SOURCE :- BBC NEWS

సౌతాఫ్రికా, బంగారు గనులు, జోహెన్నెస్ బర్గ్

ఫొటో సోర్స్, AFP

దక్షిణాఫ్రికాలోని ఓ పాడుబడిన బంగారు గనిలోంచి 78 మంది కార్మికుల మృత దేహాలను వలంటీర్లు బయటికి తీసుకొచ్చారు. మరో 200 మందిని కాపాడారు.

అంతకుముందు ఈ గనిలో ఉన్న భయంకరమైన పరిస్థితిని చూపించే వీడియోలు ఆందోళన కలిగించాయి.

అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అనేక మంది కొన్ని నెలల తరబడి ఈ గని లోపలే నివసిస్తున్నారని కథనాలు వచ్చాయి.

గతేడాది దేశవ్యాప్తంగా అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు.

ఇటీవల బయటకు వచ్చిన వీడియోల్లోని ఒక దాంట్లో గని లోపల మృతదేహాలను కవర్లలో చుట్టినట్లు కనిపించింది. అయితే ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు. మరో వీడియోలో బక్కచిక్కిన శరీరాలతో కొంతమంది అక్కడ తిరుగుతున్న దృశ్యాలున్నాయి.

గనిలో ఉన్న వారిని రక్షించాలని కోర్టు వారం రోజుల క్రితం ఆదేశించడంతో చాలా ఆలస్యంగా సోమవారం నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వం ఈ సహాయక చర్యలు ప్రారంభించకముందే 1,500 మందికి పైగా కార్మికులు గని నుంచి బయటికి వచ్చారని పోలీసులు చెప్పారు.

ఇప్పుడు ఇక ఈ గనిలో ఎవరూ లేరని సహాయక చర్యల్లో పాల్గొన్న వలంటీర్లు చెప్పారని పోలీసులు తెలిపారు.

(గమనిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

బీబీసీ న్యూస్ తెలుగు
బంగారు గని

ఫొటో సోర్స్, Reuters

గతేడాది కొంతమంది గని కార్మికులు ఎలాంటి అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా స్టిల్‌ఫొంటైన్ గనిలోకి ప్రవేశించారు. వారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు వారికి ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు.

“వాళ్లు బయటకు వచ్చేలా చేస్తాం” అని నవంబర్‌లో ఒక మంత్రి చెప్పారు.

దక్షిణాఫ్రికాలో అక్రమంగా గనులు తవ్వేవారిని ‘జామాజామా’ అంటారు. ఈ కార్మికుల మీద ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత వంద మందికిపైగా మరణించినట్లు కథనాలు వచ్చాయి. ఈ గని జోహెన్నెస్‌బర్గ్‌కు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అయితే మృతుల సంఖ్యను అధికారులు అధికారికంగా ప్రకటించడంలేదని, ఎంతమంది చనిపోయారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

కార్మిక సంఘాలు విడుదల చేసిన ఒక వీడియోలో వందల మంది చొక్కాలు కూడా లేకుండా మట్టిలో నేల మీద కూర్చుని ఉండటం కనిపిస్తోంది. వారి ముఖాలను కనిపించకుండా బ్లర్ చేశారు. వారికి నీరు, ఆహారం కావాలని ఓ వ్యక్తి చెప్పడం అందులో వినిపిస్తోంది.

“గని లోపల చనిపోయిన వారి మృతదేహాలను చూపించడం మేం మొదలుపెట్టాం” అని కూడా ఆయన చెప్పారు.

“వీళ్లు మాత్రమే కాదు, ఇక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తున్నారా? మాకు సాయం కావాలి” అనే మాటలు కూడా వీడియోలో వినిపించాయి.

మరో వీడియోలో “ఆకలి వల్ల ఇక్కడివాళ్లు చనిపోయేలా ఉన్నారు” అని మరో వ్యక్తి చెబుతున్నారు. ఇప్పటికే 96 మంది చనిపోయారని చెబుతూ తమకు ఆహారం, ఇతర వస్తువులు అందించాలంటూ ఆయన వేడుకున్నారు.

ఈ దృశ్యాలను శనివారం (జనవరి 11న) చిత్రీకరించారని కార్మి సంఘం తెలిపింది.

సౌతాఫ్రికా, బంగారు గనులు, జోహెన్నెస్ బర్గ్

ఫొటో సోర్స్, Giwusa

ఈ వీడియోలు అండర్‌‌గ్రౌండ్‌లో పరిస్థితులు “చాలా భయానకంగా ఉన్నట్లు” సూచిస్తున్నాయని కార్మిక సంఘం నాయకులు అన్నారు.

“ఇక్కడ జరిగిన దానిని ఏమని పిలవాలి? ఇదొక నరమేధం. ఎందుకంటే ఈ వీడియోల్లో మానవ మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. గని కార్మికులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు” అని జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్క్ ఆఫ్ సౌతాఫ్రికా అనే కార్మిక సంఘం అధ్యక్షుడు మమెట్వే సెబే చెప్పారు.

ఈ పరిస్థితికి అధికారులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)