SOURCE :- BBC NEWS

అమెరికాలో నిలిచిపోయిన టిక్‌టాక్ సేవలు

ఫొటో సోర్స్, EPA

అమెరికాలో టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌ను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందే దీని సేవలు నిలిచిపోయాయి.

ఈ యాప్‌ను ఓపెన్ చేస్తున్న అమెరికా యూజర్లకు, ‘‘టిక్‌టాక్‌ను నిషేధిస్తూ కొత్త చట్టం వచ్చింది. ఇక నుంచి మీరు టిక్‌టాక్‌ను వాడలేరు” అంటూ ఒక సందేశం కనిపిస్తోంది.

”అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే, టిక్‌టాక్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని చెప్పడం మా అదృష్టం” అని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది.

నిషేధాన్ని అమలు చేయబోమని బైడెన్ ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే, ఈ ఆదివారం నుంచి తమ యాప్‌ పనిచేయకుండా ఆగిపోతుందని టిక్‌టాక్ అంతకుముందే తన యూజర్లకు హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికల అనంతరం యాప్ సేవలు ఆదివారం ఆగిపోయాయి.

అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిక్ టాక్ మీదున్న నిషేధాన్ని తాత్కాలికంగా 90 రోజులపాటు వాయిదావేసే అవకాశాలు ‘ఎక్కువగా ఉన్నాయని’ ట్రంప్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అమెరికాలో యాపిల్, గూగుల్ యాప్ స్టోర్ల నుంచి కూడా ఈ యాప్‌ను తొలగించారని, టిక్‌టాక్.కామ్‌లో కూడా వీడియోలు చూపించడం లేదని యూజర్లు రిపోర్టు చేస్తున్నారు.

”90 రోజుల పొడిగింపు అనేది చాలా వరకు సాధ్యమవుతుంది. ఎందుకంటే, అది సరైనదే” అని ఎన్‌బీసీ న్యూస్‌కు ట్రంప్ చెప్పారు.

”ఒకవేళ నేను చేయాలనుకుంటే, నేను దానిని సోమవారం ప్రకటించే అవకాశం ఉంది” అని చెప్పారు.

ఇక ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అది రాబోయే ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే జరుగుతుందని వైట్‌హౌస్ చెప్పింది.

సోమవారం ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరడానికి కొన్ని రోజులు ముందు టిక్‌టాక్ లేదా ఇతర కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి కారణం లేదని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు.

చైనాకు చెందిన టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ఆదివారం లోగా అమెరికాలో ఈ ప్లాట్‌ఫామ్‌ను అమ్మకపోతే, ఈ యాప్‌ను నిషేధించాలని గత ఏడాది ఏప్రిల్‌లో ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.

టిక్‌టాక్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో 17 కోట్ల యూజర్లు ఉన్న ఈ యాప్‌ను నిషేధించే చట్టం, ప్రజల భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుందని టిక్‌టాక్ ఆరోపించింది.

తీర్పు తర్వాత మాట్లాడిన టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సౌ జీ చువ్, ”పరిష్కారం కనుగొనేందుకు మాతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉంటానన్న ట్రంప్‌కు కృతజ్ఞతలు” అని చెప్పారు.

సోమవారం జరగబోయే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చువ్ హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడానికి ముందు, చాలామంది కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్లకు గుడ్‌బై చెబుతూ వీడియోలు పెట్టారు.

‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఎడ్యుకేషనల్ కంటెంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఆ కమ్యూనిటీకి అతిపెద్ద నష్టం’’ అని యూజర్ ఎరికా థాంప్సన్ అన్నారు.

”అమెరికాలో కొత్తగా తీసుకొచ్చిన చట్టం మా సేవలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసింది. వీలైనంత త్వరగా అమెరికాలో మా సేవలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తాం” అని టిక్‌టాక్ తన యూజర్లకు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)