SOURCE :- BBC NEWS
జనవరి 20న (సోమవారం) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన ప్రతిష్ఠాత్మక అజెండాను అమలు చేసే విషయంలో అందరికీ “తల తిరిగేలా” ప్రచండ వేగంతో పరిపాలన కొనసాగిస్తానని డోనల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలలోపే దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి.
అధ్యక్షుడు ఫెడరల్ ఏజెన్సీలకు జారీ చేసే ఆదేశాలు వలసల నుంచి సరిహద్దు విధానం, వాతావరణ మార్పులపై చర్యలు, ఇంధనం, క్రిప్టో కరెన్సీ లాంటి అనేక అంశాలను ప్రభావితం చేయవచ్చు.
ఈ ఆదేశాలకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. వీటిని రద్దు చేయడం, తొలగించడం, ఆపెయ్యడం లాంటివి జరిగేదాకా లేదా వీటి కాలపరిమితి ముగిసే వరకు చట్టం మాదిరిగా అమల్లో ఉంటాయి.
అమెరికన్ పార్లమెంట్లో రిపబ్లికన్లకు పట్టుంది. అయితే ట్రంప్ ప్రణాళికల్లో కొన్నింటిని కోర్టుల్లో లేదా మరో చోట సవాలు చేస్తామని హక్కుల సంస్థలు, డెమోక్రటిక్ గవర్నర్లు చెబుతున్నారు.
ట్రంప్ ఏఏ అంశాలపై ఎలా వ్యవహరించే అవకాశం ఉందో చూద్దాం..
వలసలు, సరిహద్దులు
అక్రమ వలసదారులను వెనక్కి పంపడం
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అక్రమవలసదారుల్ని తిప్పి పంపించే కార్యక్రమం ప్రారంభిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేస్తామని ట్రంప్ అమ్ముల పొదిలో కీలక అస్త్రం, సరిహద్దు సీజర్ టామ్ హొమన్ ప్రకటించారు.
అలాగే ఫెడరల్ అధికారులు చర్చ్‌లు, స్కూళ్ల మీద దాడి చేయకుండా చాలా కాలంగా అమల్లో ఉన్న విధానానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ప్రకటించారు.
అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపించే కార్యక్రమం చేపడితే, అందుకు అవసరమైన విమానాలు, ఇతర వనరుల సమస్యలతో పాటు ఇమ్మిగ్రేషన్, మానవహక్కుల కార్యకర్తల నుంచి న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
మెక్సికోలోనే ఉండండి
ట్రంప్ అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టగానే మెక్సికన్లను తిప్పి పంపించే కార్యక్రమం చేపట్టవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఆశ్రయం కోరుతున్న మెక్సికన్ల సంఖ్య 70 వేలు ఉంది.
పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు
అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందనే 150 ఏళ్ల నాటి రాజ్యాంగబద్దమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీన్ని తొలి రోజునే తొలగిస్తానని ట్రంప్ చెప్పారు.
అయితే ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తే సరిపోదు. ఎందుకంటే పౌరసత్వం అనేది అమెరికన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని మార్చాలంటే శాసనపరంగా చాలా క్లిష్టమైన వ్యవహారం.
ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అమెరికాలోకి వలసలు రాకుండా సరిహద్దుల్ని మూసివేసేందుకు టైటిల్ 42 అనే పిలిచే ప్రతిపాదనను 1944లో తీసుకొచ్చారు. కోవిడ్ సమయంలో దీన్ని ఉపయోగించారు. ఈసారి అలాంటి వ్యాధి ఏదైనా విజృంభిస్తే, దాన్ని ఉపయోగించుకుని అమెరికా దక్షిణ సరిహద్దును మూసివేస్తారని అమెరికన్ మీడియా అంచనా వేసింది.
సరిహద్దు గోడ నిర్మాణం
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం చేశారు. ఇప్పటికే అక్కడక్కడా గోడ నిర్మాణం పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఈసారి ట్రంప్ దీని నిర్మాణం పూర్తి చేయవచ్చు.
వాణిజ్యం, ఆర్థిక రంగం
పన్నులు
అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సుంకాలు విధించారు. అందులో చైనా మీద విధించిన కొన్ని సుంకాలను జో బైడెన్ కొనసాగించారు.
అయితే ఈసారి అన్ని దిగుమతుల మీద 10 శాతం పన్నులు విధిస్తామని, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద 25శాతం, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 60 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే సుంకాల పెంపుపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తానని ట్రంప్ గతంలో అన్నారు.
పన్నులు పెంచితే వినిమయ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ తమ ఉత్పత్తుల మీద పన్నులు పెంచితే తాము కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్నులు పెంచాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీ
ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత క్రిప్టో విలువ 30 శాతం పెరిగింది.
ట్రంప్ వీలైనంత త్వరగా జాతీయ స్థాయిలో బిట్ కాయిన్లను పోగు చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. బంగారం, చమురు నిల్వల మాదిరిగానే బిట్ కాయిన్లను కూడా నిల్వ చేస్తారని భావిస్తున్నారు.
“అమెరికన్లకు ప్రయోజనం అందించేలా శాశ్వతంగా జాతీయ ఆస్తిగా ఉంటుంది” అని ట్రంప్ గతంలో చెప్పారు. క్రిప్టో మద్దతుదారులు ఈ ప్రణాళికను ప్రస్తుతిస్తున్నారు.
వాతావరణం, ఇంధనం
జో బైడెన్ పర్యావరణ విధానాలను తొలగిస్తారా?
కాలుష్యాన్ని నియంత్రించేందుకు, పచ్చదనాన్ని మెరుగుపరిచేందుకు నిధులు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు వరుస నిర్ణయాలు, చట్టాలు చేసిన వ్యక్తిగా జో బైడెన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సాధించిన విజయాల్లో ఇది ఒకటి.
పర్యావరణానికి సంబంధించి బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను తాను తొలగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఫెడరల్ ప్రభుత్వ భూముల్లో ఖనిజ వనరుల వెలికితీతకు ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇంధనం విషయంలో అమెరికా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది కీలకం అని ట్రంప్ భావిస్తున్నారు. పవన విద్యుదుత్పత్తికి సంబంధించి ఆమోదించిన కొత్త ప్రాజెక్టుల్ని రద్దు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అనే విధానాన్ని కూడా రద్దు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
పారిస్ ఒప్పందం నుంచి మళ్లీ వైదొలగడం
2017లో ట్రంప్ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆరు నెలలకే పారిస్ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
2021లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరింది. అయితే ట్రంప్ ఈసారి అధ్యక్షుడైన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి అమెరికా మళ్లీ వైదొలగనుంది.
వారికి క్షమాభిక్ష
2021లో అమెరికన్ పార్లమెంట్ మీద దాడి కేసులో దోషులుగా తేలిన వందల మంది సోమవారం ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టగానే వారికి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది.
“వారిలో చాలా మందికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అయితే అది అందరికీ కాదు. ఎందుకంటే ఒకరిద్దరు హద్దులు దాటి ప్రవర్తించారు” అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికన్ కాంగ్రెస్ మీద ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి నాలుగేళ్లైంది. ఆ దాడులకు సంబంధించి 1,583 మందిని అరెస్ట్ చేసినట్లు న్యాయ విభాగం తెలిపింది. ఇందులో 600 మందికిపైగా నిందితులపై ‘అధికారుల మీద దాడి చేయడం’ లేదా ‘వారి విధులను అడ్డుకోవడం’ వంటి అభియోగాలు మోపారు.
విదేశాంగ విధానం
యుక్రెయిన్ యుద్ధం
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పడేలా చేస్తానని ట్రంప్ చెప్పారు. తర్వాత అందుకు ఆరు నెలలు పట్టవచ్చన్నారు. యుక్రెయిన్ విషయంలో ఆయన వ్యూహం ఏంటి? ఏం చేస్తారు? అనే దానిపై స్పష్టత లేదు.
గాజా, ఇజ్రాయెల్
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమలులోకి తెచ్చిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ దీన్ని ‘జోక్’ అని అభివర్ణించినప్పటికీ, ట్రంప్‌తో పాటు ఆయన సంధానకర్త వల్లనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందనే అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.
క్యూబా, వెనెజ్వేలా
తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకురావచ్చు. వెనెజ్వేలా మీద మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ రెండు దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారి ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
గ్రీన్‌ల్యాండ్, కెనడా
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం, డెన్మార్క్‌లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారా? ట్రంప్ పాలనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇది. ఇప్పటికే అక్కడ అమెరికన్ సైనిక స్థావరం ఉంది. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందా? ఎప్పటిలాగే ఆయన ఈ రెండు అంశాల మీద జోక్ చేశారా?
ట్రంప్ ఏ ప్రణాళిక కూడా ఆచరణాత్మకంగా కనిపించడం లేదు. విస్తరణ వాదంతో ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అనేక దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
డైవర్సిటీ, జెండర్
ఇటీవల కొన్నేళ్లుగా, అమెరికాలోని స్కూళ్లు, వాణిజ్య సంస్థలు మహిళలు, వివక్ష ఎదుర్కొంటున్న మైనార్టీలను ప్రోత్సహించేలా విధానాలను అమలు చేస్తున్నాయి.
వీటిని, ‘‘వైవిధ్యం, సమానత్వం, సమభావన’’గా పేర్కొంటున్నారు. అయితే దీన్ని అనేక మంది సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కేసులు కూడా నడుస్తున్నాయి. ట్రంప్ వీటన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. మెటా, వాల్‌మార్ట్, అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు అధ్యక్ష ఎన్నికలు పూర్తైనప్పటి నుంచి ఈ విధానాన్ని పక్కన పెట్టాయి.
డీఈఐ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న స్కూళ్లకు కేంద్ర నిధులు అందించడాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంది. క్రిటికల్ రేస్ థియరీ బోధించే స్కూళ్లకు కూడా నిధులు నిలిపివెయ్యవచ్చు.
అబార్షన్
తన కంటే ముందు పని చేసిన రిపబ్లికన్ల మాదిరిగానే, ట్రంప్ కూడా మెక్సికన్ సిటీ పాలసీని పునరుద్దరించవచ్చు. ఇందులో భాగంగా అబార్షన్ కౌన్సిలింగ్ నిర్వహించే అంతర్జాతీయ గ్రూపులకు ఫెడరల్ ఫండింగ్‌ను నిలిపివేస్తారు.
కేంద్ర ఆరోగ్య సంస్థలు అబార్షన్ చేయకుండా నిరోధిస్తూ రూపొందించిన ‘టైటిల్ ఎక్స్’ నిబంధనను ట్రంప్ పునరుద్దరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లింగమార్పిడి హక్కులు
స్కూళ్లు, ఆరోగ్య సేవల్లో “లింగ మార్పిడి పిచ్చి” అని పిలిచే దానిని ట్రంప్ పదే పదే విమర్శిస్తూ వచ్చారు. లింగమార్పిడి చేయించుకున్న మహిళలను క్రీడల్లో పాల్గొనడాన్ని నిషేధిస్తానని చెప్పారు.
టిక్ టాక్
అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిక్ టాక్ మీదున్న నిషేధాన్ని తాత్కాలికంగా 90 రోజులపాటు వాయిదావేసే అవకాశాలు ‘ఎక్కువగా ఉన్నాయని’ ట్రంప్ చెప్పారు.
ఈ అంశంపై మొదటి రోజునే అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు.
ట్రంప్ గతంలో టిక్‌టాక్‌పై నిషేధానికి మద్దతిచ్చారు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకన్నారు. గతేడాది ఎన్నికల ప్రచారం సమయంలో తన వీడియోలకు టిక్‌టాక్‌లో బిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయని గుర్తు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)