SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) రవీంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్ 19లోని గీతా ప్రెస్ టెంట్లో ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
మంటలు అదుపులోకి వచ్చాయని డీఎం రవీంద్రకుమార్ తెలిపారు.
అయితే అగ్నిప్రమాదానికి కారణామేమిటనే విషయంపై స్పష్టమైన సమాచారం తెలియలేదు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, ఆయన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రెండు, మూడు సిలిండర్లు పేలినట్లు సమాచారం అందిందని, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారని ప్రయాగ్‌రాజ్ జోన్ పోలీస్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) భాను భాస్కర్ తెలిపారు.
అప్పటికే కొన్ని టెంట్లకు మంటలు అంటుకున్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా ఈ ఘటనపై స్పందించారు.
కుంభమేళా-2025లోని సెక్టార్ 19 (తులసి మార్గ్)లో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారుల బృందం సంఘటనా స్థలంలో ఉందని, అక్కడికి వచ్చే సాధువులు, భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)