SOURCE :- BBC NEWS
ఒక పసిపాపతో హీరోకి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటే అది హిట్ ఫార్ములా. బంగారు పాప, పసివాడి ప్రాణం నుంచి కొన్ని పదుల సినిమాల పేర్లు చెప్పొచ్చు. అయితే కథ పాతదైనా, కథనం కొత్తగా వుండాలి.
బాలకృష్ణకు కొత్త కథ చేయడం కష్టం. ఎలివేషన్స్, డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో మిక్స్ చేసి కథని వండాలి. అన్నీ కుదిరితే సిక్సర్. మరి ‘డాకు మహారాజ్’ ఎన్ని రన్స్ కొట్టాడో చూద్దాం.
వరుసగా మూడు హిట్స్ ఉన్న బాలకృష్ణతో, వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొల్లితో, ప్రముఖ సంస్థ సితార నిర్మించిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతికి బరిలోకి దిగాడు.
కథ ఏంటంటే..
1996లో మదనపల్లెలో ఒక టీ ఎస్టేట్. దాని యజమాని కృష్ణమూర్తి (శరద్ ఖడేకర్). ఆయనకో మనవరాలు, ఆమె ప్రమాదంలో పడిందని తెలిసి హీరో ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. పాపని కాపాడుతూ ఉంటాడు. అతనెవరో కాదు మధ్యప్రదేశ్‌లోని డాకు మహారాజ్. భోపాల్ నుంచి తిహార్ జైలుకు తరలిస్తుంటే తప్పించుకుని మదనపల్లెకు వస్తాడు. అతన్ని పోలీస్ అధికారి స్టీఫెన్ వెతుకుతూ ఉంటాడు.
అసలా పాపకి , హీరోకి ఏంటి సంబంధం? చంబల్ గజదొంగ డాకు మహారాజ్ ఎవరు? విలన్ ఠాకూర్ (బాబీడియోల్)తో ఎందుకు వైరం? ఇవన్నీ సినిమా చూస్తే తెలుస్తాయి. చూడకపోయినా ఊహించొచ్చు.
ఫస్టాఫ్ బిగువుగా ఉండి, సెకెండాఫ్ తేలిపోవడానికి కారణం కథ ముగింపు సులభంగా అర్థం కావడమే. ఏ దర్శకుడికైనా సెకండాఫ్ సమస్యే. అది బాగుంటేనే సూపర్ హిట్. థియేటర్ నుంచి బయటికొచ్చేటపుడు ప్రేక్షకుడి ఫీలింగే కీలకం.
మొదటి సగంలో ఎన్ని చిక్కుముడులు వేసి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చినా చెల్లుతుంది. అయితే, రెండో సగంలో ఆ ముడులన్నీ విప్పి కథ చెపుతూ మెప్పించాలి. ఇలాంటి కథల్లో సెకండాఫ్ అంటే హీరో ఫ్లాష్ బ్యాక్. ఇక్కడే దర్శకుడు బాబీ తడబడ్డాడు. కొత్తగా ఆలోచించకుండా రొటీన్‌లోకి వెళ్లిపోయాడు.
తెలిసిన కథే అయినా ఫస్టాఫ్ స్టైలిష్‌గా ఉంటుంది. బాలకృష్ణ ఎలివేషన్ ఒక రేంజ్‌లో ఉంది. తక్కువ డైలాగులతో, ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తాడు. పాపకి, ఆయనకి మధ్య ఎమోషనల్ సీన్స్ పండాయి.
పాప కోసం లోకల్ ఎమ్మెల్యే (రవికిషన్) గ్యాంగ్‌తో యుద్ధం చేసిన హీరో అసలు లక్ష్యం వేరే ఉంటుంది. ఇంటర్వెల్ టైమ్‌కి మెయిన్ విలన్ ఠాకూర్ ఎంట్రీతో కథ మారుతుంది.
బాలయ్య మూడు రకాల పాత్రలతో మెప్పించాడు. డ్రైవర్ నానాజీ, ఇంజినీర్ సీతారామ్, డాకు మహారాజ్‌గా కనిపిస్తాడు. ఆయన సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే అతి లేకపోవడం విశేషం.
ఫస్టాఫ్ వరకూ కథని, కథనాన్ని పరిగెత్తించిన దర్శకుడు, సెకండాఫ్‌లో కూడా ఆ మ్యాజిక్ చేసి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది. ఈజీ టార్గెట్‌ని మిస్ చేశాడు. రొడ్డ కొట్టుడు కథ, విలనీకి చంబల్ బ్యాగ్రౌండ్‌ని ముడిపెట్టి ఎలాగో లాగించేసి బయటపడ్డాడు.
డాకూని చూస్తున్నప్పుడు విక్రమ్, జైలర్, బాహుబలి గుర్తుకొస్తే మన తప్పు కాదు. ప్రజల సమస్యలు అనగానే మన దర్శకులకు వెంటనే గుర్తొచ్చేది నీళ్లు, మైనింగ్, లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి భూముల్ని స్వాధీనం చేసుకోవడం.
ఇంతకు మించి కొత్తగా ఆలోచించే ఓపిక లేదు. కన్వీనియింట్‌గా 30 ఏళ్లు వెనక్కి వెళ్లడం. ఈ కథని ఇప్పటి కాలానికి చెప్పినా పెద్ద తేడా లేదు.
కేజీఎఫ్‌లో మైనింగ్ కష్టాల్ని అరగదీశారు. స్క్రీన్ మీద మళ్లీ అవే తరహా దృశ్యాలు కనిపిస్తే ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్‌ని చూసినపుడు అందరూ మోకాళ్లపై నిలబడి అభివాదం చేస్తారు.
డాకు మహారాజ్ ముందు అతని అనుచరులు కూడా అదే రకంగా చేస్తారు. కొన్ని చూసీచూడనట్టు వదిలేసి, సెకండాఫ్ కూడా ఓకే అనుకుంటే సంక్రాంతికి కూల్‌గా చూసేయొచ్చు.
సినిమాలో హీరోయిన్ ఉన్నా లేనట్టే. బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నా గుర్తింపు లేని పాత్రే. ఎంతోకొంత శ్రద్ధా శ్రీనాథ్‌కే నటించే చాన్స్ దక్కింది. ఊర్వశీ రౌతేలాతో దబిడి దిబిడి పాట కథకి అడ్డం. అభిమానులు బాధపడతారేమో అని పెట్టినట్టుంది. డ్యాన్స్ మధ్యలో దర్శకుడు బాబీ కూడా కనిపించి స్టెప్పులేస్తాడు.
సీరియస్‌గా కథ నడుస్తున్నప్పుడు పాట పెట్టడమే అనవసరం అనుకుంటే , మళ్లీ దర్శకుడు కూడా కనిపించడం ప్రేక్షకుడి మూడ్ పోగొట్టడానికే.
విలన్ బలంగా లేకపోవడం కూడా ఒక లోపం. ఫస్టాఫ్ అంతా రవికిషన్ గ్యాంగ్ హీరో చేతిలో తన్నులు తినడానికే సరిపోతుంది. ఇంటర్వెల్‌లో బాబీ డియోల్ ఎలివేషన్ చూస్తే డిఫరెంట్‌గా ఉంటాడనిపిస్తుంది. తీరా అతనూ రొటీన్ విలనే.
సత్య, విటివి గణేష్ ఉన్నా కామెడీకి అవకాశం లేకుండా పోయింది. ఇంకా చాలా మంది నటులున్నారు కానీ, అంతా ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లే. ఊరికే నిలబడి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు.
హీరో పంచ్ డైలాగ్‌లు చాలా చోట్ల పేలాయి. చంపడంలో మాస్టర్స్ డిగ్రీ చేశాననే హీరో, సినిమా అంతా నరుకుతూనే ఉంటాడు. అభిమానులకి గూస్‌బంప్స్ తెప్పిస్తాడు. వాళ్లకి సంక్రాంతి విందు భోజనమే.
సగటు ప్రేక్షకుడికి మామూలు మీల్సే.
ఫస్టాఫ్ తర్వాత దర్శకుడు సిక్సర్ కొట్టాడనుకున్నారు. సెకండాఫ్‌లో క్యాచ్ మిస్ అయ్యింది. కానీ, రన్స్ దక్కాయి. ఔట్ కాలేదు. అదే సేఫ్.
ప్లస్, మైనస్‌లు..
ప్లస్ పాయింట్స్:
1. ఫస్టాఫ్
2. బాలకృష్ణ లుక్, నటన
3. ఫొటోగ్రఫీ
4. బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
1. సెకండాఫ్
2. ఊహకు అందే కథ
3. రొటీన్ క్లైమాక్స్
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)