SOURCE :- BBC NEWS

వర్కింగ్ అవర్స్

ఫొటో సోర్స్, Getty Images

వారానికి 90 గంటలు వర్కింగ్ అవర్స్ ఉండాలని, ఆదివారాలు కూడా పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్‌పర్సన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

చాలామంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే, ఉద్యోగులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే విషయంపై కూడా మరోసారి చర్చ ఊపందుకుంది.

నటి దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్‌‌లో స్పందిస్తూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు షాక్‌కి గురిచేశాయని రాశారు. అలాగే, మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పేలా #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జతచేశారు.

ఇంతకుముందు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటలు పని చేయాలని అన్నారు.

ఇటీవల కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతూ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలోని కొంతభాగం రెడిట్‌లో పోస్ట్ అయింది.

ఆ వీడియోలో సుబ్రహ్మణ్యన్ ఇలా అంటున్నారు, ”ఒక మనిషి వారానికి 90 గంటలు పనిచేయాలి. మీతో ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు బాధగా ఉంది. అలా చేయగలిగితే సంతోషం. ఎందుకంటే నేను కూడా ఆదివారం పనిచేస్తా. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు?” అని అన్నారు.

”ఇంట్లో కూర్చుని, మీ ఆవిడ ముఖం ఎంతసేపని చూస్తారు?” అని కూడా సుబ్రహ్మణ్యన్ అన్నారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్

పని గంటలు, విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం, వ్యక్తిగత జీవితం గురించి సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్దయెత్తున్న చర్చకు కారణమయ్యాయి.

షాదీ డాట్‌ కామ్ వ్యవస్థాపకులు అనుపమ్ మిత్తల్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ”అయితే సర్, భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకోకపోతే మనదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఎలా అవుతుంది.” అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు.

దీపికా పదుకొణె, ఎల్ అండ్ టీ  సుబ్రహ్మణ్యన్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెవరు ఏమన్నారు..

ఈ చర్చలో పాలుపంచుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ”పని గంటల కంటే పనిలో నాణ్యత ముఖ్యమని నేను భావిస్తున్నా. 40 గంటలా, 70 గంటలా, 90 గంటలు పనిచేస్తారా అనేది విషయం కాదు, ఫలితం ఏంటనేదే అసలు విషయం. మీరు పది గంటలే పనిచేసినా, ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు” అని ఆయన రాశారు.

”నేను ఎక్స్‌లో ఉన్నాను కాబట్టి, ఒంటరిగా ఉన్నానని అనుకోవద్దని చెప్పాలనుకుంటున్నా. నాకు అద్భుతమైన భార్య ఉంది, ఆమెను చూస్తూ ఉండడం, ఆమెతో సమయం గడపడమంటే నాకిష్టం” అని మహీంద్రా పోస్ట్ చేశారు.

సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా కూడా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై స్పందించారు.

”అవును, ఆనంద్ మహీంద్రా.. నా భార్య నా భర్త గ్రేట్ అనుకుంటుంది, ఆదివారాలు నన్ను చూస్తూ ఉండడానికే ఇష్టపడుతుంది. పనిలో నాణ్యత ముఖ్యం, కానీ ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు” అని ఆయన రాశారు.

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా కూడా ఆనంద్ మహీంద్రా కామెంట్స్‌కు మద్దతుగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

”వారానికి 90 గంటలా? ఆదివారం పేరును ‘సన్-డ్యూటీ’గా మార్చి.. ‘డే ఆఫ్’ని ఓ పాత రొడ్డ ఆలోచనగా ఎందుకు మార్చకూడదు? కష్టపడి, తెలివిగా పనిచేయడాన్నే నేను నమ్ముతా, కానీ జీవితాన్ని శాశ్వతంగా ఆఫీస్ షిఫ్ట్‌గా మార్చేద్దామా? అలా చేస్తే అది విజయం కోసం కాదు, వినాశనానికే. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు, అవసరం. ఇదే నా అభిప్రాయం” అని ఆయన రాశారు.

స్మార్ట్‌గా పనిచేయండి, కానీ బానిసలా కాదు అని అర్థం వచ్చేలా #WorkSmartNotSlave అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

నిజానికి దేశంలో ఫ్యాక్టరీలు, షాపులు, వాణిజ్య సంస్థల వంటి ప్రదేశాల్లో పనిచేసే వారికి నిర్దిష్ట పని గంటలు ఉన్నాయి. అందుకు సంబంధించి కార్మిక, ఉపాధి శాఖ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలున్నాయి.

పనిగంటలు, కార్మికులు, ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

పనిగంటలపై ప్రజలు ఏమంటున్నారు?

ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై బీబీసీ ప్రజల నుంచి అభిప్రాయాలు అడిగింది. స్పందనగా, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఒకరు రోజుకి 6 గంటలు సరిపోతాయంటే, మరొకరు 8 నుంచి 9 గంటలు పనిచేయాలని అన్నారు.

ఫర్హాన్ ఖాన్ అనే యూజర్ ‘కార్మికులను దోచుకోవాలని ఎల్‌ అండ్ టీ చైర్మన్ సలహా ఇస్తున్నారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు.

‘పని పూర్తవడం ముఖ్యం, అంతేకానీ ఎన్ని గంటలనేది విషయం కాదు” అని మరో యూజర్ ప్రదీప్ కుమార్ రాశారు.

బ్రిజేశ్ చౌరాసియా ఇలా రాశారు, ”అది జీతం మీద ఆధారపడి ఉంటుంది. మేమేమీ దాతృత్వం కోసం పనిచేయడం లేదు. మా ఉపాధి కోసం చేస్తున్నాం.”

జాజ్ బాత్ కా ఇజార్ అనే ఐడీ నుంచి ఒక కామెంట్ చేశారు, అందులో ”నేను ఓనర్ అయితే, 24 గంటలూ అక్కడే ఉంటా” అని రాశారు.

పని గంటలు, ఉద్యోగులు, కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

వైద్యులు ఏమంటున్నారంటే..

దిల్లీ ఎయిమ్స్‌లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగ వైద్యులు డాక్టర్ సంజయ్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ, ”వారానికి 48 గంటలు పనిచేయడం వెనక ఒక కారణం ఉంది” అని అన్నారు.

”మీరు ఎంత పనిచేయగలరనేది, మీరు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది” అన్నారాయన.

”మీరు కంపెనీ యజమాని అయితే, మీపై ఒత్తిడి ఉండదు. ఓనర్ అనే దీమాతో పనిచేస్తారు. మీరు ఆఫీసుల్లో ఒత్తిడితో పనిచేస్తున్నారా, లేదంటే అభిరుచి కోసం పనిచేస్తున్నారా అనే దానిని బట్టి అది ఆధారపడి ఉంటుంది” అని డాక్టర్ సంజయ్ చెప్పారు.

పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ గౌరవ ప్రొఫెసర్ డాక్టర్ అమితాబ్ బెనర్జీ మాట్లాడుతూ, ”మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, ఇతర దేశాల్లో అయితే అలాంటోళ్లు చూద్దామన్నా కనిపించరు” అన్నారు.

”అసలు పనికి నిజమైన నిర్వచనం ఏమిటి? మీరు ఏదైనా 8 గంటలు పనిచేస్తున్నారని అనుకుందాం. అంతకంటే ఎక్కువ పనిచేస్తే, అలసిపోతారు, అలసిపోయాక కూడా పనిచేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఏదైనా ఫ్యాక్టరీలో అయినా, డ్రైవింగ్ చేసినా, అకౌంటింగ్ అయినా, ఎందులోనైనా వర్క్ యాక్సిడెంట్స్ జరగొచ్చు.”

”సృజనాత్మకతతో ఆలోచించే వాళ్లు 24 గంటలూ పనిచేస్తూ ఉన్నట్లే. మీరు భౌతికంగా పనిచేయకపోయినా, మీ మనసు సృజనాత్మకంగా పనిచేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాంటి వ్యక్తులు కలలో కూడా పనిచేయగలరు, బెంజీన్‌ తరహాలో. (బెంజీన్ ఒక రసాయన పదార్థం). బెంజీన్‌ను కలలోనే కనుగొన్నారు” అని అమితాబ్ బెనర్జీ వివరించారు.

పని గంటలు, ఉద్యోగులు, కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా వర్క్, లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఎక్కువ పని కారణంగా, శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతారు.

దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం, దిల్లీలోని బీఎల్ కపూర్ మ్యాక్స్ హాస్పిటల్‌లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతీక్ కిశోర్‌తో మాట్లాడాం.

”ఎక్కువ పనిచేయడం, లేదంటే కష్టపడి పనిచేయడం అనేవి మీ నిద్రపై ప్రభావం చూపిస్తాయి. శరీరానికి విశ్రాంతి లేకపోయినట్లైతే మీ హార్మోన్లు పనిచేస్తూనే ఉంటాయి, అది ఒత్తిడిని పెంచే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ధమనులు గట్టిపడతాయి, బీపీ పెరుగుతుంది, ఊబకాయం, షుగర్, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశంతో పాటు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి” అని ప్రతీక్ చెప్పారు.

”కొంతసేపు పనిచేయాలి, కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. దానిపైనే వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)