన అడవులు విస్తరించి ఉన్న కొండ ప్రాంతం బస్తర్. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే రెడ్‌కారిడార్‌ పరిధిలో బస్తర్ ఉంది.

ఆయన వీడియోల్లో కొద్దిగా మెలోడ్రామా ఉన్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోని అనేక కథనాలను ఆయన ప్రసారం చేశారు. మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన అమాయక గ్రామస్థులు, తిరుగుబాటుదారులుగా ఆరోపిస్తూ పోలీసులు జైలుకు పంపిన ఆదివాసీల గురించి ఆయన వీడియోలు తీశారు.

కనీస సౌకర్యాలు కూడా లేని బస్తర్ మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తన వీడియోల్లో ఆయన చూపించారు.

బ్రిడ్జి లేకపోవడంతో నిత్యావసరాలను మోసుకుంటూ నది చుట్టూ ఈది గ్రామాలకు చేరుకుంటున్న ప్రజల కష్టాలను ఓ వీడియోలో చూపించారు. ఒక కీలకమైన రోడ్డులో ఉంచిన పేలుడు పదార్థాలను మరో వీడియోలో చిత్రీకరించారు. భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ పేలుడు పదార్థాలను ఉంచారనే ఆరోపణలొచ్చాయి. స్థానికులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఒక వేదికగా, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసేలా ఆయన కథనాలు ఉండేవి.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Ganesh Mishra

బస్తర్ అడవులపై పట్టు

కొన్ని వార్తా సంస్థలకు ఆయన స్ట్రింగర్‌గా కూడా పనిచేశారు. ఏదైనా కథనం కోసం బయటి నుంచి వచ్చే జర్నలిస్టులకు సమాచారం ఇవ్వడం, మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం వంటివి చేసేవారు.

అలాంటి ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు చాలా మీడియాసంస్థలు అతితక్కువ జీతాలు మాత్రమే ఇస్తాయి. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి రిపోర్టింగ్ చేసినప్పటికీ, వారికి సరైన గుర్తింపు, బైలైన్ వంటివి ఉండవు.

ఓ ప్రత్యేక సున్నితమైన కథనం కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరాలు, పోలీసు చెక్‌పోస్టుల గుండా బయటకు రావడానికి ముకేశ్ తనకు ఎలా సాయపడ్డారో ఓ జర్నలిస్టు బీబీసీకి తెలిపారు.

”ఆయన సాయం లేకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లడం అసాధ్యం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ జర్నలిస్టు తెలిపారు.

కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపడం, ఆయన చర్యలతో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం, తాను చేసే పని విషయంలో గర్వపడడం ముకేశ్‌లో గమనించానని ఆయన తెలిపారు.

”చాలా లక్ష్యాలు, ఆకాంక్షలు ఉన్న వ్యక్తి. తన కష్టాలను అధిగమించి జీవితంలో ఎదగాలనుకున్నారు” అని ఆయన చెప్పారు.

స్థానిక జర్నలిస్టులకు తక్కువ మొత్తంలో జీతాలుంటాయి. అయితే ముకేశ్ జీవనవిధానంపై ఆయన సహచరుల్లో కొన్ని గుసగుసలు వినిపించాయి. ముకేశ్‌కు నివాళులర్పిస్తూ ఆయన స్నేహితుడు, మరో జర్నలిస్ట్ దీపాంకర్ ఘోస్ ”వృత్తిలో సంక్షిష్టతలను గుర్తించిన వ్యక్తిగా అభివర్ణించారు. మనుగడ కోసం అనేక అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంటుంది” అని తెలిపారు.

”ధైర్యసాహసాలకు ముకేశ్ ప్రతిరూపం. ఆయన పనిచేసిన సంస్థలు, పెట్రోల్‌కు కూడా డబ్బులు చెల్లించలేదని, క్రమబద్ధమైన జీతం ఇవ్వలేదని, మనుగడ సమస్య కాలేదని, అందువల్ల ఇతర ఆదాయమార్గాలు చూసుకోలేదని వంటివి నేను చెప్పను. కానీ ముకేశ్ జర్నలిజాన్ని ఎంతో ఇష్టపడ్డారు. మక్కువతో పనిచేశారు” అని ఎక్స్‌లో రాసిన పోస్టులో తెలిపారు.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Alok Putul

గ్రామీణ జర్నలిస్టులకు ఆర్థిక భద్రత ఎలా?

”జర్నలిజాన్ని ఇష్టంతో చేసే, తమ ప్రాంతాల నుంచి నిర్భయంగా కొత్త కొత్త వార్తా కథనాలు అందించే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. అయితే ఓ వృత్తిలా జర్నలిజం వారికి ఆర్థిక భద్రత ఎంత ఇస్తుందనేది మనం చెప్పలేం” అని స్వతంత్ర న్యూస్ ప్లాట్‌ఫాం న్యూస్‌లాండ్రీ మేనేజింగ్ ఎడిటర్ మనీషా పాండే చెప్పారు. దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ఆమె మాట్లాడారు.

ముకేశ్ హత్యపై దర్యాప్తు జరుగుతోంది. రానున్న రోజుల్లో ఆయన హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తారు.

”ఓ కుటుంబ సభ్యుడులాంటి స్నేహితుణ్ని నేను కోల్పోయా. బస్తర్ ఓ మంచి జర్నలిస్టును పోగొట్టుకుంది. ఆయన జర్నలిజం చాలా మందిపై ప్రభావం చూపింది. అందుకే ఆయన మరణం అందరినీ తీవ్రంగా బాధిస్తోంది” అని ఆయన స్నేహితుడు మిశ్రా చెప్పారు.

ధైర్య సాహసాలతో రిపోర్టింగ్

ఫొటో సోర్స్, Bastar Junction

అందరికీ టార్గెట్ అయ్యారా?

ముకేశ్ హత్య తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు బయటికొచ్చాయి.

మావోయిస్టు సెంట్రల్ రీజన్ బ్యూరో ప్రతినిధి ప్రతాప్ పేరుతో ముకేశ్ చంద్రాకర్‌ను హెచ్చరిస్తూ విడుదలైన లేఖ ఒకటి వెలుగుచూసింది. 2024 జనవరి 1న, అంటే ముకేశ్ హత్యకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.

ఆ లేఖలో ముకేశ్‌ను పోలీసు, ప్రభుత్వ ప్రతినిధిగా మావోయిస్టులు ఆరోపించారు.

అంతకు 10 రోజుల ముందు బీజాపూర్‌లోని ముర్కినర్ ప్రాంతంలో ముకేశ్ చంద్రాకర్ సహా ఐదుగురు జర్నలిస్టులను సీఆర్‌పీఎఫ్ జవాన్లు గన్‌లతో బెదిరించారు. చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై ముకేశ్ కూడా వార్త రాశారు.

ఇది జరగడానికి రెండు నెలల ముందు బీజాపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్‌డీఎం)ముకేశ్ సహా నలుగురు జర్నలిస్టులకు నోటీసులిచ్చారు.

మావోయిస్టు హింసకు సంబంధించిన వార్త ఎందుకు ప్రసారం చేశారో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు.

గత ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్ బీజాపూర్ జిల్లా అధ్యక్షుడు లాలూ రాథోర్ ముకేశ్ సహా నలుగురు జర్నలిస్టులను బహిష్కరించాలని కోరుతూ లేఖ రాశారు.

ఒక నిర్దిష్ట పార్టీకి ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశంతో బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవికి వ్యతిరేకంగా దురుద్దేశపూరితమైన, ఆధారాలు లేని, అబద్ధపు వార్తలను నిరంతరాయంగా ప్రచురిస్తున్నారని, ప్రసారం చేస్తున్నారని లాలూ రాథోర్ ఆరోపించారు. ఇలాంటి వార్తలతో విక్రమ్ మాండవి ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని తెలిపారు.

మావోయిస్టులు, ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొన్న జర్నలిస్టు ముకేశ్.. ఒక కాంట్రాక్టర్ ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో శవమై తేలారు. నిందితుల్లో ఆయన బంధువులూ ఉన్నారు. రోజూ వారితో ముకేశ్ మాట్లాడుతూనే ఉండేవారు.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Alok Kumar Putul

భద్రతపై జర్నలిస్టుల్లో ఆందోళన

ముకేశ్ హత్య, ఇతర జర్నలిస్టులకు ప్రమాదఘంటికలు మోగిస్తోందని దక్షిణ బస్తర్‌లోని గుమియాపాల్ అనే ఓ చిన్న గ్రామంలో నివసించే ఆదివాసీ జర్నలిస్ట్ మంగల్ కుంజమ్ అభిప్రాయపడ్డారు.

ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ సినిమాలో జర్నలిస్టు పాత్ర పోషించిన మంగల్ కుంజమ్ బీబీసీతో కొన్ని విషయాలు చెప్పారు. ”నాకు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి. స్పాంజ్ ఐరన్ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు నన్ను తమకు అనుకూలాంగా మార్చుకునేందుకు అనేక ప్రాంతాల్లో నాతో మాట్లాడారు. నేను అందుకు ఒప్పుకోలేదు. ముకేశ్ హత్య తర్వాత నా భద్రత గురించి నాకు ఆందోళన మొదలైంది” అని ఆయన తెలిపారు.

 జర్నలిస్టు సాయిరెడ్డి

బీజాపూర్‌లో పన్నెండేళ్ల క్రితం జర్నలిస్టు హత్య

బీజాపూర్‌లో పన్నెండేళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు సాయిరెడ్డి హత్య అప్పటివారికి ఇప్పటికీ గుర్తుంది.

బన్సగూడకు చెందిన జర్నలిస్టు సాయిరెడ్డిని మావోయిస్టుగా ఆరోపిస్తూ 2008 మార్చిలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజా భద్రత చట్టం కింద ఈ అరెస్టు జరిగింది.

సాయిరెడ్డి రేషన్ షాపులో మావోయిస్టులు రేషన్ తీసుకున్నారని పోలీసులు ఆరోపించారు. తర్వాత సాయిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే, చాలా నెలల పాటు జైలులో ఉన్న సాయిరెడ్డి పోలీసుల మనిషిగా మారిపోయారని మావోయిస్టులు ఆరోపించారు.

ఆయన ఇంటిపై మావోయిస్టులు బాంబులతో దాడి కూడా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఇవన్నీ జరిగినప్పటికీ పోలీసులు ఆయన్ను ‘మావోయిస్టు’ అనే పిలిచేవారు.

2013 డిసెంబరు 6న పట్టపగలు, బీజాపూర్‌లని బన్సగూడ మార్కెట్‌లో అనుమానిత మావోయిస్టులు 50 ఏళ్ల సాయిరెడ్డిని చంపేశారు.

పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తుండడంతో సాయిరెడ్డిని చంపేశామని మావోయిస్టులు ప్రకటించారు.

బస్తర్ జిల్లాలోని సుక్మాకు చెందిన జర్నలిస్టు నేమిచంద్ జైన్ కథ దీనికి భిన్నమైనది కాదు.

2013 ఫిబ్రవరి 12న మావోయిస్టులు 45 ఏళ్ల నేమిచంద్‌ను హత్యచేశారు. ఆయన మృతదేహం దగ్గర ఓ లేఖను విడుదల చేశారు.

పోలీసులకు గూఢచారిగా పనిచేస్తుండడంతో ఆయన్ను హత్యచేశామని ఆ లేఖలో తెలిపారు.

సాయిరెడ్డి హత్యకు వ్యతిరేకంగా జర్నలిస్టులు పెద్దఎత్తున నిరసనలు చేయడంతో తాము హత్య చేయలేదని మావోయిస్టులు ప్రకటించారు.

ఆ తర్వాత కూడా జర్నలిస్టులు ఆందోళన కొనసాగించారు. ఈ హత్యపై మావోయిస్టులు క్షమాపణ చెప్పేదాకా, ఈ హత్యకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకునేదాకా మావోయిస్టులకు సంబంధించిన వార్తలను బహిష్కరించాలని బస్తర్‌లోని జర్నలిస్టులంతా నిర్ణయించారు.

నేమిచంద్ జైన్ హత్య జరిగిన 45 రోజుల తర్వాత మావోయిస్టులు తమ తప్పును అంగీకరించారు.

బీజాపూర్ అడవుల్లోకి జర్నలిస్టులను తీసుకెళ్లిన మావోయిస్టులు తమ సభ్యులు తప్పుచేశారని అంగీకరించి క్షమాపణలు చెప్పారు. పార్టీలో దిగువస్థాయి క్యాడర్ నేమిచంద్‌ను హత్యచేసిందని, అగ్రనాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుని, బాధ్యులను శిక్షిస్తుందని తెలిపారు.

”మేం ఎవరివైపూ ఉండం. కానీ అందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మేం ఎవరికన్నా వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే, వారి శత్రుశిబిరానికి చెందినవారంగా మామీద ముద్రవేస్తారు. మమ్మల్ని బ్లాక్‌మెయిలర్లని పిలవడం ఇంకా తేలిక. రాయ్‌పూర్ లేదా దిల్లీలో పనిచేసే జర్నలిస్టుల్లో ఎంతమంది గుండెలపై చేయివేసుకుని తాము స్వచ్ఛమైనవాళ్లమని చెప్పగలరని నేనడగాలనుకుంటున్నా” అని బీజాపూర్‌కు చెందిన ఒక జర్నలిస్టు అన్నారు.

ముకేశ్ చంద్రాకర్

ఫొటో సోర్స్, Alok Putul/BBC

జీతం ఉండదు.. భద్రత ఉండదు

ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ నుంచి సర్‌గూజా డివిజన్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల్లో ఎక్కువమందికి న్యూస్ పేపర్లు, టీవీ చానళ్లు అప్పాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వవు. వారికి క్రమబద్ధమైన జీతాలుండవు.

న్యూస్ పేపర్లలో ప్రచురితమైన, టీవీల్లో ప్రసారమైన ప్రకటనల్లో కొంచెం భాగం వారి ఏకైక ఆదాయ వనరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏదన్నా జరిగితే సదరు మీడియా సంస్థ చేతులు దులుపేసుకుని ఊరుకుంటుంది. బస్తర్‌లో దర్బా జర్నలిస్ట్ సంతోష్ యాదవ్ విషయంలో అయినా, సోమారు నాగ్ అయినా, గీడమ్ జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ విషయంలో అయినా ఇలాగే జరిగింది.

మావోయిస్టు సానుభూతిపరులుగా ఆరోపిస్తూ పోలీసులు ఈ జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు వారు పనిచేస్తున్న సంస్థలు తమకు సంబంధం లేనట్టు ఊరుకున్నాయి.

తర్వాత ఈ జర్నలిస్టులు అన్ని కేసుల్లోనూ నిర్దోషులుగా తేలారు. అయితే జైల్లో ఉన్నప్పుడు, కేసుల విచారణ సమయంలో వారు ఎదుర్కొన్న హింస, వారి కుటుంబ సభ్యులు అనుభవించిన బాధకు లెక్కకట్టలేం.

”క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులను ఎడిటర్లు కూడా పొగుడుతుంటారు. కానీ వారికందే జీతం గురించి మాట్లాడాల్సివస్తే నోర్లు పనిచేయవు. ఇలాంటి పరిస్థితుల్లో బస్తర్‌లో పనిచేసే జర్నలిస్టులు ఆర్థిక భద్రత కోసం మరో పని చేయాల్సివస్తుంది. అయితే జర్నలిజం ముసుగులో ఆ పని చేస్తున్నప్పుడు, ఇతర ఆర్థిక వనరుల సమీకరణ జరిగినప్పుడు సంక్షోభం తీవ్రమవుతుంది” అని దంతెవాడకు చెందిన ఓ జర్నలిస్ట్ చెప్పారు.

”జర్నలిస్టుల భద్రత గురించి మనమంతా ఆందోళన చెందుతున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం ఫైళ్ల పరిధి దాటి క్షేత్రస్థాయికి ఎప్పుడూ చేరదు” అని రాయ్‌పూర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ ఠాకూర్ చెప్పారు.

ఈ చట్టం అద్భుతైన మార్పులేమీ తేదని, కానీ పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడుతుందన్న ఆశ జర్నలిస్టులకు కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

”జర్నలిస్టుల పేరు, అడ్రస్‌తో ఓ లేఖ లేదా మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకోవడం పోలీసులకు చాలా తేలిక. వారిదగ్గర అలాంటివి చాలా ఉంటాయి” అని ఫ్రఫుల్ ఠాకూర్ అన్నారు.

జర్నలిస్టుల భద్రత కోసం కాంగ్రెస్ చట్టం చేసిందని, కానీ అందులో అన్ని నిబంధనలు మార్చివేసిందని ఆయన తెలిపారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో జర్నలిస్టుల రక్షణ చట్టం ప్రవేశపెట్టే అవకాశముందని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ రమణ్‌ సింగ్ అన్నారు.

జర్నలిస్టుల రక్షణ చట్టంలోని అసమానతలు తమ దృష్టికి వచ్చాయని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ బీబీసీతో చెప్పారు. రాజ్యాంగం పరిధిలోపల మెరుగైన మార్పులు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరినీ సంప్రదించి చట్టాన్ని మరింత ప్రభావవంతంగా మారుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

అప్పటిదాకా ఛత్తీస్‌గఢ్, బస్తర్‌లో పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిందే. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు ఒంటరిగా ఈ సవాళ్లను అధిగమించాల్సిఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS