SOURCE :- BBC NEWS

డింగీలో తల్లి, శిశువు

ఫొటో సోర్స్, SALVAMENTO MARITIMO/REUTERS

ఆఫ్రికా నుండి కానరీ దీవులకు వలసదారులతో వెళుతున్న పడవ(డింగీ)లో ఓ మహిళ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి ఉంది.

ఈ విషయాన్ని స్పానిష్ కోస్ట్ గార్డ్స్ నిర్ధరించింది. కిక్కిరిసిన డింగీలో కూర్చుని ఉన్న వలసదారుల మధ్య మహిళ శిశువుతో ఉన్న ఫోటోను కోస్ట్‌గార్డ్స్ విడుదల చేసింది.

“అప్పుడే పుట్టిన ఆ పసికందును చూసి ఆశ్చర్యపోయా’’ అని రెస్క్యూ బోట్ కెప్టెన్ డొమింగో ట్రుజిల్లో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ పడవ జనవరి 6న లాంతరోటే ద్వీపం దగ్గర తొలిసారి కనిపించింది.

రెస్క్యూ సిబ్బంది డింగీ వద్దకు చేరుకునేటప్పటికి, వలసదారులతో నిండి ఉన్న ఆ డింగీలో తల్లి పడుకుని ఉందని, శిశువును ఒక ప్రయాణీకుడు చేతుల్లో పెట్టుకుని కూర్చున్నాడని కెప్టెన్ డొమింగో చెప్పారు

‘‘ఇందులో ఒక గర్భిణి ఉందని మాకు తెలిసింది. కానీ మేం అక్కడికి చేరుకోవడానికి 10 నుంచి 20 నిమిషాల ముందే ప్రసవించినట్లుంది.’’ అని రెస్క్యూ సిబ్బందిలో ఒకరు చెప్పారు.

వైద్యుల సలహా మేరకు, తల్లీ బిడ్డలను, హెలికాప్టర్ సహాయంతో లాంతరోటేలోని ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేదని వైద్య సిబ్బంది వెల్లడించారు.

“త్రీ కింగ్స్ డే రోజు మాకు అందిన విలువైన బహుమతి ఇది” అని హెలికాప్టర్ కమాండర్ రాయిటర్స్ సంస్థతో అన్నారు.

స్పెయిన్‌లో క్రైస్తవ సంప్రదాయంలో ఎపిఫనీ అనే పండుగ రోజున శిశువు జన్మించాడు. ఆ సందర్భంగానే త్రీ కింగ్స్ డే జరుపుకుంటారు.

వలసదారులు

ఫొటో సోర్స్, SALVAMENTO MARITIMO/REUTERS

ఆఫ్రికా నుండి కానరీ దీవులకు సముద్రం ప్రయాణం చాలా ప్రమాదకరం. గత ఏడాది 46,800 వలసదారులు సరైన పత్రాలు లేకుండా ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారని స్పానిష్ ప్రభుత్వ తాజా డేటా చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)