SOURCE :- BBC NEWS

వెనెజ్వేలాలో చిత్రహింసలు

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC

‘‘మీరు ఇక ఊపిరి తీసుకోలేనంత వరకు వారు గాలి ఆడని గదిలో మిమ్మల్ని బంధించే ఉంచుతారు. వెనెజ్వేలాలో రాజకీయ ఖైదీల చిత్రహింసల చాంబర్లవి.’’

20 ఏళ్ల జువాన్ తన కథ చెప్పడం ఇలా మొదలుపెట్టారు. ”వాళ్లు ఇప్పటికే నన్ను చిత్రహింసలు పెట్టారు. కానీ వారు నా గొంతు నొక్కలేకపోయారు. నన్ను మాట్లాడనీకుండా చేయలేకపోయారు. నాకు మిగిలింది నా గొంతు ఒక్కటే” అని అన్నారాయన.

గత ఏడాది జులై 28న జరిగిన అధ్యక్ష ఎన్నికలప్పుడు తనను నిర్బంధించిన తర్వాత వెనెజ్వేలా భద్రతా బలగాలు తనను శారీరకంగా, మానసికంగా హింసించాయని ఆయన ఆరోపించారు.

నికోలస్ మదురో గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించిన తర్వాత దేశంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇందులో పాల్గొన్న వారిలో దాదాపు వంద మందిని అరెస్టు చేశారు. అలా అరెస్టు అయిన వారిలో జువాన్ ఒకరు. ఎన్నికల రికార్డులను బయటపెట్టకపోవడంతో ప్రతిపక్షంతో పాటు అనేక దేశాలు ఈ ఫలితాలను, వెనెజ్వేలా ఎన్నికలను మోసపూరితమని ఆరోపించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Reuters

నిరసనల్లో 20 మందికిపైగా మృతి

ఎవరెవరిని అరెస్టు చేశారనేదానిపై ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు ప్రారంభం నాటికి ‘2,229 మంది ఉగ్రవాదులను బంధించాం’ అని మదురో చెప్పారు.

అరెస్టుల్లో ఏమైనా అన్యాయం జరిగి ఉంటే సరిదిద్దాలని మదురో పిలుపునిచ్చిన తర్వాత నవంబరు మధ్యలో జువాన్ జైలు నుంచి విడుదలయ్యారు.

వీడియో కాల్ ద్వారా బీబీసీ ఆయనతో మాట్లాడింది. ఆయన భద్రత దృష్ట్యా కేసుకు సంబంధించి కొన్ని వివరాలు బయటపెట్టకూడదని మేం నిర్ణయించాం. అలాగే ఆయన పేరు మార్చాం.

నిర్బంధంలోకి తీసుకున్నవారిలో చాలామందిని చిత్రహింసలు పెట్టారని ఆ యువకుడు ఆరోపించారు. కుళ్లిన ఆహారం పెట్టారని, తిరుగుబాటులో చురుకుగా పాల్గొన్నవారిని చిత్రహింసలు పెట్టే చాంబర్లలో బంధించారని ఆ యువకుడు తెలిపారు.

తాను చెప్పే విషయాలను నిర్ధరించేందుకు అనేక పత్రాలను, సాక్ష్యాలను ఆయన బీబీసీకి చూపించారు. స్వచ్ఛంద సంస్థలు చేసిన ఆరోపణలు, చూపిన సాక్ష్యాల మాదిరిగానే ఇవి కనిపించాయి.

ఎన్నికల ప్రచారం సమయంలో తనకు ఓ ఆశ కనిపించిందని, చాలామంది మార్పు కోసం ఓటెయ్యాలని భావించారని ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్యకర్త అయిన జువాన్ చెప్పారు.

అయితే ఎప్పుడైతే ఆదివారం అర్ధరాత్రి తర్వాత మదురో విజయంపై ప్రకటన వెలువడిందో అప్పుడు పరిస్థితి మారిపోయింది. అప్పటిదాకా పండగ వాతావరణంలో ఉన్న ప్రజలు గందరగోళానికి గురయ్యారని, అది ఆగ్రహంగా పరిణమించిందని ఆయన వెల్లడించారు.

ఫలితం మోసపూరితమైనదిగా భావించిన వేలామంది వెనెజ్వేలా ప్రజలు వీధుల్లో నిరసనలకు దిగారు.

పోలీసుల అణిచివేతను ప్రతిపక్షం, అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి. నిరసనల్లో 20 మందికిపైగా చనిపోయి ఉంటారని అంచనా.

ఆ మరణాలకు ప్రతిపక్షం, మితవాద, తీవ్రవాద సంస్థలు కారణమని మదురో, ఆయన అధికారులు ఆరోపించారు.

  చిన్న పనిష్మెంట్ సెల్స్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC

నిరసనల తర్వాత కొందరు మిస్సింగ్

నిర్బంధంలోకి తీసుకున్న 23 మంది కనిపించకుండా పోయారని వెనెజ్వేలాకు చెందిన ఫోరో పీనల్ అనే ప్రభుత్వేతర సంస్థ తెలిపింది. ”వాళ్లిప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. వారిని అరెస్టు చేశారన్న విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలం” అని లాయర్, యాక్టివిస్ట్ గొజాలో హిమియోబ్ బీబీసీతో చెప్పారు.

నిరసనల తర్వాత కొంతమంది కనిపించకుండా పోయారన్న నివేదికలపై వెనెజ్వేలా ప్రభుత్వం స్పందించలేదు.

”అరెస్టులు ఏకపక్షంగా జరిగాయి. ఎడ్ముండో గొంజాలెజ్‌ను విజేతగా ప్రకటించినప్పుడు సంబరాలు జరుపుకున్నారని, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారని ఆరోపిస్తూ అనేక మందిని అరెస్టు చేసినట్లు రికార్డులున్నాయి” అని హిమియోబ్ చెప్పారు.

”నిరసనల్లో పాల్గొనకుండా, ఏదో ఒక కారణంతో ప్రదర్శనలకు దగ్గరగా ఉన్న వారిని సైతం అరెస్టు చేసిన కేసులున్నాయి” అని ఆయన తెలిపారు.

అలాంటి వారిలో జువాన్ ఒకరని చెప్పారు.

సెల్‌లో ఖైదీ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC

కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్

తన పని తాను చేసుకుంటుండగా ఒక గ్రూప్ వచ్చి తనను అడ్డగించిందని, తనను తీవ్రవాదిగా ఆరోపిస్తూ ముఖంపై ముసుగు వేసి, తనను కొట్టారని ఆ యువకుడు తెలిపారు.

”నా మీద రసాయనాలు, పెట్రోల్ చల్లారు. తర్వాత డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు” అని ఆయన తెలిపారు.

చాలా వారాల పాటు వెనెజ్వేలాలోని ఒక జైలులో ఆయన్ను ఉంచారు. తర్వాత రాజధాని కారకాస్‌కు 140 కిలోమీటర్లు దూరంలోని టోకోరాన్‌కు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే క్రూరాత్మక జైలు అది.

అక్కడే తన జీవితంలోనే అత్యంత దారుణమైన అనుభవాలు ఆయనకు ఎదురయ్యాయి.

”టొకొరాన్‌కు చేరుకున్న తర్వాత మా దుస్తులు విప్పించారు. కొట్టారు, అవమానించారు. తల పైకెత్తి మేం గార్డులను చూడకూడదు. తలదించుకుని నేలవైపే చూస్తుండాలి” అని జువాన్ గుర్తు చేసుకున్నారు.

జువాన్‌కు ఒక చిన్న సెల్ కేటాయించారు. అది 3 మీటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు ఉంది. ఆ గదిలో ఆయనతోపాటు ఐదుగురు ఉంటారు. అంటే ఆ చిన్నగదిలోనే ఆరుగురు ఉండాలి.

ఆ గదిలో మూడు బంక్ బెడ్స్‌ను ఆరు బెడ్స్‌గా ఏర్పాటు చేశారు. ఒక మూలన సెప్టిక్ ట్యాంక్ ఉంది. షవర్‌లా పనిచేసే పైపు ఉంది. అది బాత్‌రూమ్.

”టొకొరాన్‌లో ఉన్నప్పుడు నేను జైలులో ఉన్నానని అనిపించలేదు, కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లో ఉన్నట్టే అనుకున్నా. ఆ బెడ్‌లు సన్నని పరుపులున్న కాంక్రీట్ సమాధుల్లా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

”వాళ్లు నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారు. ఎవరినీ నిద్రపోనిచ్చేవాళ్లు కాదు. లేచి, లైన్లో నిల్చోండి అని చెప్పడానికే వారెప్పుడూ వచ్చేవారు.

సెల్ వెనక, లైన్‌లో నిల్చోడానికి మమ్మల్ని ఉదయం 5 గంటలకే లేపేవారు. పాస్‌లు, నంబర్లు చూపించమని గార్డులు అడిగేవాళ్లు. ఆరింటికి స్నానం చేయడానికని ఆరు నిమిషాలు నీళ్లు వదిలేవారు.

ఒకే ఒక్క షవర్, ఆరుగురికి ఆరే నిమిషాలు. చాలా చల్లని నీళ్లతో ఆ స్నానం చేయాలి. మీరే చివరివారు అయితే ఒంటిమీద సబ్బంతా పోయేలా నీళ్లు పోసుకోవడానికి కూడా టైమ్ సరిపోదు. రోజు మొత్తం అలా సబ్బుతోనే ఉండాలి” అని ఆయన చెప్పారు.

‘‘తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎదురుచూడాలి. కొన్నిసార్లు అది ఉదయం ఆరు గంటలకు వస్తుంది. మిగిలిన సమయాల్లో మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది.

డిన్నర్ కొన్నిసార్లు రాత్రి 9 గంటలకు వస్తే, మరికొన్నిసార్లు అర్ధరాత్రి 2 గంటలకు వస్తుంది.

భోజనం కోసం ఎదురుచూస్తూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆ చిన్నగది లోపల తిరుగుతూ కథలు చెప్పుకోవడమొక్కటే మేం చేయగలిగింది. రాజకీయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లం. కానీ చాలా చిన్నగొంతుతో. ఎందుకంటే గార్డులు మా మాటలు వింటే శిక్ష విధిస్తారు” అని ఆయన చెప్పారు.

తన తోటివాళ్లలో చాలా మంది నిరాశానిస్పృహలకు లోనై జాంబీల్లా ప్రవర్తించేవారని జువాన్ చెప్పారు.

జైలు బయట భావోద్వేగ దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

చనిపోయాననే అనుకున్నా…

‘‘మాకు కుళ్లిన ఆహారాన్ని పెట్టారు. కోళ్లకు, కుక్కలకు వేసినట్లుగా గడువుతీరిపోయిన మాంసం ముక్కలను పెట్టేవాళ్లు.

నిర్బంధంలో ఉన్నవారిలో కొందరిని ఊరికే కొట్టేవారు. లేదంటే వారిని కప్పల్లా దూకమనే వాళ్లు.

తీవ్రమైన తిరుగుబాటుదారులని వాళ్లకు అనిపించినవారిని, లేదంటే ధైర్యంగా రాజకీయాల గురించి మాట్లాడేవారిని, బంధువులకు ఫోన్ చేసుకుంటామని అడిగేవాళ్లని ‘పనిష్‌మెంట్ సెల్స్’కు పంపేవారు.

టొకొరాన్‌లో పనిష్‌మెంట్ సెల్స్‌లో ఒకదాంట్లో తానున్నానని జువాన్ చెప్పారు. అక్కడ రెండురోజులకోసారి మాత్రమే భోజనం పెట్టేవారని తెలిపారు.

”అది చాలా చీకటి గది. ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండేది. నాకు చాలా ఆకలిగా ఉండేది. ఈ అన్యాయాలన్నింటి నుంచి ఏదో ఒకరోజు తప్పించుకోగలను అని ఆలోచిస్తూ ఉండేవాడిని” అని ఆయన చెప్పారు.

మరో చిత్రహింసల సెల్ పేరు ”అడోల్ఫో బెడ్”. ఆ సెల్‌లో శిక్ష అనుభవించిన వ్యక్తి చనిపోయిన తర్వాత దానికి ఆ పేరు వచ్చింది.

”అది చీకటి గది. ఓ చిన్న ఖజానా తరహాలో ఉంటుంది. ఆక్సిజన్ ఉండదు. మీరు ఊపిరి తీసుకోవడం ఆగిపోయేవరకు లేదా మూర్ఛపోయేంతవరకు, లేదా భరించలేక తలుపును బాదడం మొదలుపెట్టేవరకు కొన్ని నిమిషాల పాటు మిమ్మల్ని అక్కడ ఉంచుతారు.

”వాళ్లు నన్నక్కడ ఐదు నిమిషాలకు పైగా ఉంచారు. నేను చనిపోతున్నాననుకున్నా” అని జువాన్ గుర్తుచేసుకున్నారు.

అత్యంత అమానవీయంగా..

జైలులో వారానికి మూడుసార్లు పదినిమిషాల పాటు వ్యాయామం చేసేందుకు అనుమతిస్తారని, కానీ చాలా మంది తమ సెల్స్‌లోనే ఉండేవారని ఆయన చెప్పారు.

నిర్బంధంలో ఉన్నవారి పరిస్థితులు దయనీయమైనవని ఫోరో పెనాల్‌కు చెందిన హిమియోబ్ చెప్పారు.

లాయర్‌ను నియమించుకోవడం వంటి ప్రాథమిక హక్కులు కూడా నిరాకరించారని ఆరోపించారు.

వారందరికీ పబ్లిక్ డిఫెండర్లు ఉన్నారు. ప్రభుత్వ అధికారి కానీ ప్రయివేట్ అటార్నీని నియమించుకోవడానికి అవకాశం ఇస్తే.. ఉల్లంఘన ప్రక్రియనంతటినీ ఆమె లేదా ఆయన డాక్యుమెంట్ చేయవచ్చన్న విషయం ప్రభుత్వానికి తెలుసు.

అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని 2024 అక్టోబరులో ఐక్యరాజ్యసమితి నిపుణులు రిపోర్టు ఇచ్చారు. అలాగే ఎన్నికల అనంతరం జరిగిన ప్రదర్శనలు, రాజకీయ హింస, అదనంగా బలగాలను వినియోగించడం, కొందరు కనిపించకుండా పోవడం, భద్రాత బలగాలు, ఇతర సాధారణ పౌరుల గ్రూపులు చట్టానికి వెలుపల సాగించిన ఉరితీతలు వంటివాటిపై నివేదికలో వివరించారు.

మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ప్రస్తుతం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)దర్యాప్తు చేస్తోంది.

ఈ ఆరోపణలను వెనెజ్వేలా ప్రభుత్వం ఖండించింది. రాజకీయ ఒత్తిళ్ల కోసం అంతర్జాతీయ క్రిమినల్ న్యాయాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించింది.

నిర్బంధంలో ఉన్నవారిని చిత్రహింసలకు గురిచేయడం, వారితో అమానవీయంగా ప్రవర్తించడం వంటివాటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌ను ఇంటర్వ్యూ కోసం సంప్రదించగా, ఈ కథనం ప్రచురించే సమయానికి వారి దగ్గరనుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

‘నేను ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదు’ అని అన్నారు జువాన్.

తన సహచరులు వందలాది మంది ఇంకా జైల్లో కష్టాలు పడుతుండడంతో తాను కొంత పశ్చాత్తాపంతో ఉన్నానని జువాన్ అంగీకరించారు.

కొన్ని నెలల క్రితం ప్రతిపక్షనేత ఎడ్విన్ శాంటోస్ మరణించారు. అక్టోబరు 25న ఆయన చనిపోయినట్టు గుర్తించారు. భద్రతాదళాలుగా చెప్పుకునే ఓ గ్రూప్ ఆయన్న నిర్బంధించడం కొందరు ప్రత్యక్షంగా చూశారు. ఇది జరిగిన రెండు రోజల తర్వాత ఆయన చనిపోయి కనిపించారు.

”నేను భయపడడం లేదు” అని జువాన్ మళ్లీ చెప్పారు. తనకేదన్నా జరిగితే ఏం చేయాలనేదానిపై ఆయన కొన్ని నోట్‌లు రాసిపెట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)