SOURCE :- BBC NEWS
భారత్‌తో పాటు విదేశాల్లోని పలు సంస్థలు మోసాలు, తప్పుడు కార్యకలాపాలకు పాల్పడ్డాయనే ఆరోపణలతో నివేదికలు బయటపెట్టిన హిండెన్‌బర్గ్ రీసర్చ్‌ను మూసివేస్తున్నారు.
ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన ఈ అమెరికా కంపెనీని మూసివేస్తున్నట్లు దాని వ్యవస్థాపకుడు నేట్ అండర్సన్ బుధవారం ప్రకటించారు.
2023లో బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ సంచలన నివేదికలను విడుదల చేసింది. ఇది భారత్‌లో రాజకీయ వివాదాలకు, అదానీ గ్రూపు కంపెనీలకు గణనీయమైన నష్టాలను తీసుకొచ్చింది.
కంపెనీ మూసివేతకు స్పష్టమైన కారణం వెల్లడించని అండర్సన్, తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బడా కంపెనీల గుట్టురట్టు
2017లో ప్రారంభమైన హిండెన్‌బర్గ్ రీసర్చ్.. బడా కంపెనీల్లోని ఆర్థిక అవకతవకలను బయటపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దాని నివేదికలు భారత్‌తో పాటు ఇతర దేశాలలోని కంపెనీలు తమ మార్కెట్ విలువలో వేల కోట్ల రూపాయలు కోల్పోయేలా చేశాయి.
“మా పని కారణంగా బిలియనీర్లు, అధికారాన్ని గుత్తాధిపత్యంగా వాడుకునే వారితో సహా దాదాపు 100 మందిపై నియంత్రణాధికారులు అభియోగాలు మోపారు. కొన్ని శక్తిమంతమైన వ్యవస్థలను మేం సవాలు చేశాం” అని అండర్సన్ కంపెనీ మూసివేతను ప్రకటిస్తూ చెప్పారు.
ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారు నికోలా కార్పొరేషన్ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిందని 2020లో హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
2022లో నికోలా వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ మోసానికి పాల్పడినట్లు నిర్ధరణ అయింది.
అదానీపై ఆరోపణలు
అదానీ గ్రూప్‌లో ఏళ్ల తరబడి స్టాక్ అవకతవకలు, లెక్కల్లో మోసం జరిగిందని 2023లో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. వాటిని ద్వేషపూరితమైనవిగా, భారతదేశంపై దాడిగా అభివర్ణించింది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో సుమారు రూ.9.3 లక్షల కోట్లను కోల్పోయింది. అయితే, తర్వాత అదానీ గ్రూప్ కోలుకుంది.
అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సంబంధమున్న ఆఫ్‌షోర్ కంపెనీలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌కు వాటాలున్నాయని గత సంవత్సరం హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
మాధవి, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలు భారతదేశంలో రాజకీయ చర్చలకూ కారణమయ్యాయి.
అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆసియాలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అదానీ.. మోదీకి సన్నిహితుడిగా కనిపిస్తారు. ఈ సంబంధంతో అదానీ లాభపడ్డారని చాలాకాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ, అదానీ ఆ వాదనలను తోసిపుచ్చారు.
హిండెన్‌బర్గ్ ఇప్పుడేం చేయనుంది?
హిండెన్‌బర్గ్ పరిశోధనా పద్ధతులను భవిష్యత్తులో ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నట్లు అండర్సన్ తన ప్రకటనలో తెలిపారు.
“రాబోయే ఆరు నెలల్లో మా రీసర్చ్ పద్దతిలోని ప్రతీది చెబుతూ, పరిశోధనలను ఎలా నిర్వహించాలో వివరించడానికి తగిన సామాగ్రి, వీడియోలను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాను” అని ఆయన తెలిపారు.
ఏదేని కంపెనీ మోసానికి లేదా ఆర్థిక తప్పిదానికి పాల్పడినట్లు భావించినప్పుడు హిండెన్‌బర్గ్ వంటి షార్ట్ సెల్లర్ సంస్థలు వాటికి వ్యతిరేకంగా బెట్టింగ్ చేస్తాయి. వారు లక్ష్యంగా చేసుకున్న కంపెనీ స్టాక్‌లను అప్పుగా తీసుకుంటారు. అనంతరం, వాటిని వెంటనే విక్రయిస్తారు. విలువ పడిపోయినప్పుడు తేడాను లాభంగా ఉంచుకొని, తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)