SOURCE :- BBC NEWS
సంక్రాంతితో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. చేతికొచ్చిన పంటతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకున్నా, దేశం అంతటా ఈ పండుగ సందర్భంగా చాలామంది చేసుకునే మిఠాయిలు, పిండి వంటల్లో బెల్లం, నువ్వులదే ఆధిపత్యం.
తెలుగు రాష్ట్రాల్లో అరిసెలు, చక్కెర పొంగలి, నువ్వుల లడ్డూలు చేస్తే, ఉత్తర భారతదేశంలో చాక్ పీస్ లాగా గట్టిగా ఉండే రేవ్డీ, బిస్కెట్ లా లైట్‌గా, క్రిస్పీగా ఉండే గజ్జక్, తిల్ కే లడ్డు (నువ్వుల లడ్డు) చాలా ప్రసిద్ధి.
అయితే సంక్రాంతి సమయంలో చేసుకునే వంటకాలల్లో నువ్వులు, బెల్లం ఎందుకు వాడతారు? వీటిలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి?
చరిత్రలో పిండి వంటల ప్రస్తావన
పిండి వంటలకు పెద్ద చరిత్రే ఉంది. 12వ శతాబ్దంలో శ్రీనాథుడి కాలంలో రచించిన కావ్యాల్లో చక్కెర పొంగలి, ఇతర తెలుగు పిండివంటల ప్రస్తావన ఉందని, తెనాలి రామకృష్ణుడు, కృష్ణ దేవరాయలు కూడా తమ కావ్యాల్లో చాలా రకాల ఆహార పదార్ధాలను ప్రస్తావించారని, కళ్యాణి చాళుక్య రాజు సంస్కృతంలో రచించిన మానసోల్లాసంలో కూడా చాలా వరకూ పండగ వంటల ప్రస్తావన కనిపిస్తుందిని డాక్టర్ పూర్ణ చందు గతంలో బీబీసీతో చెప్పారు.
బెల్లం శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని, నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని హైదరాబాద్‌లోని యశోద హాస్పటిల్ డిప్యూటి చీఫ్ డైటీషన్ డాక్టర్ ఏ. శ్వేత బీబీసీతో చెప్పారు.
‘‘సంప్రదాయ స్వీట్లు, వంటకాలు వాతావరణ మార్పును తట్టుకోగలిగేలా, ఎముకలకు, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేసినవే’’ అని ఆమె అన్నారు.
బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. తక్షణ శక్తిని ఉత్పత్తి చేసి, శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి కూడా మంచిది.
నువ్వుల్లో ప్రొటీన్లు, కాల్షియం ఎక్కువ. కాల్షియం, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు, జింక్, వంటి సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి.
“ఐరన్, ప్రోటీన్లకు మూలం అయిన బెల్లం, నువ్వులతో వరి పిండి (కార్బోబోహైడ్రేట్స్) కలిపి చేసిన వంటకాల్లో అన్సాచ్యురేటెడ్ ఫాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి, గుండెకు కూడా మంచివి” అని డాక్టర్ శ్వేత వివరించారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఐరన్ లోపం ఉన్న వాళ్లు తాము తీసుకునే ఆహారంలో బెల్లంకు ప్రాధాన్యం ఇస్తే ఫలితాలు ఉంటాయని కొన్ని పరిశోధన పత్రాలు చెబుతున్నాయి. నువ్వులు కొవ్వును తగ్గిస్తాయి. కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇవి మంచివని చెబుతారు.
ఐరన్ లోపం ఉన్న పిల్లల్లకు ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలతో సహజంగా ఐరన్ లోపాన్ని ఎదుర్కోవచ్చని పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్మర్)లో సైంటిస్ట్‌లు ఇటీవలే ఓ అధ్యయనంలో తేల్చారు.
ఐరన్ లోపంతో బాధపడుతున్న 6 నుంచి 11 ఏళ్ల వయసులో ఉన్న 82 మంది పిల్లలను రెండు గ్రూపులుగా విభజించారు. ఎనిమిది వారాల పాటు ఒక గ్రూప్‌కు ఐరన్ సిరప్, మరో గ్రూప్‌కు అదే మోతాదులో ఐరన్ సిరప్‌తో పాటు, నువ్వుల బెల్లం లడ్డూను ఇచ్చారు. రెండు గ్రూప్‌ల ఫలితాలను పోల్చినప్పుడు నువ్వుల బెల్లం లడ్డూలు తీసుకున్న పిల్లల్లో ఐరన్ స్థాయి ఎక్కువగా మెరుగుపడింది.
“అయితే బెల్లంతో తయారు చేసే పిండివంటలు ఆరోగ్యానికి మంచివే అయినా నిర్ణీత మోతాదులోనే తీసుకోవాలని’’ అని డాక్టర్ శ్వేత అన్నారు. అన్నింటికన్నా ముఖ్యం ఇంట్లో చేసుకునే పిండి పదార్థాలే తినడం అంటారు ఆమె.
‘‘చిక్కీలు, నువ్వుల లడ్డులూ మంచివే కదా అని చాలా మంది బయట షాపుల్లో కొంటూ ఉంటారు. వాటిలో వాడింది బెల్లమా, చక్కెరా? అని ఎలా తెలుస్తుంది? వాటి లేబుల్స్ చదవాలి. కొందరు మాత్రమే చదువుతారు. నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం వీటిని తయారు చేసినా ఎక్కువ రోజులు ఉండాలని ప్రిజర్వేటివ్స్ వాడతారు. అందువల్ల తాజా ఆహారం తినడం ఉత్తమం’’ అని డాక్టర్ శ్వేత చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)