SOURCE :- BBC NEWS
49 నిమిషాలు క్రితం
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలుత విడుదల చేయనున్న ముగ్గురు మహిళా బందీల పేర్లను హమాస్ ఆదివారం వెల్లడించింది.
వారి పేర్లను టెలిగ్రామ్ పోస్టు ద్వారా హమాస్ తెలియజేసింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కింద విడుదల కాబోతున్న మొదటి వ్యక్తులు వీరేనని పేర్కొంది.
వారిలో 24 ఏళ్ల రోమీ గోనెన్, 28 ఏళ్ల ఎమిలీ డమారీ, 31 ఏళ్ల డొరొన్ స్టీన్‌బ్రెచర్ ఉన్నారు.
వీరిలో ఎమిలీకి ఇజ్రాయెల్ – బ్రిటన్ ద్వంద్వ పౌరసత్వం ఉంది.
దీనికి ముందు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ విడుదల చేయనున్న బందీల జాబితాను హమాస్ అప్పగించే వరకూ కాల్పుల విరమణ ఆలస్యం అవుతుందన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, విడుదల చేయాల్సిన వారి పేర్లను కనీసం 24 గంటల ముందు వెల్లడించాలి.
‘ప్రతి ఒక్కరి కోసం ఎదురుచూస్తున్నాం’
మొదటి దశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ విడుదల చేయనున్న 33 మంది బందీల జాబితాను ఇజ్రాయెల్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసింది.
ఇజ్రాయెల్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన చిత్రంలో, 33 మంది బందీల పేర్లు, వారి ఫోటోలు ఉన్నాయి. ఈ జాబితాలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఎదురుచూస్తున్నామనే క్యాప్షన్‌తో ఈ పోస్టు చేసింది.
దాదాపు 15 నెలల కిందట, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఫైటర్లు దాడి చేసిన సమయంలో వీరిని బందీలుగా తీసుకెళ్లారు.
9 నెలల చిన్నారి నుంచి 86 ఏళ్ల వృద్ధుని దాకా…
కఫిర్ బిబాస్‌ను బందీగా తీసుకెళ్లినప్పుడు ఆ చిన్నారి వయసు 9 నెలలు. బందీగా ఉన్న సమయంలోనే తన రెండు పుట్టినరోజులు జరుపుకున్నాడు. 86 ఏళ్ల ష్లోమో మాంట్జుర్‌ను బందీల్లో అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా భావిస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, అందువల్ల 11 గంటల 15 నిమిషాలకు ఒప్పందం అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు గాజాలో కాల్పుల విరమణ – బందీల విడుదల ఒప్పందం అమల్లోకి వచ్చింది.
15 నెలల తరువాత..
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ – హమాస్ అంగీకరించినట్లు అమెరికా, మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ తెలిపాయి.
ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్, ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడంతో ఒప్పందంలోని మొదటి దశ జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇజ్రాయెల్ – పాలస్తీనాకి చెందిన సాయుధ, రాజకీయ గ్రూపు అయిన హమాస్ మధ్య 15 నెలల పోరాటం తర్వాత ఈ ఒప్పందం జరిగింది.
2023 అక్టోబర్ 7న, వందలాది మంది హమాస్ ఫైటర్లు సరిహద్దు వెంబడి ఉన్న, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై దాడి చేసి, దాదాపు 1200 మందిని చంపేసి, 250 మందికి పైగా ప్రజలను బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో ఈ ఘర్షణ మొదలైంది.
దాడులకు తక్షణమే ప్రతిస్పందించిన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ తర్వాత అక్టోబర్ 27న పూర్తి స్థాయి సైనిక చర్యకు దిగింది. అప్పటి నుంచి గాజాపై భూతల దాడులతో పాటు సముద్ర, వాయుమార్గాల్లోనూ దాడులు చేసింది. హమాస్ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేసింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 46,700 మందికి పైగా చనిపోయినట్లు గాజాలో హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
7 అక్టోబర్ 2023 : ఇజ్రాయెల్‌పై హమాస్ ఫైటర్ల దాడి
అక్టోబర్7, 2023న హమాస్ ఫైటర్లు దాడి చేసినప్పటి నుంచి జనవరి 19, 2025న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చేదాకా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఈ టైమ్‌లైన్‌లో చూద్దాం.
7 అక్టోబర్: హమాస్‌కు చెందిన వందలాది మంది సాయుధులు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై అనూహ్య దాడులు చేశారు. సరిహద్దు కంచెను ధ్వంసం చేసి, లోపలికి చొచ్చుకొచ్చి సమీప ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిపిన దాడుల్లో సుమారు 1200 మంది చనిపోయారు. 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఇజ్రాయెల్‌పై వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది హమాస్. ఆ వెంటనే ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు, ఫిరంగులతో ప్రతిస్పందించింది.
27 అక్టోబర్: గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. భూతల దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ భారీస్థాయిలో జరిపిన సైనిక దాడులతో, గాజా ధ్వంసం కావడంతో పాటు 23 లక్షల జనాభాలో ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారని, దాదాపు 46 వేల మందికిపైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
21 నవంబర్: అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా, 105 మంది బందీలను హమాస్ విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడానికి ఇజ్రాయెల్, హమాస్ ఒకరినొకరు నిందించుకున్నాయి.
28 డిసెంబర్: కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి ఒక ఒప్పందం కోసం నిరంతర దౌత్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
2024: కీలక నేతల హత్య
31 మే : బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఎనిమిది నెలల తర్వాత అంగీకారం కుదిరిన ఈ ఒప్పందానికి ఇదే ఆధారం.
10 జూన్ : కాల్పుల విరమణకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది.
31 జూలై: హమాస్ రాజకీయ నేత, చర్చల్లో కీలకమైన ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ హత్య చేయడంతో చర్చలు నిలిచిపోయాయి. రెండు వారాల తర్వాత, హమాస్ లేకుండానే చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి.
17 అక్టోబర్ : హమాస్ నేత యాహ్యా సిన్వార్‌ను దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. దీనిని యుద్ధం ‘ముగింపు దశకు ప్రారంభం’గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
9 నవంబర్ : నెలల తరబడి ఎలాంటి పురోగతీ లేకపోవడంతో, చర్చలకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఖతార్ నిలిపేసింది. చర్చల్లో ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి.
20 నవంబర్: గాజాలో కాల్పుల విరమణకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. ఇది కాల్పుల విరమణకు – బందీల విడుదలకు ఉన్న సంబంధాన్ని పట్టించుకోలేదని పేర్కొంది.
27 నవంబర్: హిజ్బొల్లాతో 13 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు లెబనాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. హమాస్‌కు మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల్లో హిజ్బొల్లా ఒకటి. ఈ డీల్ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి ఆశలు చిగురింపజేసింది. మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాల సాయంతో మరోసారి ప్రయత్నిస్తానని బైడెన్ చెప్పడంతో మళ్లీ ఆశలు రేకెత్తాయి.
2 డిసెంబర్: తన ప్రమాణ స్వీకారం నాటికి (2025 జనవరి 20) గాజాలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయకపోతే ”ఇక విధ్వంసమే” అని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
17 డిసెంబర్: పరోక్ష పద్ధతిలో కొనసాగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని పాలస్తీనా సీనియర్ అధికారి ఒకరు తెలుపగా, ఒప్పందం దాదాపు ఖరారయ్యే స్థితిలో ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ చెప్పారు.
19 జనవరి, 2025 : ఒప్పందం అమలు
13 జనవరి : తన పదవీ కాలం చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, ఒప్పందం తుది దశకు చేరుకుందని, ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
15 జనవరి : గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయెల్ – హమాస్ మధ్య అంగీకారం కుదిరిందని, జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధాన మంత్రి చెప్పారు. ”ఇది గాజాలో కొనసాగుతున్న ఘర్షణలను నిలిపివేస్తుంది, పాలస్తీనా పౌరులకు అవసరమైన మానవతా సాయం అందిస్తుంది, బందీలను వారి కుటుంబాలతో తిరిగి కలుపుతుంది” అని బైడెన్ అన్నారు.
17 జనవరి: ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ కేబినెట్ భేటీ జరిగింది. గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ఇద్దరు మంత్రులు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చేలా నిర్ణయం వెలువడింది.
19 జనవరి : షెడ్యూల్ ప్రకారం, మొదటి దశలో విడుదల చేయాల్సిన 33 మంది బందీల జాబితాను హమాస్ అప్పగించలేదని ఇజ్రాయెల్ చెప్పింది. దీంతో ఒప్పందం అమల్లోకి రావాల్సిన సమయం కొద్దిగంటలు ఆలస్యమైంది. ఆ తర్వాత, స్థానిక సమయం 11.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు) కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)