SOURCE :- BBC NEWS

నాసా, అమెరికా, స్పేస్ ఎక్స్, SpaceX, Elon Musk,  X, Amazon, Jeff Bezos

ఫొటో సోర్స్, Reuters

స్పేస్ ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్ అనే భారీ రాకెట్ ప్రయోగ దశలో పేలిపోయింది. ఇది ఎందుకు పేలిపోయిందనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

గురువారం ఈ రాకెట్‌ను అమెరికాలోని టెక్సస్ నుంచి ప్రయోగించిన తర్వాత రాకెట్ పైభాగం నాటకీయంగా బద్దలైపోయి కరేబియన్ ప్రాంతంలో ముక్కలుగా పడిపోయింది.

స్టార్‌షిప్ శకలాల వల్ల ప్రమాదం ఏర్పడవచ్చనే ఆందోళనతో ప్రయాణికుల విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది.

రాకెట్ పేలిపోవడం వల్ల టర్క్స్, కైకోస్ ఐలండ్స్‌లో ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లిందా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు చెప్పారు.

ఈ ఘటన వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ ప్రమాదం గురించి విమానయాన నియంత్రణ సంస్థ దర్యాప్తు చేస్తోందని ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది. స్టార్‌షిప్‌ను మళ్లీ ప్రయోగానికి అనుమతించవచ్చా లేదా అనేది ఈ దర్యాప్తు తర్వాత తేలుతుంది.

రాకెట్ పేలిపోయిన తర్వాత శకలాలు పడిపోతున్న ప్రాంతం వైపు వెళ్లకుండా ప్రయాణికుల విమానాలను దారి మళ్లించామని, టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న కొన్ని విమానాలను కొంతసేపు నిలిపివేశామని ఎఫ్ఏఏ తెలిపింది.

భారీగా ఉండే స్టార్‌షిప్ రాకెట్ అత్యంత శక్తిమంతమైనది.

బీబీసీ న్యూస్ తెలుగు
నాసా, అమెరికా, స్పేస్ ఎక్స్, SpaceX, Elon Musk,  X, Amazon, Jeff Bezos

ఫొటో సోర్స్, EPA

ఇంతకుముందు ఆరు స్టార్‌షిప్‌ రాకెట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. గురువారం పరీక్షించింది ఏడోది. ఇందులో సిబ్బంది ఎవరూ లేరు. ఈ రాకెట్ చాలా పొడవైనది, అత్యంత అధునాతనమైనది.

అంతకుముందు ప్రయోగించిన రాకెట్లతో పోలిస్తే, దీని పైభాగం పొడవు రెండు మీటర్లు ఎక్కువని ఈ ప్రయోగానికి ముందు స్పేస్‌ఎక్స్ సంస్థ వెల్లడించింది.

టెక్సస్‌లోని బోకో చికా నుంచి ప్రయోగించిన గంట తర్వాత హిందూ మహాసముద్రంలో పడిపోయేలా ఈ రాకెట్‌ను రూపొందించారు.

స్థానిక కాలమానం ప్రకారం దీన్ని గురువారం సాయంత్రం 5.38 నిమిషాలకు ప్రయోగించారు. తర్వాత పైభాగం వేరు పడటానికి నాలుగు నిముషాల ముందు పేలిపోయింది.

ఆ తర్వాత రాకెట్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయని స్పేస్‌ఎక్స్ సమాచార విభాగం మేనేజర్ డాన్ హుట్ చెప్పారు.

రాకెట్‌లోని సూపర్ హెవీ బూస్టర్ ప్రయోగం తర్వాత ఏడు నిమిషాలకు తిరిగి లాంచ్ ప్యాడ్‌కు వచ్చింది. దీంతో గ్రౌండ్ టీమ్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

రాకెట్ ఇంజన్ పైభాగంలో ఆక్సిజన్ లేదా ఇంధనం లీక్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా సంకేతాలు ఉన్నట్టు మస్క్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

తదుపరి ప్రయోగం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.

అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ గ్లెన్ రాకెట్ సిస్టమ్ ‌నుంచి మొదటి రాకెట్ బయల్దేరిన కొన్ని గంటల తర్వాత ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎస్ సంస్థ ఈ స్టార్‌షిప్‌ రాకెట్‌ను ప్రయోగించింది.

బెజోస్‌కు, ఆయన సంస్థ బ్లూ ఆరిజిన్‌కు ఇది పెద్ద విజయం. ఈ సంస్థ అనేక ఏళ్లు శ్రమించిన తర్వాత రాకెట్‌ను కక్ష్యలోకి పంపించింది.

అంతరిక్ష నౌకల మార్కెట్‌లో ఆధిపత్యం కోసం బెజోస్, మస్క్ పోటీ పడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)