SOURCE :- BBC NEWS
దక్షిణ కొరియాలో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ రికార్డులకెక్కారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విచారణాధికారులు ఏకంగా రక్షణ కంచెను కత్తిరించి లోపలకు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో దర్యాప్తు అధికారులు, అధ్యక్షుడి వ్యక్తిగత భద్రత సిబ్బంది మధ్య కొన్ని వారాలుగా ఏర్పడిన ప్రతిష్ఠంభన ముగిసింది.
సౌత్ కోరియాలో సైనిక చట్టాన్ని అమలు చేసేందుకు యోల్ చేసిన ప్రయత్నం దేశంలో అల్లకల్లోలం రేపింది. యోల్‌ను పార్లమెంట్ అభిశంసించింది. తిరుగుబాటుకు ప్రయత్నించారనే ఆరోపణల మీద ఆయనపై విచారణ జరుగుతోంది.
సాంకేతికంగా ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడిగానే ఉన్నారు. ఆయన అభిశంసన చెల్లుతుందా లేదా అనే విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుంది.
యోల్‌ను అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు అధికారులు గడ్డకట్టించే చలిలో ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిచ్చెన మీదుగా గోడపైకెక్కి కట్టర్లతో ఇనుప కంచెను కట్ చేసి ఆయన నివాసంలోకి వెళ్లారు. అరెస్టును అడ్డుకునేందుకు అధ్యక్షుడి వ్యక్తిగత భద్రతా సిబ్బంది బారికేడ్లను ఏర్పాటు చేశారు.
యూన్‌ను అరెస్ట్ చేసేందుకు ఉన్నత స్థాయి అధికారుల బృందం జనవరి 3న ప్రయత్నించింది. అయితే ఇనుప కంచెలు, బస్సులను అడ్డుగా పెట్టి వారిని అడ్డుకున్నారు.
బుధవారం చీకటి పడటానికి ముందు దర్యాప్తు బృందం ఆ ప్రాంతానికి వచ్చింది. తమకు అడ్డుగా ఉన్న బస్సులను ఎక్కేందుకు నిచ్చెనలు, ఇనుప కంచెలను కత్తిరించడానికి కట్టర్లు తెచ్చుకుంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు. అధ్యక్షుడి నివాసంలోకి వెళ్లేందుకు వారు గోడలు దూకాల్సి వచ్చింది.కొన్ని గంటల తర్వాత యూన్‌ను అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు.
తనను అరెస్ట్ చేయడానికి కొద్దిసేపటి ముందు యూన్ ఓ మూడు నిమిషాల నిడివిగల వీడియో ఒకటి విడుదల చేశారు. విచారణకు తాను వ్యతిరేకం అయినప్పటికీ విచారణాధికారులకు సహకరిస్తానని తెలిపారు. తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌కు చట్టబద్ధత లేదని ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు.
అగ్నిమాపక పరికరాలతో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి తన ఇంటి భద్రతా వలయాన్ని దాటి ఎలా దాడికి వచ్చారో తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
“విచారణ అక్రమం అయినప్పటికీ, ఉన్నత స్థాయి అధికారుల విచారణకు హాజరవుతాను. అనవసరమైన రక్తపాతాన్ని ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆయన చెప్పారు.
యూన్ అరెస్ట్ చట్ట విరుద్దం అని పీపుల్ పవర్ పార్టీ ఖండించింది. బుధవారం నాటి సంఘటన “విచారకరమైనది” అని ఫ్లోర్ లీడర్ క్వియోన్ సెంగా డాంగ్ అభివర్ణించారు.
యూన్ అరెస్టు “దక్షిణ కొరియాలో న్యాయం బతికే ఉందని చెప్పడానికి ఉదాహరణ” అని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్-డే చెప్పారు.
“రాజ్యాంగ, ప్రజాస్వామ్య, చట్ట పునరద్ధరణకు ఇది మొదటి అడుగు” అని ఆయన పార్టీ సమావేశంలో అన్నారు.
ప్రస్తుతం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి చోయ్ సాంగ్-మోక్ ఉన్నారు.
యూన్‌ను సీఐఓ కార్యాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జియోంగ్గి ప్రావిన్స్‌లోని సోల్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధిస్తారని భావిస్తున్నారు. అయితే అరెస్టు చేసిన 48 గంటలలోపు కోర్టు కస్టడీ వారంట్ జారీ చేయకపోతే ఆయనను విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన తిరిగి అధ్యక్ష నివాసానికి రావచ్చు.
దక్షిణ కొరియా రాజకీయాల్లో అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం సంచలనమే అయినా ఆ దేశంలో సంక్షోభం ఇంకా ముగియలేదు.
బుధవారం యూన్ ఇంటికి మద్దతుదారులు భారీ సంఖ్యలో రావడంతో దేశంలో ఏకాభిప్రాయం లేదని స్పష్టం అవుతోంది. ఆయన అరెస్ట్ పట్ల వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటుంటే, అరెస్ట్ చట్ట వ్యతిరేకమని మద్దతుదారులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)