SOURCE :- BBC NEWS

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

కేరళలోని పతనం తిట్ట జిల్లాలో 18 ఏళ్ల విద్యార్థిని, తనపై గత 3 -4 సంవత్సరాల పాటు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురిపై ఫిర్యాదు చేసిన కేసులో పోలీసులు ఇప్పటి వరకు 20మంది అరెస్టు చేశారు.

బాధితురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ. నిందితులంతా తనను లైంగికంగా వేధించారని, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

ఈ కేసులో నిందితులు మొత్తం 64 మందని కేరళ పోలీసులు చెప్పారు. వీరిలో చాలామంది ఇంటి చుట్టుపక్కల వాళ్లు, బాధితురాలి తండ్రి స్నేహితులు, క్రీడా శిక్షకులే. వీరంతా 19 నుంచి 47 సంవత్సరాల మధ్య వయస్కులు. ఈ మహిళను లైంగికంగా వేధించిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన మొత్తం 8 కేసులను పోలీసులు నమోదు చేశారు. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి.

” గత 5 ఏళ్లుగా ఆమెపై ఈ వేధింపులు జరిగాయి. అప్పటికి బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం, ఎస్‌సి, ఎస్‌టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసులు నమోదయ్యాయి’’ అని పతనం తిట్ట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నందకుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పతనంతిట్ట

ఫొటో సోర్స్, https://ps.keralapolice.gov.in

ఈ కేసులో మూడు గ్యాంగ్ రేప్ ఘటనలు: నందకుమార్

బాధితురాలి ఇంటి పక్కన నివసించే ఆమె చిన్ననాటి మిత్రుడు ఈ కేసులో మొదటి నిందితుడు. నిందితుడితో స్నేహం ఏర్పడేనాటికి తన వయసు 13 సంవత్సరాలని బాధితురాలు వెల్లడించారు.

మూడు గ్యాంగ్ రేప్ కేసుల్లో కనీసం ఒకదాంట్లో బాధితురాలి స్నేహితుడి ప్రమేయం ఉందని పోలీసులు చెప్పారు.

బాధితురాలిని లైంగికంగా వేధించిన కేసుకు సంబంధించిన ఆధారాలు అతని మొబైల్ ఫోనులో ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని ఆమెపై మరింత వేధింపులకు దిగాడని, బ్లాక్‌ మెయిల్ చేసి తన స్నేహితుల దగ్గరకు కూడా ఆమెను తీసుకెళ్లేవాడని పతనంతిట్ట క్రైమ్ బ్రాంచ్ మీడియా సెల్ ప్రతినిధి సజీవ్ మనక్కట్టుపుళ చెప్పారు.

కడుంబశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే స్నేహిత అనే కౌన్సిలింగ్‌ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది.

బాలికపై లైంగిక వేధింపులు

ఈ ప్రోగ్రామ్‌లో కౌన్సిలర్లు బాధిత కుటుంబాల వివరాలను సేకరించి, ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు బాధితురాలి ఇంటికి వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాలని బాధితురాలు నిర్ణయించుకున్నారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడాలని బాధితురాలు కోరడంతో కౌన్సిలర్లు తనను ఆశ్రయించారని పతనంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ఎన్. రాజీవ్ బీబీసీ‌తో చెప్పారు.

బాధితురాలు తన తల్లితో కలిసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయానికి వెళ్లారు. ఒక సైకాలజిస్ట్‌తో బాధితురాలు మాట్లాడుతుండగా, ఆమె తల్లి ఆఫీస్ బయట కూర్చున్నారు. నిందితుల వివరాలు బాధితురాలి తండ్రి ఫోన్‌లో ఉన్నాయని, ఆ ఫోన్ తీసుకురావాలని బాధితురాలి తల్లిని కోరడంతో నిందితుల పేర్లు బయటకు వచ్చాయి.” అని రాజీవ్ అన్నారు.

సాధారణంగా సీడబ్ల్యూసీ కేసులను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు అప్పగించాలి. ”కానీ ఈ కేసు తీవ్రత కారణంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఆశ్రయించాలని మేం నిర్ణయించుకున్నాం. ఆయన వెంటనే స్పందించారు” అని రాజీవ్ తెలిపారు.

మరోవైపు ఈ కేసుపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ విమెన్స్ కమిషన్ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేరళ విమెన్స్ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.

బాధితురాలిని, ఆమె తల్లిని ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)