SOURCE :- BBC NEWS
- రచయిత, నందిని వెళ్లైసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
14 జనవరి 2025
కేరళలోని కొల్లాం జిల్లాలో, 2006లో ఒక మహిళతో పాటు 17 రోజుల కవల పిల్లలను గొంతుకోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను 19 ఏళ్ల తర్వాత, 2025 జనవరి మొదటి వారంలో సీబీఐ అరెస్టు చేసింది.
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాక్కుంటూ, తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ కీలకపాత్ర పోషించింది. ఈ కేసులో మృతురాలి తల్లి 19 ఏళ్లుగా, ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు.
”ఈ శుభవార్త వినడానికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా. దేవుడు నా మొర ఆలకించాడు” అని మృతురాలి తల్లి అన్నారు.
కేరళలోని కొల్లాం జిల్లా అంచల్ గ్రామంలో నివసిస్తున్న శాంతమ్మ, 2006 ఫిబ్రవరి 10న పనిమీద పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ఆమె ఇంటికి తిరిగొచ్చేప్పటికి తన 24 ఏళ్ల కూతురు రంజని, ఆమెకు పుట్టిన 17 రోజుల కవలలు (అమ్మాయిలు) దారుణ హత్యకు గురయ్యారు. వారిని గొంతుకోసి చంపేశారు.
రంజని నేలపై, పిల్లలు మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్నారు. అది చూసి శాంతమ్మ షాక్‌తో స్పృహతప్పి పడిపోయారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్యలకు పాల్పడిన వారికి శిక్షపడాలని శాంతమ్మ పోరాడుతూ వచ్చారు. ఆమెకు ఇప్పుడు 67 ఏళ్లు.
అయితే, నిందితుల ఆచూకీ వెంటనే దొరకలేదు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ అంతగా లేని కాలంలో జరిగిన ఈ హత్యలకు కారకులైనవారిని గుర్తించడంలో చాలా ఆలస్యం జరిగింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 ఏళ్లు. చివరికి శాంతమ్మ పోరాటం ఫలించింది.
ఏదీ అసాధ్యం కాని ఈ టెక్నాలజీ యుగంలో, ఏఐ టెక్నాలజీ సాయంతో కేరళ పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టారు. నిందితులిద్దరూ పుదుచ్చేరిలో ఉన్నారని తెలియడంతో సీబీఐ వారిని అరెస్టు చేసింది.
నిందితుల్లో ఒకరైన డివిల్ కుమార్ మృతురాలు రంజనీకి పరిచయస్తుడని, అతనే ఆ కవలలకు తండ్రి అని పోలీసులు తెలిపారు. మరొకరు అతని స్నేహితుడు రాజేష్.
అంతేకాకుండా, నిందితులు తమ ఐడెంటిటీని మార్చుకుని వేర్వేరు పేర్లతో పుదుచ్చేరిలో స్థిరపడ్డారు. వారికి పెళ్లిళ్లై కుటుంబాలు కూడా ఉన్నాయి.
డివిల్ కుమార్ అంచల్ గ్రామానికి చెందినవారు కాగా, రాజేష్‌ది కన్నూర్ జిల్లా శ్రీకందపురం ప్రాంతం.
వీరి ఆచూకీ కనుగొనేందుకు 2006 ఫిబ్రవరిలో సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులో ఇద్దరికీ ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తమిళ భాషలు వచ్చని పేర్కొంది. డివిల్ కుమార్, రాజేష్ ఇద్దరూ ఆ సమయంలో ఆర్మీలో పనిచేస్తున్నారు.
నా కన్నీళ్లకు దక్కిన ప్రతిఫలం..
కూతురు, మనవరాళ్లు హత్యకు గురైన షాక్ నుంచి శాంతమ్మ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు జరిగినదంతా ఆమెకు గుర్తుంది.
”నా ప్రార్థనలకు, కన్నీళ్లకు దక్కిన ప్రతిఫలం ఇది. నా కూతురిని చంపేసిన హంతకులను పట్టుకున్నందుకు సంతోషం. న్యాయం కోసం ఏళ్లుగా పోరాడా. ఒంటరిగా పోరాడే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. వారిద్దరికీ కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా” అని శాంతమ్మ అన్నారు.
శాంతమ్మది నిరుపేద నేపథ్యం. చిన్న వయసులోనే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. శాంతమ్మ భర్త కూతురు అంత్యక్రియల సమయంలో వచ్చారు. మరో కూతురు, ఇతర బంధువుల సాయంతో కొల్లాంలో చిన్న ఇల్లు కట్టుకుని ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.
ఆస్తమా, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా నమ్మకంతో శాంతమ్మ పోరాటం సాగించారు. ఈ న్యాయ పోరాటంలో తనకు అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకురాలేదని శాంతమ్మ ఆవేదన చెందారు.
కానీ, ఈ 19 ఏళ్లలో ఎప్పుడూ పోరాటం ఆపేయాలని అనుకోలేదని ఆమె చెబుతున్నారు.
”ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. హంతకులు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారని ఆశించా. కానీ, ఇంతవరకూ కేసు ముందుకు సాగలేదని నిరాశ ఆవహించినప్పుడల్లా, అంతా మంచే జరుగుతుందని నాకు నేను సర్దిచెప్పుకునేదాన్ని” అని ఆమె చెప్పారు.
తన కూతురిని చంపిన హంతకులను ఒక్కసారైనా చూడాలని శాంతమ్మ కోరుకుంటున్నారు.
”నా కూతురిని, ఆమె పిల్లలను ఎందుకు చంపారు? అని నేను వాళ్లని అడగాలనుకుంటున్నా” అని అన్నారామె.
శాంతమ్మ దృఢ సంకల్పం
శాంతమ్మ దృఢ సంకల్పమే ఈ కేసును ఇంత దూరం తీసుకొచ్చిందని కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతికుమార్ సమక్కల్ చెప్పారు.
”శాంతమ్మకు అండగా ఎవరూ ముందుకురాలేదు. హత్యలకు పాల్పడిన వారిని ఇన్నేళ్లు పట్టుకోలేకపోయినా ఆమె మాత్రం వదిలిపెట్టలేదు” అని జ్యోతికుమార్ అన్నారు.
హత్య జరిగిన సమయంలో కేరళ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జ్యోతికుమార్.. శాంతమ్మను అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వద్దకు తీసుకెళ్లారు.
అప్పుడేం జరిగిందంటే..
2006 ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ షానవాజ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
”అంచల్ గ్రామంలోని ఈరం ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్న రంజని, ఆమెకు పుట్టిన కవల పిల్లలను హత్య చేశారని స్థానికులు ఫోన్ చేసి చెప్పారు” అని షానవాజ్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
షానవాజ్ వెంటనే తన టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి శాంతమ్మ బిగ్గరగా ఏడుస్తూ ఉండడం ఆయనకు ఇంకా గుర్తుంది.
ఈ హత్య కేసులో నెలకొన్న అనుమానాలు, మిస్టరీని ఆయన గుర్తు చేసుకున్నారు. డివిల్ కుమార్, రాజేష్‌లు పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
”హత్య జరిగిన సమయంలో డివిల్ కుమార్ కొల్లాంలో లేడు, పఠాన్‌కోట్ ఆర్మీ క్యాంప్‌లో ఉన్నాడు. అతనిపై ఎలాంటి అనుమానం రాకుండా వారిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. అతని స్నేహితుడు రాజేష్ హత్యలు చేశాడు” అని షానవాజ్ చెప్పారు.
రంజనీతో డివిల్ కుమార్ రిలేషన్షిప్లో ఉన్నాడని, ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని షానవాజ్ తెలిపారు.
రిలేషన్షిప్ కారణంగా రంజనీకి కవలలు పుట్టారు. కానీ, వారిని తనకు పుట్టిన పిల్లలుగా అంగీకరించకపోవడంతో రంజనీ రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. ఆమెను, పిల్లలను చంపడానికి అదే కారణమని షానవాజ్ చెప్పారు.
ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన రంజనీతో అనిల్ కుమార్ అనే పేరుతో రాజేష్ పరిచయం చేసుకున్నాడు. తన భార్యను కూడా ప్రసవం కోసం ఇదే ఆస్పత్రిలో చేర్చామని చెప్పి, ఆస్పత్రిలో రంజనీ, శాంతమ్మకు సాయంగా ఉంటున్నట్లు నమ్మించాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు సాయంగా ఉండేవాడు.
హత్యకు కొద్దివారాల ముందు డివిల్ కుమార్, రాజేష్ ఓ పాత బైక్‌ను కొనుగోలు చేశారు. ఆ బైక్ ఆర్సీ బుక్ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) సంఘటన స్థలంలో దొరికింది.
”మా దగ్గరున్న ఒకే ఒక్క క్లూ అది.. ఆ బైక్ యజమాని చెప్పిన గుర్తుల ఆధారంగా డివిల్ కుమార్, రాజేష్ ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చాం” అని చెప్పారు షానవాజ్.
ఎందుకు పట్టుకోలేకపోయారు?
హత్య జరిగిన తర్వాత, ఎవరో బైక్‌పై వేగంగా వెళ్లినట్లు స్థానికులు చెప్పారు.
”రాజేష్‌ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మార్గంమధ్యలో, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు రాజేష్ ఆగాడు. ఆ సమయంలో పోలీస్ టీంలోని ఒకరు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా, తప్పించుకుని పారిపోయాడు.
ఆ తర్వాత, మేం బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినప్పుడు ఆ అకౌంట్, పఠాన్‌కోట్‌లోని మరో బ్యాంకు అకౌంట్ మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించాం. అలా వాళ్లు ఆర్మీలో పనిచేస్తున్నారని, డివిల్ కుమార్‌తో రాజేష్‌కి సంబంధాలున్నట్లు తేలింది. ఆ బ్యాంక్ అకౌంట్ వల్లే మాకు రాజేష్ ఫోటో దొరికింది.
వాళ్లిద్దరినీ పట్టుకోవడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా వంటి చాలా రాష్ట్రాల్లో వెతికాం. మహారాష్ట్రలో చేతిదాకా వచ్చి తప్పించుకున్నారు. తప్పించుకుని తిరుగుతూ చాలా ప్రాంతాల్లో దాక్కున్నారు. ఈ కేసు గురించి ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చాం. ఆర్మీ వాళ్లిద్దరినీ విధుల నుంచి తప్పించింది” అని షానవాజ్ చెప్పారు.
ఆ తర్వాత, కేరళ సీబీసీఐడీ విచారిస్తున్న ఈ కేసును 2010లో సీబీఐకి అప్పగించారు. 2013లో ఈ కేసులో చార్జిషీట్ దాఖలైంది. అప్పటికి కూడా నిందితుల జాడ తెలియలేదు.
షానవాజ్ ఆ తర్వాత ఐపీఎస్ హోదా వరకూ ఎదిగి, 2022లో కేరళ పోలీస్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఈ దారుణ హత్యలకు పాల్పడిన నిందితులను పట్టుకోలేకపోవడం షానవాజ్‌కు ఆవేదన మిగిల్చింది.
”హంతకులు ఎవరో మాకు తెలుసు, కానీ వాళ్లని పట్టుకుని బాధితులకు న్యాయం చేయలేకపోయాం” అన్నారాయన.
షానవాజ్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న సమయంలో, నిందితులు పరారీలో ఉన్న పెండింగ్ కేసులను మళ్లీ దర్యాప్తు చేయాలని కేరళ పోలీసులు నిర్ణయించారు. అప్పుడు ఈ కేసు వివరాలను షానవాజ్ తన పైఅధికారులకు తెలియజేయడంతో, టెక్నాలజీ సాయంతో డివిల్ కుమార్, రాజేష్‌ను వెతకడం మొదలైంది.
ఏఐ సాయంతో ఎలా..
ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి కేరళ పోలీసులు ప్రయత్నించారు.
”పెండింగ్ కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కేసులో నిందితులుగా ఉన్న డివిల్ కుమార్ పాత ఫోటో మా దగ్గర ఇంకా ఉంది” అని కేరళ లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ మనోజ్ అబ్రహం బీబీసీతో చెప్పారు.
డివిల్ కుమార్‌ను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను కేరళ పోలీసులు ఉపయోగించారు. దీని ద్వారా డివిల్ కుమార్ పాత ఫోటోలను ఉపయోగించి అతను ఇప్పుడెలా ఉంటాడో ఊహాచిత్రాలు రూపొందించారు. వాళ్లు వినియోగించిన ఏఐ టెక్నాలజీ సాయంతో, ఆ ఫోటోలను ఇంటర్నెట్లో కొన్ని మిలియన్ల ఫోటోలతో సరిపోల్చవచ్చు. అలా వారు డివిల్ కుమార్‌ను గుర్తించారు.
”ఈ టెక్నాలజీ డివిల్ కుమార్ ముఖ కవళికలు, అతని జుట్టులో వచ్చే తేడాలను కూడా గుర్తించింది” అని మనోజ్ అబ్రహం వివరించారు.
ప్రస్తుత డివిల్ కుమార్ అవతార్ ఫోటో ఫేస్బుక్లో ఒక ఫోటోతో సరిపోలాయి.
ఆ ఫేస్బుక్ అకౌంట్లోని మొబైల్ నంబర్ని ట్రేస్ చేసి, ఆ దిశగా దర్యాప్తు చేసి డివిల్ కుమార్ పుదుచ్చేరిలో ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత వారు సీబీఐ చెన్నైశాఖకు సమాచారం అందించారు. డివిల్ కుమార్‌ను అరెస్టు చేసిన సీబీఐ, అతని ద్వారా రాజేష్‌ను కూడా అరెస్టు చేసింది.
ఐడెంటిటీ మార్చుకుని వేరే పేర్లతో..
డివిల్ కుమార్, రాజేష్ తమ ఐడెంటిటీని మార్చుకుని విష్ణు, ప్రవీణ్ కుమార్‌గా అవతారమెత్తారు. పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇంటీరియర్ డిజైన్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
”ఇన్నేళ్లలో వారి కుటుంబ సభ్యులకు గానీ, ఇరుగుపొరుగు వారికి గానీ వారిపై ఎలాంటి అనుమానం రాలేదు” అని ఏడీజీపీ మనోజ్ అబ్రహం చెప్పారు.
ఏఐ టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకునే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన అన్నారు.
”ఏఐ టెక్నాలజీ సాయంతో నేరస్తులను గుర్తించడం సులభం, అలాగే సమర్థవంతమైనది కూడా. భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో ఏఐని వినియోగించుకోవచ్చు” అని మనోజ్ అభిప్రాయపడ్డారు.
అరెస్టైన డివిల్ కుమార్, రాజేష్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. జనవరి 18 వరకూ సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
అదేవిధంగా, డీఎన్ఏ పరీక్షల కోసం చనిపోయిన కవల పిల్లల నమూనాలను కూడా భద్రపరచాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలున్నాయి. ఇప్పుడు డివిల్ కుమార్ దొరకడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS