SOURCE :- BBC NEWS

బ్రాడ్‌పిట్, ఫ్రాన్స్, ఏంజెలీనా జోలీ, అన్నే

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్‌‌ పేరుతో స్కామర్లు ఓ ఫ్రెంచ్ మహిళ నుంచి రూ. 7.35 కోట్ల రూపాయలు కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న మహిళను అందరూ హేళన చేయడం మొదలుపెట్టడంతో ఆమెపై ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌లో ప్రముఖ చానల్ అయిన టీఎఫ్1‌ ఉపసంహరించుకుంది.

బ్రాడ్‌పిట్‌తో ఏడాదిన్నరగా రిలేషన్‌లో ఉన్నానని చెప్పుకుంటున్న 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆన్నేతో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమైన కార్యక్రమం జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

తానేమీ “పిచ్చిదాన్ని లేదా మూర్ఖురాలిని” కాదని ఆమె ప్రముఖ ఫ్రెంచ్ యూట్యూబ్‌షోలో చెప్పారు. వాళ్లు నన్ను వెర్రిదాన్ని చేశారు. అది ఒప్పుకుంటాను. అందుకే నేను బయటకు వచ్చాను. ఇలా మోసపోతోంది నేను ఒక్కదాన్నే కాదు” అని ఆమె ఆ కార్యక్రమంలో చెప్పారు.

“స్టార్లపై ఉన్న అభిమానాన్ని మోసగాళ్లు ఇలా వాడుకోవడం అన్యాయం” అని బ్రాడ్‌పిట్ ప్రతినిధి ఒకరు అమెరికాలోని ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీతో చెప్పారు. “సామాజిక మాధ్యమాల్లో పెద్దగా కనిపించని నటుల’’ పేరుతో ఆన్‌లైన్ ద్వారా చేరువయ్యేందుకు ప్రయత్నించే వారికి అభిమానులు దూరంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమం ప్రసారమైన తర్వాత ఆన్నేపై నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకునేందుకు మూడుసార్లు ప్రయత్నించానని, దాచుకున్న సొమ్మంతా పోగొట్టుకున్నానని ఆమె ఆ కార్యక్రమంలో చెప్పారు.

“బ్రాడ్‌పిట్‌తో నాలుగు చిత్రాలు (నిజమైనవే)” అంటూ నెట్‌ఫ్లిక్స్ ఫ్రాన్స్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అయితే టౌలూజ్ ఫుట్‌బాల్ క్లబ్ “హాయ్ అన్నే, బుధవారం బ్రాడ్ స్టేడియానికి వస్తున్నట్లు మాతో చెప్పాడు.. మరి నువ్వు? అని ఓ పోస్టు పెట్టి తరువాత దానిని తొలగించింది. తరువాత ఈ పోస్టుపై టౌలూజ్ క్లబ్ క్షమాపణ చెప్పింది.

బ్రాడ్ పిట్

ఫొటో సోర్స్, Getty Images

‘‘అప్పటి నుంచే కష్టాలు మొదలు’’

అన్నేతో చేసిన కార్యక్రమం ప్రసారమైన తర్వాత ఆమెకు ‘వేధింపులు’ పెరిగాయని తాము ప్రసారం చేసిన కార్యక్రమాన్ని ఆన్‌లైన్ నుంచి తొలగించినట్లు టీఎఫ్ వన్ ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఆ కార్యక్రమం ఆన్‌లైన్‌లోనే కనిపిస్తోంది

2023 ఫిబ్రవరిలో తాను ఇన్‌స్టాగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పటి నుంచి తన కష్టాలు ప్రారంభం అయ్యాయని ఆన్నే చెప్పారు. అప్పటికే ఆమె సంపన్నుడైన పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకున్నారు.

ఇన్‌స్టా డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఆమెకు ఒకరు కాల్ చేసి తాను బ్రాడ్‌పిట్ తల్లి జేన్ ఇట్టాను అని, తన కుమారుడికి “నీ లాంటి మహిళ అవసరం” అని చెప్పారు

ఆ కాల్ వచ్చిన తర్వాత రోజే తానే బ్రాడ్‌పిట్ అని చెబుతూ ఒక వ్యక్తి ఆమెకు ‘టచ్‌’లోకి వచ్చారు. “సామాజిక మాధ్యమాల గురించి అంతగా అవగాహన లేని వ్యక్తిగా, ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు” అని ఆమె చెప్పారు.

ఒక దశలో “బ్రాడ్‌ పిట్”లా చెబుతున్న వ్యక్తి తనకు ఖరీదైన బహుమతులు పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని, అయితే కస్టమ్స్ వాళ్లు అందుకు అనుమతించడం లేదని, ఏంజెలీనాతో విడాకుల కేసు వల్ల తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని తనకు 9వేల యూరోలు పంపాలని కోరారు.

“ఒక ఫూల్ మాదిరిగా, నేను డబ్బులు పంపించాను. అతని గురించి అనుమానం ఏర్పడినప్పుడల్లా అతను నా సందేహాలను తీర్చేవాడు” అని ఆమె చెప్పారు.

అప్పటి నుంచి డబ్బులు అడగడం ఇంకా ఎక్కువైంది. ఫేక్ బ్రాడ్ పిట్ తనకు కిడ్నీ క్యాన్సర్ వచ్చిందని, చికిత్స కోసం డబ్బు కావాలని అడుగుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఏఐ రూపొందించిన ఫోటోలను ఆమెకు పంపేవాడు.

“ఆ ఫోటోలు చూసిన తర్వాత నేను ఇంటర్‌నెట్‌లో ఎక్కడైనా అలాంటి ఫోటోలు ఉన్నాయమో అని వెతికాను. ఎక్కడా కనిపించ లేదు. అతను కేవలం నా కోసమే ఆ ఫోటోలు తీసి పంపించాడని అనుకున్నాను” అని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలి

ఫొటో సోర్స్, Reuters

‘డబ్బంతా పోయింది’

అన్నే తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. భర్త నుంచి ఆమెకు 7,75,000 యూరోలు వచ్చాయి. ఆ సొమ్ము మొత్తాన్ని నకిలీ బ్రాడ్‌పిట్ కొట్టేశాడు.

“నేను ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతున్నానని నాకు నేను చెప్పుకున్నాను” అని అన్నే చెప్పారు. ఆమె కూడా గతంలో క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.

“తన తల్లికి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశానని, అయితే ఆమె బ్రాడ్ పిట్ విషయంలో చాలా ఉత్సాహంగా ఉందని” అన్నే కుమార్తే టీఎఫ్1 చానల్‌తో చెప్పారు. “ఆమె ఎంత అమాయకంగా ఉందో చూస్తే చాలా బాధగా ఉందని” అన్నారు.

బ్రాడ్‌పిట్ కొత్త గాళ్ ఫ్రెండ్ ఇనెస్ డి రమోన్ గురించి మేగజైన్లలో చూడగానే అన్నేకు అనుమానం మొదలైంది. ఇదే సమయంలో స్కామర్లు ఆమెకు ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ న్యూస్ పంపించారు. అందులో “బ్రాడ్‌పిట్ ఫ్రాన్స్‌కు చెందిన అన్నే అనే మహిళతో రిలేషన్ షిప్‌లో ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో” అని ఉంది.

ఆ వీడియో చూసిన తర్వాత అన్నే కొంతకాలం ప్రశాంతంగా ఉన్నారు. అయితే 2024లో బ్రాడ్‌పిట్ ఇనెస్ డి రమోన్ తమ రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా ప్రకటించిన తర్వాత తన సంగతేంటో తేల్చుకోవాలని అన్నే నిర్ణయించుకున్నారు.

బ్రాడ్‌పిట్, ఫ్రాన్స్, ఏంజెలీనా జోలీ, అన్నే

ఫొటో సోర్స్, x.com/nexta_tv

కేసు నమోదు

“స్పెషల్ ఎఫ్‌బీఐ ఏజంట్ జాన్ స్మిత్” పేరుతో మరి కొంత సొమ్ము గుంజేందుకు మోసగాళ్లు ప్రయత్నించగానే అన్నే పోలీసులను సంప్రదించారు. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

తాను మోసపోయానని తెలుసుకున్న అన్నే తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు ప్రయత్నించారని టీఎఫ్1 కార్యక్రమం తెలిపింది.

“నేను ఎందుకు ఇలా చేశాను”? అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. “వాళ్లంతా నరకానికి వెళతారు. ఆ స్కామర్లను పట్టుకోవాలి. వాళ్లను పట్టుకోవడానికి దయ చేసి నాకు సాయం చేయండి’’ అని ఆమె ప్రాధేయపడ్డారు.

మంగళవారం టీఎఫ్1‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మీరు బ్రాడ్‌పిట్‌తో మాట్లాడారా లేదా” అనే ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. “స్కామర్లు చెప్పే మాటలు వింటే ఎవరైనా పడిపోతారు. అలాంటవి మీ భర్త కూడా మీతో ఎన్నడూ చెప్పరు” అని అన్నారు.

ప్రస్తుతం తాను తన స్నేహితుడితో ఉంటున్నానని తెలిపారు. . “నా జీవితం అంతా ఒక చిన్న గది, కొన్ని పెట్టలకు పరిమితమైంది. నాకు ఇదే మిగిలింది” అని అన్నారు.

ఆన్‌లైన్‌లో అనేక మంది అన్నేను హేళన చేస్తుంటే, మరి కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

“ప్రజలు ఆమెను గేలి చేస్తున్నారు. అయితే మనం ఒక 50 ఏళ్ల మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె డీప్‌ఫేక్, ఏఐ వల్ల మోసపోయారు. మీ తల్లిదండ్రులు, అవ్వా తాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారు తట్టుకోలేరు” అని ఆమె గురించి రాసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది.

అన్నే గురించి ” ఆమె విజిల్ బ్లోయర్, నేటి జీవితం సైబర్ఉచ్చుల్లో చిక్కుకుంది” అని స్థానిక పత్రిక లిబరేషన్ రాసింది. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందే కొద్దీ పరిస్థితులు ఇంకా దిగజారవచ్చు” అని ఆ పత్రిక తన కథనాన్ని ముగించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)