SOURCE :- BBC NEWS
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, జనవరి 5న విశాఖ సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు జైలు ఉన్నతాధికారులు ఆమెకు ఒక మొక్కను బహూకరించారు.
అది అందుకున్న కొద్దిసేపటికే జైల్లో పెరుగుతున్న గంజాయి మొక్క గురించి ఆమె మాట్లాడాల్సి వచ్చింది.
అంతకుముందు సెంట్రల్ జైల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు దొరికాయి. ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది తెలుసుకునేందుకు విచారణ జరుగుతోంది. అలాగే ఉన్నతాధికారులు తమని ఖైదీల ముందే బట్టలు విప్పి తనిఖీలు చేస్తున్నారంటూ కొందరు జైలు వార్డర్లు, కుటుంబాలతో సహా అందోళనకు దిగారు.
విశాఖ సెంట్రల్ జైల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు నెలన్నర రోజులుగా విశాఖ సెంట్రల్ జైలు తరచూ వార్తల్లో నిలుస్తోంది.
సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారా? జైలు వార్డర్లను ఖైదీల ముందే బట్టలు విప్పి తనిఖీ చేశారా? జైల్లోకి సెల్ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాలపై హోంమంత్రి ఏమన్నారు? ఇంతకు విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది?
జైల్లోకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది?
విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఒక గంజాయి మొక్క దొరికిందని జనవరి 5న హోంమంత్రి చెప్పారు. దానికి ముందు కూడా ఇక్కడ గంజాయి దొరికిన ఘటనలు ఉన్నాయి.
ఖైదీల బంధువులు కొందరు ములాఖాత్ సమయంలో గుట్కా, ఖైనీ, బీడీలను ఖైదీలకు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఏకంగా గంజాయినే ఖైదీల దగ్గరికి చేర్చడంతో, ఈ విషయంలో ఖైదీలకు జైలు సిబ్బంది సహకారం కూడా అందుతుందనే ఆరోపణలు వచ్చాయి.
ఏడాదిన్నర క్రితం అంటే, 2023 ఆగస్టులో విశాఖ సెంట్రల్ జైల్లో ములాఖత్ సమయంలో అక్కడికి వెళ్లిన ఒక పాత నేరస్థుడు గోడపై నుంచి లోపలికి ఒక ప్యాకెట్ విసిరాడు. దీన్ని గమనించిన సిబ్బంది ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో గంజాయితో పాటు బీడీలు, ఖైనీ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ పాత నేరస్థుడు ఎల్లాజీని అదుపులోకి తీసుకున్నారు అరిలోవ పోలీసులు.
దీనికంటే ముందు సెంట్రల్ జైలులో ఫార్మసిస్టుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తోన్న కడియం శ్రీనివాస రావు, గోళీల రూపంలో ఉన్న గంజాయిని తన లంచ్ బాక్సులో పెట్టుకుని వస్తూ జైలు మెయిన్ గేట్ వద్ద తనిఖీల్లో పట్టుబడ్డారు.
“విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి అంశంపై విచారణ జరుగుతోంది. కొందరు సిబ్బందికి, ఖైదీలకు పరిచయాలు ఏర్పడటమే దీనికి కారణమని తెలుస్తోంది” అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
సగానికి పైగా ‘గంజాయి ఖైదీ’లే
విశాఖ సెంట్రల్ జైలులో 16 బ్యారక్‌లు ఉన్నాయి. వివిధ కేసుల్లో శిక్ష పడిన దాదాపు 1,800 మంది ఖైదీలు వాటిలో ఉన్నారు. వీరిలో గంజాయి కేసుల్లో పట్టుబడ్డవారే ఎక్కువ మంది ఉన్నారని హోంమంత్రి అనిత చెప్పారు.
“ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారు/నిందితులు కలిపి మొత్తం 1,075 మంది ఖైదీలు ఉన్నారు. జైల్లో ఉన్న మొత్తం ఖైదీల్లో ఈ సంఖ్య 50 శాతానికి పైనే ఉంది. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు” అని విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మహేంద్రబాబు వివరించారు.
“గంజాయి కేసుల్లో ఇంతమంది జైల్లో ఉన్నప్పుడు వారికి జైల్లోకి గంజాయి తేవడం పెద్ద విషయం కాదు. చిన్న గంజాయి విత్తనాన్ని జైల్లోకి తీసుకుని వచ్చి ఉండవచ్చు. అది మా దృష్టికి వచ్చిందంటే, మేం ఎంత పక్కగా నిఘా వేశామో అర్థం చేసుకోవచ్చు. ఇకపై మరింత కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తాం” అని హోంమంత్రి అనిత తెలిపారు.
సెల్ఫోన్లు ఎవరు ఎవరికి ఇచ్చారు?
గత నెల రోజుల వ్యవధిలో విశాఖ సెంట్రల్ జైల్లో రెండుసార్లు ఖైదీల వద్ద సెల్ ఫోన్లు దొరికాయి.
“అయితే ఎవరి దగ్గర ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి? వాటిని ఉపయోగించి వారు ఎవరికి కాల్స్ చేశారు? అనే సమాచారం కూడా మా వద్ద ఉంది. కానీ, విచారణ జరుగుతోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. అందుకే వివరాలు వెల్లడించడం లేదు” అని హోం మంత్రి చెప్పారు.
“ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉండటమనేది చాలా సీరియస్ అంశం. దీనిపై దృష్టి పెట్టాం. టెక్నాలజీ ఆధారంగా ఈ సెల్ఫోన్లు ఖైదీల వద్దకు ఎలా చేరాయి? వారు ఎవరెవరికి కాల్స్ చేశారు? అనే విషయాలను సేకరిస్తున్నాం. ఈ విషయంలో టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంటున్నాం. సిబ్బందితో సహా ఎవరి ప్రమేయం ఉన్నా ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఇటువంటి ఆరోపణలపైనే గత జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ప్రస్తుత సూపరింటెండెంట్ మహేంద్రబాబు జైల్లో పరిస్థితులను సరి చేసే పనిలో ఉన్నారు” అని ఆమె తెలిపారు.
జైల్లో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు.
‘జైల్లో అంగుళం విడిచిపెట్టకుండా సీసీ కెమెరాల నిఘా’
‘‘జైలులో కొన్ని సమస్యలు బయటపడుతున్నాయి. విచారణ జరుగుతోంది. ఇందులో అధికారుల పాత్ర ఉందని తెలిస్తే, వారిపై చర్యలు ఉంటాయి’’ అని హోంమంత్రి అన్నారు.
“సెల్ ఫోన్ కేసును విచారణ చేస్తుండగా జైల్లో గంజాయి మొక్క విషయం బయటపడింది. ములాఖాత్ సమయాల్లో కొందరు బయటి నుంచి జైల్లోకి గంజాయిని అందిస్తున్నారని ప్రాథమికంగా తేలింది. బెయిల్‌పై వెళ్లేవారు, రౌడీ షీటర్లు కూడా బయటకు వెళ్లి, లోపలికి వచ్చేటప్పుడు గంజాయి తీసుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి. జైలు నిబంధనలకు విరుద్ధంగా అయిదేళ్లకు పైగా ఇక్కడ కొందరు సిబ్బంది పని చేస్తున్నారు. ఖైదీలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీంతో కొందరు సిబ్బందిని బదిలీ చేశాం” అని హోంమంత్రి అనిత చెప్పారు.
“మేం దాయాలని అనుకుంటే మీకు ఏ విషయం తెలియదు. మేం పారదర్శకంగా అన్నీ విషయాలు ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని అనుకుంటున్నాం కాబట్టే ఈ విషయాలన్ని చెబుతున్నాం” అని ఆమె అన్నారు.
“సెంట్రల్ జైల్లో కఠినమైన నిఘా అమలు అవుతోంది. దీన్ని మరింత పెంచేందుకు జైల్లోని అన్ని ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు పెడుతున్నాం. కొన్ని రోజుల్లోనే ఒక్క అంగుళం కూడా వదలకుండా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది” అని హోంమంత్రి వెల్లడించారు.
సిబ్బందిపై కూడా చర్యలు తప్పవు: హోంమంత్రి అనిత
అంతకుముందు అంటే 2024 డిసెంబర్ చివరి వారంలో విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు దగ్గర వార్డర్లు/కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో సహా అందోళనకు దిగారు. తమను జైలు సూపరింటెండెంట్ అవమానించారంటూ జైలు వద్దే ధర్నా చేపట్టారు. ఖైదీల ముందు తమ బట్టలు విప్పించి తనిఖీలు చేస్తున్నారంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఖైదీల ముందే కానిస్టేబుళ్లను అవమానపరిస్తే తమకు ఎలా గౌరవం దక్కుతుందని వార్డర్లు ప్రశ్నించారు.
“జైల్లో కొందరు ఖైదీలకు గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు అందుతున్నాయనే సమాచారం ఉంది. అందుకే అందర్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం. కానీ, ఖైదీల ముందు తనిఖీలు చేస్తున్నామన్నది అవాస్తం. ఈ విషయంపై కూడా విచారణకు ఆదేశించాం” అని జైలు సూపరింటెండెంట్ మహేంద్రబాబు తెలిపారు.
“యూనిఫాంలో ఉంటూ అందోళనకు దిగిన సిబ్బందిపై విచారణకు ఆదేశించాం. జైల్లో విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
జైల్లో యూనిఫాం సిబ్బంది చేసిన అందోళన, ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, జైల్లో గంజాయి దొరకడం వంటి వరుస సంఘటనల నేపథ్యంలోనే హోంమంత్రి అనిత జనవరి 5న విశాఖ సెంట్రల్ జైలు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగానే ఆమె జైలులో ఒక గంజాయి మొక్క దొరికిందనే విషయాన్ని వెల్లడించారు.
గంజాయిపై పోలీసుల లెక్కలు
2021 నాటికి పోలీసుల దగ్గరున్న లెక్కల ప్రకారం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ)లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతుండగా, అనధికారిక లెక్కల ప్రకారం అది 15 వేల ఎకరాలు ఉంటుందని అంచనా.
“పోలీసులు చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం ఏవోబీలో గంజాయి దాదాపుగా కనిపించడం లేదు. డ్రోన్లతో నిశితంగా పరిశీలిస్తే అక్కడక్కడ గంజాయి తోటలు కనిపిస్తున్నాయి. వాటిని వెంటనే తగలబెడుతున్నాం” అని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ బీబీసీతో చెప్పారు.
మరో వైపు గంజాయి, మాదకద్రవ్యాలను ఆరికట్టేందుకు ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్మెంట్) వ్యవస్థని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి చీఫ్‌గా ఆకే రవికృష్ణను నియమించింది ప్రభుత్వం.
ఈగల్ చీఫ్ రవికృష్ణ బీబీసీతో మాట్లాడారు.
“డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా నేరమే. డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలి” అని చెప్పారు.
‘‘సెంట్రల్ జైల్లో దొరికిన గుట్కా, గంజాయి అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. దీనిని హోంమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణ పూర్తయితే వివరాలు వెల్లడిస్తాం’’ అని రవికృష్ణ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS