SOURCE :- BBC NEWS
గాజాలో యుద్ధాన్ని నిలిపివేసే ఒక ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా, మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ చెప్పాయి.
ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారని వెల్లడించాయి.
15 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇది చెప్పుకోదగ్గ పరిణామం. పాలస్తీనాకు చెందిన సాయుధ గ్రూప్ హమాస్ 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఈ ఘర్షణ మొదలైంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏమిటి?
ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే గాజాలో యుద్ధం ఆగిపోవడంతో పాటు బందీలు, ఖైదీల బదలాయింపు, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉంది.
హమాస్ 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు 251 మందిని బందీలుగా చేసుకుంది. ఇప్పటికీ హమాస్ దగ్గర 94 మంది బందీలు ఉన్నారని, వారిలో 60 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
బందీలను హమాస్ అప్పగించినందుకు బదులుగా ఏళ్లుగా జైళ్లలో ఉన్న దాదాపు 1000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనున్నట్లు అంచనా.
కాల్పుల విరమణ ఎలా పనిచేస్తుంది?
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం తెలిపింది.
ఈ ఒప్పందానికి ఇరువర్గాలు అంగీకరించాయని తొలుత బుధవారం(15న) అమెరికా, ఖతార్‌లు ప్రకటించాయి.
ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ అంతకుముందు చెప్పారు.
ఈ ఒప్పందంలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం.
మొదటి దశ
తొలి దశ ఒప్పందం ఆరు వారాల పాటు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా కాల్పుల విరమణ పాటిస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బుధవారం ఇరు వర్గాల మధ్య ఒక డీల్ కుదిరినట్లు ఆయన ధ్రువీకరించారు.
గాజాలోని ఇజ్రాయెల్ బందీలు, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు. నిరాశ్రయులైన గాజా ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి పొందుతారు.
వందల మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు విడుదలవుతారని బైడెన్ తెలిపారు.
మొదటి దశలో విడుదలయ్యే బందీల కచ్చితమైన సంఖ్యను ఆయన ప్రస్తావించలేదు. 33 మంది బందీలు విడుదలవుతారని బుధవారం ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఖతార్ ప్రధాని అల్ థాని చెప్పారు.
ఒప్పందం అమల్లోకి వచ్చిన వెనువెంటనే ముగ్గురు బందీలు విడుదలవుతారని గతంలో పాలస్తీనాకు చెందిన ఒక అధికారి బీబీసీకి చెప్పారు. మిగిలిన బందీల మార్పిడి ఆరు వారాల వ్యవధిలో జరుగుతుందని ఆయన అన్నారు.
మొదటి దశలో గాజాలో ప్రజలు నివసించే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వస్తాయని బైడెన్ తెలిపారు. పాలస్తీనా ప్రజలు గాజాలోని తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లొచ్చని చెప్పారు.
ఇజ్రాయెల్ దాడులు, ఫైటింగ్, ఖాళీ చేయమంటూ ఇచ్చిన ఆదేశాల కారణంగా గాజాలోని 23 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఒప్పందం తర్వాత గాజాలోకి మానవతా సహాయం సరఫరా పెరుగుతుంది. ప్రతిరోజూ మానవతా సహాయాన్ని తీసుకొచ్చే వందల లారీలకు గాజాలోకి అనుమతి లభిస్తుంది.
కాల్పుల విరమణ మొదలైన 16వ రోజున ఒప్పందంలోని రెండో దశ, మూడో దశకు సంబంధించిన చర్చలు మొదలవుతాయని గతంలో పాలస్తీనా అధికారులు చెప్పారు.
చర్చలు జరిగినంత కాలం కాల్పుల విరమణ కొనసాగుతుందని బైడెన్ చెప్పారు.
రెండో దశ
బైడెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, రెండో దశ ఒప్పందం యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుంది.
ఈ దశలో విడుదలయ్యే పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ దగ్గర బందీగా ఉన్న పురుషులతో సహా మిగతావారు విడుదల అవుతారు.
ఇజ్రాయెల్ విడుదల చేయడానికి అంగీకరించిన మొత్తం 1000 మంది ఖైదీల్లో దాదాపు 190 మంది 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ దశలో గాజా నుంచి బలగాలను ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకుంటుంది.
మూడో దశ
మూడో దశ, గాజా పునర్నిర్మాణానికి సంబంధించినది. దీనికి ఏళ్ల సమయం పట్టొచ్చు. అలాగే బందీల మృతదేహాలు ఉంటే వాటిని అప్పగించడం కూడా ఇందులో భాగం.
ఈ డీల్‌లో జవాబు దొరకని ప్రశ్నలు…
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఉన్న పరస్పర అపనమ్మకం కారణంగా ఒప్పందం ఈ స్థాయికి చేరుకోవడానికి నెలల తరబడి పరోక్ష చర్చలు జరపాల్సి వచ్చింది.
బందీలను విడుదల చేయడానికంటే ముందు యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలని హమాస్ కోరుకుంది. ఇజ్రాయెల్‌కు ఈ ప్రతిపాదన నచ్చలేదు.
కాల్పుల విరమణ అమల్లోకి రాగానే అందులోని నిబంధనల ప్రకారం యుద్ధం ఆగిపోతుంది.
అయితే, శాంతిని కోరుతూ ఈ యుద్ధం ముగిసిందా? లేక దీనివెనుక ఇంకేమైనా ఉందా? అనే విషయంలో స్పష్టత లేదు.
ఇజ్రాయెల్ ప్రధాన యుద్ధ లక్ష్యాల్లో ఒకటి హమాస్ సైన్యాన్ని, అధికార యంత్రాంగాన్ని నాశనం చేయడం.
హమాస్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది. అయితే తిరిగి కోలుకునే సామర్థ్యం ఇంకా హమాస్‌కు ఉంది.
బందీలైన వారంతా సజీవంగా ఉన్నారా? లేక చనిపోయారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు హమాస్ వద్ద ఉన్నాయో లేవో కూడా తెలియదు.
కొంతమంది ఖైదీల విడుదల విషయంలో హమాస్ డిమాండ్‌కు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. వీరిలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్నవారు కూడా ఉన్నారని భావిస్తున్నారు.
ఒక నిర్దిష్ట తేదీలోగా బఫర్ జోన్ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? లేదా అక్కడ వారి ఉనికి అలాగే ఉంటుందా కూడా తెలియదు.
ఏది ఏమైనా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ బలహీనంగా ఉండబోతోంది.
గతంలో యుద్ధాల సమయంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాలు తర్వాత వాగ్వాదాల కారణంగా ఉల్లంఘనకు గురై తర్వాత ఆ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి.
కాల్పుల విరమణ సమయంలో ఒక చిన్న ఘటన కూడా మరో పెద్ద ప్రమాదంగా మారొచ్చు.
2023 అక్టోబర్ 7న ఏం జరిగింది? దాని పర్యవసానాలు ఏంటి?
హమాస్ నేతృత్వంలోని వందల మంది సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడులు ప్రారంభించారు. సరిహద్దులు దాటుకొని వెళ్లి ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలు, పోలీస్ స్టేషన్లు, కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు.
ఆ దాడిలో దాదాపు 1200 మంది చనిపోయారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. ఇజ్రాయెల్‌పై హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించింది.
ఈ దాడులకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తొలుత గగనతల, తర్వాత క్షేత్రస్థాయిలో సైనిక చర్యతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూతల, గగనతల, జల మార్గాలలో గాజా అంతటా హమాస్ లక్ష్యాలపై దాడి చేసింది.
ఇజ్రాయెల్ ప్రతిస్పందనతో గాజా ధ్వంసం అయింది. అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో 46,700 మందికి పైగా గాజా పౌరులు చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS